రోజూ ఆందోళన... నిద్ర పట్టడం లేదు

Stress And Lack Of Physical Activity Can Make Diabetes More Rapid - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

జనరల్‌ హెల్త్‌ కౌన్సెలింగ్‌

నా వయసు 32 ఏళ్లు. వృత్తిరీత్యా ఎప్పుడూ తీవ్రమైన ఒత్తిడిలో ఉంటాను. టార్గెట్లను సాధిస్తూ ఉండాలి. దాంతో నిత్యం తీవ్రమైన ఆందోళనతో ఉంటుంటాను. చాలా త్వరగా ఉద్వేగాలకు గురవుతుంటాను. ఎప్పుడూ ఏదో ఆలోచనలు. రాత్రి సరిగా నిద్ర సరిగా పట్టదు. నా సమస్యలకు తగిన చికిత్సను సూచించండి.
– డి. జయదేవ్, హైదరాబాద్‌

మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు యాంగై్జటీ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లుగా అనిపిస్తోంది. మీరు చెప్పిన లక్షణాలైన తీవ్రమైన ఆందోళనలు, ఎడతెరిపి లేని ఆలోచనలు దీన్నే సూచిస్తున్నాయి. సాధారణంగా తీవ్రమైన ఒత్తిళ్లలో పనిచేసేవారిలో ఇది చాలా ఎక్కువ. మీరు ముందుగా ఒకసారి రక్తపరీక్షలు చేయించుకొని, రక్తంలో చక్కెరపాళ్లను పరీక్షించుకోండి. ఎందుకంటే మీ తరహా పనితీరు (సెడెంటరీ లైఫ్‌స్టైల్‌) ఉన్నవారిలో ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెరల విడుదల ఎక్కువగా ఉంటుంది. దాంతో డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఇలా మీకు తెలియకుండానే డయాబెటిస్‌ ఉంటే అది నరాలపై ప్రభావం చూపి, పెరిఫెరల్‌ నర్వ్స్, అటనామస్‌ నర్వ్స్‌ (స్వతంత్రనాడీ వ్యవస్థ)పై ప్రభావం చూపి ఇలా గాభరా, హైరానాపడేలా చేయడం  చాలా సాధారణం. మీకు చికిత్స కంటే కూడా జీవనశైలిలో మార్పులు అవసరం.

సమస్యతో అవగాహనతో, పాజిటివ్‌ దృక్పథంతో ముందుకు వెళ్లాలి. మీరు ఉదయమే నిద్రలేచి బ్రిస్క్‌ వాకింగ్‌ వంటి వ్యాయామాలు, యోగా, మెడిషటేషన్‌ చేయడం, వేళకు భోజనం  తీసుకోవడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకునేందుకు ఆహ్లాదకరమైన వ్యాపకాలను అలవరచుకోవడం వంటి జీవనశైలి మార్పులతో మీ సమస్య చాలావరకు తగ్గుతుంది. పైన పేర్కొన్న పరీక్షలు చేయించాక ఫిజీషియన్‌ను కలవండి. ఒకవేళ మీకు తెలియకుండా షుగర్‌ వచ్చి ఉంటే డాక్టర్‌... ఆ సమస్యకు కూడా కలిపి చికిత్స సూచిస్తారు. ఒకవేళ మీకు షుగర్‌ లేకపోతే... మీరు చెప్పిన జీవనశైలి వల్ల త్వరగా డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఉన్నందున... ఆ సమస్యను నివారించచడం కోసం జీవనశైలి మార్పులను తప్పక అనుసరిస్తూ, యాంగ్జటీని తగ్గించే మందులైన యాంగ్జియోలైటిక్స్‌ను డాక్టర్‌ పర్యవేక్షణలోనే వాడాలి.

ఎప్పుడూ ఆకలి, అతిగా మూత్ర విసర్జన... ఎందుకిలా?
నా వయసు 39 ఏళ్లు. ఈమధ్య తరచూ ఎక్కువసార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తోంది. అతిగా దాహం వేస్తోంది. ఆకలి బాగా వేస్తుంది. బాగానే తింటున్నాను. అయినా చాలా నీరసంగా అనిపిస్తోంది. తరచూ ప్రైవేట్‌ పార్ట్స్‌ వద్ద ఇన్ఫెక్షన్స్‌ వస్తున్నాయి. నేను చేస్తున్న పనిలో తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. ఈ లక్షణాలు చెబుతుంటే... నాకు షుగర్‌ వచ్చిందేమోనని నా ఫ్రెండ్స్‌ అంటున్నారు. నాకు ఎందుకిలా జరుగుతోంది? తగిన సలహా ఇవ్వండి.
– ఎల్‌. శ్రీకాంత్, కాకినాడ

ఉద్యోగరీత్యా మీరు ఒత్తిడికి గురవుతున్నట్లు చెప్పారు. ఇలా ఎక్కువ ఒత్తిడికి గురికావడం, శారీరక శ్రమ లేకపోవడం వంటివి డయాబెటిస్‌ను మరింత త్వరగా వచ్చేలా చేస్తాయి. మీరు చెబుతున్న లక్షణాలన్నీ డయాబెటిస్‌ లక్షణాలనే పోలి ఉన్నాయి. డయాబెటిస్‌ వల్ల రోగనిరోధక శక్తి తగ్గి, కొన్ని సందర్భాల్లో మీరు చెబుతున్నట్లుగానే ప్రైవేట్‌ పార్ట్స్‌లో ఇన్ఫెక్షన్స్‌ రావచ్చు. కాబట్టి ఒకసారి మీరు షుగర్‌కు సంబంధించిన పరీక్షలు చేయించుకోవడం మంచిది. ఫాస్టింగ్, పోస్ట్‌ లంచ్‌ షుగర్‌ పరీక్షలు, ఓరల్‌ గ్లూకోజ్‌ టాలరెన్స్‌ టెస్ట్, హెచ్‌బీ1ఏసీ వంటి పరీక్షలతో  డయాబెటిస్‌ను నిర్ధారణ చేయవచ్చు. వీలైనంత త్వరగా మీరు దగ్గర్లోని ఫిజీషియన్‌ను సంప్రదించి, వారి సూచనలను అనుసరించండి.

ఒంటి మీద గడ్డలు... ఎవరిని సంప్రదించాలి?
నా వయస్సు 36 ఏళ్లు. నా చేతులు, ఛాతీ, పొట్ట మీద చిన్న చిన్న గడ్డలు ఉన్నాయి. చాలా రోజుల నుంచి నా ఒంటిపైన ఇవి వస్తున్నాయి. ఒకసారి డాక్టర్‌కు చూపించాను. వాటి వల్ల ఎలాంటి హానీ ఉండదు అంటున్నారు. ఇందులో కొన్ని కాస్త నొప్పిగానూ, మరికొన్ని అంతగా నొప్పి లేకుండా ఉన్నాయి. ఇవి ఏమైనా క్యాన్సర్‌కు దారితీసే ప్రమాదం ఉందా? ఇంకా ఎవరికైనా చూపించాలా?
– ఆర్‌. జయకృష్ణ, కొత్తగూడెం

మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీకు  ఉన్న గడ్డలు బహుశా కొవ్వు కణుతులు (లైపోమా)గానీ లేదా న్యూరోఫైబ్రోమాగాని అయి ఉండవచ్చు. మీ డాక్టర్‌కు చూపించి ఆయన సలహా తీసుకున్నారు కాబట్టి ఆందోళన పడకుండా నిశ్చింతగా ఉండండి. ఆయన పరీక్షించే చెప్పి ఉంటారు కాబట్టి వాటి వల్ల ఏలాంటి ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడదు. మీరు చెప్పినట్లుగా హానికరం కాని ఈ గడ్డలు బాగా పెద్దవైనా, నొప్పి ఉన్నా వైద్య నిపుణులను సంప్రదించి శస్త్రచికిత్స ద్వారా తొలగింపజేసుకోవడం ఒక మార్గం. ఒకవేళ ఇవి క్యాన్సర్‌కు సంబంధించిన గడ్డలేమో అనే మీ అనుమానాన్ని నివృత్తి చేసుకోవాలనుకుంటే నీడిల్‌ బయాప్సీ చేయించుకుని నిశ్చింతగా ఉండండి. మీరు మొదట ఒకసారి మెడికల్‌ స్పెషలిస్ట్‌ను కలవండి. లేదా మీకు మరీ అంత అనుమానంగా ఉంటే ఒకసారి మెడికల్‌ ఆంకాలజిస్టును సంప్రదించండి.

అగర్‌బత్తీ వాసన వస్తే చాలు తలనొప్పి!
అగర్‌బత్తీల వాసన నా ముక్కుకు సోకగానే వెంటనే నాకు తలనొప్పి (డల్‌ హెడేక్‌)  మొదలవుతోంది. ఆ తలనొప్పి చాలా అసౌకర్యంగా, ఇబ్బందిగా ఉంటుంది. పైగా ఇంట్లో దైవప్రార్థన కోసం అగర్‌బత్తీలు వెలిగిస్తారు కాబట్టి దానిని కాదనలేను. నేనే అక్కడి నుంచి దూరంగా వెళ్లిపోతుంటాను. అంతేకాదు... ఎవరైనా స్ప్రే కొట్టుకుని వస్తే వాళ్ల దగ్గరనుంచి ఆ వాసన రాగానే కడుపులో తిప్పడంతో పాటు మళ్లీ హెడేక్‌ మొదలువుతుంటుంది. దాంతో సాధ్యమైనంత త్వరగా అక్కడ్నుంచి దూరంగా వెళ్తుంటాను. ఆఫీస్‌లో చాలా ఇబ్బందిగా ఉంటోంది. నా సమస్యకు పరిష్కారం పరిష్కారం సూచించండి.
– ఎమ్‌. సుందరి, విశాఖపట్నం

మీరు చెప్పిన అంశాలను బట్టి మీరు ఒక రకం మైగ్రేన్‌తో బాధపడుతున్నట్లు అనిపిస్తోంది. తలనొప్పిని ప్రేరేపించే అంశాల్లో అనేక రకాలు ఉంటాయి. ఇందులో అగరుబత్తీలు, పెర్‌ఫ్యూమ్స్‌ కూడా ఉంటాయి. కొందరిలో చాక్లెట్లు, స్వీట్స్‌ వల్ల కూడా తలనొప్పి రావచ్చు. మీరు న్యూరాలజిస్ట్‌ను సంప్రదించి, తలనొప్పి రాకుండానే ముందుగా తీసుకునే మందులు (ప్రొఫిలాక్సిస్‌) తీసుకోండి. మీకు తలనొప్పిని ప్రేరేపించే అంశాలేమిటో తెలుసు కాబట్టి వీలైనంత వరకు వాటిని దూరంగా ఉండండి.

డాక్టర్‌ జి. నవోదయ కన్సల్టెంట్, జనరల్‌ మెడిసన్,
కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top