breaking news
Jain religion
-
జైన గురువు తరుణ్ కన్నుమూత
న్యూఢిల్లీ: జైన మత గురువు తరుణ్ మహరాజ్ (51) శనివారం ఢిల్లీలోని రాధాపురి జైన దేవాలయంలో తుదిశ్వాస విడిచారు. ‘తరుణ్ మహరాజ్‌కు కొద్దిరోజులుగా ఆరోగ్యం బాగాలేదు. ఇటీవల రాధాపురి ఆలయానికి వచ్చి అక్కడే ఉంటున్నారు. తెల్లవారుజామున 3.18కి ఆయన మరణించారు’ అని భారతీయ జైన్ మిలాన్ సంస్థ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మోదీనగర్‌లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ‘ఉదయం 6 గంటలకు ఆయన మరణ వార్త తెలిసింది. దీంతో దేవాలయమంతా భక్తులతో కిక్కిరిసిపోయింది’ అని అన్నారు. తరుణ్ మహరాజ్ మృతిపై ప్రధాని మోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్ సంతాపం తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోపాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మహరాజ్ మృతికి సంతాపం ప్రకటించారు. -
అమిత్ షా నిజంగా జైనుడా ?
సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తనకు తాను హిందువునని చెప్పుకుంటారని, వాస్తవానికి ఆయన జైన్ మతస్థుడని కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజ్‌బబ్బర్ తాజాగా ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సోమ్‌నాథ్ ఆలయాన్ని సందర్శించినప్పుడు హిందువులు కానివారు సంతకం చేసే పుస్తకంలో సంతకం చేశారంటూ బీజేపీ తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు ప్రతికారంగానే అమిత్ షాపై కాంగ్రెస్ ఈ ప్రచారాన్ని ప్రారంభించినట్లు స్పష్టం అవుతోంది. ఎప్పుడు తాను హిందూ కుటుంబంలో పుట్టానని, తన కుటుంబం సనాతన ధర్మాన్ని ఆచరిస్తోందని చెప్పుకునే అమిత్ షా మతంపై వార్తలు రావడం, చర్చలు జరగడం ఇదే మొదటిసారి ఏమీ కాదు. అమిత్ షా పూర్తి పేరు అమిత్ భాయ్ అనిల్‌చంద్ర షా అని, ఆయన 1964లో అక్టోబర్‌లో ముంబైలోని ధనవంతుడైన జైనుడి కుటుంబంలో పుట్టారని, ఆయన తండ్రిపేరు అనిల్ చంద్ర షా అని, గుజరాత్లో ఉన్నత విద్యాభ్యాసం చేసిన అమిత్ షా కుటుంబం అక్కడే స్థిరపడిందని పలు పత్రికలు, వెబ్సైట్లు ఇదివరకే వెల్లడించాయి. దాంతో జైన మతం కూడా హిందూ మతంలో భాగమని రెండు మతాలు సనాతన ధర్మాలనే ఆచరిస్తాయంటూ ఆయన్ని వెనకేసుకొచ్చిన అజ్ఞాన మేథావులు కూడా ఎంతో మంది ఉన్నారు. హిందూ మతంతో పోలిస్తే జైన మతం చాలా ప్రాచీనమైనది, రెండు మతాల ఆచారాల మధ్య పోలికలున్నా రెండు మతాల ధర్మాలు కూడా ఒక్కటి కాదు. జైన మతంది శ్రామన ధర్మంకాగా, హిందూ మతానిది వేద ధర్మం. ఎవరి ధర్మం ఏదైనా అది పూర్తిగా వ్యక్తిగతం. ఏ మతాన్ని నమ్మకపోవడమూ, ఆచరించకపోవడమూ వ్యక్తిగతమే. మతాన్ని ఎప్పుడూ రాజకీయం చేయరాదు. ఓట్ల కోసం మతాన్ని రాజకీయం చేయడం, మతాన్నే మార్చడం మన రాజకీయ నాయకులకు మామూలై పోయింది. తమ కుటుంబానికి ఆరాధ్య దైవం శివుడని, తన నానమ్మ ఇందిరాగాంధీ కూడా శివ పూజలు చేసేవారంటూ రాహుల్ గాంధీ చెప్పడమూ, అయినా దైవభక్తి అన్నది పూర్తిగా వ్యక్తిగత మైనదని, దాని గురించి మాట్లాడరాదంటూ రాహుల్ గాంధీ సర్దిచెప్పుకోవడమూ రాజకీయమే! రాహుల్ గాంధీకి కూడా దైవభక్తి నిజంగా వ్యక్తిగతమైనది అయినప్పుడు ఇదివరకు ఎన్నడూ లేనంతగా గుజరాత్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కనిపించిన గుడికల్లా ఎందుకు వెళుతున్నారో?! -
జాతీయాలు
జైనుడి చేతిలో పేను! జైన మతం అహింసకు పెద్దపీట వేస్తుంది. సూక్ష్మజీవులు చనిపోతాయని నీళ్లు వడగట్టుకొని తాగుతారు, అడుగు తీసి అడుగు వేసేటప్పుడు కాళ్ల కింద సూక్ష్మజీవులు చనిపోతాయని నెమలీకలతో నడిచినంత మేరా నేలను ఊడ్చుకుంటూ పోతారు. నేలను దున్ని చేసే వ్యవసాయం చేయరు. జైనుల అహింసా సిద్ధాంతం ఆచరణసాధ్యం కానంత తీవ్రస్థాయిలో ఉంటుందనే విమర్శ కూడా లేకపోలేదు. వెనకటికి ఒక జైనుడి తలలో పేలు పడ్డాయి. అందులో ఒకటి అతడికి చిక్కింది. దాన్ని చేతిలోకి తీసుకున్నాడేగానీ ఏం చేయాలో అర్థం కాలేదు. చంపకుంటే మనసు శాంతించదు. చంపితే మతధర్మం ఒప్పుకోదు. ‘చంపడమా? వదిలిపెట్టడమా?’ అనే సంఘర్షణలో జైనుడితో పాటు ఆ పేను కూడా నరకం అనుభవించింది. ఈ కథ సంగతి ఎలా ఉన్నా...ఒక విషయం ఎటూ తేల్చుకోలేకుండా ఉన్నప్పుడు లేదా ఒక అవకాశం చేతికి చిక్కినప్పటికీ ఏమీ చేయలేని స్థితి ఎదురైనప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. రోకలి చిగుళ్లు! ‘రోకలికి చిగుళ్లు కోయవద్దు. జరిగే పనేనా కాదా అనేది చెప్పు’ ‘నువ్వు చెప్పిన పని పొరపాటున కూడా సాధ్యం కాదు. రోకలికి చిగుళ్లు మొలుస్తాయా?’ ఇలాంటి మాటలు వింటూనే ఉంటాం. చెట్టునో, కొమ్మనో నరికి ఎండబెట్టి రోకలిగా చెక్కుతారు. ఇక అలాంటి రోకలి చిగుళ్లు వేయడం అనేది అసంభవం అనే విషయం అందరికీ తెలుసు. అసాధ్యం, అసంభవం అనుకునే పనుల విషయంలో ఉపయోగించే మాట ఇది! జాపరమేశ్వరా! ఆపదలో ఉన్నప్పుడు ఉపయోగించే జాతీయం ఇది. ఆపదలో ఉన్న వ్యక్తి... ‘‘దేవుడా కాపాడు’’ అని అంటూ పరుగెత్తుతాడు. దీనికి సమానమైనదే ఈ జాపరమేశ్వరా! ‘తన ఇబ్బంది గ్రహించి జాపరమేశ్వర అని పారిపోయాడు’ ‘జాపరమేశ్వర అని వెనక్కి తిరిగి చూడకుండా పారిపోవడం తప్ప వేరే మార్గం లేదు’ ఇలాంటి మాటలు వింటుంటాం. జా, పరమేశ్వరా పదాలతో ఏర్పడినదే జాపరమేశ్వర! ‘జా’ అంటే హిందీలో ‘వెళ్లు’ అని అర్థం. ‘పరమేశ్వరా’ అనేది ఇష్టదైవాన్ని తలుచుకోవడం. -
గాంధార శిల్పకళను ఏమని పిలుస్తారు?
చరిత్ర నూతన మతాల ఆవిర్భావం క్రీ.పూ. 6వ శతాబ్దంలో ఆవిర్భవించిన మతాలు ప్రపంచ చరిత్ర భవితవ్యాన్ని మార్గనిర్దేశం చేశాయి. ఇవి తమ ఆధునిక, విప్లవాత్మక భావాలతో అప్పటి వరకూ ఉన్న సామాజిక కట్టుబాట్లను, వ్యత్యాసాలను తీవ్రంగా వ్యతిరేకించాయి. వీటికి ఆద్యులు సోక్రటీస్(గ్రీస్), జొరాస్టర్ (పర్షియా), కన్ఫ్యూజియస్, లావోత్సే (చైనా), రుషభనాథుడు, గౌతమ బుద్ధుడు (భారత్). వీరు ఆచరణీయ విలువలను ప్రబోధించే కొత్త మతాలను స్థాపించి ప్రజల్లో తాత్విక ఆలోచనలను పెంపొందించడానికి కృషి చేశారు. జైన, బౌద్ధ మతాలు విగ్రహారాధనను, పూజాసంస్కారా లను, బ్రాహ్మణాధిపత్యాన్ని తిరస్కరించాయి. జైన మతం: జైనమత ప్రచారకులను తీర్థంకరులు అంటారు. మొదటి తీర్థంకరుడైన రుషభనాథుడు ఈ మతాన్ని స్థాపించాడు. పార్శ్వనాథుడు 23వ తీర్థంకరుడు. చివరి (24వ) తీర్థంకరుడైన వర్ధమాన మహావీరుడు జైనమత అభివృద్ధికి తన బోధనలతో విశేషంగా తోడ్పడి ప్రజాబాహుళ్యంలో ప్రత్యేక స్థానాన్ని పొందాడు. వర్ధమాన మహావీరుడు (క్రీ.పూ. 540-468): మహావీరుడు వైశాలి సమీపంలోని కుంద గ్రామంలో జన్మించాడు. జ్ఞాత్రిక క్షత్రియ వంశీ యులైన సిద్ధార్థుడు, త్రిశాల ఇతని తల్లిదండ్రులు. భార్య యశోధ, కూతురు ప్రియదర్శిని. కుటుంబ సుఖాలను వదిలి జీనత్వం కోసం 12 ఏళ్లు తపస్సు చేసి, జీనుడయ్యాడు. జీనుడు అంటే కోర్కెలను జయించినవాడు. దీన్నే జ్ఞానోదయంగా పేర్కొంటారు. ఈ జీనులే జైనులుగా ప్రసిద్ధి చెందారు. వీరి మతాన్ని జైనమతంగా పిలుస్తున్నారు. వర్ధమానుడు తన 72వ ఏట పావాపురిలో నిర్యాణం చెందాడు. జైనమత సూత్రాలు: వీటిని పంచవ్రతాలుగా పిలుస్తారు. అవి 1. సత్యం 2. అహింస 3. ఆస్తేయం (ఇతరుల ఆస్తిని దొంగిలించకూడదు) 4. అపరిగ్రహం (అవసరానికి మించి ఆస్తి సంపాదించకూడదు) 5. బ్రహ్మచర్యం. వీటిలో మొదటి నాలుగు సూత్రాలను పార్శ్వనాథుడు ప్రవచించగా 5వ సూత్రాన్ని మహావీరుడు ప్రబోధించాడు. జైనమత ప్రధాన నియమాలు: వీటిని త్రిరత్నాలు అంటారు. అవి 1. సమ్యక్ దర్శనం 2. సమ్యక్ జ్ఞానం 3. సమ్యక్ క్రియ. మత బోధనలపై విశ్వాసం కలిగి ఉండడమే సమ్యక్ దర్శనం. వాటిలోని సత్యాన్ని గ్రహించడమే సమ్యక్ జ్ఞానం. వాటిని పాటించడమే సమ్యక్ క్రియ. వీటిని అనుసరించినవాడు మోక్షానికి అర్హుడు అవుతాడని జైనుల నమ్మకం. జైనమత పవిత్ర గ్రంథాలను అంగాలు అంటారు. ఈ మతం.. హిందూమతానికి దగ్గరగా ఉంటుంది. మహావీరుడు వర్ణవ్యవస్థను పూర్తిగా ఖండించలేకపోయాడు. అది పూర్వజన్మ సుకృతంగా అభిప్రాయపడ్డాడు. జైనమత వ్యాప్తికోసం జైన సంఘాన్ని స్థాపించాడు. మగధ రాజ్యాన్ని పాలించిన హర్యాంక, నంద వంశ రాజులు, మౌర్యరాజైన సంప్రతి చంద్రగుప్తుడు జైనమతాన్ని ఎక్కువగా ఆదరించారు. పాటలీపుత్రంలో (క్రీ.పూ.300లో) చంద్రగు ప్తుడు శ్రావణ బెళగొళ (కర్ణాటక)కు తన గురువు భద్రబాహుతో కలిసివెళ్లాడు, అక్కడ సల్లేఖన (ఉపవాస) వ్రతాన్ని పాటించి చనిపోయాడు. - జైన సాహిత్యం ప్రాకృత, కన్నడ భాషలో లభిస్తుంది. - జైన మతం రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో ఎక్కువగా వ్యాప్తి చెందింది. - ఉదయగిరి (ఒడిశా), ఎల్లోరా (మహారాష్ట్ర)ల్లో జైన గుహలున్నాయి. - మన రాష్ట్రంలో కొలన్పాక (నల్గొండ జిల్లా) గ్రామంలో జైన దేవాలయం ఉంది. - మౌంట్ అబూ శిఖరం (రాజస్థాన్) పైనున్న దిల్వారా జైన దేవాలయం చాలా ప్రసిద్ధి చెందింది. - శ్రావణ బెళగొళ (కర్ణాటక)లోని గోమఠేశ్వరుని విగ్రహం జైనమత శిల్పకళకు ప్రతీక. జైన సిద్ధాంతాలు కఠినంగా, ఆచరణకు దూరంగా ఉంటాయి. ఈ క్రమంలోనే జైనుల్లో శ్వేతాంబరులు (తెల్లని వస్త్రాలు ధరించేవారు), దిగంబరులు (వస్త్రాలు ధరించని వారు) అనే రెండు శాఖలు ఏర్పడ్డాయి. వీటి మధ్య ఐక్యత కోసం ఖారవేలుడు (కళింగరాజు) ఒక సమావేశం ఏర్పాటు చేసి విఫలుడయ్యాడు. బౌద్ధమతం: వర్ధమాన మహావీరుడి సమకాలీనుడైన గౌతమ బుద్ధుడు బౌద్ధమతాన్ని స్థాపించాడు. కపిలవస్తు నగరంలోని లుంబినీ వనంలో బుద్ధుడు జన్మించాడు. శాక్యరాజైన శుద్ధోధనుడు, మాయా దేవి అతని తల్లిదండ్రులు. బుద్ధుడి అసలు పేరు సిద్ధార్థుడు. చిన్నతనంలో తల్లి చనిపోవడంతో సవతి తల్లి గౌతమి ప్రజాపతి బుద్ధుడిని పెంచింది. అందువల్ల అతనికి గౌతముడు అని పేరు వచ్చింది. గౌతముడి భార్య యశోధర, కుమారుడు రాహులుడు. బుద్ధుడు తన 29వ ఏట జీవిత పరమార్థం తెలుసుకున్నాడు. రాజ సుఖ భోగాలను వదిలి మోక్షం కోసం బయలుదేరాడు. దీన్నే మహాభినిష్ర్కమణం అంటారు. ఇందులో భాగంగా వైశాలి, రాజగృహ నగరాల్లో పండితులను కలిశాడు. చివరికి గయ సమీపంలోని బోధివృక్షం కింద 40 రోజులు ధ్యానం చేసి జ్ఞానోదయం పొందాడు. దీన్నే సంబోధిని అంటారు. అప్పటి నుంచి గౌతముడు (సిద్ధార్థుడు) బుద్ధుడిగా మారాడు. గౌతమబుద్ధుడు వారణాసి సమీపంలో ఉన్న మృగదావనం (సార్నాథ్) చేరి 5మంది పండితులకు ప్రథమంగా జ్ఞానబోధ చేశాడు. దీన్ని ధర్మచక్ర పరివర్తనంగా పిలుస్తారు. ఆయన కుశి నగరంలో క్రీ.పూ. 483లో నిర్యాణం చెందాడు. బౌద్ధమత సూత్రాలు బౌద్ధమత సూత్రాలు: వీటిని ఆర్యసూత్రాలు అంటారు. అవి నాలుగు 1. ప్రపంచం దుఃఖమయం 2. దుఃఖానికి కోరికలే కారణం 3. కోరికలను జయించడం ద్వారా దుఃఖం నశిస్తుంది. 4. కోరికలను జయించడానికి అష్టాంగమార్గాన్ని ఆచరించాలి. అష్టాంగ మార్గంలో 8 నీతి సూత్రాలు ఉన్నాయి. అవి: 1. సరైన వాక్కు (మాట) 2. సరైన క్రియ (పని) 3. సరైన జీవనం 4. సరైన శ్రమ(కష్టం) 5. సరైన ఆలోచన 6. సరైన ధ్యానం 7. సరైన నిర్ణయం 8. సరైన దృష్టి(చూపు) వీటిని ఆచరించినవారు ప్రశాంతతను పొందుతారని బౌద్ధమతం ప్రబోధిస్తుంది. బౌద్ధమత గ్రంథాలను త్రిపీఠకాలు అంటారు. వీటిని ప్రాకృత భాషలో రాశారు. బౌద్ధ మతం విస్తృతంగా వ్యాపించింది. గొప్ప చక్రవర్తులు దీన్ని ఆదరించారు. దీంతో శ్రీలంక, బర్మా, చైనా, టిబెట్, జపాన్ల్లోనూ బౌద్ధ మతం వ్యాప్తి చెందింది. - బౌద్ధులు స్థాపించిన నలంద, వల్లభి, ధాన్యకటక విశ్వవిద్యాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. - వైద్యశాస్త్రజ్ఞులైన చరకుడు, జీవకుడు, బౌద్ధమతాన్ని ఆచరించారు. - బౌద్ధమత ఆచార్యుడైన నాగార్జునుడు, సుహృల్లేఖ, రస రత్నావళి అనే గ్రంథాలను రచించాడు. - మహారాష్ట్రలోని కార్లీ, నాసిక్, అజంతా గుహల్లోనూ, బార్హుత్, సాంచి, అమరావతి, నాగార్జున కొండల్లో, బౌద్ధ ఆరామాలు, గుహాలయాలు, మనోహర శిల్పాలు ఉన్నాయి. - గౌతమ బుద్ధుడి నిర్యాణం తర్వాత అశోక చక్రవర్తి బౌద్ధమత వ్యాప్తి కోసం విశేషంగా కృషిచేసి... దాన్ని జాతీయ ధర్మంగా, అంతర్జా తీయ మతంగా రూపొందించాడు. శాంతి, అహింసలను ప్రచారం చేసిన బౌద్ధం.. వర్ణ వ్యవస్థను ఖండించింది. అందరూ సమానమనే నీతిని, విశ్వశాంతిని కాంక్షించింది. బౌద్ధ సంఘ సమావేశాలు బౌద్ధమత సంఘ సమావేశాలను సంగీతులుగా పిలుస్తారు. మొదటి సంగీతి (క్రీ.పూ.483): రాజగృహంలో అజాత శత్రువు నిర్వహించాడు. దీనికి మహాకాశ్యపుడు అధ్యక్షుడు. ఈ సంగీతిలో సుల్తీ, వినయ పీఠకాలను సంకలనం చేశారు. రెండో సంగీతి(క్రీ.పూ. 383): వైశాలిలో కాలాశోకుడు నిర్వహించాడు. దీనికి సభకామి అధ్యక్షుడు. ఈ సంగీతిలో బౌద్ధ సంఘం రెండు శాఖలుగా(ధీరవాదులు, మహాసాంఘికులు)గా విడిపోయారు. మూడో సంగీతి(క్రీ.పూ. 250): దీన్ని అశోకుడు పాటలీపుత్రంలో నిర్వహించాడు. దీనికి మొగలిపుత్త తిస్స అధ్యక్షత వహించాడు. ఈ సమావేశంలో అభిదమ్మ పీఠకాన్ని రూపొందించారు. నాలుగో సంగీతి(క్రీ.శ.72): కాశ్మీర్‌లోని కుందలవనంలో కనిష్కుడు నిర్వహించాడు. వసుమిత్రుడు అధ్యక్షుడు. ఈ సంగీతిలో బౌద్ధమతం... మహాయాన, హీనయాన శాఖలుగా విడిపోయింది. నాలుగో బౌద్ధ సంగీతి తర్వాత బౌద్ధమతంలో తీవ్రమైన మార్పు సంభవించింది. మహాయాన బౌద్ధం అవలంభించినవారు బుద్ధుడిని ఆరాధించారు. విగ్రహాలు ప్రతిష్టించారు. హీనయానులు మాత్రం దీనికి వ్యతిరేక పద్ధతులను పాటించారు. - వేద నాగరికతలోని వైదిక బ్రాహ్మణ క్రతువులైన విగ్రహారాధన, పూజా విధానాలకు వ్యతిరేకంగా ఆవిర్భవించిన బౌద్ధమతంలో తిరిగి మహాయానుల ద్వారా వాటినే బౌద్ధంలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం మహాయాన శాఖ అభివృద్ధిలో ముందుంది. - మహాయాన బౌద్ధాన్ని ప్రచారం చేసిన వారిలో ఆచార్య నాగార్జునుడు ప్రముఖుడు. గతంలో అడిగిన ప్రశ్నలు: 1. జైనమతం నుంచి ప్రేరణ పొందిన కళ ఏది? (కానిస్టేబుల్ - 2013) ఎ) గాంధార బి) మధుర సి) సుంగ డి) ఏదీకాదు 2. దిల్వారా జైన దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? (ఎక్సైజ్ కానిస్టేబుల్ - 2013) ఎ) కర్ణాటక బి) గుజరాత్ సి) రాజస్థాన్ డి) మహారాష్ట్ర 3. బుద్ధుడు ఏ భాషలో ప్రబోధించాడు? (ఎస్సై- 2012) ఎ) ప్రాకృతం బి) పాలి సి) సంస్కృతం డి) బ్రాహ్మీ సమాధానాలు: 1) బి 2) సి 3) బి మాదిరి ప్రశ్నలు 1. బుద్ధుడి ప్రధాన శిష్యుడు? ఎ) అంబపాలి బి) అంగుళిమాలి సి) ఆనందుడు డి) ఉపాలి 2. గాంధార శిల్పకళ ఏ రాజు కాలంలో విలసిల్లింది? ఎ) అశోకుడు బి) ఖారవేలుడు సి) చంద్రగుప్తుడు డి) కనిష్కుడు 3. చైత్యం అంటే? ఎ) బౌద్ధసన్యాసుల విశ్రాంతి మందిరం బి) బౌద్ధమతస్థుల ప్రార్థన స్థలం సి) బౌద్ధ గురువుల బోధనా మందిరం డి) బౌద్ధమతస్థుల ఆరామం 4. జెండ్అవెస్టా అనే మత గ్రంథాన్ని రచించినవాడు? ఎ) కన్ఫ్యూజియస్ బి) లావోట్జి సి) జొరాస్టర్ డి) పైవేవీ కావు 5. గాంధార శిల్పకళను ఏమని పిలుస్తారు? ఎ) మధురకళ బి) అమరావతి కళ సి) గ్రీకో- బౌద్ధమతం డి) ఇండో- గ్రీక్ శిల్పకళ 6. అజీవమత ప్రధాన ప్రచార కర్త? ఎ) అజీవకుడు బి) మకాకలి గోసల సి) అజీతకేశకంబలి డి) మొగలిపుత్త తిస్స 7. సృష్టిలో ఏదీ శాశ్వతం కాదని నమ్మేవారు? ఎ) హీనయాన బౌద్ధులు బి) మహాయాన బౌద్ధులు సి) అజీవకులు డి) చార్వాకులు 8. జైనమతంలో శ్వేతాంబర ధారణను సమర్థించిన తీర్థంకరుడు? ఎ) పార్శ్వనాథుడు బి) రుషభనాథుడు సి) మహావీరుడు డి) కృష్ణనాథుడు 9. బోధిసత్వుడి ప్రతిమలను మలిచిన శిల్పులు ఏ రాజుల కాలంలో ఎక్కువగా ఉండేవారు? ఎ) అశోకుడు బి) కనిష్కుడు సి) చంద్రగుప్తుడు డి) అజాతశత్రువు 10. ప్రథమ జైన సంఘ సమావేశాన్ని పాటలీ పుత్రంలో ఎవరు నిర్వహించారు? ఎ) పార్శ్వనాథుడు బి) ఖారవేలుడు సి) వసుమిత్రుడు డి) స్థూలబాహుడు 11. వర్ధమాన మహావీరుడు ఏ నదీతీరాన జీవత్వం పొందాడు? ఎ) రుజుపాలిక బి) జృంభిక సి) దృషధ్వతి డి) పావాపురి 12. జైనమతం : అంగాలు :: బౌద్ధమతం : చిచిచిచి ? ఎ) త్రిరత్నాలు బి) త్రిపీఠకాలు సి) అష్టాంగమార్గం డి) పంచవ్రతాలు 13. జైన సూత్రాలైన పంచ వ్రతాల్లో మహావీరుడితో అధిక ప్రాధాన్యం పొందిన సూత్రం? ఎ) బ్రహ్మచర్యం బి) అహింస సి) సత్యం డి) ఆస్తేయం కాంపిటీటివ్ కౌన్సెలింగ్ కానిస్టేబుల్ రాత పరీక్షలో ప్రాచీన భారతదేశ చరిత్ర ప్రాధాన్యతను తెలపండి? ఎలా ప్రిపేరవ్వాలి? - బద్ధం కన్నారెడ్డి, ఉప్పల్ పరీక్షలో చరిత్ర నుంచి సుమారు 25 ప్రశ్నలు అడుగుతారు. వీటిలో ప్రాచీన భారతదేశ చరిత్ర నుంచి 4 నుంచి 5 ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ఈ అంశాలను పక్కాగా ప్రిపేరైతే సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. జైన, బౌద్ధమత సంబంధిత అంశాల నుంచే ఒకటి లేదా రెండు ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి మహావీరుడు, గౌతమ బుద్ధుడు జన్మించిన, నిర్యాణం చెందిన ప్రదేశాలను గుర్తుంచుకోవాలి. అలాగే జైన, బౌద్ధ మతాలకు సంబంధించిన ప్రధాన సూత్రాలను, గ్రంథాలను, నియమాలను అభ్యర్థులు ప్రత్యేక దృష్టితో చదవాలి. వీటిని పట్టిక రూపంలో సిద్ధం చేసుకుంటే గుర్తుంచుకోవడానికి సులువుగా ఉంటుంది. గౌతమ బుద్ధుడికి సంబంధించిన మహాభినిష్ర్కమణం, జ్ఞానోదయం, ధర్మచక్ర పరివర్తనం, మహాపరినిర్యాణం తదితర అంశాలు ఎక్కడ, ఎందుకు జరిగాయో నేర్చుకోవాలి. బౌద్ధమత అష్టాంగ మార్గాలు, జైన మత పంచవ్రతాలనూ సులభంగా గుర్తుంచుకోవడానికీ వాటిలోని మొదటి అక్షరాలతో ఒక పదాన్ని రూపొందించుకోవచ్చు. ఉదాహరణకు బౌద్ధమత అష్టాంగ మార్గాలైన సరైన మాట(వాక్కు), జీవనం, ఆలోచన, ధ్యానం, పని(క్రియ), కష్టం(శ్రమ), నిర్ణయం, చూపు(దృష్టి) నుంచి ‘మాజీ ఆధ్యాపకుని చూపు’ అని ఒక సులభమైన వాక్యంగా తయారు చేసుకోవచ్చు.