తన గురకే తన శత్రువు

తన గురకే తన శత్రువు


 మెడికల్ మెమరీస్

 

 ...::: యాసీన్

పురుషాధిక్య సమాజంలో మగాళ్లు ఎంతగా గురకపెట్టినా మహిళ సహనంతో భరిస్తుంది. కానీ భార్యే గురక పెడితే...

 

కావ్యకు (పేరు మార్చాం) 32 ఏళ్లు. కోల్‌కతాలోని అంతర్జాతీయ బ్యాంకులో ఉన్నతోద్యోగి. భర్త అదే ఆఫీసులో సహోద్యోగి. అపశ్రుతులే లేని అందాల కాపురం. కానీ అకస్మాత్తుగా కావ్యకు గురక రావడం మొదలైంది. స్లీప్ ఆప్నియా! గురకను భరించలేక ఆమెను వదిలేశాడా భర్త!  నిజానికి గురకతో వచ్చే సౌండ్ వల్ల... నిద్రపోయే వ్యక్తి ‘సౌండ్’ స్లీప్‌లో ఉన్నారని అనుకుంటారు. అది వాస్తవం కాదు. ఓ వ్యక్తి గురక పెడుతున్నాడంటే అతడి నిద్ర నాణ్యమైన నిద్ర కాదని అర్థం. నిద్రాదేవి ఎంత దయామయురాలో... అంత నిర్దయురాలు కూడా. ఆ నిర్దయనంతా కావ్య మీద చూపించింది నిద్రాదేవత.

 

నిద్రాదేవత తన ఒడిలోకి తీసుకున్న వారి ప్రాపంచిక బాధలను మరిపిస్తుంది. కలలతో మురిపిస్తుంది. కానీ గురకతో నిద్ర పొల్యూట్ అయినప్పుడు సదరు వ్యక్తికి సరిగా నిద్రలేక నిద్రాదేవతకు నిద్రబాకీ పడతాడు. దాన్నే ‘స్లీప్ డెఫిసిట్’ అంటారు. అలాంటి సందర్భాల్లో బాకీ వసూలులో నిద్రాదేవత నిర్దయతో వ్యవహరిస్తుంది. తన నిద్రబాకీని వసూలు చేయడానికి పగటివేళ ప్రయత్నిస్తుంటుంది. దాంతో పగ పెంచుకున్నట్లుగా పగలూ నిద్రలోకి లాగేయడానికి యత్నిస్తుంటుందా నిద్రాదేవత. ఫలితంగా రాత్రుళ్లు గురకపెట్టే వారు పగలూ డల్‌గా అయిపోతుంటారు.

 

ఓ పక్క వదిలి పోయిన భర్త. మరో పక్క పగటి వేళల్లోనూ లోపించిన క్రియాశీలత. దాంతో ఆఫీసు పనుల్లో ఆమె చురుకుదనం తగ్గి, బాసుల్లో కరుకుదనం పెరిగింది. తొలుత ఆమె స్లీప్ ఆప్నియాను తగ్గించుకోడానికి చెస్ట్ స్పెషలిస్ట్‌ను కలిసింది. ఆయన సరిగానే వైద్యం చేసి గురకను తగ్గించే ఉపకరణమైన సీపాప్‌ను ఇచ్చారు. కానీ దాంతో ప్రయోజనం కనిపించలేదు. పరిస్థితి మరింత దిగజారింది. దాంతో ఆమె తీవ్రమైన డిప్రెషన్‌కు లోనైంది.



ఈ డిప్రెషన్‌ను తగ్గించుకోడానికి సైకియాట్రిస్ట్‌ను కలిసింది. వాళ్లిచ్చే మందులతో మరింత మగత! ఫలితంగా ఆఫీసులో సమయానుకూలంగా ఆమెకు రావాల్సిన ఎన్నో పదోన్నతులను మిస్ అయ్యింది. పైగా అన్ని మందుల దుష్ర్పభావాలతో క్రమంగా ఆమెకు స్థూలకాయం కూడా వచ్చింది. దాంతో ఇంకా ఇంకా డిప్రెషన్‌లోకి కూరుకుపోయింది. ఆ పరిస్థితుల్లో ఆమె ఒకసారి డాక్టర్ శ్రీనివాస్ కిశోర్‌ను కలిసింది. అది ఆమె జీవితంలో ఒక  మేలుమలుపు!



నిజానికి స్లీప్ ఆప్నియాతో వచ్చే పేషెంట్స్‌కి సీపాప్ పరికరాన్ని సూచిస్తారు. ఆమెకూ అక్కడి డాక్టర్లు అదే చేశారు. కానీ ఆమె దాన్ని సరిగా ఉపయోగించలేకపోతోంది. దానికి కారణాలు అన్వేషించడం మొదలుపెట్టారు శ్రీనివాస్ కిశోర్. స్లీప్ ఎండోస్కోపీ పరీక్షలో ఒక విషయం తేలింది. ఆమె గదమ  చాలా చిన్నది. నాలుక కాస్త వెనగ్గా ఉంది. శరీర నిర్మాణంలోని ఈ స్వభావం వల్ల ఆమె సీపాప్‌ను సమర్థంగా ఉపయోగించుకోలేకపోయింది. దాన్ని కనిపెట్టిన శ్రీనివాస్ కిశోర్ ఒక చిన్న ప్రొసీజర్ ద్వారా పరిస్థితిని చక్కదిద్దారు. దాంతో ఆమె సీపాప్‌ను సమర్థంగా ఉపయోగించగలిగింది. తన కంటినిండా నిద్రతో నిద్రాదేవతకు కడుపునిండా నివేదన. ఆ నివేదనలతో ఆవేదనలన్నీ తీరాయి.

 

అంతే... మూడు వారాల్లోనే ముచ్చటైన ఫలితం. గురక తగ్గింది. చురుకు పెరిగింది. బరువు తగ్గింది. మునుపటిలాగే మళ్లీ తీగలాంటి ఆకృతి. భర్తలోనూ పశ్చాత్తాపం కలిగిందో ఏమో... తప్పెరగక తొలుత తప్పుకున్న భర్త తప్పు తెలుసుకుని మళ్లీ  తిరిగివచ్చాడు. ఎప్పట్లాగే అన్యోన్యంగా ఉండటం మొదలుపెట్టాడు. ఆఫీసులో తొలి ప్రమోషనూ అందుకుంది. అంతకంటే ముఖ్యమైన మరో ప్రమోషన్! అదే... త్వరలో ఆమె అమ్మ కాబోతోంది!!

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top