నా తల సింక్‌లో ఉంచి వేణ్ణీళ్ల ట్యాప్‌ తిప్పాడు

women empowerment :  Counseling - Sakshi

కౌన్సెలింగ్‌

ప్ర. మా పెళ్లయి యేడాది అవుతోంది. అరేంజ్‌డ్‌ మ్యారేజ్‌.  ఆయనకు అమెరికాలో ఉద్యోగం. పెళ్లయిన నెలకు డిపెండెంట్‌ వీసా మీద అమెరికా వెళ్లాను. ఓ పదిహేను రోజులు బాగానే ఉన్నాడు. తర్వాత నుంచి అసలు రూపం చూపించడం మొదలుపెట్టాడు. 
వంట చేస్తుంటే ఉడుకుతున్న కూరలో మగ్గుడు నీళ్లు కుమ్మరించేవాడు. నేను స్నానాకి వెళితే బయట నుంచి బాత్రూమ్‌ డోర్‌ లాక్‌ చేసేవాడు. బాగా రెడీ అయినా తప్పే.. రెడీ కాకపోయినా తప్పే. అతని ఫ్రెండ్స్‌ ఇంటికి వస్తే పలకరిస్తే లైటింగ్‌ కొడుతున్నావా అనేవాడు. ఓసారి.. మీ అమ్మానాన్న.. అంటూ మా పేరెంట్స్‌ని తిడుతుంటే సహించలేక ఎదురు తిరిగాను.  అంతే నా జుట్టుపట్టి లాగి తోసేశాడు. సోఫాకి నా తల కొట్టుకొని రక్తం వచ్చింది. అయినా ఆగకుండా... నా జుట్టు పట్టుకొని  బాత్రూమ్‌లోకి ఈడ్చుకెళ్లి సింక్‌లో నా మెడను వంచి వేడి నీళ్ల ట్యాప్‌ తిప్పాడు. తట్టుకోలేక తప్పించుకునే ప్రయత్నంలో ఆయన్ని తోసేశాను. కిందపడ్డాడు. ఆవేశంతో లేచి అక్కడే ఉన్న సిజర్స్‌తో నా పెద్ద జడను కత్తిరించేశాడు. వాళ్ల వాళ్లకు ఫోన్‌ చేసి ‘‘నా పెళ్లాం నన్ను కొడుతోంది’’ అంటూ ఏడ్చాడు.  ‘‘మీ అమ్మాయి రాక్షసి. కాపురం చేయడం నావల్ల కాదు, పంపించేస్తున్నాను’’ అని అప్పటికప్పుడు టికెట్‌ బుక్‌ చేసి ఇండియాకు పంపించేశాడు.

నేను ఆయన దగ్గరున్నది కేవలం ఆరు నెలలే. ఆయన పెట్టే హింస గురించి మా వాళ్లకు చెబితే హర్ట్‌ అవుతారని చెప్పకుండా దాచాను. కాని ఇక్కడికి వచ్చాక జరిగినదంతా చెప్పాను. మా పెద్దవాళ్లు నన్ను తీసుకొని హైదరాబాద్‌లోనే ఉన్న మా అత్తారింటికి వెళ్లారు. వాళ్లూ నాదే తప్పన్నట్టుగా చెప్పి మా పెద్దవాళ్లను ఇన్‌సల్ట్‌ చేశారు. మా వారికి ఫోన్‌ చేస్తే బూతులు తిట్టాడు మా వాళ్లను. తను ఇంకో పెళ్లి చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. ఆయనను ఇండియాకు రప్పించి, శిక్షించే మార్గం లేదా? నేనేం చేయాలి?
– ఆరతి, హైదరాబాద్‌. 

జ. ఇదంతా డొమెస్టిక్‌ వయొలెన్స్‌ కిందకే వస్తుంది. ముందు మీరు మీ భర్త మీద కేస్‌ పెట్టండి. తర్వాత లుక్‌ అవుట్‌ కేస్‌ కింద కంప్లయింట్‌ ఇవ్వండి. అలాగే 498 ఏ, వయొలెన్స్, హెరాస్‌మెంట్‌ కిందా కంప్లయింట్‌ ఫైల్‌ చేయండి. మీ హజ్బెండ్‌ అమెరికాలో ఉన్నాడు కాబట్టి మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ అఫైర్స్‌లోని ఎన్‌ఆర్‌ఐ సెల్‌కి, ఇండియన్‌ ఎంబసీకి దరఖాస్తు చేయండి. అంతేకాదు మీ భర్త అమెరికాలో ఏ స్టేట్‌లో ఉంటున్నాడో ఆ స్టేట్‌ లా గురించి తెలుసుకొని హెరాస్‌మెంట్‌కు పాల్పడ్డాడని అక్కడి అటార్నీతో మీ భర్తకు లీగల్‌ నోటీస్‌ ఇప్పించండి.  అన్నిటికన్నా ఎక్కువ వర్కవుట్‌ అయ్యేది లుక్‌ అవుట్‌ నోటీసే. మీ భర్త  ఎప్పుడు ఇండియాకు వచ్చినా ఈ లుక్‌ అవుట్‌ నోటీస్‌ కింద అతనిని వెంటనే అరెస్ట్‌ చేస్తారు. ఇదేకాక.. మీరు సెక్షన్‌ 125 కింద మెయిన్‌టెనెన్స్‌ కోసం కోర్ట్‌లో కేస్‌ వేసుకోవచ్చు కూడా. ఇందుకోసం చాలా తిరగాల్సి ఉంటుంది. అతనికి శిక్ష పడాలి అనుకుంటే మీకు ఈ ఓపిక అవసరం!
– మమతా రఘువీర్, అడ్వకేట్, ఫౌండర్, తరుణి 

మాకు పంపండి: ఒక మహిళగా మీరు గృహహింస వంటి వేధింపులకు గానీ, సామాజికంగా వివక్షకుగానీ, సంబంధిత ఇతర సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యను రాసి మాకు మెయిల్‌ ద్వారా పంపించండి. ఆయా రంగాలకు చెందిన నిపుణులతో మీకు తగిన సూచనలు / సలహాలు ఇప్పించే ఏర్పాటు చేస్తాం. 
మీరు మీ ప్రశ్నలను పంపాల్సిన మెయిల్‌ ఐడీ : nenusakthiquestions@gmail.com

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top