మూడింతల దిగుబడికి కొత్త రూటు! | Sakshi
Sakshi News home page

మూడింతల దిగుబడికి కొత్త రూటు!

Published Wed, Jan 3 2018 1:14 AM

New Root for Three-Times Yield - Sakshi

మంది పెరిగితే మజ్జిగ పలచనవుతుందని నానుడి. ఇంట్లో అయితే ఓకే గానీ.. అంగుళం నేల కూడా పెరగని భూమిపై జనాభా ఇబ్బడిముబ్బడి అయితే ఆహారం ఎల్లా? ఈ చిక్కు ప్రశ్నకు శాస్త్రవేత్తలు రకరకాల పరిష్కారాలు వెతుకుతున్నారు గానీ. తాజాగా సిడ్నీ, క్వీన్స్‌ల్యాండ్‌ యూనివర్శిటీల శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పద్ధతికి పదును పెడుతున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ పదేళ్ల క్రితం ప్రయత్నించి, వదిలేసుకున్న ఒక పద్ధతితో పంట దిగుబడులు మూడు రెట్లు ఎక్కువ చేయవచ్చునని వీరు అంటున్నారు.

మొక్కలు ఎదిగేందుకు కీలకమైన కిరణజన్య సంయోగక్రియ మరింత మెరుగ్గా, రోజంతా జరిగేలా చేయడం ఈ ‘స్పీడ్‌ బ్రీడింగ్‌’ టెక్నిక్‌లోని కీలకాంశం. దీంట్లో మొక్కలు వేగంగా పెరిగేందుకు, కాపుకొచ్చేందుకు అనువైన నిర్దిష్ట తరంగదైర్ఘ్యాలతో కూడిన కాంతిని చౌక ఎల్‌ఈడీ బల్బులతో అందిస్తారు. ఒక గ్రీన్‌హౌస్‌లో తామిప్పటికే కొన్ని ప్రయోగాలు చేశామని ఏడాది సమయంలో ఆరు పంటల గోధుమలు పండించడమే కాకుండా... సెనగ, బార్లీ, ఆవ పంటలు కూడా వేశామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త లీ హెకీ తెలిపారు.

వేరుసెనగ, గోంగూర, పప్పుధాన్యాలు, సూర్యకాంతి, మిరియాలు, ముల్లంగి వంటి పంటలను కూడా స్పీడ్‌ బ్రీడింగ్‌ ద్వారా ఎక్కువగా పండిచేందుకు అవకాశముందని వివరించారు. కొత్త పద్ధతి ద్వారా కేవలం ఒక చదరపు మీటర్‌ వైశాల్యంలో 900 బార్లీ మొక్కలను పండించామని, దిగుబడులతోపాటు పౌష్టిక విలువలను కూడా కాపాడుకోవచ్చునని వివరించారు. జన్యుపరమైన మార్పులేవీ అవసరం లేకుండా... అతితక్కువ ఎరువులు, కీటకనాశనుల సాయంతో మూడింతల దిగుబడి సాధించగల స్పీడ్‌ బ్రీడింగ్‌ వివరాలు నేచర్‌ ప్లాంట్స్‌ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement