మగువలూ... హింసోన్మాదులు

మగువలూ... హింసోన్మాదులు - Sakshi


మెన్‌టోన్

 


హింసా ప్రవృత్తికి కుల మత ప్రాంతీయ భేదాలేవీ లేవు. ఇది నిర్వివాదాంశం. ఇందులో గమనించాల్సిన మరో కోణం ఏమిటంటే, హింసా ప్రవృత్తికి లింగ భేదం కూడా లేదు. మగాళ్లలోనే కాదు, మగువల్లోనూ హింసోన్మాదులు ఉంటారు. ఇదేమీ కొత్త విషయం కాదు. చరిత్ర పుటలను తిరగేస్తే, రాకాసులకు సైతం భయంతో ఒళ్లు జలదరించే స్థాయిలో హింసాత్మక చర్యలకు పాల్పడ్డ మహిళల ఆనవాళ్లు దొరుకుతాయి. అలాంటి వీరనారీమణులలో దేశాలను ఏలి నియంతృత్వం చలాయించిన వాళ్లే కాదు, బందిపోటు ముఠాలకు నాయకత్వం వహించి జనాలను గడగడలాడించిన వాళ్లు, సీరియల్ కిల్లర్స్ కూడా ఉన్నారు.వివక్షాభరితమైన సమాజంలో నియంతలన్నా, నేరగాళ్లన్నా ముందుగా గుర్తొచ్చేది మగాళ్లే! ఎక్కడ నేరం జరిగినా ముందుగా అనుమానించేదీ మగాళ్లనే! మన పవిత్ర కర్మభూమిలో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. ఇదీ మగాళ్ల కర్మ. సంసారసాగరంలో పడి కొట్టుకుంటున్న మగాళ్ల పరిస్థితి మరీ దారుణం. ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపాలనే గాంధీగారి సిద్ధాంతాన్ని పాటించేవాళ్లయితే ఫర్వాలేదు. ఎలాగోలా బతికేయవచ్చు. హింసకు ప్రతిహింసే సమాధానం అనే విప్లవ సిద్ధాంతాన్ని అమలు చేశారో... అంతే సంగతులు! ఏ తప్పుడు కేసులోనో ఇరుక్కుని ఊచలు లెక్కపెట్టే పరిస్థితి తప్పదు. మగాళ్లే ఎక్కువగా భౌతిక హింసకు పాల్పడతారనేది కేవలం వివక్షాపూరితమైన మీడియా దుష్ర్పచారం మాత్రమే. భౌతిక హింసాకాండలో మహిళామణులేమీ తక్కువ తినలేదు. కాకపోతే మగాళ్ల మీద నమోదైనన్ని ఫిర్యాదులు వాళ్లకు వ్యతిరేకంగా నమోదు కావంతే!రికార్డులకెక్కిన వాస్తవాలను కాస్త పరిశీలిద్దాం. గృహహింసకు సంబంధించిన భౌతిక హింసా బాధితుల్లో మగాళ్లు పాతిక శాతానికి పైనే ఉంటున్నారు. లైంగిక వేధింపుల కేసుల్లో మగ బాధితులు 18 శాతం వరకు ఉంటున్నారు. ఇక మానసిక హింసా బాధితుల్లోనూ 18 శాతం మంది పురుషపుంగవులే ఉంటున్నారు. ఇవన్నీ ‘సేవ్ ఫ్యామిలీ ఫౌండేషన్’ జాతీయ స్థాయిలో సేకరించిన లెక్కలు. రికార్డులకెక్కని బాధితుల సంఖ్య ఇంతకు రెట్టింపే ఉంటుందని ఒక అనధికారిక అంచనా. ఇలాంటి బాధలను బయటకు చెప్పుకుంటే పరువు పోతుందనే భయంతో చాలామంది మగాళ్లు ఫిర్యాదులు చేయడానికి వెనుకాడుతారని, కేవలం ఆంతరంగికుల వద్దే గోడు వెళ్ల బోసుకుంటారని, అలాంటి వాళ్ల సంఖ్యను లెక్క కట్టడం అంత తేలిక కాదని కూడా ‘సేవ్ ఫ్యామిలీ ఫౌండేషన్’ ఉవాచ.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top