పలుకే బంగారమాయెగా

Unnikrishnan And His Daughter Song Viral on Social Media - Sakshi

ఉన్నికృష్ణన్‌– అందరికీ పరిచితమైన పేరు.. ఉత్తర కృష్ణన్‌– ఈ పేరూ అందరికీ పరిచితమే.. ఇద్దరూ సంగీతంలో అభినివేశం ఉన్నవారే. ఇద్దరూ చలన చిత్రాలలో పాటలు పాడినవారే.శ్రీరామనవమి సందర్భంగా ఈ తండ్రికూతుళ్లు ‘పలుకే బంగారమాయెనా’ అనే రామదాసు కీర్తనను పాడి యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశారు. వారం కూడా పూర్తి కాకుండానే ఈ వీడియోను 20 లక్షలకు పైగా విని పరవశించారు. ఈ సందర్భంగా సాక్షి ఫోన్‌ ద్వారా సంభాషించింది. 

వివరాలు...
మా అమ్మాయి పాడిన భక్తి గీతాలు, సినీ గీతాలు, పాశ్చాత్య సంగీతం వీడియోలకి మంచి ఆదరణ వచ్చింది. ఇప్పుడు శ్రీరామ నవమి సందర్భంగా రామదాసు కీర్తన పెట్టాలనుకున్నాం. ఎస్‌. జయకుమార్‌ అందుకు సహకరించారు. రామదాసు కీర్తనకు ప్రస్తుత పాశ్చాత్య ఆర్కెస్ట్రాను సమకూర్చారు. అంతకుముందే నేను మా అమ్మాయితో కలిసి వీడియో చేద్దామనుకున్నాను. ఇలా తండ్రికూతుళ్లు పాడటం చాలా అరుదు. 

మా అమ్మాయి ఉత్తరకి ఐదో ఏట నుంచే సుధారాజన్‌ దగ్గర సంగీతం నేర్పించాను.   అమ్మాయి కర్ణాటక సంగీతం, సినిమా పాటలు, పాశ్చాత్య సంగీతం అన్నీ పాడుతోంది.  అన్నిటికీ తోడు అమ్మాయి చదువుతున్న స్కూల్‌లో సంగీతానికి సంబంధించిన విశ్లేషణ, స్వరకల్పన, సంగతులు వేయటం నేర్పిస్తారు. అలా అన్నిచోట్లా సంగీతంతో ప్రయాణం చేస్తోంది. చదువును నిర్లక్ష్యం చేయకుండా సంగీతాన్ని నేర్చుకుంటోంది.

నేను అమ్మాయి కలిసి పాడాలంటే మా ఇద్దరు శృతులు వేరు వేరు. అందువల్ల నేను పాడటానికి వెనకాడాను. అయినా ప్రయత్నిద్దామనుకున్నాను. మాకు ఆడియో పంపేశారు. నేను ఉత్తర బాగా సాధన చేశాం. నాకు తెలుగు రాదు కనుక దోషాలు లేకుండా పాడటం కోసం డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు పాడిన ‘పలుకే బంగారమాయెనా’ కీర్తనను చాలాసార్లు విన్నాను. ఉచ్చారణ దోషాలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నాను. అమ్మాయి కూడా తప్పులు పాడకుండా శిక్షణ ఇచ్చాను. అలాగే ఆయన బాణీలోనే పాడాం. ఇద్దరం సాధన చేసి, మా కెమెరాలో వీడియో తీశాం. అందులో వచ్చిన దోషాలను మళ్లీ సరిచేసుకున్నాం. అలా ఆ వీడియో తప్పులు లేకుండా రావటం కోసం ఇన్ని శ్రద్ధలు తీసుకున్నాం. మా అమ్మాయితో కలిసి మరిన్ని పాటలు పాడి, వీడియోలు చేయాలని కోరికగా ఉంది. రామదాసుదే ‘సీతా కల్యాణ వైభోగమే’ కీర్తన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ శ్రీరామనవమి మాకు నిజంగా పండుగే. రామనామం పానకం వంటిది. ఆ నామాన్ని జపించడం మాకు సంతోషంగా ఉంది.– సంభాషణ: జయంతి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top