అమ్మా... నాన్నా... ఓ పారిపోయిన అమ్మాయి

Young Women Life Story on Arrange Marriage - Sakshi

ప్రతి ప్రయాణ నిర్ణయమూ ఫైనల్‌ కాదు. టికెట్‌ తీసుకున్నాక కేన్సిల్‌ చేసుకోవచ్చు. ప్లాట్‌ఫామ్‌కు చేరుకున్నాక అనీజీగా ఉంటే వెనక్కు వచ్చేయవచ్చు. ట్రైనెక్కేసినా పక్క స్టేషన్‌లో దిగిపోవచ్చు. ఆగకపోతే చైన్‌ లాగి దూకి పారిపోవచ్చు. మరి జీవితంలో తీసుకునే నిర్ణయాలకు ఈ ఆప్షన్స్‌ ఉండవా? ఒక నిర్ణయం తీసుకుంటే కేన్సిల్‌ చేసే వీలు ఉండదా? ఉండదు అన్న ఆలోచనేచాలా పెద్ద వ్యాధి అవుతుంది.లేదా ఈ అమ్మాయికథ అవుతుంది.

‘మీ అమ్మాయికి అందమైన జీవితం అంటే తెలుసు. అర్థవంతమైన జీవితం అన్నా తెలుసు. స్వేచ్ఛగా ఎగిరే పక్షి, గాలికి తలలూపే చెట్టు ఎంత అందమైనవో మీ అమ్మాయి భావుక ప్రపంచం అంత అందమైనది. ఆ అబ్బాయి బంగారు బోనులాంటి వాడు. బోను బంగారంతో చేసినా బోనే కదా. పెళ్లి కేన్సిల్‌ చేస్తే రెండు రోజుల పాటు మీ బంధువులకు అది న్యూస్‌ అవుతుంది. పెళ్లి చేస్తే ప్రతి రోజూ న్యూస్‌ అవుతుంది’

మొత్తం పదిహేను రోజుల తర్వాత దొరికిందా అమ్మాయి. పూణెలో ఒక వర్కింగ్‌ విమెన్స్‌ హాస్టల్‌లో ఉంటే పోలీసులు ట్రేస్‌ చేశారు.పదిహేను రోజుల పాటు ఆ అమ్మాయి ఫోన్‌ వాడలేదు. ఎవరికీ ఫోన్లు చేయలేదు. కాని ఇన్‌స్టాగ్రామ్‌ను ఒకసారి ఉపయోగించడం వల్ల పోలీసులు దాని ఆధారంగా ఎక్కడుందనేది కనిపెట్టారు.పూణెలో ఆ అమ్మాయి చాలా మామూలు ధోరణిలోనే తోటి హాస్టల్‌ మేట్స్‌కు కనిపించింది. దగ్గరిలోని స్కూల్‌లో మ్యూజిక్‌ టీచర్‌గా క్లాసులు చెప్పడానికి వచ్చానని చెప్పింది. క్లాస్‌ ఉన్నప్పుడు స్కూల్‌కు వెళ్లేది. లేదంటే రూమ్‌లో పుస్తకాలు చదువుకుంటూ ఉండేది.ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి వచ్చిందని తెలిసి వారు ఆశ్చర్యపోయారు. ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోతుందని ఊహించని తల్లిదండ్రులు అంతకు మించిన షాక్‌లో ఉన్నారు.

హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్‌లో ఉన్న ఆ కాలనీ వారికి ఆ అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయి తిరిగి వచ్చిందని తెలియదు. తల్లిదండ్రులు చాలా జాగ్రత్త పడ్డారు. పోలీసుల ఫిర్యాదును కూడా బయటకు పొక్కకుండా చూసుకున్నారు. వయసొచ్చిన అమ్మాయి ఇంట్లో నుంచి పారిపోయిందని తెలిస్తే ఆ అమ్మాయి భవిష్యత్తుకు దెబ్బ.పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే కనుక ఇంకా దెబ్బ. ఎంగేజ్‌మెంట్‌ అయి ఉంటే ఇంక చెప్పే పనే లేదు. ఆ అమ్మాయికి ఎంగేజ్‌మెంట్‌ అయి నెల రోజులు. పెళ్లి మరో నెలలో. కాని ఈలోపు పారిపోయింది.

తల్లీ తండ్రీ మంచి ఉద్యోగులు. ఒక్కగానొక్క అమ్మాయి. బాగా చదివించుకున్నారు. ఎప్పుడూ డబ్బుల గురించి కొంటున్న స్థలాల గురించి ఇతరులు ఎదుగుతున్న వైనం గురించి చెబుతుండేవారు. ఉద్యోగం చేస్తే కొన్ని మంచి సంబంధాలు తప్పిపోతాయని చెప్పి ఉద్యోగం వద్దని సలహా ఇచ్చారు. జీవితం సంతోషంగా ఉండాలంటే పెద్ద ఉద్యోగం హోదా ఉండే అబ్బాయిని చేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు.
ఆ అమ్మాయి సరే అంది.

తల్లిదండ్రులకు మించిన శ్రేయోభిలాషులు ఎవరుంటారు?
మొదట ఒక ఐ.ఆర్‌.ఎస్‌ ఆఫీసర్‌ను చూశారు. కాని అతడు ఆ పోస్టు కొట్టడానికి చదివీ చదివీ ఇంకా ఆ చదువు నుంచి కోలుకోని వాడిలా కనిపించాడు. తల్లిదండ్రులే వద్దనుకున్నారు. ఆ తర్వాత ఒక డాక్టర్‌ని చూశారు. కాని అతడి పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌ ఫీజు తామే కట్టి చదివించాల్సి ఉంటుందని గ్రహించి వద్దనుకున్నారు. ఆ తర్వాత అమెరికా సంబంధం చూశారు. అబ్బాయి అక్కడకు వెళ్లి పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. చూడటానికి బాగున్నాడు. ఆస్తిపాస్తులు ఉన్నాయి. పైగా ట్రంప్‌ పెట్టే రూల్స్‌తో సంబంధం లేకుండా అన్ని విధాలా అక్కడ శేష జీవితం గడిపే అర్హతలతో ఉన్నాడు.
‘ఇది మంచి సంబంధం’ అని తల్లిదండ్రులు అన్నారు.

సరే అంది. నిశ్చితార్థం అయ్యింది. అబ్బాయి తిరిగి పెళ్లినాటికి వస్తానని వెళ్లాడు. రెండు మూడువారాలు గడిచాయి. ఒకరోజు ఆ అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి ‘నాకీ పెళ్లి ఇష్టం లేదు. కేన్సిల్‌ చేయండి’ అంది. ‘నోర్ముయ్‌’ అని తండ్రి అన్నాడు. ‘పిచ్చెక్కిందా’ అని తల్లి అంది. ‘మా పరువేంగాను’ అని ఇద్దరూ అన్నారు. ‘ఈ పెళ్లి జరక్కపోతే చస్తాం’ అని కూడా అన్నారు. అమ్మాయి పారిపోయింది. వెళ్లే ముందు చేసుకోను అంది. వెళ్లొచ్చాకా చేసుకోను అంది. అమ్మాయి పారిపోయాక, డీటాక్సినేషన్‌ కోసం ప్రకృతి వైద్యశాలలో చేరిందని అక్కడ ఫోన్లు అలౌ చేయరని అబ్బాయికి చెప్పి, ఏదో మేనేజ్‌ చేసిన తల్లిదండ్రులు ఈ విషయాన్ని ఎలా మేనేజ్‌ చేయాలా అని తలలు పట్టుకున్నారు.

‘నాకు ఏదైనా ఎన్‌.జి.వోలో చేరి వీధి బాలల కోసం పని చేయాలని కోరిక మేడమ్‌’ అందా అమ్మాయి లేడీ సైకియాట్రిస్ట్‌తో. సైకియాట్రిస్ట్‌ వింటూ ఉంది. ‘అందుకు తగినట్టుగా ఎం.ఏ. సోషల్‌వర్క్‌ చదువుదామనుకున్నాను ఇంటర్‌లో ఉండగానే. కాని సాఫ్ట్‌వేర్‌కు తగిన చదువు చదివించారు. పోనీ ఆ ఉద్యోగమూ చేయనివ్వలేదు. ఎప్పుడూ డబ్బు గురించి చెప్తారు కాని నాకు చిన్నప్పటి నుంచి కళలు, పుస్తకాలు, సంగీతం ఇష్టం. వాటి పట్ల నా ఇష్టం చూపిస్తే తిడతారని దాచుకుని దాచుకుని పుస్తకాలు చదివేదాన్ని. పాటలు వినేదాన్ని. ఊళ్లో మంచి సాహిత్య కార్యక్రమం ఉంటే వెళ్లేదాన్ని. డబ్బు మనిషికి సౌకర్యం ఇవ్వొచ్చు. కాని మనిషికి వికాసం ఇచ్చేది కళే. దాని టచ్‌ లేనివాళ్లు వేస్ట్‌ అని నా ఉద్దేశ్యం. ఈ అబ్బాయి మంచివాడే. అక్కడకు వెళ్లాక రోజూ ఫోన్‌ చేసేవాడు. ఒకరోజు ఏం చేస్తున్నావ్‌ అని అడిగితే చలం పుస్తకం చదువుతున్నా అన్నా. ఎవరతను అన్నాడు. గతుక్కుమన్నాను. మరో రోజు ఒక పాట పాడనా అని అడిగి ‘నెమలికి నేర్పిన నడకలివీ’ పాడాను. అంతా విని ‘ఏ సినిమాలోదీ పాట’ అన్నాడు. సత్యజిత్‌ రే తెలియదు. కె.బాలచందర్‌ తెలియదు. కరుణశ్రీ తెలియదు. సరిగ్గా పది ఘంటసాల పాటలు కూడా వినలేదు. అలా ఎలా పెరిగాడో మరి. నేను కొంత సర్దుకోగలను గానీ మరీ ఇంత సర్దుకోలేను’ అందా అమ్మాయి.

సైకియాట్రిస్ట్‌కు మొత్తం అర్థమైంది. తల్లిదండ్రులను పిలిచి మాట్లాడింది. ‘మీ అమ్మాయికి అందమైన జీవితం అంటే తెలుసు. అర్థవంతమైన జీవితం అన్నా తెలుసు. స్వేచ్ఛగా ఎగిరే పక్షి, గాలికి తలలూపే చెట్టు ఎంత అందమైనవో మీ అమ్మాయి భావుక ప్రపంచం అంత అందమైనది. ఆ అబ్బాయి బంగారు బోనులాంటి వాడు. బోను బంగారంతో చేసినా బోనే కదా. పెళ్లి కేన్సిల్‌ చేస్తే రెండు రోజుల పాటు మీ బంధువులకు అది న్యూస్‌ అవుతుంది. పెళ్లి చేస్తే ప్రతి రోజూ న్యూస్‌ అవుతుంది’ అంది. ఆ పెళ్లి జరగలేదు. ఇటీవల ఒక ట్రావెల్‌ ఫోటోగ్రాఫర్‌ ఆమెకు పరిచయమయ్యాడని తల్లిదండ్రులకు తెలిసింది.వాళ్లిద్దరూ కలిసి ట్రావెల్‌ చేద్దామనుకుంటే వద్దనలేదట కూడా. బహుశా వాళ్లిద్దరి పెళ్లిఫొటో కనుచూపు మేరలో ఉండొచ్చు.
– కథనం: సాక్షి ఫ్యామిలీ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top