2013.. కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ | Congress party great shock in 2013 Assembly elections | Sakshi
Sakshi News home page

2013.. కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్

Dec 31 2013 2:04 PM | Updated on Mar 18 2019 7:55 PM

2013.. కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ - Sakshi

2013.. కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్

కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం దాపురించిందా ? అవుననే చెప్పాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఆ విషయాన్ని తేటతెల్లం చేశాయి.

కాంగ్రెస్ పార్టీకి గడ్డుకాలం దాపురించిందా ? అవుననే చెప్పాలి. ఐదు రాష్ట్రాల ఎన్నికలే ఆ విషయాన్ని తేటతెల్లం చేశాయి. మిజోరాం మినహా మధ్యప్రదేశ్, న్యూఢిల్లీ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్లలో ఆ పార్టీకి చావుతప్పి కన్నులొట్టపోయింది. యూపీఏ ప్రభుత్వ పాలనలో దేశంలో అవినీతి అరచేతి మందాన మేట వేయడం, తారాపథానికి చేరుకున్న ధరలు, సామాన్యుల కష్టాలు వెరసి కాంగ్రెస్ పార్టీని కిలోమీటరు లోతున గొయ్యితీసి కప్పెట్టేశాయి.

న్యూఢిల్లీలో ఆ పార్టీ పరువు గంగలో కలిసింది. సీఎం షీలా పాలనలో విద్యుత్తు, తాగునీటి ఛార్జీలు ఆకాశాన్నంటాయి. నిర్భయపై అత్యాచారం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. నిర్భయ చట్టం తెచ్చినా కూడా న్యూఢిల్లీలో మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో హస్తిన వాసులు షీలాపై ఆగ్రహంతో ఉన్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ విధి విధానాలపై మాజీ ఐఆర్ఎస్ అధికారి అరవింద్ కేజ్రీవాల్ సమర శంఖం పూరించారు. ఆ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించారు. స్వయంగా కేజ్రీవాల్ సీఎం షీలాపై పోటీచేసి విజయం సాధించారు. న్యూఢిల్లీ శాసన సభకు మొత్తం 70 స్థానాల్లో బీజేపీ 32 స్థానాలను కైవసం చేసుకుంది. అలాగే ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ మాత్రం కేవలం 7 సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఇటు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్ చేపట్టిన సంక్షేమ పథకాలే ఆ పార్టీని విజయ తీరాలకు చేర్చాయి. మధ్యప్రదేశ్లో 230 స్థానాలకుగాను బీజేపీ 165, కాంగ్రెస్ 58 స్థానాలను గెలుచుకున్నాయి. ఛత్తీస్గఢ్లో 90 స్థానాలకు బీజేపీ 49, కాంగ్రెస్ 39, ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు.  ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ గెలుస్తుందేమోనని ఓ దశలో అనిపించినా, కమలవికాసాన్ని అరచేయి ఆపలేకపోయింది.

రాజస్థాన్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనకు ఆ రాష్ట్ర వాసులు మంగళం పాడారు. ఇక్కడ బీజేపీకి పట్టం కట్టారు. మొత్తం 199 స్థానాల్లో 162 బీజేపీ, 21 కాంగ్రెస్, 16 ఇతరులు గెలుపొందారు. దీంతో బీజేపీ నాయకురాలు వసుంధర రాజే రాజస్థాన్ ముఖ్యమంత్రి పీఠంపై మరోసారి అధిష్టించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. నీచాతి నీచమైన స్థానానికి దిగజారిపోయింది.

ఇక మిగిలింది మిజోరాం. ఆ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ఎలాగోలా అధికారం సంపాదించింది. మొత్తం 40 స్థానాల్లో కాంగ్రెస్ 33, ఎమ్ఎన్ఎఫ్ 7 స్థానాల్లో గెలిచాయి. దీంతో కాంగ్రెస్ నాయకుడు లాల్ తన్వాలా మిజోరాం పీఠాన్ని అధిష్టించారు. త్వరలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే వాటిలోనూ పునరావృతం కావచ్చన్నది విశ్లేషకుల అభిప్రాయం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement