నేడు బుద్ద పూర్ణిమ
‘సకల సౌకర్యాలూ ఉన్నాయి. మనఃశాంతి లేదు’ ‘ఎంత ప్రయత్నించినా కోపాన్ని తగ్గించుకోలేకపోతున్నాను’ ‘చిన్న చిన్న విషయాలకే ఆందోళన పడుతుంటాను’
‘ఆత్మన్యూనతతో ఏ పనీ చేయలేకపోతున్నాను’... ఇలాంటి మాటలు ఎక్కడో ఒకచోట వినబడుతుంటాయి. ఈ సమస్యలకు పరిష్కారాలు వ్యక్తిత్వ వికాసనిపుణులు,
మోటివేషనల్ స్పీకర్స్ మాటల్లోనే వెదుక్కుంటాం. అయితే బుద్ధుడి కథల్లో ఎన్నో సమస్యలకు, ఎన్నో పరిష్కారాలు ఉన్నాయి. వాటిని పిల్లలతో చదివిస్తే... నైతిక విలువలతో కూడిన వారి భవిష్యత్‌కు ఆ కథలు పునాదిగా పనిచేస్తాయి. మచ్చుకు కొన్ని కథలు...
సూత్రాలు కాదు... స్ఫూర్తి ముఖ్యం
బుద్దుడు తన శిష్యుడితో కలిసి దట్టమైన అడవి గుండా ఒక గ్రామం నుండి మరో గ్రామానికి ప్రయాణిస్తున్నాడు. వారికి ఎదురుగా ఒక నది వచ్చింది. వారు నదిలోకి అడుగుపెట్టబోతుండగా ఒక యువతి పరుగెత్తుకుంటూ వచ్చి నది దాటడానికి సహాయం చేయాల్సిందిగా వేడుకుంది. బుద్ధుడు క్షణం కూడా సంకోచించకుండా ఆ యువతిని తన వీపుపై ఎత్తుకొని నదిని దాటాడు. ఆ తరువాత... తనను వేధిస్తున్న ప్రశ్నను బుద్ధుడిని అడిగాడు శిష్యుడు....
‘ఓ మహర్షి! మనం బ్రహ్మచర్య దీక్ష తీసుకున్నాం. అయినా మీరు ఆ స్త్రీని మీతోపాటు నదిలోకి తీసుకెళ్లారు. ఇది మన సూత్రాలకు విరుద్ధం కాదా?’
బుద్దుడు నవ్వి ఇలా అన్నారు: ‘కుమారా! నేను అవసరంలో ఉన్న తోటి మనిషికి సహాయం చేయడానికి ఆ స్త్రీని ఒడ్డున వదిలి పెట్టాను. నువ్వే ఆమెను ఇంకా నీ మనసులో మోస్తున్నావు’ చివరకు శిష్యుడు గ్రహించాడు. దీక్షలోని పదాలు ముఖ్యం కాదు అందులోని స్ఫూర్తి ముఖ్యం అని. మనకు ఉండే భౌతిక భారం కన్నా మన ఆలోచనలే పెద్ద భారం అని.
వజ్రాల కంటె విలువైన సందేశం
ఒక శిష్యుడు బుద్దుడి దగ్గరకు వచ్చి ‘పేదరికంతో విసిగివేసారి పోయాను. నాకు సంపద కావాలి’ అన్నాడు. అప్పుడు బుద్దుడు ‘ఈ చెట్ల వరుసను చూడు. ప్రతి చెట్టు కింద ఒక నిధి పెట్టె పాతిపెట్టి ఉంది. నువ్వు దానిని తీసుకొని ధనవంతుడివి కావచ్చు’ అన్నారు. ఆ శిష్యుడు చాలా సంతోషించి తవ్వడానికి సిద్ధమయ్యాడు. మొదటి చెట్టును తవ్వడం మొదలు పెట్టిన కొద్దిసేపటికి వెండి ఉన్న నిధి పెట్టె దొరికింది.
అతను కాసేపు ఆలోచించి ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రెండవ చెట్టు కింద తవ్వగా బంగారంతో నిండిన ఒక పెట్టె దొరికింది. అతడు కాసేపు ఆలోచించి ఇంకా ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆ చెట్టుకింద ఇప్పటివరకు చూసిన వాటిలోకెల్లా అతి పెద్ద పెట్టె ఉంది. తన జీవితంలో ఎన్నడూ చూడని విలువైన వజ్రాలు అందులో ఉన్నాయి. అయినా, అతనికి ఇంకా కావాలనిపించింది.
చివరి చెట్టు దగ్గరికి వెళ్లి తవ్వాడు. అతడికి ఆశ్చర్యం కలిగేలా ఒక చిన్నపెట్టె కనిపించింది. ఆ పెట్టెలో ఇలా రాసి ఉంది...‘అవకాశాలు నీ దారిలోకి వస్తూనే ఉంటాయి. వాటిని నువ్వు అందిపుచ్చుకోవచ్చు. కానీ మితిమీరిన దురాశ ఎల్లప్పుడూ పతనానికి దారితీస్తుంది’ ఈ సందేశంతో శిష్యుడు గుణపాఠం నేర్చుకున్నాడు. ఆ తరువాత ఎప్పుడూ దురాశకు లోనుకాలేదు.
యానిమేటెడ్ కథలు
బుద్ధుడి కథలు యానిమేటెడ్ వీడియోల రూపంలో యూట్యూబ్‌లో ఉన్నాయి. ‘మ్యాజిక్‌బాక్స్ ఇంగ్లీష్ స్టోరీస్, ‘గీతాంజలి–కార్టూన్ ఫర్ కిడ్స్’... మొదలైన యూట్యూబ్ చానల్స్‌లో బుద్ధ స్టోరీస్ ఫర్ కిడ్స్ విభాగాలు ఉన్నాయి. లిటిల్ బుద్ధ: ఏ పీస్‌ఫుల్ జర్నీ, బుద్దా’స్ లెస్సన్స్, 28–లైఫ్ చేంజింగ్ బుద్దిస్ట్ స్టోరీస్(దట్ విల్ రీషేప్ యువర్ లైఫ్ ఫర్ ఎవర్), ది బుద్ధ అండ్ ది హోమ్‌లెస్ మ్యాన్ స్టోరీ, లెజెండ్ ఆఫ్ బుద్ద...ఇలా ఎన్నో యానిమేటెడ్ వీడియోలు (యూట్యూబ్)లో, బుద్ధ విజ్‌డమ్ స్టోరీస్, బుద్ధ మోటివేషన్ స్టోరీ... మొదలైనవి ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులో ఉన్నాయి.
శంకర ‘మంచి కథలు’
తెలుగులో రైటింగ్ స్కిల్స్ పెంపొందించుకోవడానికి ఉపయోగపడే పుస్తకం...అమరావతి కథలు. సత్యం శంకరమంచి రాసిన అమరావతి కథలు పెద్దలకే కాదు పిల్లలకూ బాగా నచ్చుతాయి. ఈ పుస్తకంలో ‘కానుక’ అనే అద్భుతమైన కథ ఉంది. రాకుమారుడు బుద్దుడై తిరిగి వచ్చిన నాటి కథ ఇది. ‘మంగళ వాద్యాలు మోగాయి. వీథుల్లో జనం కిక్కిరిసి ఉన్నారు. అల్లడుగో బుద్దుడు! అల్లదే వెలుగు! వీథుల నిండా వెన్నెల!’ ‘రాజ్యమేలవలసిన రాజు లోకాన్నంతా ఏలుతున్నాడంట!’
‘అంత సుకుమారుడు అడవుల ఏ ఎండకాసెనో, ఏ వాన తడిసెనో, ఏ ముళ్లబాట నడిచెనో, ఏ కసరుకాయ కొరికెనో...’ ‘రాజకుమారుడు సన్యాసి అయ్యాడు. రత్నకిరీటం లేదు. మణిహారాలు లేవు. కాషాయాంబరాలతో, చిరునవ్వుతో అందరి కళ్ళలోకి చూస్తున్నాడు. ఆకాశంలోంచి కాంతిగోళం భూమిని తాకినట్టుంది’.. ఇలాంటి వాక్యాలెన్నో మనసుకు హత్తుకుపోతాయి.
మనస్సుకు కొంత సమయం ఇవ్వు!
ధ్యానం ముగిసిన తరువాత బుద్దుడి దగ్గరకు వచ్చిన ఒక శిష్యుడు ఆయనతో ఇలా అన్నాడు... ‘ఈరోజు నాకు చాలా కోపంగా ఉంది. వృద్ధురాలైన మా తల్లిని చూసుకోవడానికి మా అన్న తిరస్కరిస్తున్నాడు. అతనికి ఏం చెప్పాలో నాకు తెలియడం లేదు’ శిష్యుడు చెప్పింది విన్న బుద్దుడు... ‘దయచేసి దగ్గరలో ఉన్న చెరువు నుండి నా కోసం గిన్నెడు నీళ్లు తీసుకురాగలవా?’ అని అడిగారు. అతడు వెంటనే చెరువు దగ్గరికి వెళ్లాడు. అక్కడ కొన్ని జంతువులు చెరువును దాటి వెళ్లడం వల్ల నీళ్లు మురికి అయ్యాయి.
ఆ శిష్యుడు బుద్ధుడి దగ్గరకు వచ్చి ‘చెరువు నీరు తాగడానికి యోగ్యంగా లేవు’ అని చెప్పాడు. ‘మనం ధ్యానం చేద్దాం’ అన్నాడు బుద్దుడు. కొద్దిసేపటి తరువాత...శిష్యుడిని నీళ్లు తీసురమ్మని అడిగాడు బుద్దుడు. చెరువు దగ్గరికి వెళ్లాడు శిష్యుడు. నీళ్లు స్వచ్ఛంగా ఉండడంతో బుద్ధుడికి ఈసారి నీళ్లు తీసుకురాగలిగాడు. నీళ్లు తాగిన బుద్దుడు ఇలా అన్నాడు... ‘నీ మనసు ఒక చెరువులాంటిది. నీకు కోపపూరితమైన ఆలోచనలు వచ్చినప్పుడు బురద నీళ్లలాగే మనసు కూడా నిరూపయోగకరంగా మారుతుంది. మనస్సుకు కొంత సమయం ఇవ్వు. కోపం శాంతించనివ్వు. అప్పుడు నీ మనస్సే నీకు సమాధానం ఇస్తుంది’


