నవ్వడం ఒక యోగమ్‌

Laughter is a good for health

లాఫ్టర్‌ యోగా

సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేని దివ్య ఔషధం నవ్వు అని ఆధునిక పరిశోధనలు తెలియజేస్తున్నాయి అమెరికాలో అదో చిన్న యోగా సెంటర్‌.అలై్జమర్స్‌తో బాధ పడే కుటుంబ సభ్యులు ఉన్న ఐదారు మంది అక్కడకు చేరుకున్నారు. అలై్జమర్స్‌తో బాధ పడే పేషెంట్స్‌ను ఇరవై నాలుగ్గంటలూ ఎవరో ఒకరు చూసుకోవాలి. అలా చూసుకునేది కుటుంబ సభ్యులు అయితే గనుక వారి మీద చాలా ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి ఎక్కువైతే ఆరోగ్యం దెబ్బ తింటుంది. మరి దానికి విరుగుడు? ఇదిగో ఈ సెంటర్‌లో చేసే లాఫ్టర్‌ యోగా. ఆ కుటుంబ సభ్యులంతా కొన్ని క్షణాల్లోనే ఒక వృత్తంలా నిలుచున్నారు. ఒకరి కళ్లల్లోకి మరొకరు చూసుకున్నారు. అంతే. హాయిగా నవ్వడం మొదలుపెట్టారు. మెల్లగా... మెల్ల మెల్లగా... ఆ తర్వాత ఉధృతంగా. ఒకటే నవ్వు. నవ్వే కొద్దీ వారిలో కండరాలు రిలాక్స్‌ అయ్యాయి. శరీరం రిలాక్స్‌ అయ్యింది. మనసు కూడా రిలాక్స్‌ అయ్యింది. ఎంతో హాయిగా సంతోషంగా అనిపించింది. మళ్లీ కొన్ని రోజులు ఒత్తిడితో పని చేయదగ్గ శక్తి వచ్చింది. ఇంకా ఏం కావాలి? ఇలా వీరు మాత్రమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది నవ్వునే ఔషధంగా స్వీకరించి జీవితాలను ఒడిదుడుకులను దాటుకుంటూ జీవిస్తున్నారు.

కనిపెట్టింది మనవాడే
మదన్‌ కటారియా. ఈ పేరు చాలామంది నవ్వుబోతులకు తెలిసే అవకాశం లేదు. కాని ఇవాళ ప్రపంచంలో చాలామంది ఇతని వల్లే నవ్వుతున్నారు. లాఫ్టర్‌ యోగాను సాధన చేస్తున్నారు. మదన్‌ కటారియా ముంబైలో డాక్టర్‌గా పని చేసేవాడు. దాంతో పాటు ఒక హెల్త్‌ మేగజీన్‌ను కూడా నడిపేవాడు. ముంబైలో ప్రజల క్షణం తీరిక లేని జీవితం వల్ల వాళ్ల రోగ నిరోధక శక్తి తగ్గి రోగాల బారిన పడుతున్నారని అర్థం చేసుకున్నాడు. దీనికి విరుగుడు ‘నవ్వే’ దివ్య ఔషధం అని భావించాడు.

1995లో కేవలం 5 మందితో
1995లో కేవలం అయిదు మంది మిత్రులతో ముంబైలోని ఒక పార్క్‌లో మదన్‌ కటారియా ‘లాఫింగ్‌ క్లబ్‌’ను ప్రారంభించాడు. ఒక్కొక్కరు ఒక్కో జోక్‌ చెప్పడం... హాయిగా నవ్వడం... ఇదేదో బాగుందే అని నాలుగు రోజుల్లోనే చాలామంది జమ అయ్యారు. ఈ సంగతి నలుగురికీ పాకింది. ముఖ్యంగా రిటైరయి ఒంటరితనం భావించే వయోజనులు ఈ క్లబ్‌ పట్ల చాలా తొందరగా ఆకర్షితులయ్యారు. పత్రికలలో ప్రచారం వల్ల ముంబై లాఫింగ్‌ క్లబ్‌ స్ఫూర్తి ఇతర ఊర్లకు కూడా ఇది పాకింది. ఎక్కడ చూసినా నవ్వులే... వికటాట్టహాసాలే.

సమస్య వచ్చింది...
ముంబైలో లాఫింగ్‌ క్లబ్‌ మొదలెట్టాక మదన్‌ కటారియాకు ఒక సమస్య వచ్చింది. అదేమిటంటే నెల రోజుల్లోనే క్లబ్‌ సభ్యులకు తెలిసిన జోకులన్నీ అయిపోయాయి. కొందరు బూతు జోకులు తెచ్చి చెప్పడం మొదలుపెట్టారు. దాంతో మిగిలిన సభ్యులకు విముఖత వచ్చింది. లాఫింగ్‌ క్లబ్‌ మూతపడే పరిస్థితి వచ్చింది. మదన్‌ కటారియాకు ఏం చేయాలో పాలుపోలేదు. ‘నాకు ఒక రోజు టైమ్‌ ఇవ్వండి. దీనికి పరిష్కారం చెబుతాను’ అని అతడు ఇంటికొచ్చి పుస్తకాలు తిరగేయడం మొదలుపెట్టాడు. అప్పుడే అతడికి ఒక విషయం తెలిసి వచ్చింది. ‘మెదడుకు మనం నవ్వుతున్నామన్న సంగతే తెలుస్తుంది తప్ప అది నిజం నవ్వుకూ దొంగ నవ్వుకు తేడా తెలుసుకోలేదు. కాని నవ్విన ప్రతిసారీ ఆనందాన్ని ఇచ్చే రసాయనాలు (ఎండార్ఫిన్స్‌)ను అది విడుదల చేస్తుంది’ అని. దాంతో అతడు ఉత్తనే మనం నవ్వొచ్చు అని లాఫింగ్‌ క్లబ్‌ సభ్యులకు తెలియ చేశాడు. అలా అందరూ అకారణంగానే పెద్ద పెద్దగా నవ్వును ‘అభినయించడం’ మొదలుపెట్టారు. వరుస పెట్టి నవ్వడం ఎవరికైనా ఇబ్బందే కనుక మధ్య మధ్య ఉచ్చ్వాస నిశ్వాసలతో కూడిన ఎక్సర్‌సైజులు జత చేశారు. వీటన్నింటికి కలిపి ‘లాఫ్టర్‌ యోగా’ అని పేరు పెట్టాడు మదన్‌ కటారియా.

70 దేశాలలో 6000 క్లబ్బులు
ప్రస్తుతం లాఫ్టర్‌ యోగా క్లబ్బులు 70 దేశాలకు విస్తరించాయి. దాదాపు 6000 క్లబ్బులు ఆరోగ్యం కోసం నవ్వును ప్రచారం చేస్తున్నాయి. బృందగానంలో ఒకరు హమ్‌ చేస్తే మిగిలినవాళ్లు ఎలా హమ్‌ చేస్తారో అలాగే ఈ క్లబ్బులో ఏ జోక్‌ చెప్పకపోయినా, నవ్వొచ్చే విషయం లేకపోయినా నవ్వును ఒకరు అందించడం ద్వారా మరొకరు అందుకుంటూ ఉంటారు. ‘నవ్వడం భోగం, నవ్వించడం యోగం, నవ్వకపోవడం రోగం’ అని మన దర్శకుడు జంధ్యాల అన్నారు. లాఫ్టర్‌ యోగాను కనిపెట్టడానికి చాలా రోజుల ముందే ఆయన ఈ మాట అన్నారు. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నది ఆర్యోక్తి. దీనిని నేటి బిజీ రోజులకు సరి చేసుకుని ‘హాస్యమే మహాభాగ్యం’ అనుకోవాలి. అయిన దానికి కాని దానికి హాయిగా నవ్వుకుంటూ మెడికల్‌ షాప్‌ దారిని మర్చిపోవాలి.

సినిమాలో లాఫ్టర్‌ యోగా
లాఫ్టర్‌ యోగా ప్రభావం సినిమాల్లో కూడా కనిపించింది. రాజ్‌కుమార్‌ హిరాణి తన ‘మున్నాభాయ్‌ ఎంబిబిఎస్‌’లో విలన్‌ బొమన్‌ ఇరానీకి ఈ మేనరిజమ్‌ పెట్టాడు. తనకు కోపం వచ్చినప్పుడల్లా బొమన్‌ మరింత నవ్వుతుంటాడు. తెలుగులో ఈ రోల్‌ చేసిన పరేష్‌ రావెల్‌ కూడా తెగ నవ్వుతూ పాత్రను రక్తి కట్టించాడు.

నవ్వడానికి నామోషీ పడకండి
లాఫ్టర్‌ యోగా గురించి విస్తృతంగా ప్రచారం చేస్తున్న మదన్‌ కటారియా చెప్తున్న కొన్ని విషయాలు.
►చిన్న పిల్లలను గమనించండి. వాళ్లు ఆటల్లో పాటల్లో చాలా నవ్వుతారు. అందువల్లే వారు ఉత్సాహంగా ఉంటారు. పెద్దలు నవ్వకూడదని, అది సంస్కారం కాదని మనల్ని కండిషన్‌ చేశారు. కాని నవ్వాలి. ఎంత బాగా నవ్వితే అంత ఆరోగ్యం.
►నేను బిజీ డాక్టర్‌ని. కాని జనానికి నవ్వు విలువను తెలియచేయడానికి ప్రాక్టీసు మానేశాను. ఒక డాక్టర్‌ చేయలేని పని ఒక హాౖయెన నవ్వు చేస్తుంది.
►నేను సంవత్సరంలో మూడు నాలుగు సార్లు జబ్బు పడేవాణ్ణి. కాని లాఫ్టర్‌ యోగా మొదలుపెట్టాక నా రోగ నిరోధక శక్తి పెరిగింది. నా శరీరం, మనసు శక్తిమంతమయ్యాయి. మన చుట్టూ చాలా నెగెటివిటీ ఉంది. దానికి మన శరీరం, మనసు సులభంగా లొంగుతాయి. నవ్వు ఈ పరిస్థితి నుంచి బయటపడేస్తుంది.
►నేను చెప్పడం కాదు – గత ఇరవై ముప్పై ఏళ్లుగా జరుగుతున్న పరిశోధనలు కూడా నవ్వు ఆరోగ్యానికి మంచిది అని చెబుతున్నాయి. డిప్రెషన్‌తో ఉన్నవాళ్లు ఈ యోగాతో సులభంగా ఆరోగ్యవంతులు అవుతారు. బి.పి ఉన్నవాళ్లకు అది కంట్రోల్‌లో ఉంటుంది. నీరసం దరి చేరదు.
►మన మీద ఇతరులు చేసే కామెంట్స్‌ను, వెక్కిరింతను కూడా మనం స్వీకరించి ఎప్పుడైతే హాయిగా నవ్వగలుగుతామో అప్పుడే ఆరోగ్యవంతులవుతాము.
►నా లాఫ్టర్‌ యోగాను చూసి మెచ్చుకున్నవారిలో దిలీప్‌ కుమార్‌ వంటి గొప్పవారు ఉన్నారు... ఓప్రా విన్‌ఫ్రే వంటి సెలబ్రిటీలు ఉన్నారు.
►మాస్కోలో నేనొక ప్రదర్శన ఇచ్చాను. నాకు ఒక్క ముక్క భాష రాకపోయినా ఒక్క జోక్‌ చెప్పకుండా అరగంట సేపు వాళ్లను నవ్వించాను. నవ్వాలంటే కారణం అక్కర్లేదు.
డాక్టర్‌ మదన్‌ కటారియా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top