పేరెంట్స్‌కూ పరీక్షే!

Learn how to prepare children for exams without stress - Sakshi

బుర్రలో చాలా  కెమికల్స్‌ ఉంటాయి.  నిజానికి అదో కెమిస్ట్రీ ల్యాబ్‌!  సరైన కెమికల్‌ రియాక్షన్‌లకి సరైన టెంపరేచర్‌ అవసరం. అలాగే... పరీక్షల సమయంలో  పిల్లల బ్రెయిన్‌ లేబొరేటరీలో  సరైన రిజల్ట్స్‌ కోసం  సరైన పేరెంటింగ్‌  అంతే అవసరం.  ఒత్తిడి పెట్టకుండా  పిల్లలను పరీక్షలకు  ఎలా తయారు చేయవచ్చో  అవగాహన కలిగించేందుకే  ఈ ప్రత్యేక కథనం.

ముందుగా పెద్దలు తెలుసుకోవాల్సిన కథ ఒకటి ఉంది. అంతగా చదువుకోని అండర్‌గ్రాడ్యుయేట్‌కు ఒక కొడుకు ఉన్నాడు. అతడి పేరు రమేశ్‌. ఆ ఇంటికి కాస్త దూరంలోనే మరో అబ్బాయి కూడా చదువుతున్నాడు. ఈ కుర్రాడి పేరు శీతల్‌.  శీతల్‌  వాళ్ల నాన్న పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌. రమేశ్‌తో పోలిస్తే శీతల్‌ వాళ్లది కాస్తంత కలిగిన కుటుంబం. ఒకే స్కూల్‌ కాదుగానీ... రమేశ్, శీతల్‌ ఇద్దరూ పదో తరగతి చదువుతున్నారు. పైగా రమేశ్‌తో పోలిస్తే శీతలే చదువులో చురుకు. మంచి క్లవర్‌ స్టూడెంట్‌ అని పేరు. మున్ముందే కెరియర్‌ ప్లానింగ్‌లూ గట్రా తెలియని రమేశ్‌ వాళ్ల నాన్న అతడికి ఎప్పుడూ భరోసా ఇచ్చాడు. రమేశ్‌కు తనపై తనకు నమ్మకం కలిగేలా మాట్లాడుతుండేవాడు. కానీ శీతల్‌ వాళ్ల నాన్న కెరియర్‌ ప్లానింగ్‌ గురించీ, భవిష్యత్తులో చేయాల్సిన పనుల గురించి, సాధించాల్సిన గోల్స్‌ గురించి ఎక్కువగా మాట్లాడుతుండేవాడు. అందరూ ఊహించిన దానికి భిన్నంగా పదో తరగతి పరీక్షల్లో శీతల్‌తో పోలిస్తే రమేశ్‌ గ్రేడ్స్‌ బాగా వచ్చాయి. దీనికో కారణం ఉంది. ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో చాలా బాగా స్కోర్స్‌ సాధిస్తారనుకున్న పిల్లల్లోని మూడింట రెండు వంతుల మంది పిల్లలు అనుకున్న దానికంటే తక్కువ స్కోర్‌ సాధించారు. వారి స్కోర్‌ అలా తగ్గడానికి కారణం ఆ పిల్లలు కాదు. కేవలం వాళ్ల తల్లిదండ్రులే. 

భరించగలిగే ఒత్తిడి అంటే... 
ఒత్తిడి ఎప్పుడూ చెడ్డదేనా? కాదు... ఓ మోతాదుకు మించనంతవరకు ఒత్తిడి చాలా మంచిది. చిన్నారులపై కాస్తంత ఒత్తిడి కూడా లేదనుకోండి. అప్పుడు పిల్లలు ఎగ్జామ్‌ను లైట్‌ తీసుకుంటారు. చదవాల్సిన పోర్షన్‌ను చదవనే చదవరు. ఇది ఎంతమాత్రమూ తగదు. ఇలాంటి పిల్లలపై పేరెంట్స్‌ కాస్త ఒత్తిడి పెంచాల్సిందే. ఒకింత శ్రద్ధతో తమంతట తామే చదువుపై శ్రద్ధ చూపే పిల్లలుంటారు. వారి గుణం, వారు చదువు పట్ల చూపే శ్రద్ధాసక్తులు వంటివి తల్లిదండ్రులకు తెలిసే ఉంటాయి. ఇలాంటి పిల్లల విషయంలో మాత్రం తల్లిదండ్రులు అతిగా ఒత్తిడి పెంచేలా చేయకూడదు. చేస్తే ఏమవుతుందో చూద్దాం. అసలే తమకు ఉన్న శ్రద్ధతో తాము చదువుకునే దానికి తోడు... తమ కెరియర్‌ తల్లిదండ్రులు చూపుతున్న అతి శ్రద్ధను చూస్తున్న కొద్దీ ఆ పిల్లల్లో మరింత ఒత్తిడి పెరుగుతుంది. అది యాంగై్జటీకి దారితీస్తుంది. దీన్నే వైద్యపరిభాషలో ‘పెర్‌ఫార్మెన్స్‌ యాంగై్జటీ’ అంటారు. దీన్నే  మరోలా చెప్పుకుందాం. ఎలాంటి ఒత్తిడి లేని సాధారణ పరిస్థితుల్లో వారు పుస్తకంలోని దాదాపు ప్రతి ప్రశ్నకూ సరైన సమాధానం రాయగలరు. కానీ పెర్‌ఫార్మెన్స్‌ యాంగై్జటీకి గురైనప్పుడు మాత్రం వారిలో ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో తాము రాస్తున్నదంతా కరెక్టేనా, ప్రదర్శించాల్సినంత ప్రతిభను తాము ప్రదర్శిస్తున్నామా లేదా అనే సందేహాలు మొలకెత్తుతాయి. అలా మొలకెత్తిన సందేహాలు ఊడలమర్రిలా పెరిగి అసలుకే మోసం వచ్చే అవకాశం ఉంటుంది.  అందుకే పరీక్షలకు చదువుతున్న పిల్లల విషయంలో తల్లిదండ్రుల శ్రద్ధ పిల్లల్లో అనుకూల ధోరణి పెంపొందేలా, ఆత్మవిశ్వాసం నింపేలా ఉండాలి. అంతేతప్ప పెర్‌ఫార్మెన్స్‌ యాంగై్జటీ కలిగించేలా ఉండకూడదు. 

ఒకటే మెదడు.. రెండు రకాల చర్యలు 
అందరిలో ఉండేదీ మెదడే. కానీ అదే మెదడు మనం వాడుకునే తీరును బట్టి రెండు రకాల ఫలితాలు ఇస్తుంది. మొదటిది చిన్నారికి మీరిచ్చే భరోసా, సాంత్వన, ఆత్మవిశ్వాసం నింపేలా మాట్లాడే మాటలు. ఇది అనుకూల ఫలితాలు ఇస్తుంది. కానీ అదే మరొక తండ్రి... తన కొడుకు/కూతురి కెరియర్‌ పట్ల ప్రదర్శించే అతి శ్రద్ధ, అతి జాగ్రత్త ఆ చిన్నారిలో పెర్‌ఫార్మెన్స్‌ యాంగై్జటీని పెంచితే అదే మెదడు ప్రతికూల ఫలితాలిచ్చేలా చేస్తుంది. పిల్లలిద్దరిలోనూ ఒకే లాంటి మెదడు... కాని అదిలా రెండు రకాలుగా ఎలా ప్రవర్తిస్తుందో చూద్దాం. 

భరోసాలో జరిగే ప్రక్రియ ఇదే... 
మీ అమ్మాయి పరీక్షల కోసం తయారవుతున్నదనుకుందాం. ఆమె స్వతహాగానే బాగా చదువుతుంది. శ్రద్ధ ఎక్కువే. అలాంటప్పుడు మీరు అమ్మాయిపై అదనంగా భారం వేయకండి. జస్ట్‌ భరోసా నింపండి చాలు. అదెలా? అమ్మాయి పరీక్షకు ప్రిపేర్‌ అవుతుంటుంది. ఎనిమిదింటికి భోజనం చేసి, తొమ్మిదిగంటలకల్లా పడుకునేది కాస్తా... రాత్రి పది దాటినా చదువుతోంది. తల్లి పాల గ్లాసుతో వెళ్లింది. ‘మరికాసేపు చదువుతావా? అలాగైతే ఈ పాలు తాగు’ అంది. ఇక్కడ ఆ తల్లి ధోరణీ, మాటలూ ఎలా ఉండాలంటే... ‘నువ్వు ఒక్కదానివే  కష్టపడుతున్నావు. మేం హాయిగా ఏ టీవీ చూసుకుంటూనో ఎలా ఉండగలం. హాయిగా మా మానాన మేమెలా నిద్రపోగలం. కాబట్టి మావంతుగా నీకు తోడుగా ఉంటున్నాం’ అంటూ అమ్మాయిలో సాంత్వన నింపేలా ఉండాలి. అంతే తప్ప... ‘మరికాసేపు చదవడం కోసం టీ తాగు... అప్పుడు నిద్రరాకుండా ఉంటుంది’ అనో... లేదా ‘ఉండాలనుకున్న దాని కంటే మరో అరగంట ఎక్కువగా మేలుకొని చదువుకో’ అనేలాగో ఆ మాటలు ఉండకూడదు. ఇలాంటి మాటలు పెర్‌ఫార్మెన్స్‌ యాంగై్జటీని కలిగిస్తాయి. అలాగే మర్నాడు అమ్మాయిని  తండ్రి ఎగ్జామినేషన్‌ సెంటర్‌కు తీసుకెళ్లే సమయంలో, ‘నువ్వెలాగూ ఈమాత్రం దూరం రాలేవని కాదు... కాకపోతే నేను నీకు తోడుగా వస్తే నీపై కాస్త ఒత్తిడి తగ్గడం కోసం వెంట వచ్చా’ లాంటి మాటలు వినిపించాలి. వెళ్లేప్పుడు ‘జాగ్రత్తగా రాయి... టెన్షన్‌ పడకు’ లాంటి మాటలను అనునయంగా చెప్పండి. ఆ పరీక్షలో ఏదో ఒక ప్రశ్న పాడుచేశాననీ, పది మార్కులు తగ్గవచ్చని అమ్మాయి అందనుకోండి. వెంటనే... ‘అలా జరగదేమోలే. చూద్దాం. నువ్వు అనుకున్నంత సంతృప్తి పడకపోవడం వల్ల నీలో అలాంటి ఫీలింగ్‌ ఉందేమోలే’ అనండి. అంతే తప్ప... ‘పది మార్కులంటే మాటలా... మరో పేపర్‌లో కనీసం 20 అయినా ఎక్కువ సంపాదించేలా చూడు. అప్పుడే ఆ నష్టం కాంపెన్సేట్‌ అవుతుంది’ లాంటి మాటలు మాట్లాడకండి. 

సాంత్వన మాటలతో ఏం జరుగుతుంది? 
మనందరి మెదడులో మాట్లాడేలా చేసే స్పీచ్‌ సెంటర్, చూసిందేమిటో చెప్పే విజువల్‌ సెంటర్‌ లాగే మరో ప్రత్యేక ప్రాంతమూ ఉంటుంది. దాని పేరు రివార్డ్‌ సెంటర్‌. ఉదాహరణకు మీరో ఎగ్జామ్‌లో క్లాస్‌ ఫస్ట్‌ వచ్చారు. మీ టీచర్‌ మిమ్మల్ని ‘గుడ్‌’ అని మెచ్చుకుంది. అప్పుడు మీ మెదడులో ఎండార్ఫిన్‌ అనే సంతోషం కలిగించే ఒక జీవరసాయనం విడుదల అవుతుంది. టీచర్‌ ఇచ్చిన ఆ అభినందన రివార్డ్‌తో కలిగిన సంతోషాన్ని పదే పదే పొందడం కోసం మళ్లీ మళ్లీ మీరు క్లాస్‌ ఫస్ట్‌ వచ్చేందుకు ప్రయత్నిస్తుంటారు. అంటే ఆ రివార్డు సెంటర్‌ ఇచ్చే ప్లెజర్‌ కోసం ప్రయత్నిస్తుంటారన్నమాట. అలా ప్లెజర్‌ ఇస్తుంది కాబట్టే దాన్నే ప్లెజర్‌ సెంటర్‌ అని కూడా అంటారు. ఇక అలాగే తల్లి తాను నిద్రపోకుండా తన కోసం మేల్కొని ఉండి పాల గ్లాసు తెచ్చి ఇచ్చిందనే భావన కూడా అమ్మాయిలో  ఒక కృతజ్ఞతను పెంపొందిస్తుంది. ఎదుటి వాళ్ల చర్య తమకు సంతోషం కలిగించిన భావన అనేది ‘ఫినైల్‌ ఇథలమైన్‌’ అనే మెదడులోని రసాయనం వల్ల కలుగుతుంది. 

అలాగే మర్నాడు ఉదయం ఎగ్జామ్‌ సెంటర్‌ దగ్గర తండ్రి మాటలూ, తండ్రి ఇచ్చే నమ్మకం, భరోసా అన్నవి అమ్మాయి మెదడులోని డోపమైన్‌ లాంటి హుషారు కలిగించే రసాయనాలను విడుదల చేస్తాయి. మన ఆరోగ్యకరమైన ఉద్వేగాలకు మూలం డోపమైన్‌. ఈ రసాయనం లోపిస్తే మన దృష్టి కేంద్రీకరణ శక్తి (కాన్సంట్రేషన్‌) తగ్గుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది. ఇది తగ్గడం వల్ల ప్రేమరాహిత్యంతో బాధపడుతున్న ఫీలింగ్‌ కూడా ఉంటుంది. అందుకే తండ్రి భరోసా డోపమైన్‌ను స్రవించేలా చేస్తుంది. కాస్త అటు ఇటు ప్రవర్తించినా మా నాన్న నన్ను అర్థం చేసుకుంటాడనే భావనను పెంచి ఆరోగ్యకరమైన ఉద్వేగాలకు కారణమవుతుంది. అలాగే ఎండార్ఫిన్‌ అనే మెదడులోని రసాయనం మనలో యాంగై్జటీని తొలగిస్తుంది. ఉదాహరణకు అమ్మాయి ఆ రోజు ఎగ్జామ్‌ బాగా రాసిందనుకుందాం. అప్పుడు స్రవించిన ఎండార్ఫిన్‌ అమ్మాయిలో ‘ఫీల్‌ గుడ్‌’ భావన పెంచుతుంది. అదే ఫీలింగ్‌ను మర్నాడు కూడా పొందడం కోసం ఇంకా బాగా చదువుతుంది. అంతే తప్ప... కేవలం తల్లిదండ్రుల ఒత్తిడి మేరకే పిల్లలు విజయాలు సాధిస్తారన్న మాట పూర్తిగా నిజం కాదు. ఇక ఆమె పరీక్షలు బాగా రాస్తున్న కొద్దీ తన మెదడులో ఇంకెన్నో రకాల సంతోష రసాయనాలు స్రవిస్తూ మరింత బాగా పెర్‌ఫార్మ్‌ చేసేలా ఆమెను ప్రోత్సహిస్తుంటాయి. వాటిలో ఎన్‌. ఆరాకిడోనోయల్‌ డోపమైన్‌ (ఎన్‌ఏడీఏ), నలడోయిన్, అరాకిడోనోయల్‌ గ్లెసెరాల్, వైరోడమైన్‌ వంటివి చాలానే ఉంటాయి. 

మరి పైన పేర్కొన్న దానికి ప్రతికూలంగా జరిగేదేమిటి? 
తల్లిదండ్రులు కేవలం పిల్లల్లో పరీక్షల ఒత్తిడిని మరింతగా పెంచే పనులే చేస్తున్నారనుకుందాం. అంటే ఉదాహరణకు... ‘బాగా చదువు. ఇప్పుడు చదవకపోతే భవిష్యత్తులో మట్టితట్టలు మోయడానికి తప్ప దేనికీ పనికిరావు. ర్యాంకులు రాకుండా కేవలం ఫస్ట్‌ క్లాస్‌ వస్తే... ఇప్పటి కాంపిటీషన్‌లో దిక్కూదివాణం ఉండదు. మీ మేనమామగారి అమ్మాయిలా నువ్వూ యూఎస్‌ వెళ్లాలి. మినిమమ్‌ ఐఐటీకి ప్రిపేర్‌ అయితేగానీ మామూలు బీటెక్‌ కూడా దక్కని రోజులివి’ లాంటి మాటలు పిల్లల్లో ఒత్తిడి పెంచేస్తాయి. ఓ మోస్తరుగా 70%, 80% పొందేవాళ్లు కూడా 60% లు లేదా ఏ సెకండ్‌ గ్రేడ్‌కో తగ్గినా తగ్గవచ్చు. 

ఇలాంటి మాటలతో మెదడులో ఏం జరుగుతుంది? 
ఒత్తిడిని పెంచి పెర్‌ఫార్మెన్స్‌ యాంగై్జటీ కలిగించే సందర్భంలో అమ్మాయిలో ఏం జరుగుతుందో చూద్దాం. మెదడులో ‘అమిగ్దలా’ అనే ఒక అవయవం ఉంటుంది. బాదాం షేపులో ఉండే ఈ అవయవం మనలో భయం, ఆందోళనా వంటి భావనలు ఉన్నప్పుడు కలిగే ఫీలింగ్స్‌ను వెదికి పట్టుకుంటుంది. అంతేకాదు... ఆ ఫీలింగ్స్‌ కలిగిన వెంటనే పక్కనే ఉండే హైపోథెలామస్‌ అనే అవయవానికి సిగ్నల్స్‌ ఇస్తుంది. అప్పుడది ఎదుట ఉన్న ఆ ప్రమాదాన్నీ, ముప్పునూ ఎదుర్కొనేందుకు అవసరమైన హార్మోన్లను విడుదల చేయమంటూ శరీరాన్ని ఆదేశిస్తుంది. అంతే... పెద్దపొత్తంలో హార్మోన్లూ, జీవరసాయనాలూ ఒంట్లో వెలువడుతాయి. ఉదాహరణకు పిల్లలు తీవ్రమైన ఉద్విగ్నతకు లోనైనప్పుడు పరిస్థితిని తప్పించుకునేందుకు ఎడ్రినల్‌ గ్రంథి నుంచి కార్టిసాల్స్, అడ్రినాలిన్, నార్‌–అడ్రినాలిన్‌ అనే హార్మోన్లు స్రవించాల్సిందిగా హైపోథెలామస్‌ అనే మెదడు భాగం... శరీరాన్ని ఆదేశిస్తుంది. దాంతో ఆమెలో రక్తపోటు పెరుగుతుంది. కాలేయం నుంచి చక్కెరలు వేగంగా విడుదలవుతాయి. ఒంటికి హాని చేసే కార్టిజోల్స్‌ అనే హానికర రసాయనాలు వెలువడుతాయి. ఇవి ఎముకల్ని బలహీనపరుస్తాయి. అయితే ఇలా రసాయనాలు వెలువడటం అన్నది ఏ కొద్దిసమయం పాటో జరిగితే పర్లేదు. కానీ పరీక్షలు కనీసం 20 రోజుల పాటు కొనసాగుతుంటాయి. ఇది పిల్లల ఒంటికీ, మెదడుకూ, భవిష్యత్తులో వాళ్ల  కెరియర్‌కే హాని చేయవచ్చు. అందుకే పరీక్షల సమయంలో పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన సాంత్వననిస్తూ, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతూ, తనపై తనకు నమ్మకం కలిగేలా ఉండాలి తప్ప... అతి ప్రవర్తనతో వాళ్లలో పలాయనభావాన్నీ, తల్లిదండ్రుల పట్ల ఏవగింపునూ కలిగించేలా ఉండకూడదు. 
పిల్లల్లో ఒత్తిడి పెరిగిన లక్షణాలు కనిపించినప్పుడు తల్లిదండ్రులు పిల్లలకు మరింత చేయూతనిస్తూ, ఆసరాగా నిలవాలి. అప్పుడే పిల్లల విజయాలనూ చవిచూడవచ్చు. వాళ్లలో ఆత్మహత్యల్లాంటి భావనలూ విజయవంతంగా నిరోధించవచ్చు. 

కేర్‌ అండ్‌ శ్రద్ధ అవసరమే... 
పై కథ చదివాక ‘పిల్లలపై శ్రద్ధ చూపకపోతే ఎలా?’ అనేది సగటు తల్లిదండ్రుల ప్రశ్న. మరీ ముఖ్యంగా పరీక్షల సమయంలో వారి పట్ల అదనపు శ్రద్ధ అవసరమే. కానీ అది పాయసంలో చక్కెర లేదా బెల్లం అంత మోతాదులో కావాలి. పాయసం రుచిగా ఉండాలంటే... అందులో మిగతా పదార్థాల రుచి కూడా తెలిసేలా... ఉండాల్సినంత తియ్యగానే ఉండాలి. చక్కెర అతిగా పడితే విపరీతమైన తీపి పెరిగి, పదార్థంపై మొహంమొత్తుతుంది. ఇదే ఉదాహరణ పెద్దలు తమ పిల్లల పట్ల ప్రదర్శించాల్సిన శ్రద్ధకూ వర్తిస్తుంది. ఇక్కడ పిల్లలపై తామెంత ఒత్తిడిని కలిగిస్తున్నారు, అది వారు భరించే స్థాయిలో ఉందా లేదా అన్నది తెలుసుకోగలగడమే మంచి పేరెంట్‌ తాలూకు విజ్ఞత.

పిల్లల్లో ఒత్తిడి పెరుగుతోందని గ్రహించడం ఎలా? 
పరీక్షల కారణంగా పిల్లల్లో ఒత్తిడి పెరుగుతుందని గ్రహించడానికి వీలుగా వాళ్ల శరీరం కూడా తల్లిదండ్రులకు కొన్ని సిగ్నల్స్‌ పంపిస్తుంది. ఉదాహరణకు... ∙పిల్లల్లో నిర్ణయం తీసుకునే శక్తి తగ్గుతుండటం ∙ఏదైనా అంశం పట్ల దృష్టికేంద్రీకరణ/ఏకాగ్రత తగ్గడం ∙గోళ్లు కొరుక్కుంటూ టెన్షన్‌గా కనిపించడం ∙త్వరగా విసుగు, నిర్లిప్తత, కోపం వంటి భావనలకు లోనుకావడం వంటి ప్రవర్తనాపూర్వకమైన లక్షణాలు కనిపించవచ్చు. అలాగే శారీరక లక్షణాల్లో భాగంగా కనిపించేవి...
∙వికారం, వాంతి వచ్చినట్లుగా ఉండటం  
∙మాటిమాటికీ చెమటలు పడుతూ ఉండటం
∙ఛాతీ పట్టేసినట్లు ఉండటం            
 ∙వేగంగా శ్వాసతీసుకుంటూ ఉండటం వంటివీ కనిపించవచ్చు. 
∙పిల్లల్లో మైగ్రేన్‌ తలనొప్పుల వంటివి కనిపిస్తే... ఈ సీజన్‌లోనైతే దానికి కారణం పరీక్షల ఒత్తిడే కావచ్చని ఊహించడం తేలికే. అలాగే మరికొందరిలో తీవ్రమైన ఒత్తిడి ఆస్తమాకూ దారితీయవచ్చు. 
∙ఇక బాలికల్లో అయితే వారి మెదడులోని హైపోథెలామస్‌ గ్రంథి ఆదేశాల మేరకు గొనాడోట్రాఫిన్‌ వంటి హార్మోన్లు స్రవించడం వల్ల రుతుస్రావం క్రమం తప్పడం వంటి లక్షణాలు కనిపిస్తూ, వాళ్ల హార్మోన్లలో అసమతౌల్యత ఏర్పడినట్లు స్పష్టంగా తెలియజేస్తుంది.
డాక్టర్‌ బి. చంద్రశేఖర్‌ రెడ్డి, 
చీఫ్‌ న్యూరాలజిస్ట్, సిటీ న్యూరో సెంటర్, 
రోడ్‌ నెం. 12, బంజారాహిల్స్, హైదరాబాద్‌  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top