అమ్మ

Funday horror story of the week  24-03-2019 - Sakshi

కిర్ర్‌..ర్‌..!

‘‘భయంగా ఉంది’’ భర్త భుజమ్మీద తల వాల్చుతూ భార్య.‘‘నేనున్నా కదా.. ’’ భార్య చెక్కిలి స్పృశిస్తూ అభయమిచ్చాడు. నిట్టూరుస్తూ అతణ్ణి అల్లుకుపోయింది ఆమె.వాళ్లిద్దరిదీ ప్రేమ వివాహం. సొంత ఊళ్లో పెద్దలు తమని వేరు చేస్తారనే భయంతో కొన్ని వందల కిలోమీటర్లు దాటి వచ్చారు. యేడాదిగా ఒక్కో ఊరు.. ప్రస్తుతం ఇక్కడ. ఇప్పుడు ఆమె నిండు గర్భిణి. ఆ ఊళ్లో టీచర్‌గా ఉపాధి దొరికింది అతనికి. పల్లెటూరు. పచారీ కొట్టు అందుబాటులోనే ఉన్నా.. ఆసుపత్రి  లేదు. కనీసం ఏడు కిలోమీటర్లు వెళ్లాలి. ఇరుగూపొరుగూ  దగ్గరగా లేక  విసిరేసినట్టుగానే ఉంది ఇల్లు. అద్దె తక్కువని చేరారు. సమయానికి ఎవరూ రారేమోనన్న  భయం ఆమెది. బయటకు బింకంగా కనిపిస్తున్నా లోపల అతనికీ దిగులుగానే ఉంది కాన్పు గురించి.

‘‘ఆకు కూరలు తీసుకోమ్మా... తాజాగా ఉన్నాయ్‌. నీ బిడ్డక్కూడా మంచిది’’ లేత తోటకూర కట్టల్ని ఏరిఏరి ఇస్తోంది కూరగాయలమ్మ.సిగ్గు.. ఆమె నున్నటి బుగ్గల మీద ప్రతిఫలిస్తోంది గులాబీ రంగుగా. ‘‘చక్కటి పిల్ల. ఆలనాపాలనా ఉంటే ఇంకెంత ఆరోగ్యంగా ఉండేదో’’ మనసులో అనుకుంటూ పైకి అడిగింది‘‘నెలలు నిండినట్టున్నాయ్‌.. పెద్దవాళ్లెవరూ లేరా తల్లీ’’ అని.తోటకూర కట్టల్ని చేటలో సర్దుకుంటున్నదల్లా ఒక్కసారిగా తలెత్తి చూసింది కూరలగాయలమ్మను.‘‘కొత్తగా వచ్చినట్టున్నారు.. నాలుగు రోజులుగా చూస్తున్నా..! పెద్దవాళ్లెవరూ కనిపించలేదు’’ నింపాదిగా కూరగాయలమ్మ.గబగబా ఆ ఆకుకూరలు తీసుకుని లోపలికి వెళ్లిపోయి తలుపేసుకుంది ఆ అమ్మాయి.‘‘ఇదిగో అమ్మాయ్‌...మాట...’’అని కూరగాయలమ్మ పిలుస్తున్నా వినకుండా. ‘‘అయ్యో తల్లీ.. ఒక్కదానివే ఎలా నెట్టుకొస్తావ్‌’’ బాధపడుతూ బుట్ట ఎత్తుకుంది ఇంకో చోటికి.

‘‘మీ అమ్మో.. అత్తో.. మీతో ఉంటే ఇవన్నీ చేసేవారు. తొలిచూలు అపురూపమే వేరు’’ గోరింటాకు పెడ్తూ చెప్తోంది.‘‘సారీ.. అవ్వా.. ఆరోజు నీ మొహమ్మీదే తలుపేసాను. కొత్త కదా... ఎవరు ఎలాంటి వాళ్లో తెలీదు.. ఎవరూ లేరని తెలిస్తే.. ’’ ఆగిపోయింది ఆ అమ్మాయి.‘‘నేనేం తప్పుపట్టుకోలేదు తల్లీ.. నువ్వు నా బిడ్డలాంటిదానివి! ’’  అంది గోరింటాకు పెట్టిన ఆ పిల్ల చేతులను ముద్దుగా చూసుకుంటూ!ఆ అమ్మాయి  కళ్లల్లో నీళ్లు.‘‘అరే... ఏంటమ్మా ఇది? చెప్పా కదా..నువ్వు నా బిడ్డ లాంటిదానివని.నీకు పురుడు పోసే బాధ్యత నాది. ఊరుకో తల్లీ.. ఈ టైమ్‌లో అలా కళ్లనీళ్లు పెట్టద్దు’’ ఖాళీ అయిన గోరింటాకుగిన్నెలో చేతులు కడుక్కుని ఆ తడి చేత్తోనే ఆ అమ్మాయి కళ్లు తుడుస్తూ అంది ఆమె.ఆ ఆప్యాయతకు ఆ అమ్మాయిలో గడ్డకట్టుకున్న దుఃఖం కరిగిపోయింది.అంతే ఆమె గుండెలో తలపెట్టి వెక్కివెక్కి ఏడ్వసాగింది. ఆ పిల్ల తల నిమురుతూ అలాగే ఏడ్వనిచ్చింది. ఆ కాసేపట్లోనే ఆ పెద్దామె మనసులో ఎన్నో జ్ఞాపకాలు.. తన కూతురు... ఇలాగే ఉండేది.  ఈ ఇంట్లోనే. కడుపులో ఉన్నది ఆడపిల్లఅని తెలిసి ఆ పిల్ల పెంపకానికి డబ్బులు కావాలని ఇబ్బంది పెట్టారు. ఇచ్చేట్టు లేమని తెలిసి పురిటికి పుట్టింటికి పంపలేదు. నొప్పులు పడ్తున్నా ఆసుపత్రికీ తీసుకెళ్లలేదు. కడుపులో బిడ్డ పేగుమెడకేసుకుని అడ్డం తిరిగింది. కడుపులోనే పోయింది. వైద్యం అందక తన బిడ్డా ప్రాణం వదిలింది. ఆ విషాదగతం ఆమె కంటా నీరు పెట్టించింది.తేరుకున్న ఆ అమ్మాయి చూసి.. ‘‘అయ్యో.. అమ్మా.. మీరెందుకేడుస్తున్నారు?సారీ.. అమ్మా.. నేనేమైనా బాధపెట్టుంటే ’’ గోరింటాకు చేతి మణికట్టుతో ఆమె కళ్లు తుడుస్తూ నొచ్చుకుంది ఆ అమ్మాయి.తెప్పరిల్లిన ఆమె ‘‘ఛ.. ఛ..అట్లాదింటేం లేదు’’ అని చీర చెంగుతో మొహం తుడుచుకుంటూ ‘‘అన్నం పెట్టనా..’’ అంటూ వంట గదిలోకి వెళ్లింది.‘‘థాంక్స్‌ దేవుడా.. ఈ అమ్మను ఇచ్చినందుకు’’ కనిపించని ఆ దేవుడికి దండం పెట్టుకుంది ఆ అమ్మాయి.

‘‘అమ్మా...భరించలేను.. నా వల్ల కాదు..’’ నొప్పితో మెలికలు తిరిగిపోతోంది ఆ పిల్ల.‘‘కాస్త ఓర్చుకో ప్లీజ్‌.. నేను అలా వెళ్లి ఎవరైనా తోడు వస్తారేమో చూస్తా... ’’‘‘నా వల్ల కావట్లేదు... కూరగాయలమ్మ వస్తుందేమో చూడవా ఒకసారి’’ పంటి కింద నొప్పిని భరిస్తూ నడుమ్మీద చేతి ఆసరాతో మంచమ్మీద కూర్చుంటూ అంది.‘‘ఆమె కోసం చూసేంత టైమ్‌ లేదులేగానీ.. బయటకు వెళ్లి ఎవరినైనా సాయం అడిగొస్తా.. ఆసుపత్రికెళ్లడానికి.. అందాక  కాస్త ఓపిక పట్టు’’ అంటూ మంచినీళ్ల చెంబు ఆమెకిచ్చి బయటకు వెళ్లిపోయాడు.అతనలా వెళ్లాడో లేదో.. కూరగాయలమ్మ వచ్చింది.‘‘ఏం తల్లీ.. నొప్పులు పడ్తున్నావా?అయ్యో.. నిన్న రాత్రి ఇక్కడే ఉంటానంటికదా.. పర్లేదు పో అన్నావ్‌’’ అంటూ గబగబా ఆ అమ్మాయిని పడుకోబెట్టింది.కూరగాయలమ్మను చూడగానే అమ్మాయికి భరోసా వచ్చింది.‘‘అమ్మా... ఇక్కడే ఉంటావ్‌ కదా..’’ ఓ ధైర్యం కోసం అడుగుతోంది ఆ పిల్ల.‘‘నేనెక్కడికి పోతానమ్మా..నీ చేతిలో పండంటి బిడ్డను పెట్టందే ఎక్కడికీ పోను’’ అంటూ ఆమె నుదిటి మీద చేయి వేసి ధైర్యమిచ్చి... తను వెంటతెచ్చిన పాత గుడ్డల మూట విప్పింది.‘‘అమ్మా....’’ అంటూ అరిచింది   అమ్మాయి.‘‘ఏంకాదు... కాస్త ఓపికపట్టు’’ అంటూ ఆ పిల్ల కాళ్లను మలిచి ఎడం చేసింది.ఆ అమ్మాయికి అంతకంతకు నొప్పులు ఎక్కువవుతున్నాయి.. అర్థమవుతోంది కూరగాయలమ్మకు. వంటింట్లోకి వెళ్లి స్టవ్‌ మీద వేడి నీళ్లు పెట్టింది. మళ్లీ ఈ గదిలోకి వచ్చేటప్పటికే పిల్లకు నొప్పులు ఉధృతమయ్యాయి. ఆ పిల్ల కాళ్లువణుకుతున్నాయి. మొహం ఎర్రబడింది.. చూసింది... నల్లగా తలకట్టు కనబడుతోంది...‘‘తల్లీ.. బిడ్డ బయటకు వస్తోంది.. ఊపిరి ఎగబబీల్చకు.. కిందకు నొక్కు నొప్పిని...’’ చెప్తోంది..అయినా   బిగబట్టలేక పైకి పీల్చుకుంది ఆ పిల్ల.కంగారు పడింది కూరగాయలమ్మ.. ‘‘అయ్యో అలా చేయకమ్మా,, బిడ్డకు శ్వాసాడదు.. ’’ తన అనుభవసారం చెప్తోంది..మూడేమూడు పెద్ద నొప్పులు... బిడ్డ కూరగాయలమ్మ చేతిలో పడింది.. కేర్‌... కేర్‌.....‘‘ఆడపిల్ల’’ కూరగాయలమ్మ మొహం వెలిగిపోతోంది.అప్పటిదాకా అనుభవించిన నరకం.. మాయమైంది... బిడ్డ ఏడుపు.. ఆ తల్లి మనసును శాంత పరిచింది. హాయిగా కళ్లు మూసుకుంది బాలింత  అలసట తీర్చుకునేందుకు.‘‘మాయా... మాయా..’’ పడుకున్న భార్యను లేపాడు.మగతగా కళ్లు తెరిచింది ఆమె. భర్తను చూసింది... అతని వెంట ఉన్న మరో ఇద్దరు ఆడవాళ్లనూ!లేవబోయింది... పక్కన పొత్తిళ్లల్లో బిడ్డ ఒళ్లు విరుచుకుంటూ ...‘‘నీళ్లాడింది కదా బాబూ...’’ అంది వెంట వచ్చిన ఆడవాళ్లలో ఒకామే ఆ బిడ్డను ఎత్తుకుంటూ.‘‘ఎలా?’’ చూశాడు.  ‘‘కూరగాయలమ్మ’’ చెప్పింది చిన్న స్వరంతో.‘‘ఎక్కడా?’’ అడిగాడు ‘‘ఇందాకటిదాకా నా పక్కనే ఉందే!  వంటింట్లోకెళ్లిందేమో’’ అంది .చూశాడు.. వంటగదిలో లేదు.. ఇంకెక్కడా కనిపించలేదు. తను సాయం కోసం బయటకు వెళ్లొచ్చిన  పదినిమిషాల్లోనే  ఇదంతా.. ఎలా సాధ్యం? వింతగా.. అయోమయంగా  ఉంది అతనికి!
- సరస్వతి రమ 

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top