ఆకుపచ్చ సూర్యోదయం

ఆకుపచ్చ సూర్యోదయం


ఒడ్డున నిలుచుని గంగానదిని చూస్తుంటే జీవిత గమ్యం దొరికినట్టనిపించింది. గంగ–అసి నదుల సంగమం దగ్గర ఉండే అసీ ఘాట్, దశాశ్వమేథ్‌ ఘాట్, సింధియా ఘాట్, మణికర్ణిక, హరిశ్చంద్ర ఘాట్, తులసీఘాట్, భోన్సలే ఘాట్‌.... ఎక్కడ నుంచి చూసినా గంగ ఈ దేశపు మహాద్భుతం అనిపించేది. నిత్యం ఒక ఘాట్‌లో స్నానం చేయడం, కాశీ విశ్వేశ్వరుడిని దర్శించుకోవడం.వారం తరువాత ఒక సంస్కృత పండితుడి దగ్గర చేరాడు రామరాజు. మనసుకు గొప్ప శాంతిని అందించింది కాశీ. చాలా కాలం ఉండాలి అనుకున్నాడు రామరాజు.కానీ ఆరునెలలు గడిచేసరికే మనసు మారిపోయింది.



లక్నో, రాంపూర్‌ దాటి హరిద్వార్‌ చేరుకున్నాడు రామరాజు.తరువాత రిషీకేశ్‌. కొండల పాదాలను తడుపుతూ సాగుతూ ఉంటుంది. గంగ. ఆ ప్రవాహం వెంటే సాగిపోతూ ఉంటుంది ఆ యాత్ర. ఒక కొండ నుంచి ఇంకో కొండ మీదకు సాగుతూ ఉంటుంది ప్రయాణం. పిప్పల్‌కోట్, జోషీమ వరకు ఇదే దారి. అక్కడ నుంచి బదరీనాథ్‌. చైనా, టిబెట్‌ సరిహద్దులలోనే ఉంది. ఘడ్వాల్‌ ప్రాంతమది. మంచు నిండిన కొండలు... గోవిందఘాట్‌ నుంచి బదరీనాథ్‌కు తీసుకువెళ్లే ఆ 18 మైళ్ల ప్రయాణం దివ్యమైనది.బదరీనాథ్‌... పురాణాలలో చెప్పే బదరికాశ్రమం.



అలకనంద తీరంలోని గొప్ప వైష్ణవక్షేత్రం. ఉపనిషత్తులకీ, బ్రహ్మసూత్రాలకీ భాష్యాలు అవతరించిన నేల. బదరీనాథుడి ఆలయం– శంకరభగవత్పాదులు నిర్మించినది. అందులోని జలం విష్ణుపాదాల నుంచి వచ్చినదని నమ్ముతారు. గుడికి కుడిపక్కనే బ్రహ్మకుండం. ఇది దాటి కుడి వైపున అలకనంద తీరం వెంటే యాభై గజాలు నడిస్తే, అంటే ఉత్తరాన ఉంది బ్రహ్మకపాలం. తిరుగు ప్రయాణంలో ఐదు నదుల నేల పంజాబ్‌ని దర్శించుకున్నాడు రామరాజు. అమృతసర్‌లో స్వర్ణాలయం కూడా చూశాడు. ఎక్కడ అడవులు ఉంటే అక్కడికే నడిచాయి అతడి పాదాలు. ఎక్కడ నది ఉంటే అటే పోయింది మనసు.  నడుస్తూనే ఉన్నాడు. కానీ తృప్తి కలగడం లేదు. మళ్లీ ఆయన పాదాలు గోదావరి ఒడ్డుకు నడిచాయి.



ఒక్క యాత్రతో మనసుని క్షాళనం చేయగల పుణ్యక్షేత్రాలు. ఒక్క స్నానంతో మనసుని క్షాళన చేసే  నదీనదాలు. ఒక్క వీక్షణంతో జ్ఞానతృష్ణకు రెక్కలు తొడిగే కొండలూ కోనలూ. ఇది నా మహోన్నత దేశం. అయినా ఎందుకీ కరువు? అయినా ఏమిటీ అజ్ఞానాంధకారం? అయినా ఎలా వచ్చిందీ అనైక్యత? అన్నింటికి మించి మార్పుకోసం ఆరాటపడని జడత్వం ఏమిటి జాతి నిండా?పాపికొండల మీద నడుస్తుంటే హృదయం ఘోషిస్తోంది రామరాజుకి. తనకి జ్ఞానోదయం కల్పించమని గోదారమ్మని అడుగుతున్నట్టే ఉంది అతడి ముఖం. అన్వేషించమనే చెబుతోంది ఆటుపోట్ల గోదావరి.



మళ్లీ నడక. మళ్లీ అన్వేషణ. ఎటో పోతున్నాడు. అదిగో! ఎవరో పిలుస్తున్నారు. ఎవరో తనని పిలుస్తున్నారు. ఔను. ఎవరో ఏదో పేరుతో పిలుస్తున్నారు.అది చిటికెల నారాయణమూర్తి గొంతు. ‘అయ్యా సాములోరు! ఆగండి! అటంతా అడవే స్వామీ. అదిగో అది మా అన్నగారిల్లు. రండి బాబు వెనక్కి రండి! మా ఇంట భిక్ష తీసుకుని వెళ్లండి......’ఇంకా ఈ ఊరి పేరు కృష్ణదేవిపేట అంటున్నాడతడు. అంతకు ముందు విన్నపేరే! తను ఆగిపోయాడు. చటుక్కున ఈలోకంలోకి వచ్చి పడ్డాడు రామరాజు. తను ఎక్కడ ఉన్నాడో అర్థమైంది. తెల్లవారినట్టుంది. గది బయట సోమమ్మగారు పిలుస్తున్నారు.‘‘బాబయ్యా! ఈ లాంతరు పట్టుకుని బయలుదేరు స్నానానికి.’’



 5

సీతను తీసుకుని అమ్మమ్మ అచ్యుతమ్మ వెళ్లిపోయింది. అది జరిగిన వారం రోజుల తరువాత.తనకు ఇచ్చిన ముందుగదిలో సాయంత్రం వేళ ఒక్కడూ కూర్చుని ఉన్నాడు రామరాజు. అప్పుడు వచ్చాడు భాస్కరుడు, ఏదో చెబుదామని. చూసీ చూడడంతోనే తనే ముందు అన్నాడు రామరాజు, ‘‘అన్నయ్యగారూ! ఒక్క విషయం!’’‘‘చెప్పండి!’’ అన్నాడు భాస్కరుడు.‘‘ఈ ఊరుతో నా అనుబంధం దైవనిర్ణయమనిపిస్తుంది నాకు. నా ఊరు, నేను ఉండవలసిన చోటు ఇదేననిపిస్తోంది. కానీ ఎల్లకాలమూ మీ ఇంటిలో ఉండడం భావ్యం కాదు. అమ్మ, తమ్ముడు కూడా ఇక నాతోనే ఉండిపోవచ్చు. నాకు కొద్దికాలం క్రితం కట్టినట్టే చిన్న ఇల్లు కట్టి ఇవ్వండి. కొంత భూమి కౌలుకి ఇప్పించండి! వ్యవసాయం చేయాలని ఉంది. నా బతుకు నేను బతకాలని ఉంది. ముఖ్యంగా ఏకాంతం కావాలి నాకు.’’ అన్నాడు రామరాజు.‘‘మీరూ, మీ కుటుంబం మాకు భారం కాదు. అయినా, మీ మాట సబబైనది.



 మీరు ఈ గ్రామంలోనే ఉండాలని మనసారా కోరుకుంటున్నవాడిగా, మీరు చెప్పినట్టే చేస్తాను. మీకు ఎంతో ఇష్టమైన తాండవ ఒడ్డునే ఆ ఏర్పాటు చేస్తాను. పడాల దిబ్బలు తెలుసు కదా! అవి మనకు తెలిసినవాళ్ల సొంత భూములే. అక్కడే మీరు ఉంటారు.’’ చెప్పాడు భాస్కరుడు.ఊరు సంబరం చేసుకుంది– ఆ వార్తతో. నీలకంఠేశ్వరస్వామి ఆలయం దాటి వెళితే చిన్న దిబ్బ నుంచి నది వైపు దిగుతున్నట్టు ఉంటుంది. అక్కడే చిక్కాలగెడ్డ అనే చిన్న ఏరు తాండవలో సంగమిస్తూ ఉంటుంది. ఆ ఎగుడుదిగుడు నేలనే పడాల దిబ్బలు అంటారు. వాటి మీదే వరి చేలు ఉన్నాయి. అందులో కొంత భూమి రామరాజు కౌలుకు తీసుకున్నాడు.



రెండు చక్కని తాటాకు పాకలు నిర్మించి పెట్టారు గ్రామస్థులంతా కలసి. ఒకటి రామరాజు కుటుంబంతో ఉండడానికి. రెండు ఎప్పటి నుంచో రామరాజు కోరుతున్నట్టు గ్రంథాలయం కోసం, పఠన మందిరం కోసం. అవి పక్కపక్క కట్టిన పర్ణశాలల మాదిరిగా ఉన్నాయి. ఎదురుగా, ఏటి ఒడ్డున చెట్టు. పురాణాలలో వర్ణించే మున్యాశ్రమాలలా రూపుకట్టాయి. కొంచెం ముందే చిన్నగాదిగుమ్మి.వాటికి ముందు సోమమ్మగారు ఇచ్చిన నల్లటి ఆవును కట్టేశారు.ఇన్నాళ్లు నిర్మానుష్యంగా ఉన్న పడాల దిబ్బల ప్రాంతం ఇప్పుడు రమణీయమైన ప్రదేశమైంది. దానికే ఊరివారు శ్రీరామ విజయనగరం అని నామకరణం చేశారు. రామరాజు మీద పెంచుకున్న ప్రేమకు గుర్తు.



6

సూర్యనారాయణమ్మ మనసుకు గొప్ప ఊరట దొరికింది.                                                      

1918, జూన్‌ మాసాంతం – ఆ నెలలో కృష్ణాతీరం పరిస్థితి ఇదీ అంటూ ఆంధ్రపత్రిక ఇచ్చిన వార్తా కథనం వాళ్లందరినీ కలచివేసింది. గ్రేట్‌వార్‌ లేదా ప్రపంచ మహా సంగ్రామం ఫలితమంటూ ఇచ్చారా వార్తా కథనాలు. ‘ధరలు తగ్గించాలంటూ చల్లపల్లి ప్రజలు ఆందోళనలకు దిగారు. ఇందులో ఎవరి ప్రోద్బలం లేదు. రెండువందల మంది ఊరేగింపులో పాల్గొన్నారు. కొన్ని దుకాణాలను ఉద్యమకారులు దగ్ధం చేశారు.



‘ఉయ్యూరు, మచిలీపట్నం, గుడివాడలలో కూడా ఇలాగే  జనం ఉద్యమం చేపట్టారు. గుంటూరు ప్రాంతంలో బాపట్ల, వేటపాలెం, అమ్మనబ్రోలులో కూడా ఇలాగే ఆందోళనలు జరిగాయి. హాహాకారాలు మిన్నంటాయి. గోదావరి తీరంలోని పోలవరంలో కూడా అల్లర్లు జరిగినట్టు నివేదికలు వచ్చాయి.అసలు మద్రాసు ప్రెసిడెన్సీయే కరువుకాటకాలతో విలవిలలాడుతోంది.పేజీ తిప్పి, అక్కడ కనిపించిన ఇంకో వార్త చదువుకుంటున్నారు భాస్కరుడు. ‘ఈశాన్య భారత అడవులలో కుకీలు, చిన్‌లు అనే కొండవాళ్లు తిరుగుబాటు లేవదీశారని వార్తలు వస్తున్నాయి. పంజాబ్‌లో గదర్‌ పార్టీ విజృంభిస్తోందట. మలబార్‌లో మోప్లాలు తిరగబడుతున్నారట.’



  7                                                     

‘‘సమిధలు స్వామీ!’’

ఆ మాటకు అటు తిరిగాడు రామరాజు.‘‘యాగం చేయిస్తాన్నారట. సంతలో చాటింపేశారు. అందుకే తెచ్చాం!’’ అన్నాడు గోకిరి ఎర్రేసు. చక్కగా కోసిన రావి చితుకుల మోపు ఉంది ఎర్రేసు నెత్తిమీద. ‘‘ఏ ఊరు నీది?’’ అడిగాడు రామరాజు ప్రసన్నంగా నవ్వుతూ. ‘‘గన్నర్లపాలెం స్వామీ! గోకిరి ఎర్రేసు అంటారు. కృష్ణదేవిపేట సంతకి కూడా వస్తుంటాను. ఆదినారాయణ బాగా తెలుసు!’’ అమాయకంగా అన్నాడు.భాస్కరుడు గారింటి అరుగు మీద కూర్చుని ఉన్నారు రామరాజు, భాస్కరుడు ఎదురెదురుగా, స్తంభాలకి జారపడి. చేతులు కట్టుకుని అక్కడే నిలబడి ఉన్నాడు ఆదినారాయణ.ఎర్రేసు వెనకే ఉన్నాడు బొంకుల మోదిగాడు, భుజం మీద కావడితో. మర్రి చితుకుల మోపు ఒకటి, రావి చితుకుల మోపు ఒకటి ఉన్నాయి కావడి తాళ్లల్లో.



ఆ ఇద్దరి వెనుక కొంచెం దూరంలో నిలబడి ఉన్నారు మరో నలుగురు. అంతా కొండవాళ్లే. నెయ్యి, పుట్ట తేనె, మామిడాకులు మోయగలిగినన్ని తీసుకుని వచ్చారు.

జూలై ముగుస్తున్నా తొలకరించలేదు ఆకాశం. విత్తనాలు పడలేదు. గ్రాసం లేక పశువులు పాడైపోతున్నాయి. బావులు లోతుకుపోయాయి. ఈ దుర్భిక్ష వాతావరణంలోనే వరుణ జపం, హోమం చేయిద్దామని రామరాజు సలహా ఇస్తే కృష్ణదేవిపేట ప్రజలంతా ఆనందంగా అంగీకరించారు. చుట్టుపక్కల గ్రామాల వారితో పాటు, కొండవాళ్లని కూడా పిలవాలని చెప్పాడు రామరాజు. ‘‘సెలవు స్వామీ!’’ అన్నాడు ఎర్రేసు, ఎదురుగా వచ్చి.

‘‘ఎర్రేసూ! మీరంతా యాగానికి రావాలి.’’అన్నాడు రామరాజు. బ్రహ్మానందపడిపోయారు వాళ్లు.

                                                                 8

‘‘ఆంధ్రపత్రికలో ఏదో రాశారట. మిమ్మల్ని చప్పున తీసుకురమ్మన్నారు నాన్నగారు!’’ ఆవును కట్రాడుకు కట్టేస్తున్నాడు రామరాజు. అప్పుడే పరుగు పరుగున వచ్చారు, భాస్కరుడిగారబ్బాయి దాలినాయుడు, మరో కుర్రవాడు. అరగంటకి గ్రామచావడి దగ్గరకి చేరుకున్నాడు రామరాజు. ‘‘చూశారా రామరాజుగారూ! నెలా పదిరోజులు దాచిపెట్టారు ఈ వార్తని. వీళ్లు మనుషులేనా?’’ అన్నాడు మర్రి వెంకటాచలం. ఇప్పటిదాకా ఎంత ఆవేశపడి ఉంటాడో అతని మాట తీరే చెబుతోంది. ఆ వార్త భాగం మాత్రమే కనిపించేటట్టు ఆంధ్రపత్రికను మడిచి రామరాజు చేతికి ఇచ్చాడు భాస్కరుడుగారు.



జూలై 12: 1919 అమృత్‌సర్‌లో అశాంతి ఇలాంటి దుర్ఘటన గురించి ఇంత ఆలస్యంగా పాఠకుల దృష్టికి తీసుకువస్తున్నందుకు మొదట  క్షమాపణలు కోరుతున్నాం. ఇలాంటి రక్తాక్షరాలకు ఈ పత్రికలో చోటు ఇవ్వవలసి వస్తుందనీ, వేలాదిమంది మనసులను గాయపరచవలసి వస్తుందనీ ఊహించలేదు.1919, ఏప్రిల్‌ 13వ తేదీ హిందూదేశ చరిత్రలో మరచిపోలేని రోజు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో, స్వర్ణదేవాలయం పక్కనే ఉన్న జలియన్‌వాలాబాగ్‌ మైదానంలో శాంతియుతంగా సమావేశమైన పౌరుల మీద పోలీసులు కాల్పులు జరిపారు. హర్‌మందిర్‌ సాహెబ్‌ దగ్గరే ఉన్న ఈ తోటలో జరిగిన  కాల్పులలో 379 మంది చనిపోయారనీ, 1137 మంది గాయపడ్డారనీ ప్రభుత్వం ప్రకటించింది. ఈ అంకె నిజం కాదనీ, చనిపోయినవారి సంఖ్య ఇంకా ఎంతో ఎక్కువ అని గాంధీగారికి సమాచారం అందుతోంది. మృతులలో 41 మంది బాలురు, ఆరువారాల శిశువు కూడా ఉన్నారని పంజాబ్‌ ప్రభుత్వమే ప్రకటించింది........



పెద్ద వార్త.  పూర్తిగా చదవకుండానే కళ్లల్లో నీళ్లు నిండి కళ్లు అలుక్కుపోయాయి రామరాజుకి. ‘‘ప్రపంచ సంగ్రామంలో సహకరించినందుకు గాంధీగారికీ, పంజాబ్‌ ప్రజలకీ ఎంత గొప్ప కానుక ఇచ్చింది బ్రిటిష్‌ ప్రభుత్వం! నేను ఐదునదుల పంజాబ్‌ను దర్శించుకున్నాను. ఇప్పుడు తెల్లజాతి మరో నదిని పారించింది. అది నెత్తుటి నది’’అంటూనే అక్కడ నుంచి వెళ్లిపోయాడు, రామరాజు. ఆ రోజంతా తాండవ ఒడ్డున కూర్చుని బాధపడుతూనే ఉన్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ కొన్ని ప్రశ్నలు పదునెక్కుతున్నాయి. అహింసతో హింసని నిరోధించడం వాస్తవిక ఆలోచనేనా?



కానిస్టేబుల్‌ కుండలో నుంచి తీసి ఇచ్చిన నీళ్లు తాగుతున్నాడు ఫర్బీస్‌. అప్పుడే మోగింది వైర్‌లెస్‌. ‘‘హలో.... నర్సీపట్నం హెడ్‌క్వార్టర్స్‌...ఓవర్‌!’’పరిచయం కలిగిన గొంతు. మరింత ఉత్సాహంగా స్పందించాడు ఫర్బీస్‌.

‘‘హలో.... కేడీపేట క్యాంప్‌....హలో, ఈవ్‌లింగ్‌. నువ్వేనా!? గుడ్‌మార్నింగ్‌. ఓవర్‌.’’‘‘అభినందనలు!’’ అవతల అన్నాడు ఈవ్‌లింగ్‌. అడ్డతీగెల ఠాణా అధిపతి అతడు.‘‘నీక్కూడా. నర్సీపట్నంలో ఎవరున్నారు?’’ అడిగాడు ఫర్బీస్‌.‘‘సాండర్స్, మార్టిన్‌ ఇప్పుడే కేడీపేట బయలుదేరారు. స్పెషల్‌ కమిషనర్, జాన్‌ మద్రాస్‌ నుంచి రాబోతున్న ఫోన్‌ కాల్‌ కోసం చూస్తున్నారు. వీళ్లూ కేడీపేట బయలుదేరతారు.’’ చెప్పాడు ఈవ్‌లింగ్‌. స్పెషల్‌ కమిషనర్‌ వచ్చాక  ఏజే హెపెల్‌ని ఆపరేషన్స్‌ కమాండర్‌గా తప్పించి జాన్‌ని నియమించాడు.



‘‘అన్నట్టు స్వేనీ గాడు నిన్ననే అక్కడికి వచ్చాడు. ఏం చేస్తున్నాడు?’’ అన్నాడు ఫర్బీస్‌.‘‘స్పెషల్‌ కమిషనర్‌కీ, జాన్‌కీ చరిత్ర చెబుతున్నాడు.’’ అన్నాడు ఈవ్‌లింగ్‌.‘‘ ఇప్పుడా? ఎవరి చరిత్ర?’’ అంత ఉత్కంఠలోనూ ఆసక్తిగా అడిగాడు ఫర్బీస్‌.‘‘అదే, లాగరాయి ఫితూరీ, గరిమండ మంగడు... అంతకుముందు ద్వారబందాల చంద్రయ్య, కారం తమ్మనదొర––  ఇవన్నీ...గంట నుంచి. ఎప్పుడో క్లైవ్‌ చేసిన ప్లాసీ యుద్ధానికి ముందే చౌర్స్‌ అనేచోట కొండవాళ్లు తిరుగుబాటు చేశారట. అక్కడ అందుకున్నాడు. ఇక చూస్కో– ఖాశీలట, ఖోందులట, ఖోలీలట, సంతాల్స్‌ అట,  ముండాలట, బీర్సా ముండా అట, కుకీలట – బెంగాల్‌ ప్రెసిడెన్సీ నుంచి, బొంబాయి ప్రెసిడెన్సీ మీదుగా తిప్పి, చివరికి కథని మద్రాస్‌ ప్రెసిడెన్సీ విశాఖ మన్యంలో లాగరాయికి తీసుకొచ్చాడు. అసలు స్పెషల్‌ కమిషనర్‌ రెండు రోజుల నుంచి హెపెల్‌ నివేదిక తెలుసుగా, అదే చదువుతున్నాడట. ఓవర్‌.’’



 మూడవ అధ్యాయం

గోడకు తగిలించిన ఆ వస్తువు మీద అనుకోకుండా పడింది రామరాజు దృష్టి.ఎప్పుడూ మూసి ఉండే ఆ గది తలుపు ఆరోజు బార్లా తీసి ఉంది. పాతసామాను పడేసే గది.కొండచిలువ మింగిన చిరుజంతువు ఆకృతి పొట్ట మీద లీలగా కనిపిస్తున్నట్టు ఉబ్బెత్తుగా ఉంది, ఆ గోడకి. అంత పొడవు ఉన్నా పట్టి పట్టి చూస్తే తప్ప తెలియడం లేదు. మట్టితో అలికిన గోడ. గోడ మీద నుంచి ఒక పొరలా బూజు, బూజు మీదుగా దట్టంగా దుమ్ము. తన ఒడిలో ఉన్న సోమమ్మ కుడి కాలు మర్దన చేస్తూనే మార్చి మార్చి చూస్తున్నాడు రామరాజు, ఆ గోడ కేసి.



‘‘ఇంకో నాలుగు చుక్కలు పొయ్యి!’’ పక్కనే ఉన్న దాలినాయుడితో అన్నాడు రామరాజు.కొబ్బరి నూనె సీసా ఒంచి వేశాడతడు, ఆమె పాదం మీద. తరువాత వంటింటి వైపు వెళ్లాడు.ఈసారి ఇంకాస్త బలంగా మర్దన చేసాడు రామరాజు. బాధని పంటి బిగువున అణుచుకుంటోంది సోమమ్మ.మొన్ననే బావి దగ్గర కాలు మడతపడిందామెకు. ఆ సంగతి ఆలస్యంగా తెలిసింది. వెంటనే శ్రీరామ విజయనగరం నుంచి వచ్చాడు రామరాజు. ఆ ఇంటికి వచ్చి ఇంతకాలమైనా ఏనాడూ లోపలికి రాలేదు. ఇప్పుడు సోమమ్మగారి కాలు బెణుకు వల్ల వచ్చాడాయన.రామరాజుకి చటుక్కున గుర్తుకొచ్చింది పాండవుల మెట్ట....... ఆ రోజు సింహాచలం వెళ్లొస్తామంటూ తుని నుంచి బయలుదేరారు– రామరాజు, ఆయన తుని మిత్రులు. కానీ మరునాడు పెద్దాపురంలో దిగారు, తెలతెలవారుతుండగా.పెద్దగా కష్టపడకుండానే అతడి చిరునామా తెలిసింది. పేరు షేక్‌ మదీనా.



ఊరు మొదట్లోనే చిన్న పెంకుటిల్లు. రిటైర్డ్‌ పోలీసు ఉద్యోగి మదీనా. అరవై అయిదేళ్లుంటాయి. వాళ్లలో రేగరాజు మహా చురుకు. మాటకారి. ‘‘నవాబుగారూ! నమస్కారం. మాది తుని.  క్షత్రియులం’’ అన్నాడు.‘‘నమస్కారం బాబూ!’’ అన్నాడతడు ఎంతో మృదువుగా. ‘‘తుపాకీ కాల్చడంలో తమది అందె వేసిన చేయి అని విని వచ్చాం, ఇంతదూరం. మా శ్రీరామరాజుకి వేటాడాలని కోరిక. మీరు తుపాకీ పట్టడం నేర్పించాలి. కాదనకూడదు.’’ అన్నాడు రేగరాజు.‘‘ఎంతమాట బాబూ! నేర్పిస్తాను. ఓ మూడు రోజులు ఉంటారా! ఇంతకీ ఎక్కడుంటారు?’’ అన్నాడు మదీనా.‘‘ఉంటాం. సత్రంలో బస.’’ మళ్లీ అన్నాడు రేగరాజు.



‘‘అదిగో! చూశారుగా, ఆ కొండ, ఆ గుడి. అదే పాండవులమెట్ట. మధ్యాహ్నం మూడు గంటలకి  వచ్చేయండి. నా తుపాకీ ఉంది. దానికి లైసెన్సు కూడా ఉంది. నేర్పించేద్దాం!’’ అన్నాడు మదీనా.‘‘ఇప్పుడైతే ఏం?’’ అమాయకంగా అడిగాడు పేకేటి సుబ్బరాజు.‘‘లేడికి లేచిందే ప్రయాణం అంటే కాదు బాబూ! ఈ ఊళ్లోనే సారస్వత సంఘం అని ఉంది. దాన్లో పనిచేస్తున్నాను. మధ్యాహ్నం ఖాళీ. పైగా ఆ వేళకి మెట్ట మీద ఎవరూ ఉండరు.’’ అన్నాడు మదీనా. సాయంత్రానికి నెమ్మదిగా వచ్చాడు మదీనా, రెండు భుజాల మీద రెండు రైఫిళ్లతో.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top