జైన మతం అహింసకు పెద్దపీట వేస్తుంది. సూక్ష్మజీవులు చనిపోతాయని నీళ్లు వడగట్టుకొని తాగుతారు...
జైనుడి చేతిలో పేను!
జైన మతం అహింసకు పెద్దపీట వేస్తుంది. సూక్ష్మజీవులు చనిపోతాయని నీళ్లు వడగట్టుకొని తాగుతారు, అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కాళ్ల కింద సూక్ష్మజీవులు చనిపోతాయని నెమలీకలతో నడిచినంత మేరా నేలను ఊడ్చుకుంటూ పోతారు. నేలను దున్ని చేసే వ్యవసాయం చేయరు. జైనుల అహింసా సిద్ధాంతం ఆచరణసాధ్యం కానంత తీవ్రస్థాయిలో ఉంటుందనే విమర్శ కూడా లేకపోలేదు.
వెనకటికి ఒక జైనుడి తలలో పేలు పడ్డాయి.
అందులో ఒకటి అతడికి చిక్కింది.
దాన్ని చేతిలోకి తీసుకున్నాడేగానీ ఏం చేయాలో అర్థం కాలేదు.
చంపకుంటే మనసు శాంతించదు.
చంపితే మతధర్మం ఒప్పుకోదు.
‘చంపడమా? వదిలిపెట్టడమా?’ అనే సంఘర్షణలో జైనుడితో పాటు ఆ పేను కూడా నరకం అనుభవించింది. ఈ కథ సంగతి ఎలా ఉన్నా...ఒక విషయం ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నప్పుడు లేదా ఒక అవకాశం చేతికి చిక్కినప్పటికీ ఏమీ చేయలేని స్థితి ఎదురైనప్పుడు ఉపయోగించే జాతీయం ఇది.
రోకలి చిగుళ్లు!
‘రోకలికి చిగుళ్లు కోయవద్దు. జరిగే పనేనా కాదా అనేది చెప్పు’
‘నువ్వు చెప్పిన పని పొరపాటున కూడా సాధ్యం కాదు. రోకలికి చిగుళ్లు మొలుస్తాయా?’ ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం.
చెట్టునో, కొమ్మనో నరికి ఎండబెట్టి రోకలిగా చెక్కుతారు. ఇక అలాంటి రోకలి చిగుళ్లు వేయడం అనేది అసంభవం అనే విషయం అందరికీ తెలుసు. అసాధ్యం, అసంభవం అనుకునే పనుల విషయంలో ఉపయోగించే మాట ఇది!
జాపరమేశ్వరా!
ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగించే జాతీయం ఇది.
ఆపదలో ఉన్న వ్యక్తి... ‘‘దేవుడా కాపాడు’’ అని అంటూ పరుగెత్తుతాడు. దీనికి సమానమైనదే ఈ జాపరమేశ్వరా!
‘తన ఇబ్బంది గ్రహించి జాపరమేశ్వర అని పారిపోయాడు’ ‘జాపరమేశ్వర అని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’ ఇలాంటి మాటలు వింటుంటాం.
జా, పరమేశ్వరా పదాలతో ఏర్పడినదే జాపరమేశ్వర! ‘జా’ అంటే హిందీలో ‘వెళ్లు’ అని అర్థం. ‘పరమేశ్వరా’ అనేది ఇష్టదైవాన్ని తలుచుకోవడం.