ఆరోగ్య ‘సిరి’ధాన్యాలు

Millets Good For Health - Sakshi

మార్కెట్‌లో పెరుగుతోన్న డిమాండ్‌

నాడు పేద రైతు పంట.. నేడు అందరికీ వంట 

పశ్చిమ ఏజెన్సీలో మళ్లీ సాగు చేపట్టిన గిరిజనులు

ఆ రోజుల్లో తిండి వేరు.. ఇప్పుడంతా ఎరువుల తిండి.. తింటే రోగం.. తినకపోతే నీరసం.. ఇదీ పరిస్థితి.. అందుకే ప్రజల ఆహార అలవాట్లలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి.. ఆ‘పాత’ మధురం అంటున్నారు.. బామ్మలు, తాతయ్యలు ఒకప్పుడు తిన్న తిండినే ఇప్పుడూ మనమూ ఇష్టపడుతున్నాం.. చోడి జావ, జొన్న రొట్టె, సామలు, అరికెలు అంటూ వెంటపడుతున్నాం.. ఈ మార్పు ఆరోగ్యానికి ఎంతో మంచిదని వైద్యులు సైతం చెబుతున్నారు.. దీంతో జిల్లాలో ప్రతి ఒక్కరూ చిరు ధాన్యాలు తింటూ ఆయుః ఆరోగ్యాలను పొందే ప్రయత్నం చేస్తున్నారు. 

నేడు వ్యవసాయం ఆధునికంగా మారింది. వాణిజ్య పంటల వైపు రైతులు పరుగులు తీస్తున్నారు. తద్వారా బలవర్థకమైన ఆహార పంటలు కనుమరుగవుతున్నాయి. ఆరు, ఏడు దశాబ్దాల నాడు రైతులు ఎలాంటి ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడకుండా బలవర్థకమైన చిరు ధాన్యాలను పండించేవారు. అయితే ఆ తర్వాత వాటి సాగు కాల క్రమేపీ కనుమరుగైంది. నేడు పంటలు పండించే విధానం వల్ల వివిధ రకాల వ్యాధులు, అంతుచిక్కని రోగాలతో ప్రజలు సతమతమవుతున్నారు. లక్షలాది రూపాయల వైద్యం కోసం ఖర్చు చేస్తున్నారు. నేటి పరిస్థితులను పరిశీలిస్తే దేవుడి గుడిలో క్యూ కట్టే వారి కంటే ఆస్పత్రిలో క్యూకట్టే వారి సంఖ్య ఎక్కువగా కనిపిస్తుంది.

వ్యాధుల నుంచి రక్షించుకోవడం కోసం ఆహారపు అలవాట్లలో మార్పులు అనివార్యంగా భావిస్తున్నారు. ఈ మేరకు నాటి పేద రైతులు పండించే కొర్రలు, అండుకొర్రలు, సామలు, ఊదలు, అరికలు వంటి పంటలు ఇప్పుడు మిల్లేట్లుగా, సిరి ధాన్యాలుగా ప్రాచుర్యం పొందుతున్నాయి. ప్రతికూల వాతావరణాన్ని తట్టుకుని ఎటువంటి పరిస్థితుల్లోనైనా స్థిరమైన దిగుబడి ఇవ్వడంతో పాటు అధిక పోషక విలువలు కలిగి ఉన్నవే చిరుధాన్యాలు. చిరుధాన్యాల వినియోగంపై అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపడంతో తాజాగా వీటి సాగుపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. చిరు ధాన్యల సాగుతో లాభాలు మెండుగా ఉంటాయని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు.

పశ్చిమ ఏజెన్సీలో అధికంగా సాగు 
జిల్లాలోని పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల కొండ ప్రాంతంలో నివసించే ఆదివాసీలు జొన్నలు, రాగులు, చోళ్లు వంటి ప్రధాన పంటలు పంటలు పండించేవారు. అయితే మారుతోన్న కాలంతో పాటు గిరిజనులు కూడా ఆహారపు అలవాట్లలో మార్పులు కోరుకున్నారు. ప్రస్తుత ఆరోగ్య సమస్యల కారణంగా వారు కూడా చిరుధాన్యాల సాగువైపు మళ్లీ దృష్టి సారించారు. సిరుల పంటలపై ప్రస్తుతం పెరిగిన డిమాండ్‌ కారణంగా మిలేట్స్‌ పేరు(న్యూట్రీ గ్రెయిన్స్‌)గా, సిరి ధాన్యాలుగా మారిపోయింది. కరువు కాలాల్లోనూ పండే సిరి ధాన్యాల పంటలు కొత్తగా ప్రవేశించడంతో ప్రజల్లో ఆరోగ్యదాయక ఆహారంపై శ్రద్ధ పెరగగా నాడు సిరి ధాన్యాలు పంటలు పండించిన పేద రైతులను నేడు మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటున్నారు.

సామలతో కడుపు చల్లగా..
సామల పంట ఏ నేలలోనైనా పండుతుంది. అధిక ఉష్టోగ్రత, నీటిని తట్టుకుంటుంది. జూన్‌ నెల, జులై చివరివారం వరకూ ఈ పంటను విత్తుకోవచ్చు. సాళ్ల మధ్య 25 సెంటి మీటర్ల, మొక్క మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండాలి. ఈ పంటకాలం 80 నుంచి 90 రోజులు. ఎకరాకు 5 నుంచి 6 క్విం టాళ్ల దిగుబడి వస్తుంది. సస్యరక్షణకు సాధారణ పంటల మాదిరిగానే పనులు చేపట్టాల్సి ఉంటుంది.
పైత్యంను దూరం చేసే ఔషధం
సామలు తియ్యగా ఉంటాయి. వీటి ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయని వైద్యులు సూచిస్తున్నారు. పైత్యం ఎక్కువ అవ్వడం వల్ల భోజనం తర్వాత గుండెల్లో మంటగా ఉండటం, కడుపు ఉబ్బరంగా ఉండటం వంటి సమస్యలకు సామలు ఔషధంగా పనిచేస్తుంది. సుఖవ్యా«ధులు, అతిసారం, అజీర్ణం తగ్గిపోతుంది. పీచుపదార్థం మలబద్దకాన్ని అరికడుతుంది. మైగ్రేన్‌ సమస్యను దూరం చేస్తుంది. గుండె సమస్యలు, ఊబకాయం, కీళ్ల నొప్పులకు సామల పంట బలవర్థకమైన ఆహారం.

అరికెలతో ఆరోగ్యం
ఈ పంట ఏ నేలలో అయినా పండుతుంది. నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. పొడి వాతావరణం చాలా అనుకూలం. జూన్‌ నుంచి జులై నెలాఖరు వరకూ విత్తుకోవచ్చు. సాళ్ల మధ్య 25 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఉండాలి. పంట కాలం 95 రోజుల నుంచి 100 రోజుల వరకూ ఉంటుంది. ఎకరానికి 6 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
పిల్లలకు మంచి పోషకాహారం
అరికెలు తీపి, వగరు, చేదు రుచులు కలిగి ఉంటాయి. అధిక పోషకాలు కలిగి ఉండటం వల్ల పిల్లలకు మంచి ఆహారంగా పని చేస్తుంది. విటమిన్లు, ఖనిజాలు అధికంగా ఉంటాయి. జీర్ణశక్తి పెరుగుతుంది. కేన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా నివారిస్తుంది. వీటిని పప్పు దినుసులైన బొబ్బర్లు, శనగలతో కలిపి తీసుకుంటే శరీరానికి కావాల్సిన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. వాతం, కీళ్లవాతానికి, కంటి, నరాల బలహీనతకు అరికెలు మంచి ఆహారం. అరికె పిండి వాపులకు పై పూతగా వాడతారు.

తీపి, వగరు కలబోత.. కొర్రలు 


అండుకొర్రలను వండుతున్న గిరిజన మహిళ

తేలికపాటి ఎర్ర చెల్క నేలల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో పండించుకోవచ్చు. ఖరీఫ్‌ జూన్‌ రెండో వారం నుంచి జులై చివరి వారం వరకూ విత్తుకోవచ్చు. వరుసల మధ్య 30 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండేలా నాటుకోవాలి. పంట కాలం 75 నుంచి 80 రోజులు. ఎకరానికి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. చీడ, పీడలు చాలా తక్కువ. క్రిమికీటకాలు ఆశిస్తే సాధారణ పంటలకు పిచికారీ చేసిన మందులనే వాడితే సరిపోతుంది. 
కొలెస్ట్రాల్‌ కరిగే.. సుగర్‌ తరిగే..
కొర్రలు తీపి, వగరు రుచులు కలిగి ఉంటాయి. మధుమేహం వ్యాధిగ్రస్తులకు మంచి ఆహారం. శరీరంలో కొలెస్ట్రాల్‌ పరిమాణాన్ని తగ్గిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్‌లు అధికంగా ఉంటాయి. కొర్రల్లో అధిక పీచుపదార్థం, మాంసకృతులు, కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరంతో పాటు విటమిన్లు అధిక పాళ్లలో ఉంటాయి. చిన్నపిల్లలు, గర్భిణిలకు మంచి ఆహారం. ఉదర సంబంధిత వ్యాధులకు ఉపశమనం లభిస్తుంది.
ఏ నేలలోనైనా 
వీటిని ఏ నేలలోనైనా పండించవచ్చు. అతి తక్కువ వర్షపాతం ఉన్నా పంట చేతికి అందుతుంది. ఎకరానికి 5 నుంచి 6 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. సాళ్ల మధ్య 60 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు దూరం ఉండాలి. ఒక్కో దుబ్బకు 15 నుంచి 20 పిలకలకు వస్తాయి. పంటకాలం 85 రోజులు. సస్యరక్షణకు ఎరువుల వినియోగం మామూలుగా ఎర్రజొన్నలా వేస్తే సరిపోతుంది. 
నానబెట్టాలి
సంప్రదాయ పంటల్లో అండుకొర్రలు ఒకటి. అండుకొర్రలను నాలుగు గంటలు నానబెట్టిన తర్వాతే వండుకోవాలి. జీర్ణాశయం, ఆర్థరైటిస్, బీపీ, థైరాయిడ్‌ వంటి సమస్యలు, ఊబకాయ నివారణకు ఉపయోగపడతాయి. అల్సర్, కేన్సర్‌ చికిత్సకు ఉపయోగపడతాయి.

ఊదలు తియ్యన.. ఆరోగ్యం చక్కన
ఈ పంట ఏ నెలలోనైనా పండుతుంది. వరికి ప్రత్యామ్నాయ పంట. సాళ్లకు సాళ్లకు మధ్య 25 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 10 సెంటీమీటర్లు ఎడం ఉండాలి. పంట కాలం 90 నుంచి 95 రోజులు. దిగుబడి ఎకరానికి 5 నుంచి 8 క్వింటాళ్ల వరకూ వస్తుంది. సస్యరక్షణ చర్యలు మామూలు పంట మాదిరిగానే చేపట్టుకోవచ్చును. 
జీర్ణం.. జీర్ణం.. సులభం
ఊదలు రుచికి తియ్యగా ఉంటాయి. ఊదలతో తయారు చేసిన ఆహారం బలవర్థకంగా ఉంటుంది. సులభంగా జీర్ణమవుతుంది. ఉత్తర భారతదేశంలో ఉపవాస దీక్షలో ఎక్కువగా వినియోగిస్తారు. ఉత్తరాఖండ్, నేపాల్‌లో ఊదల ఆహారాన్ని గర్భిణిలు, బాలింతలకు ఎక్కువగా ఇస్తారు. ఊదలు వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. చిన్నపేగుల్లో ఉండే పుండ్లు, పెద్ద పేగులకు వచ్చే కేన్సర్‌ బారిన పడకుండా ఇవి కాపాడతాయి.

అంగన్‌వాడీ సెంటర్లలో ఆహారం 
అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే గర్భిణులు చిరు ధాన్యాలనే నేడు ఆహారంగా ఇస్తున్నారు. దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుందని మహిళలు చెబుతున్నారు. అలాగే బాల సంజీవని కార్యక్రమంలో గర్భిణులు, బాలింతలతో పాటు పిల్లలకు కూడా కొర్రలు, రాగి, జొన్నలు వంటి ఆహారాన్ని మెనూ ప్రకారం అందిస్తున్నారు.

ఆరోగ్యంగా ఉన్నాను 
నేను గర్భిణిని. నాకు మూడో నెల నుంచి పౌష్టికాహారంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో కొర్రలు, జొన్నలు, రాగి రొట్టె, జొన్నల పులిహోర వంటి ఆహారం ఇస్తున్నారు. కొర్రల ఆహారం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఆహారం ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచించారు. అవి తినడం వల్ల నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను.
–ఆసి దుర్గ, తూర్పురేగులకుంట, బుట్టాయగూడెం మండలం

మా నాన్న కొర్రలు పండించేవారు 
మా చిన్నతనంలో మా తండ్రి మాకున్న పొలంలో 2 ఎకరాలు కొర్రలు పండించేవారు. ఆ రోజుల్లో ఆ వంటలు ఎక్కువగా తినేవారం. మారుతున్న కాలంలో పాటు బియ్యం వంట తినేవారు ఎక్కువయ్యారు. అలాగే కొర్రల పంటలు పండించేవారు కూడా తక్కువగా ఉండటంతో ప్రస్తుత పంటలకు అలవాటు పడ్డాం. వరి తినడం వల్ల వ్యాధుల బారిన పడుతున్నాం. 
–ఆసి వీరమ్మ, తూర్పు రేగులకుంట, బుట్టాయగూడెం మండలం

రైతులను ప్రోత్సహిస్తున్నాం 
చిరుధాన్యాల పంటలపై రైతులను ప్రోత్సహిస్తున్నాం. పంటల ప్రాముఖ్యతపై గ్రామాల్లో రైతులతో అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాం. పాతతరం వారు వెంటనే పంటలు వేసేందుకు ముందుకు వస్తున్నారు. చిరుధాన్యాల పంటల సాగు పెరగాలంటే కొంత సమయం పడుతుంది.
–బి.సుమలత, వ్యవసాయాధికారి, బుట్టాయగూడెం

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top