స్త్రీలోక సంచారం

Womens empowerment:Punishment for those who commit sexual assaults on boys - Sakshi

ఎక్కడ మిస్‌ అయినా.. ఇక్కడ మిస్‌ అవరు!

చిన్నప్పట్నుంచీ తను రోజువారీగా «ధరిస్తూ వస్తున్న షూజ్, సాక్స్, ఇంకా యాక్సెసరీస్‌ను పెద్ద మొత్తంలో జాగ్రత్త పరిచిన అస్ఫియా ఖాద్రీ అనే హైదరాబాద్‌ యువతి మూడు ప్రపంచ రికార్డులు సాధించింది. మినార్‌ గార్డెన్స్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన ఈ వస్తు సేకరణ ప్రదర్శనకు గోల్డెన్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్, ఆసియా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్, ఇండియా బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రతినిధులు హాజరై, సంతృప్తి చెందిన అనంతరం అస్ఫియాకు 18 పతకాలు 21 ప్రశంసా పత్రాలు (సైటేషన్స్‌) అందజేసి.. ఇటీవలే ఎం.బి.బి.ఎస్‌. పూర్తి చేసి, ఆర్థోపెడిక్స్‌లో మాస్టర్స్‌ డిగ్రీ చేయబోతున్న అస్ఫియాకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు ::: గత ఏడాది జైపూర్‌లోని బార్మర్‌కు సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఒక అట్టపెట్టెలో గుర్తు తెలియని వ్యక్తులు ఉంచి వెళ్లిన అప్పుడే పుట్టిన ఆడశిశువును లైన్‌మ్యాన్‌ గమనించి జో«ద్‌పూర్‌లోని ‘నవజీవన్‌ సంస్థాన్‌’ ఆశ్రమానికి చేర్చిన తర్వాత ఇప్పుడీ ఎనిమిది నెలల పాపను స్వీడన్‌ నుంచి వచ్చిన ఎలిన్‌ క్రిస్టిన్‌ ఎరిక్‌సన్‌ అనే నర్సు దత్తత తీసుకున్నారు. కజ్రీ అని పేరు పెట్టి నవ జీవన్‌ సంస్థాన్‌ అల్లారు ముద్దుగా పెంచుతున్న ఈ పాపను దత్తత తీసుకోడానికి అవసరమైన నియమావళిని ఎలిన్‌ పూర్తి చేయవలసి ఉంది :::  బాలురపై లైంగిక దాడులకు పాల్పడేవారికి విధించే శిక్షలను మరింత కఠినతరం చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ.. మంత్రి మండలికి పంపించబోతోంది. ఇందుకు అనుగుణంగా ‘పోక్సో’ (ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్సువల్‌ అఫెన్సెస్‌) చట్టంలో సవరణలు చేయాలన్న స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ సూచనను న్యాయ శాఖ ఇప్పటికే ఆమోదించింది.

గత మేలో పెళ్లయ్యాక ఇంగ్లండ్‌ నూతన రాచవధువు మేఘన్‌ మార్కెల్‌ తొలిసారి ఒంటరి ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే అంతఃపుర ఆంక్షలను, నిబంధనలను పక్కన పెట్టి క్వీన్‌ కుటుంబాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళుతున్నారని ఏక కాలంలో ప్రశంసలు, విమర్శలు మూటగట్టుకుంటున్న మార్కెల్‌.. న్యూయర్క్, లాస్‌ ఏంజిలెస్‌లలోని తన స్నేహితులను, బంధువులను, తల్లిదండ్రులను కలుసుకునేందుకు భర్త ప్రిన్స్‌ హ్యారీ పక్కన లేకుండానే.. వచ్చే నెలలో అనధికారిక ఏకాంత పర్యటనకు బయల్దేరుతున్నారు ::: మెల్‌బోర్న్‌లో మొదలౌతున్న ఐ.టి.టి.ఎఫ్‌. (ఇంటర్నేషనల్‌ టేబుల్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌) వరల్డ్‌ టూర్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో పాల్గొనేందుకు ఆదివారంనాడు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న ఇండియన్‌ టెన్నిస్‌ స్టార్‌ మోనికా బాత్రా, మౌమాదాస్, మరో ఐదుగురు టెన్నిస్‌ ప్లేయర్‌లను ప్రయాణానికి అనుమతించేందుకు మెల్‌బోర్న్‌ వెళ్లే ఎయిర్‌ ఇండియా విమానం నిరాకరించింది. అప్పటికే సీట్లన్నీ బుక్‌ అయి ఉండటం మాత్రమే కాక, వారి పి.ఎన్‌.ఆర్‌. (ప్యాసింజర్‌ నేమ్‌ రికార్డ్‌) నంబర్లు సరిపోలలేదని ఎయిర్‌ ఎండియా చెప్పడంతో పొరపాటు ఎక్కడ జరిగిందో తెలియక బాత్రా, మిగతా ప్లేయర్‌లు మరో విమానంలో మెల్‌బోర్న్‌ బయల్దేరి వెళ్లారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top