బ్రిటిష్ రెసిడెన్సీ

బ్రిటిష్ రెసిడెన్సీ


ప్రధాన రెసిడెన్సీ భవనాన్ని ఆనుకునివున్న విశాలమైన ప్రాంగణంలో ఆనాటి  బ్రిటిష్ అధికారుల కోసం నిర్మించిన ఆఫీసు గదులు, వారి నివాసం కోసం నిర్మించిన క్వార్టర్లు ఉన్నాయి. బ్రిటిష్ రెసిడెన్సీ నిర్మించిన తర్వాత సుమారు 50 ఏళ్ల దాకా  చుట్టూతా ఎలాంటి ప్రహరీ నిర్మించ లేదు. ఐతే, 1857లో భారత స్వాతంత్య్ర సమరంలో భాగంగా రెసిడెన్సీపై ఉద్యమకారుల దండయాత్ర జరిగింది. దాంతో దీని చుట్టూ రాళ్లతో ప్రహరీ నిర్మించారు.

 

 చారిత్రక పురాతన వారసత్వ సంపదకు నిలువెత్తు సాక్ష్యం బ్రిటిష్ రెసిడెన్సీ. ఇండో-బ్రిటిష్ కాలం నాటి భవనాలకు సంబంధించిన తీపి గుర్తుగా బ్రిటిష్ రెసిడెన్సీ నిలుస్తుంది. హైదరాబాద్‌లో బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని చాటుకున్న సమయంలో ఈ కట్టడం నిర్మించారు. దీని నిర్మాణంలో ఆనాటి గొప్ప ఆర్కిటెక్చర్, వాస్తు శిల్ప శైలీ విశిష్టత నేటికీ ప్రతిబింబిస్తుంది. బ్రిటిష్ 200 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. కోఠి-సుల్తాన్ బజార్, చౌరస్తాలో సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ పురాతన రాజ ప్రాసాదంలో నేడు ఉస్మానియా విశ్వవిద్యాలయం మహిళా కళాశాల ఉంది. అసఫ్ జాహీల కాలంలో (1724-1948) బ్రిటిష్ పాలకుల ఆధిపత్యం అధికంగా ఉండేది.

 

 స్థానిక నిజాం ప్రభువులు కల్పించిన క్వార్టర్‌‌సలోనే బ్రిటిష్ రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన మేజర్ జె.ఎ. కిర్‌క్‌పాట్రిక్, బ్రిటిష్ అధికారులకు వారి హోదాకు దీటుగా ఒక పెద్ద బంగళా ఉండాలని, అందుకోసం కోఠి ప్రాంతంలో మూసీనది సమీపంలో సుమారు 60 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేసి అక్కడ పెద్ద భవంతి నిర్మించాలని ప్రతిపాదించాడు. అప్పటి నిజాం ప్రభువు ముందుగా ఈ ప్రతిపాదనను ఒప్పుకోకపోయినా, తర్వాత అంగీకరించి రెసిడెన్సీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.  ఇందుకయిన ఖర్చునంతా నిజాం ప్రభువే భరించాడు. బ్రిటిష్ రాయల్ ఇంజనీర్లు లెఫ్టినెంట్ శామ్యూల్ రస్సెల్, మద్రాసు, ఈ భవన నమూనాను రూపొందించారు. నిజాం ఆస్థానంలోని ఉన్నతాధికారి శ్రీరాజా కంద స్వామి ముదిలియార్ తదితరులు సివిల్ పనులు పర్యవేక్షించారు.

 

 22 పాలరాతి మెట్లు

 రెసిడెన్సీ ప్రధాన హాలును చేరుకోవడానికి 22 పాలరాతి మెట్లు ఎక్కవల్సి వుంటుంది. ఒక్కొక్క మెట్టు సుమారు 60 అడుగుల పొడవు వుంది. పోర్టికో ముందు భాగంలో సుమారు 50 అడుగుల ఎత్తులో ఎనిమిది భారీ ఎత్తై పిల్లర్లు, నాటి రాచఠీవికి దర్పణంగా దర్శనమిస్తాయి. అలాగే, తెల్లని ఎత్తై పాలరాయి వేదికపై ప్రధాన సింహద్వారానికి ఇరు పక్కలా పెద్దసైజు సింహాలు బ్రిటిష్ ఇంపీరియల్ చిహ్నంగా స్వాగతం పలుకుతాయి.

 

 ఇది దాటి రాజప్రాసాదంలో అడుగిడగానే ఉన్న దర్బార్ హాల్లో అత్యంత ప్రతి భావంతంగా చెక్కిన పలు కళాకృతులున్నాయి. దర్బారుహాల్లో సుమారు 60 అడుగుల ఎత్తున గల పైకప్పుపై ఆనాటి చిత్ర కళాకారుని తైలవర్ణ చిత్రాలు నేటికీ చెక్కుచెదర లేదు. ఖరీదైన  చాండిలియర్‌లు, గోడలకు బిగించిన నిలువుటెత్తు అద్దాలు, అద్దాల మహల్‌ను తలపిస్తూ దర్శకుల మనసులను దోచుకుంటాయి. అన్నిరకాల హంగులున్నా బ్రిటిష్ రెసిడెన్సీలోని ప్రధాన భవనం చాలా భాగం శిథిలావస్థకు చేరుకుంది. వాటికి తక్షణ రిపేరు చేయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.  ప్రధాన భవన సముదాయానికి కొద్దిపాటి దూరంలో బ్రిటిష్ రెసిడెంట్‌ల సమాధులు ఉన్నాయి. బ్రిటిష్ రెసిడెన్సీ కట్టడ నమూనా కూడా ఇక్కడ దగ్గర్లోనే ఉంది.

 

 అయితే ఈ ప్రాంతంలో నేడు కాలు మోపడానికి కూడా వీలు లేనంతగా పిచ్చి మొక్కలతో నిండి ఉంది. వీటికి తగిన రక్షణ, మరమ్మతులు చేసి సందర్శకులకు అందుబాటులో ఉంచితే బాగుంటుంది. న్యూయార్కులోని  గిౌటఛీ కౌఠఝ్ఛ్ట గ్చ్టిఛిజి  అనే సంస్థ బ్రిటిష్ రెసిడెన్సీలో తగిన మరమ్మతుల కోసం ఒక లక్ష  అమెరికన్ డాలర్లు గ్రాంటుగా ప్రకటించింది. చారిత్రక, వారసత్వ కట్టడాలపై ఆసక్తి గల వారందరికీ బ్రిటిష్ రెసిడెన్సీ ఎన్నో కథలు తెలియజేస్తుంది.

 - మల్లాది కృష్ణానంద్

 malladisukku@gmail.com

Read latest Features News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top