అనగనగా ఒక రాత్రి

funday new story special - Sakshi

కథా ప్రపంచం

ఆమెను బస్సులో కలిశాను. జనంతో బస్సు కిక్కిరిసిపోయింది. సీటు కోసం వెతుకులాడే నా చూపులు తప్పించుకోవడానికి ఆమె అటూ ఇటూ చూస్తుండేది. ఆమె కాస్తంత పక్కకి జరిగితే అక్కడో మనిషి సర్దుకుని కూర్చునే స్థలం లభించింది. దూసుకుని వెళ్లి కూర్చున్నా, నన్ను తిట్టుకుంటున్న వారిని అంతగా పట్టించుకోలేదు. నా స్టాప్‌ రాగానే లేచి వెళుతూ ఏదో గొణిగాను థాంక్స్‌ అన్నట్టు! చీకటి పడింది. సన్నటి తుప్పర మొదలైంది. చలికాలంలోలానే వుంది, అట్టే జనసంచారం లేకుండా. దీనికి తోడు వీధి దీపాలు వెలగడం లేదు. ఇంటికి వెళ్లడం ఇప్పటికే ఆలస్యమైంది. మా వార్షికోత్సవానికి చీఫ్‌గెస్ట్‌ ముఖ్యమంత్రే. ఆయన రాక ఆలస్యం కావడంతో అన్ని కార్యక్రమాలు అనుకున్న దానికంటే ఆలస్యంగా  జరిగాయి. అమ్మా, నాన్న ఎంతో కంగారు పడుతుంటారని తెలుసు. అందుకే పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ వీలయినంత వేగంగా వెళుతున్నాను. ఎవరో వెనకే వస్తున్నట్టు అనిపించింది. నన్ను నెమ్మదిగా వెళ్లమని ఎవరో అడుగుతున్నారు. ఒక్కసారి వెనక్కి తిరిగి చూశాను. బస్సులో  ఉన్న ఆమె కూడా బస్సు దిగి నేను వెళుతున్న వైపే వస్తోంది.

‘‘మేము కొత్తగా వచ్చాం. 173 క్వార్టర్‌లో ఉంటాం’’. నిజమే నిన్ననే ఆమ్మ చెప్పింది. ఇప్పుడు గుర్తొస్తోంది. మా యింటికి మూడిళ్ల అవతల ఇంట్లో ఎవరో కొత్తవారు వచ్చారని అంది. జల్లు పెద్దదయింది. మేం కొద్దిగా వేగంగా నడక సాగించాం.‘‘మీకు దయ్యాల మీద నమ్మకం వుందా?’’‘‘ఏమిటి?’’ నాకు బొత్తిగా ఇష్టంలేని అంశం ఇదే. అయినా ఈ చలిరాత్రి, వర్షం పడుతున్న రాత్రి అస్సలు పరిచయం లేని ఆమె ఈ ప్రశ్న వేసింది. వెనక్కి తిరిగి ఆమె వంక చూశాను. ఆమె చక్కగా నవ్వుతోంది. అంతే! వెంటనే కళ్ల ముందు రావ్‌ుసే బ్రదర్స్‌ హారర్‌  షోలో ఆడ డ్రాక్యులా ప్రత్యక్షమైంది. రాక్షసులు మామూలు మనుషుల్లానే వుంటారు. కానీ మనిషి రక్తాన్ని తాగేస్తారు. ఇంతకీ ఈమె డ్రాక్యులానా? ‘‘ఏంటి? బిక్కు బిక్కుమంటున్నావ్‌? కొంపదీసి దయ్యాలంటే భయమా?’’‘‘అవును. మరి నీకు?’’ అంటూ ఆమె వంక తిరిగి చూశాను. ఆమె లేదు. చుట్టూరా చూశాను. కానీ ఆమె చీకట్లో ఎటో వెళ్ళిపోయింది. చెప్పొద్దు.. క్షణంపాటు భయంతో వొణికిపోయాను. ఆ తర్వాత కొంత దూరం నుంచీ ఆమె సహాయం కోరుతూ పిలుస్తోంది.  ఆమె కనిపించడం లేదు. మాట ఎలా వినపడుతోంది? ఇంతకీ ఆమె ఎవరు...రాక్షసా లేక మనిషి వేటలో ఉన్న దయ్యమా? నా చుట్టూ దయ్యాలు, భూతాలు ఉన్నట్టనిపించింది.అంతే! ఒక్కసారిగా భయంతో గట్టిగా అరుస్తూ వెనక్కి చూడకుండా పరుగు పెట్టాను నాన్నను చేరేవరకు.

‘‘ఏమైందిరా?’’ నాన్న నన్ను పట్టుకుని లోపలికి తీసికెళ్లారు. భయంతో, వొణుకుతో నోట మాట రాలేదు. అలసిపోయి అలా అమ్మ వొడిలో పడిపోయాను. ఏడుపు వచ్చేసింది. గట్టిగా ఏడ్చాను.‘‘నానీ... నానీ... ఏమైందీ?’’ నాన్న గట్టిగా పట్టుకుని అరుస్తున్నారు. అందులోనూ ఆందోళన.. భయం..‘‘దయ్యం..నేనిప్పుడే దయ్యాన్ని చూశాను. ఆమె బస్సులో వుంది.’’‘‘ఏమిటీ.. బస్సులో దయ్యం ఉందా?!’’ కళ్లద్దాలు పెట్టుకుని అమ్మ నా మొహంలోకి ఆశ్చర్యంగా చూసింది.‘‘అవును. నాతోనే బస్సులో దిగింది. దయ్యాల గురించి అడిగింది. చీకట్లోకి మాయమైపోయింది. ఆమెనా శరీరం కోసం అడగడం వినిపించింది. మనిషి రక్తమాంసాల కోసం వెతుకుతున్న రాక్షసి ఆమె.’’ అసలే చీకటి, పైగా వర్షం, దానికి తోడు లోపలి భయం అన్నీ వెరసి నాపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. అసలు అలా జరగడానికి అవకాశం వుందా అనే ఆలోచన ఎప్పుడో పోయింది.‘‘ఎలా తప్పించుకున్నానో నాకే తెలీదు. చాలా చిత్రంగా, భయంగానూ వుంది...’’ అలా చెబుతూనే వున్నాను. ఏది ముఖ్యమో తేల్చుకోలేకపోతున్నాను. దయ్యాన్ని కలిశానన్న భావన, లేదా భయం. ఈ కాలనీలో రాబోయే పది రోజుల్లో పెద్ద హీరో అయిపోతానన్న ఆందోళనా పట్టుకుంది.‘‘నువ్వు చెప్పేదంతా ఎక్కడ జరిగింది?’’ నాన్న ప్రశ్నల మీద ప్రశ్నలు.‘‘నారంగ్‌ అంకుల్‌ ఇంటి దగ్గరే’’‘‘ఆమె పడిపోయిందో ఏమయిందో నీకు స్పష్టంగా తెలుసునా?’’‘‘నేను అంతా వెతికాను.’’‘‘మరి మ్యాన్‌ హోల్‌?’’ నాన్నా, నేను ఒక్కసారే ఆశ్చర్యంగా అనుకున్నాం.‘‘నిజమే. ఇవాళ సాయంత్రమే నారంగ్‌ వచ్చి తనింటి దగ్గరున్న మ్యాన్‌ హోల్‌ పై చట్రాన్ని ఎవరో దొంగిలించారని చెప్పాడు’’ అమ్మ అంది.

‘‘నానీ... ఆ సంగతి...’’ అని నాన్న ఏదో అనబోయాడు. నన్ను తిట్టాలా, పడిపోయిందేమో అనుకుంటున్న ఆమెని రక్షించాలా అనే సందిగ్ధంలో కంగారు పడ్డారు. వెంటనే పరుగున బయటికి వెళ్లాడు. ఆయన వెంట నేనూ పరిగెట్టాను. అందరం ఒక్కసారి వెతకడం మొదలెట్టాం. అందరూ నన్ను కోపంగానూ చూడటం గమనించాను. అప్పటికే నారంగ్‌ అంకుల్, ఆయన భార్య టార్చి వెలుగులో ఆమెను రక్షించే యత్నాలు చేస్తున్నారు. మొత్తానికి నాన్నా, నారంగ్‌ అంకుల్‌ ఆమెను బయటికి తీసుకురాగలిగారు. ఆమె దెయ్యంలా లేదు. బట్టలంతా మురికి మురికి అయి అచ్చం మురికిలో దొర్లిన ఎలకపిల్లలా వుంది. ఆమె ‘ఎలక దెయ్యం’! ఆ ఆలోచనే చాలా తమాషా అనిపించింది. నవ్వొచ్చింది. కానీ అమ్మ చాలా కోపంగా చూసింది. పరిస్థితులు గ్రహించి మౌనంగా వున్నాను. అంతా నన్ను చాలా కోపంగా చూస్తున్నారు. కానీ వారంతా నా ఫాంటసీని ఎలా అర్థం చేసుకోగలరు! క్షమించమని ఏదో నసుగుతూ ఇవతలకి వచ్చేశాను. కానీ ఆ రాత్రి మూడు నిర్ణయాలు తీసుకున్నాను. కొత్తవారితో మాట్లాడకూడదని, హారర్‌ చిత్రాలు అస్సలు చూడకూడదని, భువనేశ్వర్‌ చీకటి దారుల్లో వెళ్లేటపుడు టార్చ్‌లైట్‌ తప్పనిసరిగా ఉంచుకోవాలని.
ఒరియా మూలం : డాక్టర్‌ శ్రుతి మహాపాత్రో 
అనువాదం: టి. లలితప్రసాద్‌ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top