ఆకుపచ్చ సూర్యోదయం

ఆకుపచ్చ సూర్యోదయం


రామరాజు ఫితూరీ చేస్తాడా? ఆయుధాలు వస్తాయని ఆయన స్వయంగా చెబుతున్నాడా?  కంతారం మొఖాసాదారు కొటికల బాలయ్య సహకరిస్తున్నాడా? కృష్ణదేవిపేటతో పాటు, చుట్టుపక్కల గ్రామాలలో మొత్తం ఇవే ప్రశ్నలు.  సూర్యనారాయణమ్మకు ఇదేమిటో మొదట ఏమీ అర్థం కాలేదు. అందుకే మిన్నకుండిపోయారు.భాస్కరుడు, చింతల స్వామినాయుడు, లగుడు సత్యనారాయణ వంటి గ్రామ పెద్దలంతా ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.



ఆయన ఆధ్యాత్మికవాది. ఊళ్లో జాతీయ కాంగ్రెస్‌ సభ జరిగినా ఆయన మాట్లాడలేదు. అలాంటి శాంత స్వభావుడు.. ఫితూరీ లేవదీస్తాడా?  ‘ఇదంతా ఏమిటి బాబయ్యా!’ అని ఆరా తీసి వస్తానంటూ సోమమ్మ గారు బయలుదేరితే భాస్కరుడే ఆపేశాడు. అవన్నీ వదంతులేనమ్మా అని నచ్చ చెప్పాడు. నిజంగా వదంతులే అయితే బాగుండుననిపిస్తోంది అందరికీ.



 దానికి తోడు రామరాజు ఆ రోజంతా శ్రీరామవిజయరామ నగరం నుంచి ఊళ్లోకే రాలేదు. అయినా హోరెత్తుతున్న ఆ  వదంతి ఆయన దాకా వెళ్లిపోయింది. అందుకు కారణం  కొటికల బాలయ్య. ఉదయం పదిగంటల ప్రాంతంలో ఆయాస పడుతూ వచ్చాడు బాలయ్య– కంతారం మొఖాసాదారు. ‘‘స్వామీ! దండాలు. మా దాకా రానేలేదు. ఊరంతా కోడై కూస్తంది! అయినా ఫరవాలేదు.’’ అన్నాడు సంతోషంగా.

‘‘ఎందుకు?’’ అన్నాడు రామరాజు.



‘‘మళ్లీ ఫితూరీ జరగబోతోందట.......’’

‘‘ఎక్కడ? ’’ ‘‘కృష్ణదేవిపేటలోనే. తమరు లేవదీస్తన్నారట!’’ అన్నాడు బాలయ్య.  ఖిన్నుడైపోయాడు రామరాజు. ‘‘ఎవరు చెప్పారు?’’ అసహనంతో అడిగాడు. ‘‘ఊర్లో అనుకుంటున్నారు. తమర్ని దర్శించుకోవాలని వచ్చాను. అంతా నాకేసే అనుమానంగా చూశారు. ఏమైందయ్యా అని అడిగాను. ఒకాయన చెప్పాడు. స్వామీ! మా కష్టాలు తీర్చడానికి వచ్చావా?’’ అన్నాడు బాలయ్య రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తూ. ‘‘కాదు బాలయ్యా! ఫితూరీలతో, హింసతో సాధించలేం. గాంధీగారు అదే చెబుతున్నారు. హింసామార్గం మంచిది కాదు. అదంతా వదంతి.’’అన్నాడు రామరాజు.ఇంతలోనే ఆదరాబాదరా వచ్చాడు స్వామినాయుడు.‘‘నాయుడు గారూ! నమస్కారం.’’ అన్నాడు రామరాజు.‘‘నమస్కారం!’’ అంటూనే, ఏదో చెప్పబోయి బాలయ్యని చూసి ఆగిపోయాడు. తరువాత ‘‘ఒక్కసారి లోపలికి దయచేయండి!’’ అంటూ చేయి పట్టుకుని ఇంట్లోకి తీసుకువెళ్లాడు నాయుడు.



‘‘తమరేంటి? ఫితూరీ ఏంటి? ఏంటి బాబూ ఇదంతా! నమ్మవలసిందేనా!’’ అన్నాడు ఆందోళనగా  రామరాజు రెండుచేతులు పట్టుకుని. నాయుడి చేతులలో నుంచి తన చేతులు విడిపించుకుని, వాటిని జోడించి స్థిరంగా అన్నాడు రామరాజు, ‘‘మీ అంతరాత్మ ఏం చెబుతోంది. ఈ రామరాజు ఫితూరీ లేవదీస్తాడని చెబుతోందా!’’‘‘లేదు.’’ అన్నాడు నమ్మకంగా నాయుడు.‘‘నా ఆంతరాత్మ సాక్షిగా నేనూ చెబుతున్నాను. అలాంటిదేమీ లేదు.’’ అన్నాడు రామరాజు.



‘‘సంతోషం.’’ అంటూ తృప్తిగా అక్కడ నుంచి బయటకు నడుద్దామని గుమ్మం వైపు తిరిగాడు నాయుడు. మునసబు లగుడు సత్యనారాయణ కంగారుగా వస్తూ కనిపించాడు. అతడిని నాలుగు అడుగుల అవతలే నిలిపేసి, బయటకు తీసుకెళుతూ అన్నాడు నాయుడు. ‘‘ఏం లేదులే మునసబు. ఎవరో పుకారు పుట్టించాడు. రాజుగారి మనసు బాధ పెట్టొద్దు.’’ అన్నాడు. ఇద్దరూ గ్రామం వైపు వెళ్లిపోయారు. ‘‘స్వామీ! చేతులెత్తి మొక్కుతున్నా. మా కొండోళ్ల బాధలు తీర్చు. కొండోళ్లు మొత్తం నీ ఎనక నడుస్తాం. నేలతల్లి మీద ప్రమాణం. గాంధీగారు చెప్పేదేంటో మా దాకా రాదు స్వామీ! ’’ అన్నాడు బాలయ్య. కొన్ని గంటల పాటు  కొండవాళ్ల ఇక్కట్ల గురించి కథలు కథలుగా చెప్పాడు.మౌనంగా ఉండిపోయాడు రామరాజు. నిరాశగా వెళ్లిపోయాడు బాలయ్య.                                                             



6

ఫితూరీ భయం భళ్లుమంది. కృష్ణదేవిపేటలో పెద్ద పెద్ద కుటుంబాల వారు సాయంత్రం ఆరుగంటలకే తలుపులు బిడాయించారు. కొందరు రాత్రి భోజనాలు ముగించుకుని, ఇళ్లకి తాళాలు బిగించి, ఊళ్లో పోలీసు స్టేషన్‌ దగ్గరకు వచ్చేశారు. కునికిపాట్లు పడుతూ గడిపారు, తెల్లవార్లు. దీనికి సంబంధించిన ఒక నివేదిక  నర్సీపట్నంలో ఉండే ఏజెన్సీ కమిషనర్‌ స్వైర్‌కు ఆగమేఘాల మీద చేరిపోయింది. సాక్షాత్తు గ్రామ మునసబు లగుడు సత్యనారాయణే పంపాడు. 27–1–1922న రహస్యంగా పంపిన నివేదిక అది. గ్రామంలో జరిగే ఏ ముఖ్య పరిణామమైనా మునసబు నివేదించవలసిందే.  ‘ఏజెన్సీ లక్ష్మీపురం (కృష్ణాదేవిపేట గ్రూపు)గ్రామ మునసబు లగుడు



 వ్రాయించిన స్టేట్‌మెంట్‌–కృష్ణదేవిపేటలో పుట్టిన బలమైన రూమర్‌ను బట్టి నేను ఈ నివేదిక రాశాను. అల్లూరి రామరాజు కొంతమంది కొండవాళ్లతో కలసి అమావాస్య పోయిన పంచమినాడు (1–2–1922) పితూరీ లేవదీయబోతు న్నాడని గ్రామంలో అందరి నోటా వినిపిస్తున్నది. కానీ ఈ వదంతిని గురించి ఫలానా మనిషి చెప్పినాడని నేను స్పష్టంగా చెప్పలేను. మీ రోజులు దగ్గరపడ్డాయి. ఈ పెద్ద పెద్ద కొంపలు ఎలా ఉంటాయో చూస్తాం అని గత సోమవారం కృష్ణదేవిపేట సంతకు వచ్చిన గోకిరి ఎర్రేసు, గనర్లపాలెం, అనేవాడు నాతో అన్నాడు.



 రామరాజుగారు ఏదో చేయడానికి వాళ్లతో కలుస్తున్నాడని కూడా అతడు అన్నాడు. ఎర్రేసుది పిచ్చివాగుడని మేం అనుకునేవాళ్లం. వాడు వెర్రివాడిలాగా కనపడడు. మంచివాడిలాగా కూడా కనపడడు. అల్లూరి శ్రీరామరాజు పంచాయతీ కోర్టులు పెట్టి నీతిని బోధించేవారు. స్వదేశీ సిద్ధాంతాన్ని ఆయన ఆమోదిస్తారు. తాగుడు వగైరా మానవలసిందని బోధించేవారు.



అంతే....  రామరాజుగారి ఇంటికి మేం వెళ్లినప్పుడు చింతల స్వామినాయుడు, కంతారం మొఖాసదారు కూడా ఉన్నారు. రామరాజు సహా అందరినీ అల్లర్లలో పాల్గొనవలసిందని కోరినట్టు బాలయ్య స్వయంగా చెప్పాడు. నన్ను, హనుమంతు గోపాలస్వామిని (కొంగశింగి మునసబు) చంపివేస్తామని ఎర్రేసు సంతలో అన్నాడని విన్నాము. ఎందుకంటే మేం ఎర్రేసుకి వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చామట. కింద సత్యనారాయణ సంతకం. పక్కనే తన సమక్షంలో రాసినట్టు ధ్రువీకరిస్తూ బాస్టియన్‌ సంతకం.

                                                     

7

మరునాడు రాత్రి కూడా కొందరు పోలీసు స్టేషన్‌ దగ్గరే కాలక్షేపం చేశారు. ఇది రామరాజునీ, సూర్యనారాయణమ్మనీ కలచివేసింది. ఎవరైనా అడిగితే రాజుగారంటే నమ్మకమే గానీ, కొండవాళ్లతో ప్రమాదం అంటున్నారు.

29వ తేదీ ఉదయం తొమ్మిది గంటల ప్రాంతం. గ్రామంలోకి వెళదామని రామరాజు తన కుటీరం నుంచి బయటకు వచ్చాడు. ఎదురుగా కనిపించిందా దృశ్యం.నెత్తి మీద టోపీతో, కోటేసుకుని ఉన్న అతడు గుర్రం మీద వస్తున్నాడు.  ఎప్పుడూ చూడలేదు. సరిగ్గా ఇంటి దగ్గరకు వచ్చి, గుర్రం మీద నుంచే అడిగాడతడు. ‘‘శ్రీరామరాజు అంటే ....?’’ ‘‘నేనే!’’ అన్నాడు రామరాజు.నెమ్మదిగా గుర్రం దిగాడతడు. ఆ పరిసరాలన్నీ చూసి అన్నాడు ఇంగ్లిష్‌లో, ‘‘ఇక్కడ ఎవరూ లేరు!’’



‘‘మా కుటుంబం ఒక్కటే ఉంటుంది. నేను, మా అమ్మ, తమ్ముడు. రాత్రి పూట కొందరు యువకులు వచ్చి ఇక్కడ చదువుకుంటారు.’’ అన్నాడు రామరాజు ఇంగ్లిష్‌లో.ఇంగ్లిష్‌తో రామరాజుని కంగారు పెట్టాలన్న తన వ్యూహం బెడిసికొట్టినందుకు ఖిన్నుడైపోయాడతడు. అప్పుడు సర్వసాధారణంగా తెలుగులో పరిచయం చేసుకున్నాడు.‘‘నా పేరు ఎ. బాస్టియన్‌. అల్ఫ్‌ బాస్టియన్‌. గూడెం డిప్యూటీ తహసీల్దార్‌!’’ అన్నాడు.



‘ఇతడా బాస్టియన్‌? ఈ మనిషేనా డిప్యూటీ తహసీల్దారు!’ మనసులో అనుకున్నా, ఆ ఆశ్చర్యాన్ని ఏమీ కనిపించనీయకుండా, ‘‘అలాగా! రండి. లోపల కూర్చోవచ్చు.’’ అన్నాడు రామరాజు.‘‘ఇక్కడైతే మాట్లాడరా!’’ అన్నాడు బాస్టియన్, కొంచెం పొగరుగా. తన మీద అర్జీలు పంపిన మనిషన్న కోపం ఆ మాటలో. ‘‘మీ ఇష్టం.’’ అన్నాడు రామరాజు. తలుపు చాటు నుంచి ఆందోళనగా చూస్తున్నారు సూర్యనారాయణమ్మ. ‘‘అసలు మీరెవరు?’’ అడిగాడు బాస్టియన్, సూటిగా.‘ఈ దేశవాసిని!’’ నిబ్బరంగా చెప్పాడు రామరాజు.‘‘ఉహు. మరి సువిశాల దేశంలో ఈ మూల, ఒక్కరే ఎందుకు ఉండడం?’’ అన్నాడు  బాస్టియన్‌.‘‘నేను ఆధ్యాత్మిక చింతనాపరుడినని అనుకుంటున్నాను. అందుకే ఒక ప్రశాంత వాతావరణాన్ని ఆశిస్తూ ఉంటాను.’’ అన్నాడు రామరాజు, ఇంగ్లిష్‌లోనే. ‘‘ఊరికి ఇంతదూరంగా.. అడవి జంతువులు కూడా వచ్చే చోట.. ఒక్కరూ ఉండి ప్రభుత్వానికి అనుమానం కలిగిస్తున్నారని అనిపించడం లేదా!’’ దర్పంతో అన్నాడు బాస్టియన్‌.



‘‘నా మీద అనుమానం అవసరం లేదు. నేను ఎక్కువ కాలం భగవంతుడి చింతనలోనే ఉంటాను. మూలికా వైద్యం తెలుసు. ముహూర్తాలు పెడతాను. నా దగ్గరకి అందరూ వస్తారు. వెళతారు. అనుమానించవలసిందేముంది?’’

‘‘మీరు మోహన్‌దాస్‌ గాంధీ నాన్‌ కో ఆపరేషన్‌ ఉద్యమాన్ని సమర్థిస్తున్నారట.’’ ‘‘నేను గాంధీగారి అభిమానినే. అయితే నేను ఎవరి మార్గాన్నీ అనుసరించను. నా దృష్టి నాది.’’‘‘నా ప్రశ్న– మీరు సమర్ధిస్తున్నారా? ’’‘‘అదే చెబుతున్నాను. రాజకీయోద్యమం ఆయన మార్గం. నా మార్గం ఆధ్యాత్మిక చింతన.’’‘‘మీరు క్రైస్తవ మిషనరీలని అడ్డుకుంటున్నారు.’’‘‘ఔను. మాయమాటలు చెప్పి, క్రీస్తుదేవుడి ప్రవచనాలను అవమానిస్తున్నారు వాళ్లు. మత మార్పిళ్లకు సేవ అని పేరు పెడుతున్నారు.’’



‘‘ మీకెందుకు? చూసుకోవడానికి ప్రభుత్వాలు ఉన్నాయి.’’ కఠినంగా అన్నాడు బాస్టియన్‌.‘‘వారు నా ధర్మాన్ని కించ పరిచినప్పుడు ఒక ఆధ్యాత్మిక చింతనాపరునిగా బదులివ్వడం నా ధర్మం.’’‘‘ఈ మధ్య మీరు ఎక్కడికో వెళ్లి వచ్చారట. ఎక్కడికి?’’ ‘‘నాసిక్‌.’’‘‘ఎందుకు?’’ కనుబొమలు ముడివేస్తూ అడిగాడు బాస్టియన్‌.‘‘గోదావరి జన్మించే చోటు. అక్కడకు వెళితే మోక్షం వస్తుందని మా నమ్మకం.’’ చెప్పాడు రామరాజు.‘‘రామరాజు గారు! ఇవాళ ఏజెన్సీ జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌ స్వైర్‌ మిమ్మల్ని విచారించడానికి వస్తున్నారు. మేం పిలిచినప్పుడు రావాలి.’’ అన్నాడు బాస్టియన్‌.‘‘ఎవరు వచ్చి విచారించినా నా సమాధానం ఒక్కటే.’’ అంతే నిబ్బరంగా చెప్పాడు రామరాజు. ‘‘మీరు రావాలనుకుంటున్నారా? లేదా?’’ అసహనంగా ప్రశ్నించాడు బాస్టియన్‌.మౌనం దాల్చాడు రామరాజు. విసురుగా గుర్రం ఎక్కాడు బాస్టియన్‌.

                                                       

8

బాస్టియన్‌ వెళ్లి రామరాజును కలుసుకోవడం సంచలనమైపోయింది. ఒక గంట తరువాత యథాప్రకారం వెళ్లి రామాలయం దగ్గర కూర్చున్నాడు రామరాజు. పోలీస్‌ సూపరింటెండెంట్‌ స్వైర్‌  శ్రీరామరాజును విచారించడానికి వస్తున్నాడని తెలిసిపోయింది. భయం భయంగానే అయినా ముప్పయ్‌ మంది వరకు గ్రామస్థులు రామరాజు దగ్గరకు వచ్చి మౌనంగా కూర్చున్నారు. భాస్కరుడు, చింతల స్వామినాయుడు, మునసబు ఎలాగూ ఉండాలన్నారు– స్వైర్‌ వచ్చేసరికి. ఈ ముగ్గురు, బాస్టియన్‌ గ్రామ చావడి దగ్గర వేచి ఉన్నారు. మూడు గుర్రాల మీద ఆ ముగ్గురు వస్తూ కనిపించారు. స్వైర్‌ గుర్రం ముందు నడుస్తోంది. ఏజెన్సీ కమిషనర్‌ ఎఫ్, డబ్లు్య. స్టీవర్ట్, పోలవరం డిప్యూటీ తహసీల్దార్‌ ఫజులుల్లా ఖాన్‌ల గుర్రాలు ఆ వెనుక నడుస్తున్నాయి.

బాస్టియన్‌ కనిపించగానే గుర్రం ఆపాడు స్వైర్‌.



‘‘ఆ క్షత్రియ యంగ్‌మ్యాన్‌ ఉన్నాడా?’’ వెంటనే అడిగాడు స్వైర్, ఇంగ్లిష్‌లో.

‘‘ఉన్నాడు సార్‌! ముందు ఒక నిమిషం ఇక్కడ మాట్లాడుకుందాం. మునసబుగారు కొబ్బరి నీళ్లు ఏర్పాటు చేశారు.’’ అన్నాడు బాస్టియన్‌.

ముగ్గురూ గుర్రాలు దిగారు. దొరలు ఇద్దరు కొబ్బరినీళ్లు తాగారు. ఫజులుల్లా మాత్రం సున్నితంగా తిరస్కరించాడు. ఏదో జబ్బుతో బాధపడుతున్నట్టే ఉన్నాడు. తెల్లటి మనిషి ఫజులుల్లా. ఆజానుబాహుడు. సగం నెరిసిన దీర్ఘకేశాలు ఆయనవి. మరింత నెరిసింది గడ్డం. తెల్లని కోటు ప్యాంటులో దొరలాగే ఉన్నాడు.



‘‘సార్‌! అతడి పేరు రామరాజు. ఇంగ్లిష్‌ కూడా బాగా మాట్లాడతాడు. చదువుకున్నవాడే. ఆధ్యాత్మికవేత్తగా ఈ చుట్టుపక్కల వంద గ్రామాలలో మంచి పేరుంది. మనం అతడిని పిలిస్తే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి జనం వేరే అర్థం చేసుకుంటారు. అదిగో రామాలయం. అక్కడే ఉన్నాడతడు. మనమే వెళితే సరి!’’ అన్నాడు బాస్టియన్‌.



‘‘అక్కడేనా! సరే వెళదాం. ఊరి పెద్దలు వచ్చారా?’’ అన్నాడు ఇంగ్లిష్‌లో స్వైర్‌.

భాస్కరుడినీ, స్వామినాయుడినీ పరిచయం చేశాడు బాస్టియన్‌.

అంతా అక్కడికి నడిచి వెళ్లారు. రామాలయం మెట్ల మీదే కూర్చుని ఉన్నాడు రామరాజు. అప్పటిదాకా అతడి చుట్టూ ఉన్నవాళ్లు రెండడుగులు వెనక్కి తప్పుకున్నారు.



‘‘దయచేయండి!’’ అన్నాడు రామరాజు. అంతే. అధికారులను చూసి నమస్కారం అనలేదు. కూర్చున్న చోటు నుంచి లేవలేదు.

l1919 తరువాత యతులూ, సన్యాసులూ సాధువుల కార్యకలాపాల మీద ఒక కన్నేసి ఉంచమని రహస్య ఉత్తర్వులు జారీ అయినాయి. స్థానికుల మనోభావాలు దెబ్బతినని రీతిలో వాళ్లతో మెలగాలని కూడా ఆదేశాలు ఉన్నాయి. అందుకేనేమో, అధికారులంతా బూట్లు విప్పేసి మండపంలోకి వచ్చి కూర్చున్నారు.



మునసబు రామరాజుకు సంగతి చెప్పాడు లాంఛనంగా.వెంటనే అన్నాడు స్వైర్‌. ‘‘మీరు ఫితూరీ కోసం ప్రజలను ఉసిగొలుపుతున్నారా?’’‘‘లేదు. నేను ఆధ్యాత్మికవేత్తనని ముందే చెప్పాను. నా మతం గురించి చెబుతూ ఉంటాను.’’ చెప్పాడు రామరాజు‘‘మత ప్రచారమే అయితే, దేవుడి గురించీ, ధర్మం గురించీ చెప్పాలి. తాగుడు వద్దని ఎందుకు ప్రచారం?’’‘‘ధర్మం ప్రకారమైతే మద్యం హిందూ మతంలో నిషిద్ధం. దాదాపు సన్యాసి జీవితం గడుపుతున్న నేను ప్రజలు అధర్మవర్తనులైతే వారిని సన్మార్గంలో పెట్టాలి.’’



‘‘పంచాయతీలు పెట్టడం, కోర్టులకు పోవద్దని చెప్పడం హిందూ ధర్మ ప్రచారమేనా?’’‘‘కోర్టులకు వెళ్లడం ధర్మమో, అధర్మమో; అక్కడ దొరికేది న్యాయమో, అన్యాయమో మీకు మాత్రం తెలియదా!’’ఇంగ్లిష్‌ అర్థమైన కొందరు ఈ జవాబుకు నవ్వేశారు.బాస్టియన్, స్టీవర్ట్‌ లోపల్లోపల మండి పడుతున్నా, రామరాజు ఆంగ్ల పరిజ్ఞానం, వాక్పటిమ వాళ్లని మంత్రముగ్ధులని చేస్తున్నాయి. ఫజులుల్లా ఖాన్‌ వినోదం చూస్తున్నాడు. ‘‘మీరు నాన్‌ కోఆపరేషన్‌ కార్యకలాపాలు చేపడుతున్నారని కూడా ఫిర్యాదులు ఉన్నాయి.’’ అన్నాడు స్టీవర్ట్‌.



‘‘ఎలా చెబుతారు మీరు?’’ అన్నాడు రామరాజు, తీవ్రంగా.‘‘ఎంకె గాంధీని పొగడ్తలలో ముంచెత్తుతుంటే ఏమనాలి?’’‘‘గాంధీగారు ఆధ్మాత్మికత ఆధారంగా రాజకీయరంగాన్ని నిర్మిస్తున్నారు. అహింసను ప్రబోధిస్తున్నారు.  అమాయక గిరిజనులకు కోర్టులంటే తెలియదు. అక్కడ వాళ్లకి న్యాయం జరిగిన దాఖలా ఒక్కటి కూడా లేదు. రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్లు. టెంకంబలి, చింతంబలి తాగి ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. దీనికి తోడు మద్యం వ్యసనం. బతుకుల్లో నరకం చూస్తున్నారు. అలాంటి వాళ్లని తాగుడు మానెయ్యమంటే గాంధీగారిని సమర్థించడమా?’’ తీవ్రంగా ప్రశ్నించాడు రామరాజు. ‘‘పన్నులు చెల్లించవద్దని చెబితే అది సహాయ నిరాకరణ కిందకి రాదని ఎలా అంటారు? అన్నాడు స్వైర్‌.‘‘ నేను పన్నులు చెల్లించవద్దని ఏనాడూ ఎక్కడా చెప్పలేదే!’’ అన్నాడు రాజు.‘‘మరి విదేశీ వస్త్ర బహిష్కరణను సమర్థించారట. దానికేం చెబుతారు?’’ అన్నాడు ఫజులుల్లాఖాన్‌.‘‘అయ్యా! నేను విదేశీ వస్త్ర బహిష్కరణ గురించి ప్రచారం చేశానని ఎవరో చెబితే ఎలా నమ్మారు? దేశీయమైన గోచీ గుడ్డలకే నోచుకోని వాళ్లకి విదేశీ వస్త్రాలని బహిష్కరించమని ఏ మూఢుడైనా చెప్పే సాహసం చేస్తాడా?’’ అన్నాడు రామరాజు.



కంగు తిన్నా, ఆ వాదనా పటిమ, వ్యంగ్యం ఫజులుల్లాను ఆకట్టుకున్నాయి.

‘‘రామరాజు గారూ! మీరు నాసిక్‌ వెళ్లివచ్చారని తెలిసింది. ఇప్పుడే ఎందుకు వెళ్లారు?’’ అడిగాడు స్టీవర్ట్‌.‘‘గోదావరి జన్మస్థలం హిందువులకి మహా పుణ్యక్షేత్రం. దర్శించుకుని వచ్చాను.’’ అన్నాడు రామరాజు.‘‘ఎవరికీ చెప్పకుండా వెళ్లారు. ఎందుకు? ’’‘‘¯lను యోగిని. ఒకరి అదుపాజ్ఞలలో, ఒకరి కనుసన్నలలో నడవలేను.’’‘‘అక్కడ ఎన్నిరోజులు ఉన్నారు? ఎవరిని కలిశారు?’’‘‘ఒక క్షేత్రపాలకుని ఇంటిలోనే కొన్ని రోజులు ఉన్నాను. నాకు తృప్తిని ఇచ్చేవరకు, నా ఆత్మ క్షాళనమైన భావన కలిగే వరకు ఉన్నాను.’’ అన్నాడు రామరాజు.



‘‘మీరు ఇక్కడ కాకుండా మరో చోటికి వెళ్లడానికి అభ్యంతరం ఏమైనా ఉందా?’’ అన్నాడు ఫజులుల్లా.‘‘ఎంతమాత్రం లేదు. అపోహలు అనవసరం. రాద్ధాంతాలు సద్దుమణగడం ప్రధానం’’ చెప్పాడు రామరాజు, నిస్సంకోచంగా. ముగ్గురూ ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఇక లేద్దాం అన్నట్టు కళ్లతోనే సైగ సుకున్నారు.‘‘రామరాజుగారు! కృతజ్ఞతలు. మీ సహకారానికి ధన్యవాదాలు.’’ అన్నాడు స్వైర్, గుర్రం వైపు వెళుతూ.‘‘అంటే నేను సహాయ నిరాకరణవాదిని కాదన్నమాటే కదా!’’ అన్నాడు రామరాజు నవ్వుతూ. ‘‘నీ నివేదికను బట్టి వచ్చాను. ఈ కుర్రవాడు అంత ప్రమాదకారి కాదనే అనిపిస్తోంది.’’ నెమ్మదిగా అన్నాడు స్వైర్, మునసబుతో.‘‘చిత్తం. నా నమ్మకం కూడా అదే! కానీ ఊళ్లో వదంతి వచ్చింది. నా బాధ్యత మేరకు నివేదించాను!’’ అన్నాడు మునసబు.‘‘బాస్టియన్‌! నీ స్టేట్‌మెంట్‌ ఏది? అతడితో నీవు కూడా మాట్లాడావు కదా!’’ అడిగాడు స్వైర్‌.ఫైలులో ఉన్న తన స్టేట్‌మెంట్‌ తీసి అందించాడు బాస్టియన్‌. తెరిచి అక్కడే చదివాడు స్వైర్‌.

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top