గూగుల్ డూడెల్‌తో పారాచ్యూట్ జంప్ చేద్దామా? | Sakshi
Sakshi News home page

గూగుల్ డూడెల్‌తో పారాచ్యూట్ జంప్ చేద్దామా?

Published Tue, Oct 22 2013 3:42 PM

గూగుల్ డూడెల్‌తో పారాచ్యూట్ జంప్ చేద్దామా?

కొన్ని చారిత్రాత్మకమైన, చిరస్మరణీయమైన సంఘటనల్ని గూగుల్ తన డూడెల్ ద్వారా గుర్తుకు తెస్తుంటుందని తెలిసిందే. మంగళవారం నాటి గూగుల్ డూడెల్ మరో సరికొత్త ప్రయోగం చేసింది. 1797 అక్టోబర్ 22న, అంటే సరిగ్గా 216 ఏళ్ల క్రితం ఆంద్రి- జాక్స్ గర్నెరిన్‌ అనే ఓ ఫ్రెంచ్ సాహసి మొట్టమొదటిసారి పారాచ్యూట్ జంప్ చేసి చరిత్ర సృష్టించాడు. నీలాకాశంలో మబ్బులానో, గాలిలో దూదిపింజలానో తేలిపోవాలని మనుషులు కన్న కలలకి రెక్కలు తొడిగింది గర్నెరిన్‌ సఫల సాహసమే. ఆ స్ఫూరిదాయక సంఘటనని కేవలం గుర్తుకు తేవడానికే పరిమితం కాకుండా, నెటిజెన్లు కూడా అందులో పాలుపంచుకునే ఇంటరాక్టివ్ డూడెల్‌ని రూపొందించింది గూగుల్. దానితో, ఎంచక్కా వీడియో గేమ్ ఆడినట్లు, గూగుల్ ఓపెన్ చేసిన నెటిజెన్లు తాము కూడా రెండొందల ఏళ్లు వెనక్కి వెళ్లి పారాచ్యూట్ జంప్ చేస్తున్న గర్నెరిన్‌ దిశని కీబోర్డు ద్వారా (స్మార్ట్‌ఫోన్లో అటూఇటూ టిల్ట్ చేయడం ద్వారా) నిర్దేశించవచ్చు. మరో విధంగా చెప్పాలంటే, గర్నెరిన్‌ పాటు యూజర్లు కూడా వర్చువల్‌గా పారాచ్యూట్ జంప్ చేసేలా గూగుల్ తన హోమ్‌పేజీ డూడెల్‌ని రూపొందించింది.
ఆనాడు ఆ పారాచ్యూట్‌ను కనిపెట్టింది కూడా గర్నెరినే. కేవలం 28 ఏళ్ల వయసులో ఆయన సాధించిన విజయానికి ప్రతిఫలంగా ఫ్రాన్స్ వైమానిక అధికారిగా నియమించబడ్డాడు.


1769 జనవరి 31న పుట్టిన గర్నెరిన్‌ ఫిజిక్స్ చదువుకొని, ఫ్రెంచ్ సైన్యంలో ఇన్స్‌పెక్టర్‌గా 1793లో చేరాడు. 1797 పారాచ్యూట్ జంప్ తర్వాత, 1798లో ఇదే సాహసాన్ని ఒక మహిళతో కలిసి చేస్తానని ఆయన ప్రకటించడం చాలా వివాదానికి దారితీసింది. మహిళలు అంతటి వాతావరణ ఒత్తిడిని తట్టుకోలేరని ఆయన్ని అందరూ విమర్శించారు. కానీ, జూలై 8, 1798లో సితొయిన్ని హెన్రీ అనే స్త్రీతో కలిసి ఆయన విజయవంతంగా పారాచ్యూట్ జంప్ చేసి సంచలనం సృష్టించారు.   


1823 ఆగస్టు 18న పారిస్‌లో ఒక బెలూన్ తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు దూలం గుద్దుకొని ఆంద్రి-జాక్స్ గర్నెరిన్‌ చనిపోయినప్పటికీ, అమేయమైన మానవ ప్రయత్నాలకి ఉదాహరణగా నిల్చిన వారిలో ఆయన ఒకడిగా చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement