నేనొక ప్రపంచం

special story to traveler neelima reddy - Sakshi

దేశాల మధ్యలో ఉండేవి గీతలే!మాసిపోని.. మార్చలేని.. చెరపలేని ముళ్లకంచెల్లాంటి గీతలే!!అలాగే మనుషుల మధ్యలో కూడామాసిపోని.. మార్చలేని.. చెరపలేని గోడల్లాంటి గీతలే!!మనిషి లోపలుండే హద్దులు.. సరిహద్దులు.. అభిప్రాయాలు.. అపోహలు.. ఇవి ఎలాంటి గీతలు? ఈ గీతలకు నీలిమ దగ్గర ఓ పేరుంది....‘అట’!‘నేను నా గమ్యం కావాలంటే ప్రపంచమే  నా ప్రయాణం కావాలి’ అంటారామె  అర్థం చేసుకుంటే మీరే ప్రపంచం!!

‘చిన్న ప్రాణి చీమ. ఆహారం సేకరించడం పుట్టలో దాచుకోవడం అనే శ్రమలోనే జీవితాన్ని గడిపేస్తుంది. పెద్ద జీవి మానవుడు కూడా అంతే. సంపాదించుకోవడం దాచుకోవడంతోనే జీవితాన్ని గడిపేస్తాడు. చీమకు, మనకు మధ్య ఏం తేడా ఉన్నట్టు? మనం ఇంకేదైనా చేయాలి కదా..’ ఓ ఆధ్యాత్మిక గురువు చెప్పిన ఈ మాట ఆమె మీద చాలా ప్రభావం చూపింది. ‘చీమకు, మనుషులకే కాదు.. నాకూ ఇతరులకూ కూడా తేడా  ఉండాలి. ఆ తేడా ఎక్కడుంది? అందరిలాగే నేనూ చదువుకున్నా. అందరిలాగే ఉద్యోగం చేస్తున్నా. అందరిలాగే కలలున్నాయి. మరి తేడా ఎక్కడుంది? యెస్‌.. కలలను సాకారం చేసుకోవడానికి చాలామందికి ధైర్యం లేదు.. అది నాకుంది. దాన్ని ప్రదర్శించాలి’ అని అనుకుందామె.

మూడున్నరేళ్ల కిందట..
ఓ ఫైన్‌ డే. బ్యాక్‌ప్యాక్‌ వేసుకొని ‘అమ్మా.. నేనట్లా ఓ మూడునాలుగు దేశాలు చుట్టొస్తా’ అంటూ ప్రయాణం మొదలుపెట్టింది ఆమె. ఈ యేడు జనవరితో 52 దేశాలను చుట్టివచ్చింది. ప్రపంచంలోని దేశాలను చూడాలనే వాండర్‌లస్ట్‌ (భ్రమణ కాంక్ష)ను తీర్చుకోవాలని ఆమె నిర్ణయించుకున్నప్పుడు కనీసం వంద దేశాలు అనే టార్గెట్‌ను పెట్టుకుంది. కాని ఈ మూడున్నరేళ్లలో ఇన్ని దేశాలు చూశాక ఆ కాంక్ష పెరిగి అన్ని దేశాలను చూడాల్సిందే అని టార్గెట్‌ పరిధిని పెంచుకుంది. ఆమె పేరు నీలిమా రెడ్డి. కాని నీల్‌ రెడ్డిగా పరిచయం. దేశాలు తిరిగి ఊరికే ఉండట్లేదు. Neel Travelogues అనే యూ ట్యూబ్‌ చానెల్‌నూ నిర్వహిస్తోంది. సోలో ట్రావెలర్‌గా తాను తిరిగిన దేశాల్లోని చారిత్రాత్మక కట్టడాలు, ఆ దేశ చరిత్ర, అక్కడి సంస్కృతి, ప్రజలు, వింతలు, విడ్డూరాలు, విశేషాలు, భౌగోళిక ప్రత్యేకతల గురించిన వీడియోలు తీసి అందులో పొందుపరుస్తోంది. అంతేకాదు తనలా సోలో ట్రావెల్‌ చేయాలనుకున్న అమ్మాయిలు, అబ్బాయిలకు ట్రావెల్‌ టిప్స్‌నూ అందిస్తోంది. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా తన సంపాదనలోని మూడొంతుల ఆదాయాన్ని వరల్డ్‌ టూర్‌కే ఖర్చు చేస్తోంది. ఆమెకు కొన్ని ప్రశ్నలు:
   
 డబ్బు సరే.. సెలవులు గట్రా ఎలా మేనేజ్‌ చేసుకుంటున్నారు?
నేను మైక్రోసాఫ్ట్‌ కంపెనీలో జాబ్‌ చేస్తున్నాను. నా సుపీరియర్స్‌ అందరికీ ట్రావెలింగ్‌ గురించి, మెయిన్‌గా నా వాండర్‌ లస్ట్‌ గురించి బాగా తెలుసు. నేను ఎవ్రీ త్రీ మంత్స్‌కి ట్రిప్‌ ప్లాన్‌ చేసుకుంటా. మినిమమ్‌ టెన్‌ డేస్‌ మాగ్జిమమ్‌గా టూ వీక్స్‌ లీవ్‌ తీసుకుంటా. అయితే ఈ త్రీ మంత్స్‌ ఆఫీస్‌ వర్క్‌కే నా టైమ్‌ను డెడికేట్‌ చేస్తా. ఒక్క రోజు కూడా లీవ్‌ తీసుకోను. వీక్‌ ఆఫ్‌ వాడుకోను. టోటల్‌గా వర్క్‌ మీదే శ్రద్ధ పెడతా.  అలా కష్టపడి పని చేసి నా పని పెండింగ్‌లో లేకుండా చూసుకొని లీవ్‌ పెడతా. నా పై అధికారులు అభ్యంతరం లేకుండా లీవ్‌ ఇస్తారు.
     
ఆడవాళ్లకు సొంత ఊళ్లళ్లోనే భద్రత లేదు.. తెలియని దేశాలలో ఎలా?
భయముంటే సొంతూరైనా ప్రపంచమైనా ఒకటే. తెలియని ప్రదేశం హైదరాబాద్‌లో ఉప్పల్‌ అయినా వరల్డ్‌లో ఉక్రెయిన్‌ అయినా ఒక్కటే. ఎక్కడికి వెళ్లాలన్నా ముందు కాన్ఫిడెన్స్‌ కావాలి. అవేర్‌నెస్, నాలెడ్జ్‌ తప్పనిసరి. డేంజర్‌ను ప్రతి మనిషి, ముఖ్యంగా ఆడవాళ్లు  బాగా సెన్స్‌ చేయగలరు. ఆ ఇన్‌స్టింక్ట్‌  మనల్ని ఎప్పటికప్పుడు వార్న్‌ చేస్తూనే ఉంటుంది. అయినా కొత్త ప్రదేశానికి వెళ్తున్నామంటే ఎంతైనా కాస్త జాగ్రత్తగానే ఉంటాం కదా. నేను ఇన్ని దేశాలు తిరిగా. భద్రతకు సంబంధించి నాకెక్కడా ఎలాంటి ఇబ్బందులూ ఎదురు కాలేదు. లక్కీగా ఇంటర్‌నెట్‌ ఉండనే ఉంది. ముందుగానే నేను వెళ్లబోయే దేశానికి సంబంధించిన వివరాలన్నీ సెర్చ్‌ చేసుకుంటాను. సోలో ట్రావెలర్స్‌ కోసం కౌచ్‌ సర్ఫింగ్, హాస్టల్‌ వరల్డ్‌ లాంటి వెబ్‌సైట్స్‌ ఉన్నాయి. అకామిడేషన్‌లాంటి వాటికి అవెంతో హెల్ప్‌ చేస్తాయి. సాధారణంగా బయటి దేశాల్లో  ఫారినర్స్‌ను కనీసం టీజ్‌ చేయడం కూడా నేను చూడలేదు. అందులో ఆడవాళ్లంటే హెల్ప్‌ చేయడానికి ముందుంటారు. నేనైతే మగవాళ్లు కూడా వెళ్లని ప్రదేశాలకు వెళ్లాను. అడ్వంచరస్‌ టూర్స్‌ చేశాను. ఎక్కడా ఎలాంటి ప్రాబ్లమ్‌నూ ఎదర్కోలేదు. ప్రాబ్లమ్స్‌ అంటే బస్‌ మిస్‌ కావడం, ట్రైన్‌ మిస్‌ కావడం లాంటివే. నాకు తెలిసీ ఈ భద్రతకు సంబంధించి నిజాలకన్నా మనకు అపోహలే ఎక్కువుంటాయి. ఎగ్జాంపుల్‌.. నేను బ్రెజిల్, పెరూ వెళ్తున్నప్పుడు చాలా మంది అక్కడ డ్రగ్స్, క్రైమ్‌ ఎక్కువ అలాంటి చోట్లకు వెళ్తావా? అంటూ కామెంట్‌ చేశారు. అక్కడికి వెళ్లాక బ్రెజిలియన్స్‌ నేను ఇండియన్‌ అని తెలుసుకొని మీ ఇండియాలో ఫారిన్‌ అమ్మాయిలకు సెక్యూరిటీ లేదట కదా. రేప్‌ చేసి చంపేస్తారట కదా’ అని అడిగారు. అలాగే ఇంకో కంట్రీవాళ్లు నేను హైదరాబాద్‌లో ఉంటానని చెప్పగానే ఓమైగాడ్‌.. హైదరాబాద్‌లో కమ్యూనల్‌ రెయిట్స్‌ ఎక్కువట కదా. హిందూ, ముస్లింలు రోడ్ల మీదే గొడవపడ్తారట కదా అని అడిగారు. సో నేను చెప్పొచ్చేదేంటంటే ఈ ‘అట’ భాషను ఎంత ఇగ్నోర్‌చేస్తే అంత మంచిది. ప్రతి దేశానికి ఇతర దేశం పట్ల ఓ అపోహ ఉంటుంది. ఎక్స్‌ప్లోర్‌ చేస్తే అది అబద్ధమని తేలుతుంది.   సో.. నిరభ్యంతరంగా అమ్మాయిలు సోలో ట్రావెల్‌ చేయొచ్చు.  
   
బాగా నచ్చిన ప్రదేశాలు?
అన్నీ నచ్చాయి. ఏ దేశానికదే.. ఏ ప్రాంతానికదే ఓ స్పెషల్‌. ప్రతీ ప్లేస్‌ ఎన్నో కొత్త విషయాలను నేర్పింది నాకు. కొత్త అనుభవాలనిచ్చింది. కొత్త సంస్కృతి.. కొత్త మనుషులు.. కొత్త భాష.. అసలు ఆ మాటకొస్తే కొత్త అనేదే ఎక్సయిట్‌మెంట్‌. ఆఫ్రికాలో  ఏడు దేశాలను (కెన్యా నుంచి సౌత్‌ ఆఫ్రికా దాకా) చూడ్డానికి ట్రక్‌లో వెళ్లా. దాన్ని ఓవర్‌ల్యాండ్‌ ట్రక్‌ ట్రిప్‌ అంటారు. గెరిల్లా సఫారీని చూశా. బల్లికే భయపడే నేను అనకొండను మెడలో వేసుకున్నా. సెవెన్‌ కలర్‌ హిల్స్‌.. సెవెన్‌ వండర్స్‌.. ఎన్నని చెప్పను? ఈ ప్లానెట్‌ ఇంత అందమైందా అని అనిపించే అందమైన ప్రదేశాలెన్నిటినో చూశా. కొరియా అందమైన దేశం. అక్కడి వాళ్లకు ఇంగ్లిష్‌ రాదు.. మనకు కొరియా రాదు. అయినా చిన్న ఇబ్బంది కూడా లేకుండా ఆ దేశాన్ని తిరిగొచ్చా. ఆ దేశం అలాంటిది. భాషరాని వాళ్లు.. ఆ మాటకొస్తే మాటలు రాని వాళ్లూ హాయిగా  తిరిగొచ్చు. కొరియన్‌ లాంగ్వేజ్‌ రాని వాళ్ల కోసం కలర్స్, సింబల్స్, సైన్స్‌తో కమ్యూనికేట్‌ చేస్తారు. టికెట్‌  వెనకే అన్ని వివరాలనూ ఇస్తారు. ఇలాంటివెన్నో. 
   
 ట్రావెల్‌ చేయక ముందు మీకు.. చేశాక మీకు ఉన్న తేడా? వచ్చిన మార్పు?
చాలా చాలా అంటే చాలా! నేను కావలి (నెల్లూరు జిల్లా) అనే ఊళ్లో పుట్టి పెరిగి, తెలుగు మీడియంలో మామూలు చదువు చదివిన అమ్మాయిని. నిజం చెప్పాలంటే హైదరాబాద్‌లో జాబ్‌లో చేరినా తక్కువ ఆత్మవిశ్వాసంతోనే ఉండేదాన్ని. సోలో ట్రావెల్‌ మొదలు పెట్టాక ఆత్మవిశ్వాసం పెరిగింది. నేను వెళ్లిన చోటున్న స్థానిక తెగలను, ఆ సంస్కృతిని అధ్యయనం చేయడం ఇష్టం. ఆ అవగాహన అంతా నాలో ఆత్మవిశ్వాసంను పెంచుతూనే ఉంది. రష్యన్, స్పానిష్‌ భాషలను నేర్చుకున్నా. సహనం పెరిగింది. మనుషులను అర్థం చేసుకునే విషయంలోనూ మార్పు వచ్చింది. అంతకుముందు ఆఫీస్‌లో టీమ్‌లో నా కొలీగ్స్‌తో చాలా గొడవలొచ్చేవి. ఇప్పుడు రావట్లేదు. టీమ్‌ను మేనేజ్‌ చేసుకోవడం తెలుస్తోంది. యాంగర్, క్రైసిస్‌ మేనేజ్‌మెంట్‌ తెలుస్తున్నాయి. అంతకుమందు చిన్న విషయాలు కూడా పెద్దగా కనిపించేవి. ఇప్పుడు పెద్ద విషయాలు కూడా చాలా తేలిగ్గా అనిపిస్తున్నాయి. సొల్యూషన్‌ ఈజీ అవుతోంది. వేరే వాళ్ల షూలో కాలుపెట్టి ఆలోచించడం అలవాటైంది. జడ్జిమెంటల్‌గా ఉండకూడదనీ తెలిపింది. అందుకే ఇప్పుడు ఎవరైనా ఇంకెవరిగురించైనా కామెంట్‌ చేస్తుంటే నేను వినను. ఈవెన్‌ మా అమ్మయినా ఎవరి గురించైనా చెప్తే అమ్మా.. ఊరుకో అని వార్న్‌ చేస్తున్నాను. ఒక పాజిటివ్‌ అట్యూటూడ్‌ అలవడింది. ఇక్కడ మీకొక్కటి చెప్పాలి. నాకు ఒక అక్క. తను తెల్లగా ఉంటుంది. నేను నల్లగా ఉంటాను. బ్లాక్‌ వల్ల చిన్నప్పటి నుంచి ఒకరమైన హ్యూమిలియేషన్‌కు గురయ్యా. కాని వరల్డ్‌టూర్‌ నా రంగు పట్ల నాకు విపరీతమైన ఇష్టాన్ని పెంచింది. నన్ను ప్రేమించుకోవడం.. నన్ను నేను ప్రెయిజ్‌ చేసుకోవడం నేర్పింది. లైఫ్‌ను ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలో చెప్తోంది. అందుకే ఐ లవ్‌ ట్రావెలింగ్‌. 
   
 మీ ఇంట్లోవాళ్లు?
ముందు భయపడ్డారు. తర్వాత అలవాటు పడ్డారు. మా ఇంట్లో వాళ్లే కాదు నా చుట్టూ ఉన్నవాళ్లు కూడా. కనీసం వంద దేశాలన్నా తిరగాలి అని చెప్పినప్పుడు ఎగతాళి చేశారు. ఇప్పుడు 198 అంటే తిరుగుతావులే.. ఆల్‌ ది బెస్ట్‌ అంటున్నారు. ప్రపంచం ఏమనుకున్నా పట్టించుకోవద్దు.. ఇదే నా ఫిలాసఫీ. దాన్నే ఫాలో అవుతాను. ట్రావెల్‌ ఈజ్‌ మై రిలీజియన్‌. అంతే. 

అడ్వంచర్‌ అన్నారు.. ఎగ్జాంపుల్‌ చెప్తారా?
చాలా ఉన్నాయి. అటకామా వెళ్లా. బ్రెజిల్‌లో అమేజాన్‌ వెళ్లా. మీకో విషయం తెలుసా? అమేజాన్‌ వెళ్లడానికి బ్రెజిలియన్సే వెనకాముందు అవుతుంటారు. రీసెంట్‌గా జాంబియాలోని విక్టోరియా ఫాల్స్‌ పైనున్న డెవిల్స్‌ ఫూల్‌కి వెళ్లా. అది చాలా డెంజేరస్‌ ప్లేస్‌. సొంత రిస్క్‌ మీదే అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది. నార్త్‌ కొరియో వెళ్లా. ఉక్రెయిన్‌లోని చెర్నోబిల్‌కి వెళ్లా. అట్లాగే ఇండోనేషియాలోని టాగీన్‌ ఐల్యాండ్‌కీ వెళ్లా. జనరల్‌గా ఇండియన్స్‌ ఎవరూ వెళ్లరట అక్కడికి. నన్ను చూసి సర్‌ప్రైజ్‌ ఫీలయ్యారు. అక్కడే నేను స్కూబా డైవింగ్‌లో సర్టిఫైడ్‌ కూడా అయ్యాను. స్కై డైవింగ్‌ కూడా చేస్తా.  ఆరు ఖండాలు చూశా. అంటార్కిటా వెళ్లాలనీ ఉంది. అయితే దీనికి స్పాన్సర్స్‌ కోసం ట్రై చేస్తున్నా. స్పాన్సర్స్‌ దొరికితే రేపే వెళ్లిపోతా. అంత ఈగర్‌గా ఉన్నా.  
–  సరస్వతి రమ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top