కొత్త పుస్తకం: ఉన్నతాధికారి అనుభవాలు

కొత్త పుస్తకం: ఉన్నతాధికారి అనుభవాలు - Sakshi


మోహన మకరందం (అనుభవాలూ-జ్ఞాపకాలూ)

 రచన: మోహన్ కందా

 పేజీలు: 252; వెల: 200; ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, కాచిగూడ, హైదరాబాద్-27. ఫోన్: 24652387

 

 మాకు జర్నలిజంలో పాలిటీ బోధించిన కృపాదానం సర్ సరదాగా ఒక మాట అన్నారు: ఈ రాజకీయనాయకులు ఎవరూ లేకపోయినా, జరిగే పని జరుగుతూనే ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ ఏ వ్యవస్థా పడకేయకుండా చూసే బాధ్యత అధికారయంత్రాంగం మీద ఉంటుంది మరి! జాన్‌సన్ చోరగుడి అన్నట్టు, ‘ప్రభుత్వం’ లేకపోయినా ‘రాజ్యం’ తన పని తాను చేసుకుపోయే సందర్భాలు వస్తుంటాయి. రాష్ట్రపతి పాలన విధించినప్పుడో, ‘మంత్రివర్గం’ ఇంకా ప్రమాణ స్వీకారం చేయనప్పుడో ఇది మనకు బాగా తెలిసొస్తుంది. అలాంటి రాజ్యానికి చోదకశక్తి ‘తెరచాటునుండే’ ఐఏఎస్ ఆఫీసర్లు. ‘ఐఏఎస్‌లో ఎన్నో రకాల ఉద్యోగాలుంటాయి.... (అందులో) జిల్లా కలెక్టర్, రాష్ట్రంలో ప్రధాన కార్యదర్శి, కేంద్రస్థాయిలో కార్యదర్శి- యివి ప్రత్యేకమైనవి’. ఈ మూడు కీలకస్థానాల్లోనే కాక, చేనేత, ఫిషరీష్, సివిల్ సప్లయిస్, ఎక్సయిజ్, కమర్షియల్ టాక్స్, ఎగ్రికల్చర్, ప్లానింగ్, కో-ఆపరేషన్‌లోనూ  పనిచేసిన ఉన్నతాధికారి మోహన్ కందా! ఆయన ఆత్మకథాత్మక, సంఘటన కేంద్రక జ్ఞాపకాలివన్నీ!

 ఉన్నతాధికారి అన్న పదంతో ఉండే ఇమేజ్ వల్లనేమో, ఇందులోని అక్షరాలకు కూడా సూటూబూటూ తొడిగివుంటారా, అన్న అనుమానం కలుగుతుంది. కానీ చెప్పుల్లేకుండా కాలేజీకి, బూట్లు లేకుండా ఆఫీసుకీ(అలవాటుగానే సుమా! పేదరికంతో కాదు. జడ్జిగారబ్బాయి కదా!) కూడా వెళ్లిన ‘మోహన్’... ఆ గాంభీర్యాన్ని తగ్గించి, ‘బెటర్ దన్ ద ఆల్టర్నేటివ్’ అయిన జీవితానికి సెన్సాఫ్ హ్యూమర్‌ను కచ్చితమైన టెన్షన్ బస్టర్‌గా నమ్మినవాడు కాబట్టి, సరదాగా రాసుకువెళ్లారు.

 

 ఉంటాడో ఊడతాడో అనుకున్న తన పుట్టుక, గాంధీజీ మీదుగా తన నామకరణం, సినిమాల్లో బాలనటుడి వేషాలు, ప్రకాశం సబ్‌కలెక్టర్‌గా జై ఆంధ్ర ఉద్యమాన్ని ‘ఎదుర్కోవాల్సి రావడం’, ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి, నేదురుమల్లిల పనితీరుకు అడ్జస్ట్ కావడం, ఎన్టీయార్‌తో ఉదయం ఐదుగంటలకు భోంచేయాల్సి రావడం, తన కుక్కపిల్లల ప్రేమ గొడవ, రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ టైముకు రాకూడదని మొక్కుకున్న సందర్భం, మూడురోజుల్లో ఇవ్వాలనుకున్న ‘జాతీయ విపత్తు నిర్వహణా సంస్థ’ నివేదికకు మూడేళ్లు పట్టడం, ప్రశ్నోత్తరాలకు మంత్రిని ఎంత సిద్ధం చేసినా మాట పడాల్సిరావడం, కృష్ణా పుష్కరాల అనర్థానికి ‘ఎంచుకున్న తలకాయలను’ శిక్షించడం, చంద్రబాబునాయుడుకీ, రాజశేఖరరెడ్డికీ ఇద్దరికీ ప్రధాన కార్యదర్శిగా పనిచేయడం... ఇట్లాంటివెన్నో అనుభవాలు! ఇవే విషయాల్ని గంభీరంగా చెబితే, ‘చూశారా, నా గొప్పతనం,’ అన్నట్టుగా ధ్వనించే ప్రమాదం ఉంది. కానీ ‘టోన్’లో తీసుకున్న జాగ్రత్త వల్ల ‘ఔచిత్య భంగం’ కాలేదు.

 

 ‘అత్యున్నత స్థాయిలో ఉన్నవాడు దిశానిర్దేశం చేయాలి. ప్రాథమికస్థాయిలో కచ్చితంగా అమలు చేయాలి’. ‘అవినీతి అంటే ఏమిటో మనం సులభంగా కనుక్కోవచ్చు. కానీ నిజాయితీని నిర్వచించడం కష్టమని నా వ్యక్తిగత అభిప్రాయం’. ‘కేంద్రప్రభుత్వంలో వ్యవస్థను ఆఫీసర్ డ్రివెన్ సిస్టమ్ అంటారు, రాష్ట్రాలలో ఉన్నది ఆఫీస్ డ్రివెన్ సిస్టమ్’ లాంటి ‘ముక్తావళి’ కూడా సంఘటనల్లో భాగంగా కలిసిపోయింది. అందుకే ఈ పుస్తకం చదవడంలోని మజా ఇస్తూనే, వ్యవస్థ పనితీరును అర్థం చేసుకోవడానికీ పనికొస్తుంది. అయితే, కాలమ్‌గా రాసినవి కాబట్టి, కొన్నిసార్లు నేపథ్యాల పునరుక్తులున్నాయి. ‘ఫీల్ గుడ్’ అంశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చినట్టుంది!

 - ఆర్.ఆర్.

 

 కొత్త పుస్తకాలు: తెగిపడ్డ ఆ చెయ్యి (కారుమంచి దళితుల ధిక్కార చరిత్ర)

 రచన: సి.ఎస్.సాగర్

 పేజీలు: 126; వెల: 100; ప్రతులకు: ఇం. 2-1-716(బి-6, ఎఫ్-4), ఎస్వీఎస్ స్కూలు ఎదురుగా, ఓయూ మెయిన్ రోడ్, విద్యానగర్, హైదరాబాద్-44.

 ఫోన్: 040-27668471

 

 స్వాభిమాన ప్రతీక, విద్యాసుందరి బెంగుళూరు నాగరత్నమ్మ జీవితం, కొన్ని రచనలు

 సంపాదకుడు: మోదుగుల రవికృష్ణ

 పేజీలు: 134; వెల: 100; ప్రతులకు: నవోదయా బుక్ హౌస్, హైదరాబాద్‌తో పాటు, సంపాదకుడు, 26-19-10, ‘0’ లేన్, మెయిన్ రోడ్, ఎ.టి.అగ్రహారం, గుంటూర్- 522004.

 ఫోన్: 09440320580

 

 కాకతీయుల వంశ రహస్యం

 రచన: డా.బాలరాజు తక్కెళ్ల

 పేజీలు: 120; వెల: 100; ప్రతులకు: టి.కళావతి రాజ్, 3-14-609, కొత్తూరు, కె.యు.రోడ్, హన్మకొండ,

 వరంగల్ జిల్లా-506001

 

 తెల్లారితే... (అపాయింటెడ్ డే) (కవిత్వం)

 రచన: కె.విల్సన్‌రావు, కె.ఆంజనేయకుమార్

 పేజీలు: 120; వెల: 75

 ప్రతులకు: సాహితీస్రవంతి, విజయవాడతోపాటు ప్రజాశక్తి అన్ని శాఖలూ.

 

 భాస్వరాలు (కవిత్వం)

 రచన: ఆచార్య కడారు వీరారెడ్డి

 పేజీలు: 116; వెల: 100

 ప్రతులకు: కవి, 8-12-20, బృందావన్ నగర్, రోడ్ నం.8, హబ్సిగూడ, హైదరాబాద్-7. ఫోన్: 9392447007

 

 ప్రేమాంజలి (దీర్ఘకవిత)

 రచన: బిక్కి కృష్ణ

 పేజీలు: 122; వెల: అమూల్యం

 ప్రతులకు: బిక్కి చందన, 7-1-309/11/12, రేణుకానగర్, బి.కె.గూడ, ఎస్.ఆర్.నగర్, హైదరాబాద్-38. ఫోన్: 9912738815

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top