స్త్రీలోక సంచారం

Womens empowerment:Tanushree Dutta Returns to India After Two Years to Curious Fans - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

మెరుగైన జీవితం కోసం ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ దేశంలో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లే యువతులు, మహిళల సంఖ్య గత మూడు దశాబ్దాలలో పురుషుల కంటే కూడా ఎక్కువగా ఉండటంతో పాటు, వారిలో ఒంటరి జీవితం గడుపుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోందని న్యూఢిల్లీలోని ‘రిసెర్చ్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ ఫర్‌ డెవలపింగ్‌ కంట్రీస్‌’లో పనిచేస్తున్న ప్రొఫెసర్‌ అమితాబ్‌ ఖండు రూపొందించిన తాజా నివేదిక వెల్లడించింది. వివాహం అయ్యి, భర్త పని చేస్తున్న చోటికి వెళ్లడం అనేది స్త్రీ జీవితంలో ఎప్పుడూ ఉండేదే అయినప్పటికీ.. సంపాదన కోసం స్వతంత్రంగా.. ఉన్న చోటు నుంచి కదలి వెళ్లడానికి మహిళలు చొరవ చూపడం సామాజికంగా ఎంతో ప్రయోజనకరమైన పరిణామం అని నివేదిక వ్యాఖ్యానించింది ::: త్రిపుల్‌ తలాక్‌ ఆచారానికి వ్యతిరేకంగా ఉద్యమించిన ముస్లిం వితంతువు నిదాఖాన్‌ను ఇస్లాం మతం నుంచి బహిష్కరిస్తూ ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఒక ముస్లిం మతాధికారి జారీ చేసిన ఫత్వాను దేశంలోనే అత్యున్నతస్థాయి ముస్లిం సంస్థ అయిన ‘ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌’ తిరస్కరించింది! ‘మతం నుంచి ఒక వ్యక్తిని బహిష్కరించడం ఇస్లాం విలువలకు విరుద్ధమైన చర్య మాత్రమే కాదు, అమానుషం కూడా’ అని బోర్డులోని సీనియర్‌ సభ్యులు మౌనాలా ఖలీద్‌ రషీద్‌ ఫరంగీ మహాలీ ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు ::: అమెరికాలోని ఆఫ్రికావర్ణ మహిళలు, హిస్పానిక్‌ (లాటిన్‌ అమెరికాలో దేశాల్లో స్పానిష్‌ భాష మాట్లాడే సంతతి) స్త్రీలు సాధించిన నూతన ఆవిష్కరణలకు పేటెంట్లు ఇవ్వడంలో ‘యు.ఎస్‌. పేటెంట్‌ అండ్‌ ట్రేడ్‌మార్క్‌ ఆఫీస్‌’ తీవ్రమైన వివ„ý  పాటిస్తోందని వాషింగ్టన్‌లోని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఉమెన్స్‌ పాలసీ రిసెర్చ్‌’ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది. 

తెలివుండీ, ప్రపంచానికి ఉపయోగపడే గొప్ప విషయాలను కనిపెట్టి, అనేక సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను సూచించినప్పటికీ  తెల్లవారితో సమానంగా ఈ నల్లజాతి, హిస్పానిక్‌ మహిళలు మేధోహక్కులను పొందలేకపోతున్నారని నివేదికను సమర్పించినవారిలో ఒకరైన జెస్సికా మిల్లీ.. పేటెంట్‌ ఆఫీస్‌ ధోరణిని ఎండగట్టారు ::: అమెరికా నుంచి రెండేళ్ల తర్వాత ఇండియా చేరుకున్న మాజీ అందాలరాణి, బాలీవుడ్‌ నటి తనుశ్రీ దత్తా ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగడానికి కొన్ని నిముషాల ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఫొటోలో రూపురేఖలు మారిపోయి పూర్తిగా కొత్త మనిషిలా కనిపించడం విశేషం అయింది! తొలి చిత్రం ‘ఆషిక్‌ బనాయా అప్‌నే’లో ఎమ్రాన్‌ హష్మీతో నటించి, బాలీవుడ్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తనుశ్రీ విమానాశ్రయంలో సైతం ఏ కొద్దిమంది ఫొటోగ్రాఫర్‌లు మాత్రమే గుర్తుపట్టేలా మారిపోవడం చర్చనీయాంశం అయింది::: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన జీవితకాలంలో ఏనాడూ గర్భిణిగా లేరని తమిళనాడు అడ్వొకేట్‌ జనరల్‌ విజయ్‌ నారాయణ్‌ మద్రాసు హైకోర్టు దృష్టికి తెచ్చారు. అమృత అనే బెంగళూరు యువతి తను జయలలిత కూతురునని కోర్టులో వేసిన పిటిషన్‌పై విజయ్‌ తన వాదనలు వినిపిస్తూ, 1980లో అమృత తను పుట్టానని చెప్పుకుంటున్న తేదీకి కొద్ది రోజుల ముందు జయ పాల్గొన్న ఒక ఫిల్మ్‌ అవార్డు ఫంక్షన్‌ వీడియోను చూపించి, అందులో ఆమె గర్భిణిగా లేకపోవడాన్ని గమనించాలని న్యాయమూర్తిని కోరారు ::: ఎబోలా వైరస్‌ మహిళల్లో కూడా ఒక ఏడాది పాటైనా నిక్షిప్తం అయి ఉండి, ఇతరులకు వ్యాపించే గుణం కలిగి ఉంటుందని తొలిసారిగా శాస్త్ర పరిశోధకులు కనుగొన్నారు. ఎబోలా పురుషులలో మాత్రమే దాగి ఉండి, వ్యాపిస్తుందని ఇంతవరకు భావిస్తూ వస్తున్న పరిశోధకులు.. ఎబోలా తీవ్రత పూర్తిగా తగ్గిపోయిందని లోకం స్థిమిత పడుతున్న తరుణంలో లైబీరియాలోని ఒక మహిళలోఏడాది తర్వాత ఎబోలా వైరస్‌ బయటపడటాన్ని గమనించి, ఆ వివరాలను ‘లాన్సెట్‌ ఇన్ఫెక్షియస్‌ డిసీజెస్‌’ పత్రికకు ప్రచురణ కోసం అందించారు :::

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top