ఫైన్‌... స్పైన్‌

yoga  special  good for health - Sakshi

యోగా

ఏ నెట్‌వర్క్‌కి అయినా బ్యాక్‌బోన్‌ చాలా ముఖ్యం. అలాగే మన శరీరంలో వెన్నెముక చాలా కీలకమైనది. మొత్తం 33 వెన్నుపూసలలో 24పూసలు కదిలేవి కాగా మిగిలిన 9 పూసలు క్రింది భాగంలో ఒకదానికి ఒకటి అతికించబడినట్టుగా ఉంటాయి. వీటి మధ్యలో ఉండే డిస్కులు వెన్నుపూసల మధ్య రాపిడి లేకుండా కాపాడుతుంటాయి. వీటిని ఒక దగ్గరగా ఉంచడానికి చుట్టూ లిగమెంట్లు, 3 రకాలైన మెంబ్రేన్లతో కప్పబడి ఉంటాయి. ఆధునిక జీవనశైలిలో ఎక్కువ సేపు కూర్చుని పనిచేయడం, వ్యాయామం లేకపోవడం, తద్వారా వెన్నెముక సమస్యలైన డిస్క్‌ ప్రొలాప్స్, స్లిప్డ్‌ డిస్క్, డిస్క్‌ హెర్నియేషన్‌... కలుగుతాయి.అంగ చాలనములలో చివరగా చేసే మేరు చాలనములు వెన్నెముక సమస్యలకు సంబంధించిన స్ట్రెచెస్‌. ఇవి రోజులో ఎప్పుడైనా ఎక్కడైనా చేయవచ్చు. పైకి చేసే స్ట్రెచెస్, పక్కలకు తిప్పే ట్విస్టులు ఆహారం తీసుకున్న కాసేపటి తర్వాత కూడా చేయవచ్చు. అయితే ఫార్వర్డ్, బ్యాక్‌వార్డ్‌ బెండింగ్స్‌ చేసేటప్పుడు మాత్రం పొట్ట కొంచెం ఖాళీగా, తేలికగా ఉంటే సౌకర్యవంతంగా ఉంటుంది. వెన్నెముక సమస్యల పరిష్కారంగా చేసే మేరు చాలనములలో కొన్ని...

1. ఊర్థ్వచాలన
సమస్థితిలో నిలబడి పాదాల మధ్య కావల్సినంత దూరం ఉంచాలి. చేతులు ఇంటర్‌లాక్‌ చేసి శ్వాస తీసుకుంటూ చేతులు రెండూ ముందుకు స్ట్రెచ్‌ చేయాలి. శ్వాస తీసుకుంటూ కాలి మడమలను కొంచెం కొంచెం పైకి లేపుతూ చేతుల్ని పూర్తిగా పైకి తీసుకెళ్లాలి. చేతులు రెండూ ఇంటర్‌లాక్‌ చేసిన స్థితిలోనే ఉంచి ఆకాశంవైపు చూపిస్తూ కాలి ముందు వేళ్ల మీద పైకిలేచి నిలబడే ప్రయత్నం చేయాలి. శ్వాస వదులుతూ నెమ్మది నెమ్మదిగా చేతులు అలానే తలపైన ఆనించి కాలి మడమలను నేల మీద ఉంచాలి. మళ్లీ శ్వాస తీసుకుంటూ చేతులు పైకి మడమలు పైకి శ్వాస వదులుతూ చేతులు తల మీదకు మడమలు కిందకు తీసుకురావాలి. దీనిని లేటరల్‌ ట్రాక్షన్‌ అనే స్పాండిలైటిస్‌ సమస్య ఉన్న ఉన్నవారికి ఫిజియోథెరపీలో భాగంగా తప్పక చేయిస్తారు.

2. కటి చాలన   (పక్కలకు) వేరియంట్‌
ఇందులో పైకి ఇంటర్‌లాక్‌ చేసి స్ట్రెచ్‌ చేసిన చేతులను అలానే ఉంచి కుడి పక్కకు పూర్తిగా వంగే ప్రయత్నం చేయాలి. తర్వాత శ్వాస వదులుతూ మధ్యలోకి, మళ్లీ శ్వాస తీసుకుని ఎడమ పక్కకు నడుమును వంచాలి. ఇక్కడ కాలి మడమలు పైకి లేపవలసిన అవసరం లేదు. పాదాలు స్థిరంగా ఉంచాలి. చేయడంలో ఎటువంటి ఇబ్బంది ఉన్నా కాళ్లను రిలాక్స్‌డ్‌గా ఉంచి చేసినట్లయితే చాలా తేలికగా చేయగలుగుతారు. ఎటువంటి ఆసనం అయినా టెన్షన్‌ పడుతూ చేస్తే శరీరం బిగుసుకు పోతుంది. దీంతో కండరాలలో బిగుతు పెరుగుతుంది. ఆక్సిజన్‌ సరఫరా జరగదు. ఆసనం వలన కలగాల్సిన ప్రయోజనం లభించక పోగా నష్టం కలుగుతుంది.

3. కటి చాలన (వేరియంట్‌ 2)
ఈ ఆసనంలో చేతులను సాగదీసి కాకుండా చేతులను మడిచి భుజం తలకు సపోర్ట్‌గా ఆనించాలి. ఫొటోలో చూపిన విధంగా కుడి పక్కకు నడుమును వంచి పక్కలకు పైకి కిందకు స్వింగ్‌ చేయాలి. కనీసం 5 నుంచి 10సార్లు, ఇదే విధంగా రెండవవైపు కూడా చేయాలి. స్వింగ్‌ చేసేటప్పుడు జర్క్‌లు జర్క్‌లుగా శ్వాస వదులుతూ చేస్తే చాలా రిలాక్స్‌డ్‌గా చేయవచ్చు.
– సమన్వయం: ఎస్‌. సత్యబాబు  మోడల్‌: రీనా  ఫొటోలు: ఠాకూర్‌
- ఎ.ఎల్‌.వి కుమార్‌ ట్రెడిషనల్‌ యోగా ఫౌండేషన్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top