ఇంకా పక్క తడుపుతున్నాడు...

sakshi family health councling - Sakshi

ఫ్యామిలీ డాక్టర్‌

పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌
మా బాబు వయసు పదేళ్లు. వాడు ఇప్పటికీ పక్కతడుపుతూనే ఉంటాడు. రాత్రిళ్లు ప్రతి రెండు గంటలకోసారి యూరిన్‌కు వెళ్తుంటాడు. పగలు కూడా ఎక్కువగానే వెళ్తుంటాడు. ఈ సమస్యతో చాలా ఇబ్బంది పడుతుంటాడు. మావాడి సమస్యకు తగిన సలహా ఇవ్వండి. – సుమశ్రీ, ఖమ్మం
మీ బాబుకు ఉన్న కండిషన్‌ను ఇంక్రీజ్‌డ్‌ ఫ్రీక్వెన్సీ ఆఫ్‌ యూరినేషన్‌ అని చెప్పవచ్చు. దాంతోపాటు యూరిన్‌ పరిమాణం ఎక్కువగా రావడాన్ని పాలీయూరియా అన్న కండిషన్‌ కూడా ఉందేమోనని కూడా అనుమానించాలి. ఈ సమస్యకు అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యంగా నీళ్లు ఎక్కువగా తాగడం, యూరినరీ ఇన్ఫెక్షన్స్, మనస్తత్వ సంబంధమైన సమస్యలు, ఎండోక్రైన్‌ సమస్యలు, యూరినరీ బ్లాడర్‌ డిజ్‌ఫంక్షన్, దీర్ఘకాలికమైన కిడ్నీ సమస్యలు, మలబద్దకం వంటివి ముఖ్యమైనవి. మీ బాబు విషయంలో అతడి సమస్యకు నిర్దిష్టమైన కారణాన్ని తెలుసుకోడానికి కంప్లీట్‌ యూరిన్‌ అనాలిసిస్, 24 గంటల్లో అతడు విసర్జించే మూత్రపరిమాణం పరీక్షలతోపాటు యూరిన్‌ ఆస్మనాలిటీ, అల్ట్రాసౌండ్‌ ఆఫ్‌ కేయూబీ పరీక్షలు చేయించాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో సాధారణంగా సాయంత్రం నుంచి రాత్రివరకు నీళ్లు ఎక్కువగా తాగకుండా చూడటం, తియ్యటి పదార్థాలను ఎక్కువగా తీసుకోకుండా చూడటం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. దాంతో పాటు యూరిన్‌ పాస్‌ చేసేటప్పుడు విసర్జన పూర్తిగా చేసేలా చూడటం ప్రధానం. (ముఖ్యంగా వాయిడింగ్‌ డిస్‌ఫంక్షన్‌ అవాయిడ్‌ చేయడానికి). ఇలాంటి మంచి విసర్జక అలవాట్లతో ఈ సమస్య పూర్తిగా తగ్గుతుంది. అయితే పైన పేర్కొన్న కారణాలలో ఏవైనా ఉన్నాయేమో తెలుసుకునేందుకు పూర్తిస్థాయి మూత్రపరీక్షలు (కంప్లీట్‌ యూరిన్‌ ఎగ్జామినేషన్‌) చేయించండి. మీరు ఒకసారి మీ పిల్లల వైద్యనిపుణుడిని సంప్రదించండి.

పాపకుఇప్పుడు మరో చెవిలో నొప్పి...
మా పాప వయస్సు ఆరేళ్లు. రెండు నెలల క్రితం మా పాపకు జలుబు వస్తే ఈఎన్‌టీ స్పెషలిస్ట్‌ దగ్గరకు తీసుకెళ్లాం. ఆయన చికిత్స చేశాక తగ్గిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ మరోపక్క చెవి నొప్పిగా ఉందని అంటోంది. ఇలా జరిగే అవకాశం ఉందా? – రమ్య, ఒంగోలు
మీ పాపకు ఉన్న కండిషన్‌ను ‘అడినాయిడైటిస్‌ విత్‌ యూస్టేషియన్‌ కెటార్‌’ అని చెప్పవచ్చు. ఎడినాయిడ్స్‌ అనే గ్రంధులు ముక్కు వెనకాల, టాన్సిల్‌ పైన ఉంటాయి. ఈ గ్రంథులకు టాన్సిల్స్‌ తరహాలో ఇన్ఫెక్షన్‌ రావచ్చు. ఇది కొన్ని వారాలు, నెలలు ఉండవచ్చు. చిన్నపిల్లల్లో ఈ కండిషన్‌ను తరచూ చూస్తుంటాం. ఇలాంటిది జరిగినప్పుడు మధ్య చెవి నుంచి ముక్కు వెనుక భాగంలో ఉండే యూస్టేషియన్‌ ట్యూబులో కొన్ని మార్పులు జరగవచ్చు. ఎడినాయిడ్‌ ఇన్ఫెక్షన్‌ ఉన్నప్పుడు సైనసెటిస్, ముక్కు రంధ్రాలు మూసుకుపోవడం, నోటితో గాలి పీల్చడం, నిద్రపట్టడంలో ఇబ్బంది వంటి ఇతర లక్షణాలూ కనిపించవచ్చు. ఇలాంటి పిల్లలకు యాంటీహిస్టమిన్, యాంటీబయాటిక్‌ కోర్సులతో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నొప్పి ఉంటే పెయిన్‌ మెడికేషన్‌ కూడా అవసరం కావచ్చు. ఇలాంటి లక్షణాలు దీర్ఘకాలం కొనసాగితూ ఉంటే కొందరిలో చాలా అరుదుగా ఎడినాయిడ్స్‌ను తొలగించాల్సి రావచ్చు. మీరు మీ పీడియాట్రీషియన్‌ లేదా ఈఎన్‌టీ సర్జన్‌ను కలిసి తగిన చికిత్స తీసుకోండి.

పాపకు ఒంటి మీద మచ్చలు... ఎందుకిలా?
మా పాపకు 14 ఏళ్లు. ఏడాది కిందటినుంచి ఒంటిమీద, ముఖం మీద చాలా మచ్చలు వస్తున్నాయి. ఈ మచ్చలు పోవడానికి ఏం చేయాలి? – ప్రియ, ఆదిలాబాద్‌
మీ పాపకు ఉన్న కండిషన్‌ నీవస్‌ అంటారు. దీన్ని వైద్యపరిభాషలో మల్టిపుల్‌ నీవస్‌ అనీ, సాధారణ పరిభాషలో చర్మంపై రంగుమచ్చలు (కలర్‌డ్‌ స్పాట్స్‌ ఆన్‌ ద స్కిన్‌) అంటారు. ఇవి రెండు రకాలు. మొదటిది అపాయకరం కానివీ, చాలా సాధారణంగా కనిపించే మచ్చలు. రెండోది హానికరంగా మారే మెలిగ్నెంట్‌ మచ్చ. ఒంటిపై మచ్చలు పుట్టకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు  10 నుంచి 30 ఏళ్ల మధ్య రావచ్చు. నీవస్‌ చర్మానికి రంగునిచ్చే కణాల వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా (అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా) రావచ్చు. సూర్యకాంతికి ఎక్కువగా  ఎక్స్‌పోజ్‌ కావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలున్న సందర్భాల్లో ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో నీవాయిడ్‌ బేసల్‌ సెల్‌ కార్సినోమా అనే కండిషన్‌ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతో పాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి ఈ మచ్చలతోపాటు జన్యుపరమైన అబ్‌నార్మాలిటీస్‌ చూస్తుంటాం. అలాంటి వాళ్లకు ముఖ ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లోపాలు కనిపిస్తాయి. మీ పాపకు ఉన్న కండిషన్‌తో పైన చెప్పినవాటికి సంబంధం లేదు. మీ పాపది హానికరం కాని సాధారణ నీవస్‌ కావచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్‌లు క్రమంగా క్యాన్సర్‌ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది.

కాబట్టి ఒంటిపై మీ పాపలా మచ్చలు ఉన్నవారు రెగ్యులర్‌గా డెర్మటాలజిస్ట్‌లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది. అది ఎలాంటి మచ్చ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాలు గమనిస్తూ ఉండటం మంచిది. ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవంలో ఏదైనా మార్పు ఉందా?, బీ– అంటే బార్డర్‌... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా?, సీ– అంటే కలర్‌... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందా?, డీ– అంటే డయామీటర్‌... అంటే మచ్చ వ్యాసం (పరిమాణం) పెరుగుతోందా? ఈ నాలుగు మార్పుల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అప్పుడు బయాప్సీ తీసి పరీక్ష చేసి అది హానికరమా కాదా అన్నది వారు నిర్ణయిస్తారు. ఇక ఇలాంటివి రాకుండా ఉండాలంటే... ఎండకు ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ కావడం పూర్తిగా తగ్గించాలి. హానికారక అల్ట్రావాయొలెట్‌ కిరణాలు తాకకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు ఎక్కువ ఎస్‌పీఎఫ్‌ ఉన్న సన్‌ స్క్రీన్‌ లోషన్స్‌ రాసుకోవాలి. మీ పాపకు ఉన్న మచ్చల్ని అప్పుడప్పుడూ డెర్మటాలజిస్ట్‌తో పరీక్ష చేయిస్తూ ఉండటం మంచిది. ఇలాంటి నీవస్‌లు ముఖం మీద ఉండి కాస్మటిక్‌గా ఇబ్బంది కలిగిస్తుంటే... దీన్ని ఎక్సెషన్‌ థెరపీతో వాటిని తొలగించవచ్చు.
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్,
రోహన్‌ హాస్పిటల్స్,
విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top