పరిపూర్ణ మానవుడు బుద్ధుడు | perfect man of budha | Sakshi
Sakshi News home page

పరిపూర్ణ మానవుడు బుద్ధుడు

May 15 2016 12:33 AM | Updated on Sep 4 2017 12:06 AM

పరిపూర్ణ మానవుడు బుద్ధుడు

పరిపూర్ణ మానవుడు బుద్ధుడు

అజ్ఞానమనే చీకటిని పారద్రోలిన వెలుగుల సూర్యుడు బుద్ధుడు. అశాంతి అనే నిశీధిలో ప్రశాంతతని నెలకొల్పిన వెన్నెల చంద్రుడు బుద్ధుడు.

అజ్ఞానమనే చీకటిని పారద్రోలిన వెలుగుల సూర్యుడు బుద్ధుడు. అశాంతి అనే నిశీధిలో ప్రశాంతతని నెలకొల్పిన వెన్నెల చంద్రుడు బుద్ధుడు. మానవాళిని మహాదుఃఖసాగరం నుండి కాపాడటానికి ‘ధమ్మం’అనే నావను నిర్మించిన ప్రాజ్ఞుడు. ఆ నావకు చుక్కాని ఆయన ప్రవచించిన పంచశీల. నావను దారిలో నడిపించే నావికుడు ఆయన బోధించిన అష్టాంగమార్గం. నావను నడిపే తెరచాప ఆయన ప్రబోధించిన చతురార్య సత్యాలు.

 మానవ హృదయాల్లోంచి ద్వేషం, పగ, ప్రతీకారం, మోసం, ఈర్ష్య, అసూయలు అనే చెడ్డ ఆలోచనల్ని తుడిచేసి, వాటి స్థానంలో దయ, జాలి, కరుణ, ప్రేమ, అనురాగం, మైత్రి లాంటి మానవీయ భావనల్ని పెంపొందించిన మహనీయుడు బుద్ధుడు. ఆయన కేవలం మానవజాతి మేలును మాత్రమే కోరుకోలేదు. సమస్త జీవకోటి మేలును కాంక్షించాడు. పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, జలచర భూచరాలు.. అన్నింటి పట్ల దయను ప్రదర్శించాడు.

బుద్ధత్వం అనేది ఒక జీవకారుణ్యమూర్తికి ఉండవలసిన లక్షణం. ఏ వ్యక్తి అయినా దానం, శీలం, నిష్కామం, ప్రజ్ఞ, ధీరత్వం, ఓర్పు, సత్యం, పట్టుదల, మైత్రి, ఉపేక్ష అనే పది విశేష గుణాల్ని సాధిస్తే బుద్ధత్వం పొందగలడు. పరిపూర్ణుడవుతాడు. ఈ పరిపూర్ణత్వమే అనంత కరుణని ప్రసాదిస్తుంది. మనిషిని మానవీయునిగా, సమస్త జీవజాతిని ప్రేమించే జీవకారుణ్యమూర్తిగా మలుస్తుంది. ఈ దశ సుగుణాలూ రాసిపోసిన మహోన్నతా మానవతామూర్తే తథాగతుడు గౌతమబుద్ధుడు.

 - డా. బొర్రా గోవర్ధన్

Advertisement
 
Advertisement
Advertisement