మణికట్టుతో మణిహారాలు | Wrist maniharalu | Sakshi
Sakshi News home page

మణికట్టుతో మణిహారాలు

Mar 2 2014 10:20 PM | Updated on Sep 2 2017 4:16 AM

మణికట్టుతో మణిహారాలు

మణికట్టుతో మణిహారాలు

పెద్దయ్యాక ఏం చేస్తావ్ అని అడిగితే... పిల్లలు రకరకాల సమాధానాలు చెబుతారు. లండన్‌కు చెందిన అనెట్ గ్యాబ్‌డీ మాత్రం ‘ఏదో ఒకటి చేస్తాను’ అనేది.

పెద్దయ్యాక ఏం చేస్తావ్ అని అడిగితే... పిల్లలు రకరకాల సమాధానాలు చెబుతారు. లండన్‌కు చెందిన అనెట్ గ్యాబ్‌డీ మాత్రం ‘ఏదో ఒకటి చేస్తాను’ అనేది. ఎందుకంటే ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియదు. అసలు ఏమైనా చేయగలదో లేదో కూడా తెలియదు. అవును మరి... అనెట్‌కి పుట్టుకతోనే చేతివేళ్లు లేవు! ఆ తర్వాత ఆమె ఏం చేసిందో తెలుసుకుంటే ఆశ్చర్యంతో నోరు తెరవాల్సిందే!
 
‘నేను ఐఏఎస్ ఆఫీసర్‌ని కావాలనుకున్నాను, కానీ పరిస్థితులు సహకరించలేదు’ అనేవాళ్లని చూస్తుంటాం. ‘డాక్టర్‌ని అవుదామను కున్నాను, కానీ కాలం కలసి రాలేదు ఏం చేస్తాం’ అని వాపోయేవాళ్లనీ చూస్తుంటాం. నిజానికి కాలం, పరిస్థితులు, అదృష్ట దురదృష్టాల వంటివి ఎదుగుదలకు ఎప్పుడూ ఆటంకం కావు. కృషి, పట్టుదల, సాధించాలన్న కసి, సాధించగలనన్న ఆత్మవిశ్వాసం ఉన్నవాళ్లని ఏ అవరోధాలూ అడ్డుకోలేవు. దానికి అనెట్ గ్యాబ్‌డీ జీవితమే ఉదాహరణ!

1966లో, బ్రిటన్‌లో జన్మించింది అనెట్. వేళ్లు లేకుండా మొండి చేతులతో పుట్టిన ఆమెని చూసి వెక్కి వెక్కి ఏడ్చింది అనెట్ తల్లి. తనంతట తానుగా ఏదీ చేసుకోలేని కూతుర్ని ఎలా పెంచి పెద్ద చేయాలా అని ఆలోచించి కుమిలిపోయాడు తండ్రి. ప్రపంచం పోటీ పడి పరుగులు తీస్తోంది. ఏ కాస్త వెనుకబడినా జీవితం నిస్సారమైపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తన చిట్టితల్లి ఎలా ఎదుగుతుంది? ఏం సాధిస్తుంది? అసలు ఎలా బతుకుతుంది? ఈ ఆలోచనలు వారిని కుంగదీశాయి.
 
చిన్నతనంలో తన తల్లిదండ్రుల దిగులుకు అర్థం తెలిసేది కాదు అనెట్‌కి. కానీ ఎదిగేకొద్దీ ఆ దిగులు తన గురించేనని తెలుసుకుంది. ఈ రోజు ఇలా బాధపడుతోన్న తల్లిదండ్రులు... తనని చూసి గర్వేపడేలా ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకుంది. ఆత్మవిశ్వాసం ఉన్నవారిని అవకరం ఏం చేస్తుంది? ఏం చేయలేక తలవంచుకుని తప్పుకుంటుంది. అనెట్ విషయంలోనూ అదే జరిగింది.
 
చిన్నప్పట్నుంచీ నగల మీద ప్రత్యేకమైన ఆసక్తి ఉంది అనెట్‌కి. వాటిని ఎలా తయారుచేశారు, ఏ లోహంతో చేశారు, ఏ రాళ్లు పొదిగారు అంటూ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉండేది. అందుకే... జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి ఏం చేద్దామా అని ఆలోచించినప్పుడు... ఆమె మనసులో మొదట మెదిలింది నగల డిజైనింగే. అనుకున్నదే తడవుగా ఆ దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టింది.
 
తినడానికే పనికిరాని తన చేతులతో నగలను చెక్కడం అంత సులువుగా అయ్యే పనికాదని అనెట్‌కి తెలుసు. అయినా సరే... చేసి తీరాలనుకుంది. నగల తయారీ నేర్చుకోవడానికి ఓ ఇన్‌స్టిట్యూట్‌లో చేరింది. అప్పుడు కూడా చాలామంది ఆమెను నిరుత్సాహపరిచారు. ‘నగలు తయారు చేయడమనేది పూర్తిగా చేతులతోనే చేసే పని, నీకు కష్టమవుతుంది, వేరే ఏదైనా నేర్చుకో’ అనేవారు. వారికి సమాధానంగా ఓ చిరునవ్వు నవ్వేది అనెట్.

దేవుడు తనకి వేళ్లు ఇవ్వలేదు కానీ, దేనినైనా సాధించగలిగే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు. జీవన సంగ్రామంలో గెలవడానికి అంతకుమించిన ఆయుధమేదీ అవసరం లేదని అనెట్‌కి తెలుసు. అందుకే మౌనంగా తన పని తాను చేసుకుపోయింది. విజయవంతంగా కోర్సు పూర్తి చేసింది. తర్వాత ఆమె చేసిన మొదటి పని... నగల తయారీకి అవసరమైన పనిముట్లను తయారు చేసుకోవడం. ఏమేం పనిముట్లు కావాలో ఆర్డర్ ఇచ్చి, తన చేతులకు పట్టి ఉండే విధంగా వాటికి లెదర్ బెల్టులను అమర్చమంది. వాటితోనే తన లక్ష్యసాధన మొదలుపెట్టింది.
 
ఆలోచనలు బలమైనవైతే ఆచరణ సులువవుతుంది. సంకల్పం దృఢమైనదైతే అసాధ్యమనుకున్నది సుసాధ్యమై ముందుకు నడిపిస్తుంది. అనెట్ కృషి ఫలించింది. జ్యూయెలరీ డిజైనర్‌గా ఆమె ప్రస్థానం మొదలయ్యింది. బంగారం, ప్లాటినం, వజ్రాలు, రాళ్లతో అనెట్ రూపొందించిన ఆభరణాలు అందరినీ విపరీతంగా ఆకర్షించాయి. వారి ఇష్టమే పెట్టుబడిగా తను పుట్టి పెరిగిన లండన్‌లోని తన ఇంట్లోనే ‘గ్యాబ్‌డీస్’ పేరుతో స్టోర్‌ను తెరిచింది.
 
ఇప్పుడు అనెట్ వయసు 48. దాదాపు ఇరవ య్యేళ్లుగా ఆమె అందమైన డిజైన్లను రూపొందిస్తూనే ఉంది. బ్రిటన్‌లోని ప్రముఖ జ్యూయెలరీ డిజైనర్లలో ఒకరిగా ఖ్యాతి గడించింది. ‘వేళ్లు లేకుండా ఇవన్నీ ఎలా చేస్తున్నారు’ అని ఎవరైనా అడిగితే... ‘‘వేళ్లు ఉండి మీరెలా చేస్తున్నారో అలాగే’’ అంటుంది అనెట్ తడుముకోకుండా. తన తల్లిదండ్రులు, భర్త, పిల్లలు తనని ఎప్పుడూ వికలాంగురాలిగా చూడలేదని, అందుకే తానెప్పుడూ దాని గురించి ఆలోచించలేదనీ అంటుందామె. ‘ఏమీ చేయలేం అనుకుంటే చేయలేం, ఎప్పటికీ ఎదగలేం, చేసి తీరతాం అనుకుంటే చేస్తాం, ఎదిగి చూపిస్తాం’ అంటున్నప్పుడు అనెట్ కళ్లలో కొండంత ఆత్మవిశ్వాసం ప్రతిఫలిస్తుంది!
 
 ‘నగలు తయారు చేయడమనేది పూర్తిగా చేతులతోనే చేసే పని, నీకు కష్టమవుతుంది, వేరే ఏదైనా నేర్చుకో’ అనేవారంతా. వారికి సమాధానంగా ఓ చిరునవ్వు నవ్వేది అనెట్. దేవుడు తనకి వేళ్లు ఇవ్వలేదు కానీ, దేనినైనా సాధించగలిగే ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాడు. జీవన సంగ్రామంలో గెలవడానికి అంతకుమించిన ఆయుధమేదీ అవసరం లేదని అనెట్‌కి తెలుసు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement