తుంగ-భద్ర | Tunga - Bhadra | Sakshi
Sakshi News home page

తుంగ-భద్ర

Jun 23 2014 10:26 PM | Updated on Sep 2 2017 9:16 AM

తుంగ-భద్ర

తుంగ-భద్ర

తుంగభద్ర ఒక్క నది కాదు.తుంగ, భద్ర విడివిడిగా కొంత దూరం ప్రవహించి ఒక్కటై పోయాయి. తుంగడు యాదవ బాలుడు. గోవులను, గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు.

గ్రంథం చెక్క
 
 తుంగభద్ర ఒక్క నది కాదు.
 తుంగ, భద్ర విడివిడిగా కొంత దూరం ప్రవహించి ఒక్కటై పోయాయి.
 తుంగడు యాదవ బాలుడు. గోవులను, గొర్రెలను కాచుకుంటూ ఉండేవాడు. వయసు ఇరవై వుండవచ్చు. యౌవనం అతనిలో తొణికిసలాడింది.
 తుంగడు మురళి వాయించేవాడు.
 గోవులూ, గొర్రెలు, చెట్లు, చేమలు తలలూపుతూ తన్మయత్వంతో వినేవి.
 ఆ ప్రాంతాన్ని ఒక కన్నడ రాజు పాలిస్తున్నాడు. అతని కూతురు పేరు భద్ర. అందాల రాశి.
 తుంగడు మోగించే మురళి విన్నది భద్ర. గోపాలకృష్ణుడి వద్దకు రాధ వెళ్లినట్లు భద్ర తుంగడి వద్దకు వెళ్లిపోయింది.
 ఇది కొన్నాళ్లు సాగింది. రాజుకు తెలిసింది.
 ఇద్దరినీ అడవిలో కదంబవృక్షం కింద పట్టుకున్నారు.
 ‘‘మమ్మల్ని యెవ్వరూ విడదీయలేరు’’ అంది భద్ర.
 తుంగణ్ణి చితక్కొట్టించాడు రాజు.
 అతని రక్తాన్ని తిలకంగా ధరించింది భద్ర.
 ఇద్దర్నీ విడదీశారు రాజభటులు.
 భద్ర కరిగి నీరై, నదియై ప్రవహించింది.
 తుంగడు కరిగి నీరై, నదియై ప్రవహించాడు.
 అలా విడివిడిగా ప్రవహిస్తూ వెళ్ళిపోయారు. రాజు గుండె పగలి చచ్చాడు. రాణి గుండె పగిలి చచ్చింది.
 మైళ్లు,  బీళ్ళు, రాళ్ళు, బోళ్ళు, గుళ్ళు దాటి వెళ్లి ఒకచోట తుంగ+భద్ర కలుసుకొని తుంగభద్ర అయింది. వారు ప్రేయసీప్రియులు, భార్యాభర్తలు.
 కనుక ఇక సముద్ర సంగమం సాధ్యపడే విషయం కాదు. అందుకే తల్లిలాంటి కృష్ణవేణమ్మ వొడిలో చేరిపోయారు.
 -దాశరథి కృష్ణమాచార్య
 ‘యాత్రాస్మృతి’ నుంచి.
 

Advertisement
 
Advertisement
Advertisement