వైర భక్తి

వైర భక్తి


  జ్యోతిర్మయం

ఆదిశంకరులు మోక్షాన్ని తెచ్చిపెట్టే సాధనాల్లో భక్తికే పెద్దపీట వేశారు. ఆ భక్తి తొమ్మిది విధాలుగా ఉంటుం ది అని మన పెద్దలు చెప్తారు. శ్రవణం, కీర్తనం, స్మర ణం, పాదసేవనం, అర్చనం, వందనం, ధ్యానం, సఖ్యం, ఆత్మనివేదనం అనేవి ఆ తొమ్మిది విధాలు. వీటి లో స్మరణం చాలా ప్రత్యేకమైనది, విశేషమైనది. స్మర ణం అంటే తలంపు, జ్ఞప్తి. భగవంతుణ్ణి గురించి నిరం తరం తలపోస్తూ ఉండటం, విడువకుండా జ్ఞాపకం పెట్టుకోవటం. భగవంతుణ్ణి ఇట్లా జ్ఞాపకం పెట్టుకోవ టం ప్రేమతో కావచ్చు, ద్వేషం తో కావచ్చు, కోపంతో కావ చ్చు, విరోధంతో కావచ్చు. ఏ విధంగా భగవంతుని, ఎల్లప్పు డు తలచుకొంటున్నావు? అన్నది ముఖ్యం కాదు. తలచు కోవటం ముఖ్యం. ఎవరైనా భగవంతునితో వైరం పెట్టుకొని, ద్వేషించి, ఎల్లప్పుడు తలచుకొంటూ ఉంటే, ఆ తలంపే అతడిని భగవం తుని దగ్గరకు జేరుస్తుంది. దీనిపై భాగవతం తృతీయ స్కంధంలో ఆసక్తికరమైన వృత్తాంతం ఒకటి ఉన్నది.



 శ్రీ మహావిష్ణువు దర్శనార్థం వైకుంఠం వచ్చిన మహర్షులు సనక సనందనాదులను విష్ణువు అంతః పుర ద్వార పాలకులైన జయవిజయులు అడ్డగించి భూలోకంలో పుట్టేలా ఘోర శాపం పొందుతారు. విష్ణుమూర్తి విషయం తెలుసుకొని, శాపవిమోచనంగా వాళ్లతో ఇలా అంటాడు, ‘‘జయ విజయులు భూలోకం లో అసురులుగా జన్మిస్తారు. దేవతలకు, మనుష్యులకు కీడు కలుగజేస్తూ, నాకు విరోధులుగా ఉంటారు. యుద్ధంలో నన్ను ఎదుర్కొని, నా చేతిలో చనిపోతారు. అలా చనిపోయి, త్వరలోనే నా సన్నిధికి వస్తారు’’.  విష్ణువు ఇంకోమాట అంటాడు, ‘‘వైరంతో అయినా సరే, ఎవరు నన్ను మనస్సులో తలచు కొంటూ, నన్ను చూస్తూ చనిపోతారో, వారు నన్నే పొందుతారు’’.



 అయితే ఇక్కడ ఎవరికైనా ఒక ధర్మసందేహం రావచ్చు. భగవంతుణ్ణి ప్రేమించి, సేవ చేసిన వానికం టే, భగవంతుణ్ణి ద్వేషించి, విరోధం పెట్టుకొన్న వాడే త్వరగా మోక్షానికి వెళ్తాడు? అదెట్లా సంభవం? అంటే భాగవతమే దానికి సమాధానం చెబుతుంది. వైరం వల్ల భగవంతుని యెడల తన్మయత్వం కలిగినట్లు, మరి దేనివల్లా కలుగదు అని. మనం ఎవరినైనా ద్వేషించినప్పుడు, ప్రేమించినప్పటికంటే, ఎక్కువ సార్లు, ఎక్కువ తీవ్రతతో అతడిని జ్ఞప్తికి తెచ్చుకొం టాము. ఒక మనిషి మీద అత్యంత ద్వేషం, విరోధం కలిగినప్పుడు, నీవు అన్నింటినీ మరచిపోయి, నిన్ను నీవే మరచిపోయి, ఎవరినైతే ద్వేషిస్తున్నావో, అతడిని గురించే ఆలోచిస్తూ ఉంటావు. ప్రేమలో కూడా తలచుకోవటం ఉంటుంది కాని, ద్వేషంలో ఉన్నంత తీవ్రంగా, నిరంతరాయంగా ఉండదు. హిరణ్యాక్ష హిరణ్యకశిపులు మొదలైన వాళ్లు ఎందుకు త్వరగా మోక్షాన్ని పొందారు అంటే, వాళ్లు భగవంతుడితో విరోధం పెట్టుకొని, ద్వేషించి, బతుకంతా ప్రతిక్షణం ఆ భగవంతుని ధ్యాసలోనే గడిపారు కాబట్టీ.



     - దీవి సుబ్బారావు

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top