పులి పేల్చ‌న తూపాకి

Funday story of the world 27-01-2019 - Sakshi

ఈవారం కథ

మనిషి రక్తం మరిగిన పులెంత ప్రమాదకారో వేట రుచెరిగిన మనిషీ అంతే ప్రమాదకారి. పులి వేట ఆకలి కోసం అయితే మనిషి వేట అహం చల్లార్చుకోవడం కోసం. వేటలో పులి పంజా విసిరితే మనిషి తుపాకీ పేలుస్తాడు. పులి బలం పులిదైతే,  మనిషి జులుం మనిషిది. మిగతాదంతా మామూలే ప్రాణం దక్కించుకోవడానికి రెండు వైపులా అసమాస పోరాటమే.ఏదో పనిమీద కోలంక వెళ్ళొచ్చిన ఫాలయ్య రావారం కృష్ణమూర్తి గారొచ్చేరని చెప్పడంతో రామన్నయ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. గబ గబా తయారయ్యి చేలగట్లకడ్డంపడి కోలంక బాట పట్టేడు. వెళతా వెళతా ఓ పంగలకర్రని  కూడా నడుం దగ్గర దోపుకున్నాడు. వేట కృష్ణమూర్తిరాజుకి ఆరో ప్రాణం. అదే ఆయన వృత్తి ప్రవృత్తీ కూడా. ఆయన దగ్గరుండే జోడుగుళ్ళ తుపాకీ అంటే కుర్రోళ్ళందరకీ భలే సరదా. చల్లగా... నల్లగా నిగనిగలాడే దాన్నోసారి అలా ముట్టుకొని వళ్ళు మైమరచి పోతుంటారు. పులి వంటి మీద చెయ్యేసి నిమిరినట్టే సంబరపడిపోతుంటారు. తాను ఎన్ని పులులని చంపిందో ఆ తుపాకీకి బాగా జ్ఞాపకమే.అప్పట్లో మారేడుమిల్లి అడవుల్లో... ఓ మేనీటర్‌ వీరవిహారం చేస్తూ గిరిజనులకి కంటికి కునుకులేకుండా చేసింది. మనిషి నెత్తురు మరిగిన పెద్దపులిని వేటాడ్డానికి, వేటే వ్యసనమైన కృష్ణమూర్తిరాజు అరణ్యవాసం చేపట్టారు. దాని కదలికలని పసిగడుతూ... రోజుకో చోటున మాటు వేస్తూ అదును కోసం ఎదురు చూసారు. పులి బలం ముందు మనిషి బలమెంత? అందుకే... ఆయన పులి బలహీనతల మీద కన్నేసారు. ఒకటి. రెండు..మూడు రోజులు గడిచాయి. రాజుగారి యుక్తి ముందు పులి శక్తి తలొంచింది. చేతిలో తుపాకీ ఢాం అంది. గుండు గురి తప్పలేదు. ఎంతో మంది రక్తం రుచి చూసిన పులి తన రక్తపు మడుగులో తానే గిలగిల్లాడింది. అది మొదలు రాజుగారి తుపాకీకి ఎదురు లేకుండా పోయింది. అరివీర భయంకరమైన ‘మేనీటర్‌’ ని చంపడం అనేది ఎంతో తెగువ, సాహనం, గుండె దిటవు వున్న వేటగాడికే సాధ్యం. ఇది తెలిసిన వేట ప్రియులు రాజుగారి సాహచర్యం కోసం అన్ని వైపులనుంచీ స్నేహ హస్తం చాపారు.

కుర్రజట్టంతా పోరు పెట్టడంతో కృష్ణమూర్తిరాజుగారు వాళ్ళని వెంటేసుకొని మూర్తమ్మ చెరువుకాడకెళ్ళారు. చెరువునిండా చిలకబాతులు కళకళ్ళాడుతూ తిరుగుతున్నాయి. గట్టునున్న తుమ్మ చెట్లమీద నుంచి నత్తగొట్లు ఉండుండి చెరువులోకి దిగి, పెద్ద పెద్ద చేపలని నోట కరుచుకుని ఎగిరిపోతున్నాయి. ఒక్కో ఔత్సాహికుడినీ పిలిచి తుపాకీ ఎలా గురిచూడాలో చెప్పారు.బారెల్‌ విరిచి గుళ్ళెలా కూరాలో చూపించారు. తుపాకీని దండకి ఎలా దాపెట్టుకోవాలో నేర్పించారు. రెండ్రోజులు కుర్రాళ్ళతోనూ పెద్దోళ్ళతోనూ వేటకబుర్లు చెబుతూ సరదాగా గడిపిన కృష్ణమూర్తిరాజు మూడోరోజు మిత్రుడు సూరిబాబురాజుతో కలిసి వాజేడు అడవుల్లోకి వేటకి వెళ్ళిపోయారు.

పులిని చంపాలంటే వేటగాడికి పులి భాష తెలియాలి. పులిని బాగా చదవాలి. కృష్ణమూర్తిరాజు ఆయన తాత చిట్టిరాజు నుంచి ఈ వేట చదువుని బాగా వంటబట్టించుకున్నారు. స్వాతంత్య్రానికి ముందు నుంచీ చిట్టిరాజు మేనీటర్స్‌ని చంపడంలో చాలా దిట్ట. అడవిదారుల్లో గుర్రాలపై తిరిగే తెల్లోళ్ళని పులులు చంపేసి రక్తం చప్పరించేస్తుండేవి. చేతుల్లో తుపాకులున్నా పులి గాండ్రింపులకే తెల్లోళ్ళు హడలి చచ్చేవారు.దీంతో వాళ్ళు పులికీ తమకీ మధ్య చిట్టిరాజుని అడ్డుగోడగా పెట్టుకునేవారు.ఓ మేనీటర్‌ బ్రిటిషోళ్ళని పంజాతో అదేపనిగా నంజుకు తినేసేది. వ్యాపారమే తప్ప వేట చేతకాని తెల్లోళ్ళు, తునిరాజు గారి దగ్గర తమ గోడుని వెళ్ళబోసుకున్నారు.ఆయన చిట్టిరాజుని పిలిపించి సంగతి వివరించారు. బ్రిటిష్‌వారికి అడ్డు తగులుతున్న పులులని అంతం చేసెయ్యమన్నారు.‘‘మనం చేయలేని పని పులులు చేస్తున్నాయి. ఓ రకంగా చూస్తూంటే... ఆ పులులు దేశభక్తుల్లా కనిపిస్తున్నాయి’’ అని పులులని ప్రశంసిస్తూ చిట్టిరాజుగారు ఆ పనికి ఒప్పుకోలేదు.‘‘వాటి పంజాలకి మనవాళ్ళూ బలవుతున్నారు కదా? కాబట్టి పులుల్ని చంపాల్సిందే’’ అని రాజావారు తీర్మానించారు.‘‘అయితే ఓ షరతు, నేను పులిని చంపాకా ఈ తెల్లోళ్ళు నాతో కరచాలనం చేయడానికి  వీల్లేదు. అలా  అయితేనే చంపుతాను’’ అని   ఓ నిబంధన పెట్టి పులుల సంహారానికి దిగారు చిట్టిరాజు.చిట్టిరాజుగారి ఈ చర్యతో ఓ సాహసికుడి చేతిని స్పృశించలేక పోతున్నామన్న వ్యధ అప్పటి బ్రిటిష్‌ అధికారుల్లో వుండేది.

పులి ఎప్పుడూ నీరూ తిండీ, దండిగా దొరికే ప్రాంతాన్నే ఆవాసంగా మార్చుకుంటుంది. నీటి వసతి వున్న ప్రాంతంలో మాటు వేసి నీటిని త్రాగడానికి వచ్చే జంతువుని చంపుతుంది. సింహం మృగరాజు అయితే అయివుండొచ్చు. పెద్దపులి అడవికే రారాజు. సింహాలు గుంపులుగా తిరుగుతాయి. కానీ పెద్దపులి ఒంటరిగానే తిరుగుతుంది. అది తిరిగే ప్రాంతానికి మరో పులిని సైతం రానీయదు. అది ఆడైనా, మగయినా దాని అంతు చూసేస్తుంది.వేటగాడిగా మహా గుర్తింపు పొందిన కృష్ణమూర్తిరాజుతో కలిసి వేటాడ్డానికి, సరదాగా ఆయన వేట చూడ్డానికి దేశం నలుమూలలనుంచీ చాలా మంది వస్తుండేవారు. అధికార్లే కాకుండా నాయకులూ, ఇతర ప్రముఖులూ కూడా అందులో వుండేవారు. పగలూ రాత్రి కూడా వేట సాగుతుంటుంది. తూర్పు కనుమల్లోని పెద్ద పులులే కాకుండా చిచ్చర పిడుగుల్లాంటి చిరుతపులులు కూడా రాజుగారి తూటాలకి బలయిపోయాయి. పులిజాడ కనిపించకపోవడంతో సంఘవిద్రోహ శక్తులు అడవిలోకి చొరబడ్డం మొదలయ్యింది. అక్రమాలకి అడవి అడ్డా అవ్వడం చాప కింద నీరులా జరిగిపోయింది. తన విశృంఖల వేటలో పులి లేని అడవితల్లి దిక్కుమాలినదయ్యిందని పులిలాంటి ఆ వేటగాడికి తెలియదు.

వేటగాడికి కావాల్సింది ప్రధానంగా సహనం, ఏకాగ్రత, అప్రమత్తత. పులిని వేటాడ్డానికి ఒక్కోసారి కూర్చొన్న చోటునుంచి రెండు మూడు రోజులు కదలకుండా కూర్చోవాలి. అయినా ప్రయోజనం వుండకపోవచ్చు. ఎంత గొప్ప వేటగాడికైనా ఒక్కోసారి ప్రాణాపాయం తప్పకపోవచ్చు. అందుకు కృమూర్తిరాజూ అతీతుడు కాదు. వేటగాళ్ళకి వేటగాళ్ళే మిత్రులు. వారికి జంతువులూ మృగాలూ ఉమ్మడిశత్రువులు. కృష్ణమూర్తిరాజూ ఆయన మిత్రుడు సూరిబాబురాజూ కలిసి మరో మిత్రుడి ఇంట్లో పెళ్ళికి వెళ్ళారు. మాటలమధ్య ఎర్రకొండల్లో పులి వుందన్న సంగతి తెలిసింది. ఇంట్లో అటూ ఇటూ వెదికే సరికి రెండు నాటు తుపాకులు దొరికాయి. లేడికి లేచిందే పరుగన్నట్టు వాడకంలో లేని ఆ రెండు గొట్టాం తుపాకులు, నాలుగు తూటాలు పట్టుకుని బుల్లెట్‌ బండి మీద కొండల్లోకి పోయారు. వేటగాళ్ళని చూడగానే అలవాటైన గిరిజనులు అవసరమైన సరంజామాతో సన్నధ్ధమై పోయారు.అంతా కలిసి కొండ ప్రక్కన మాటు వేసారు.పులిజాడ కనిపెట్టడానికి వేటగాళ్ళు ముందు వాటి అడుగులని పట్టుకుంటారు.వాటిని బట్టి పులి బరువూ వయస్సూ ఆకారాన్ని అంచనావేస్తారు. పులి ఏదైనా జంతువుని వేటాడాక దాని రక్తం పీల్చేస్తుంది. పాతిక నుంచి ముప్పై కేజీల వరకూ మాంసం లాగిస్తుంది.మిగిలిన మాంసాన్ని పొదల్లోకి తీసుకెళ్లి దాచుకుని మూడురోజుల్లోపు దాన్ని మొత్తం తినేస్తుంది. కడుపు నిండాకా ఆ చుట్టు పక్కల అనువైన చోట విశ్రమిస్తుంది. అది ఎక్కడ? అన్నది ఎవరూ చెప్పలేరు. ఇరవై కిలోమీటర్ల పరిధిలో ఎక్కడైనా కావచ్చు.

పౌర్ణమి రోజులు, వెన్నెల వానలో అడవి తడిసి ముద్దవుతోంది. కీచురాళ్ళ రొద అంతకంతకీ ఎక్కువవుతోంది. చేరువలో నిద్రపట్టని ఏదో పిట్ట అదే పనిగా అరుస్తోంది. టక్కుమని దాని అరుపు ఆగిపోయింది.దాంతో పులి రాక కోసం వేచి చూస్తున్న మిత్రులిద్దరికీ అది వస్తున్న సంకేతం అందింది.అంతా అప్రమత్తమయ్యారు. ఖాళీ ప్రాంతం నుంచి కొండవైపు చలాకీగా పరిగెడుతోంది చిరుతపులి. కృష్ణమూర్తి సడన్‌గా వేసిన టార్చ్‌ వెలుగు దాని కళ్ళల్లో మెరిసింది. కొన్ని క్షణాలపాటు చిరుత అయోమయానికి గురయ్యింది.సూరిబాబుగారి తుపాకీలోంచి గాలిని చీల్చుకుంటూ తూటా దూసుకెళ్ళింది.తిరిగి పరుగందుకోబోయిన చిరుత గాండ్రిస్తూ గాల్లోకి ఎగిరి, పొదల్లోకి విరుచుకు పడిపోయింది. గిరిపుత్రులు తమ కళ్ళని తామే నమ్మలేకపోయారు.వేటగాడు ఏదైనా జంతువుని కొట్టినప్పుడు వెంటనే అది పడిన చోటుకు వెళ్ళడు. కొంత సేపటి తరువాత, ఇక అది చనిపోయి వుంటుందని నిర్థారణ కొచ్చాకా మాత్రమే వెదుక్కుంటూ వెళతాడు. మిత్రులు ఇద్దరూ మిగతా జనంతో పాటూ అక్కడనుంచి వెనుదిరిగారు. కొంతదూరం వెళ్ళాకా మళ్ళీ రేపటిదాకా ఆగడం ఎందుకు? ఈపాటికి చచ్చేవుంటుంది లాక్కొచ్చి పడేద్దాం అని చిరుత పడిన చోటికి వెళ్ళి లైట్లు వేసారు. అందరికీ వళ్ళు జలదరించింది. చిరుత బతికే వుంది. చెట్టు పక్కన బాధతో విల విల్లాడుతోంది. టార్చ్‌ వెలుతురులో పులికళ్ళు  మెరిసాయి.వేటగాళ్ళిద్దరూ అప్రమత్తమయ్యారు. చేతుల్లో తుపాకుల గొట్టాలు విరచి రెండు గుళ్ళు కూరి పులి వేపు గురిపెట్టారు.దెబ్బతిన్న పులి చాలా ప్రమాదకరం. రెచ్చిపోతుంది. ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోతుంది.

పులి నెమ్మదిగా చీకటిని చాటు చేసుకుంటూ దేహం మొత్తాన్ని చెట్టుచాటుకు లాక్కుంది. తోకని ఒకసారి బలంగా నేలకేసి కొట్టి కృష్ణమూర్తి రాజు మీదకి లంఘించి దూకింది. ఇది ఆయన ఊహించలేదు. గుండు దెబ్బకి రక్తం పోయిన అది నీరసపడి వుంటుందని ఏమరుపాటుగా వున్నారు. దాని పంజా దెబ్బకి ఆయన మెడ విరిగినట్టయ్యింది. క్రింద పడ్డ ఆయన చేతిలోని తూపాకి దూరంగా పడిపోయింది.చిరుత నోరు తెరచి పదునైన కోరలని ఆయన కంఠం వైపు చాపింది. దానినోట్లోంచి కారుతున్న చొంగతో ఆయన లాల్చీ తడిసి పోయింది. సూరిబాబురాజు తుపాకీని గురి చూస్తూ అటూ ఇటూకదులుతున్నారు. తోడొచ్చిన గిరిజనులు దూరంగా పరిగెత్తి భయం భయంగా చూస్తున్నారు.పరిస్థితిని అంచనా వేసిన కృష్ణమూర్తిరాజు అనూహ్యంగా తన ఎడమ చేతిని పులి నోట్లో పెట్టేసారు.దాని నోటినుంచి తన పీకనితప్పించాలంటే అంతకు మించి ఆయనకి మరో మార్గం లేదు.పులి గొంతులో ఇరుక్కున్న కృష్ణమూర్తి రాజు చేతి నుంచి రక్తం ధారపాతంగా కారుతోంది.వెళ్ళకిలా రాజుగారు. రాజుగారి మీద బరువైన పులి.దానినోట్లో చిక్కుకున్న ఆయన చేయి.పులిని గురి చూస్తూ సూరిబాబు గారి తుపాకీ. కానీ ఆయన పులి తల్లోకి పేల్చడానికి వీలు కావడం లేదు, తూటా అటీటైతే కృష్ణమూర్తి రాజుగారికి తగిలే ప్రమాదం వుంది.అంత పులి బరువునూ మోసుకుంటూ, కాళ్ళు నేలకి తన్ని పెట్టి నడుం మీద పాక్కుంటూ పడిపోయిన తన తుపాకీని కుడి చేత్తో అందుకున్నారు కృష్ణమూర్తి రాజు. దాన్ని పులి తల దాకా తెచ్చి ట్రిగ్గర్‌నొక్కారు.

ఆ డొక్కు తుపాకీ చేసిన మోసం అంతా ఇంతా కాదు. అది పేల లేదు. ఆయనకే కాదు అక్కడున్న అందరికీ గుండెలు జారి పోయాయి. కృష్ణమూర్తి రాజుకి ఇదే ఆఖరి రోజు అని అర్థమైపోతోంది.మిత్రులిద్దరిదీ వందల పులులని చంపిన అనుభవం. ఆఖరి ప్రయత్నంగా సూరిబాబురాజు పులిడొక్కలోకి కాల్చారు. పుటుక్కుమందే తప్ప అదీ ఢాం అనలేదు. తుక్కు తుపాకీలతో వేటకొచ్చి ఎంత పెద్ద పొరపాటు చేసారో అప్పుడర్థమయ్యింది ఆయనకి. కోపంగా ఆ తుపాకీని విసిరికొట్టారు.అంతకంతకీ పులిది పై చేయి అయిపోతోంది. చేతినుంచి రక్తం పోతున్న కృష్ణమూర్తి రాజు నీరసపడి పోతున్నారు.పులి పరిస్థితీ అదే. కానీ తన శత్రువు బలహీన పడుతున్న సంగతి గ్రహించి అది పట్టు బిగిస్తోంది.తేరుకున్న సూరిబాబురాజు పులి బలాన్నీ బలహీనతనీ పసిగట్టారు. పులి దాని బలాన్నంతా వెనక కాళ్ళమీదే మోహరించింది. వెంటనే పులి వెనక్కి వెళ్ళి నేలకి అదిమి పెట్టివున్న దాని వెనకి కాళ్ళని బలంగా రెండు చేతులతో పైకి లేపడం మొదలెట్టారు. దూరంగా వున్న గిరిజనులని ‘‘రండ్రా రండి’’ అంటూ పిలిచారు.గిరిజనులు సూరిబాబురాజు చుట్టూ గుమి గూడారు. వాళ్ళ చేతుల్లో బరిసెలూ కత్తులూ గొడ్డళ్ళూ ఉన్నాయి. వెనక కాళ్ళు పట్టు దప్పడంతో పులి నోటిపట్టు కూడా కొంచెం సడలింది. అదే అదునుగా కృష్ణమూర్తిరాజుగారు బలాన్నంతా కూడ గట్టుకుని పులిని తన మీద నుంచి త్రోసేసారు. అది తిరిగి లేచే లోపే ఓ గిరిజనుడు చేతిలోని గొడ్డలితో పులి తలమీద బలంగా వేటు వేసాడు. అలా పులిని వదిలించుకొని కృష్ణమూర్తి రాజు మృత్యుంజయుడయ్యారు. అడవికి పులి కాపలా. రాజసం గాంభీర్యం దాని సొంతం. శక్తికీ యుక్తికీ పట్టుదలకీ అది ప్రతిరూపం. అడవిలో పులి వుందంటే అటు వెళ్ళడానికి మనిషన్నవాడు  హడలి చావాల్సిందే.అందుకే పులి మనిషికి శత్రువు. అడవిని జయించాలంటే మనిషి పులిని అంతమొందించాల్సిందే. పులిలేని అడవి అసాంఘిక శక్తులకు ఆడింది ఆట పాడింది పాటగా మారుతుంది. కానీ మనిషే పులై అడవికి కాపలా కాస్తే... ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి?

పులినోట్లో చెయ్యెట్టి తలని తప్పించుకున్న కృష్ణమూర్తిరాజు కొంతకాలం వేటకి విరామం ప్రకటించక తప్పలేదు. ఆయన గుండె ధైర్యానికి అందరికీ వెన్ను జలదరించింది. ఎన్నో నోరులేని ప్రాణులని చంపిన ఆయనకి, తొలిసారి ఓ పులి ప్రాణం విలువనీ! ప్రాణభయాన్నీ! తెలియజెప్పడమే కాదు, ఆలోచనలోనూ పడేసింది. కానీ... తిరిగే కాలూ పేలే తుపాకీ తీరుబడిగా ఒక్క చోట కుదురుగా వుండవు కదా!కృష్ణమూర్తిరాజుగారి వేట మళ్ళీ మొదలయ్యింది. ఎక్కడా పులుల అలికిడి లేకపోవడంతో అడవిపందులూ, కణుజులూ, కొండగొర్రెలూ అతిధులకీ గ్రామస్థులకీ విందుగా మారుతున్నాయి. మృగాలులేని అడవిలోకి మానవమృగాలు ప్రవేశించాయని కృష్ణమూర్తి ఆలస్యంగా గ్రహించారు. అడవిలో పులులని లేకుండా చేసి తాను ఎంత తప్పు చేసారో ఆయనకి అర్ధం అయ్యింది.దాంతో... ఆయన తుపాకీ ఈ కొత్త జంతువుల వైపు తిరిగింది.కృష్ణమూర్తి తుపాకీమడమ నాటుసారా కుండలని బద్దలు గొట్టేది. ఆయన వెలిగించే అగ్గిపుల్ల గంజాయి పంటని దహించేది. తుపాకీ తూటా లారీ టైర్లలోకి దూరి అక్రమకలప అధికారుల కంట్లో పడేది.అడవిలో ఒంటరిగా తిరిగే రాజుగారు, ఆసాంఘిక శక్తులకి పులిలా కనపడ్డం మొదలెట్టారు. శత్రువులు మొదలయ్యారు. పెరిగారు, వాళ్ళంతా ఏకమయ్యారు. కృష్ణమూర్తి రాజు పులికోసం మాటు వేసినట్టే వాళ్ళు రాజుగారి కోసం మాటువేసి అదును కోసం ఎదురు చూసారు.ఓ రోజు రాత్రి అడవికి వెళ్ళిన రాజుగారికి కొంతమంది అక్రమ వ్యాపారులు అనుకోకుండా కనపడ్డారు. ‘‘మరోసారి కనిపిస్తే కాల్చేస్తా’’ అంటూ హెచ్చరించి ఆయన అక్కడ నుంచి కదిలారు.చక చక మంటూ ఏదో మృగం కదిలిన అలికిడి వినిపించడంతో కృష్ణమూర్తి వెనక్కి చూసారు. అప్పటికే ఆలస్య మయ్యింది. ఓ బడితె దెబ్బ రాజు గారి మెడ వెనకపడింది. కింద పడ్డ రాజుగారు క్షణాల్లో తేరుకొని తుపాకీ గురిపెడుతూ లంఘించి లేచారు. ఓ తూటా ఒకడి కాలిని చీల్చేసింది. మరో తూటా పేల్చేలోగానే ఆ చేతిమీద మరో దెబ్బ తగిలింది. కష్ణమూర్తి రాజుగారి తుపాకీ నేల జారింది. ఆయన మోకాళ్ళ మీద కూలబడి పోయారు. ఒకడు కింద పడ్డ తుపాకీని తీసి మడమతో ఆయన తలపై కసిగా మోదాడు. రాజుగారి కళ్ళు మూతలు పడ్డాయి. ఆయన కళ్ళముందు గుండు దెబ్బ తగిలి విలవిల్లాడిన పెద్దపులులూ... చిరుతలూ... అడవి పందులూ.... దుప్పులూ... కణుజులూ రక్తమోడుతూ కలగా పులగంగా కనిపిస్తుంటే తలవాల్చేసారు.చట్టం తనపని తాను చేసుకుంటూ పోయింది. ప్రాణం తీయడం చట్టరీత్యా నేరం. అది మనిషిదైనా మృగానిదైనా ఒకటే. హత్య చేసిన వాళ్ళే కాదు. ఆ హత్యకి సహకరించిన వాళ్ళూ చట్ట రీత్యా నేరస్థులే. రాజుగారు వన్య ప్రాణులని వేటాడారు. అందుకు ఆయన డబుల్‌ బ్యారెల్‌ గన్‌ సహకరించింది. కనుక అదికూడా శిక్ష అనుభవించి తీరాల్సిందే.అవును... ఇప్పుడు ఆ తుపాకీ రాజుగారు లేని ఒంటరితనాన్ని శిక్షగా అనుభవిస్తోంది. మీరు ఆ జోడుగుళ్ళ తుపాకీని పరామర్శించాలనుకుంటే...  జగ్గంపేట పోలీస్‌ స్టేషన్‌ కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. 
- చిరంజీవి వర్మ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top