తినే వేళలూ ముఖ్యమే! | important of feeding time and health tips | Sakshi
Sakshi News home page

తినే వేళలూ ముఖ్యమే!

Sep 21 2016 11:56 PM | Updated on Sep 4 2017 2:24 PM

తినే వేళలూ ముఖ్యమే!

తినే వేళలూ ముఖ్యమే!

చాలామంది మనం ఏం తింటున్నామనే అంశానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు.

చాలామంది మనం ఏం తింటున్నామనే అంశానికి ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుంటారు. కానీ ఏం తిన్నామన్న దానికంటేఎప్పుడు తిన్నాం అన్నదే ముఖ్యం. ఆరోగ్యకరమైన ఆహారమే కాదు.... ఆరోగ్యకరమైన భోజనవేళలూ ముఖ్యం.

పాప పుట్టాక ప్రశాంతి దాదాపు 30 కిలోల బరువు పెరిగింది! ప్రసవం అయిన కొంతకాలంలోనే ఇంతగా బరువు పెరగడం ఆమెను చాలా అసౌకర్యానికి గురిచేస్తోంది. బరువు తగ్గించుకోడానికి తన వంతు ప్రయత్నం చేద్దామని అనుకుంది ప్రశాంతి. బిడ్డకు రెండేళ్ల వయసు వచ్చే సరికి అదనంగా పెరిగిన బరువు తగ్గింది కూడా! దీనికోసం ఆమె డైట్‌పిల్స్ వాడలేదు. ఇంకేమీ చేయలేదు. వేళకు భోజనం చేసిందంటే. ఆమె కొత్తగా ప్రారంభించిన డీజే ఆఫీసులో వృత్తి కూడా ఆమెకు భోజనవేళలు మార్చుకోవడానికి దోహదపడింది.

మామూలుగా అయితే ఆమె రాత్రి 9 గంటలకు భర్తతో పాటు భోజనం చేస్తుండేది. డీజే ఆఫీసులో పనిచేయడానికి వెళ్లడం వల్ల ఆమె సాయంత్రం 5.30 గంటలకే భోజనం పూర్తి చేయాల్సి వచ్చేది. పాపను బేబీసిట్టర్ దగ్గర దింపేముందరే తాను భోజనం చేయాల్సి వచ్చేది కాబట్టి ఆ వేళకు ఆమె భోజనం పూర్తి చేసేసేది. అది ఆమె బరువు తగ్గడానికి తోడ్పడింది!

 పరిశోధనలతోనూ తేటతెల్లం
రాత్రివేళల్లో తిండితో బరువు పెరుగుతుందనే విషయం తాజా పరిశోధనల్లోనూ నిరూపణ అయింది. సాల్క్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ బయలాజికల్ సెన్సైస్ కు చెందిన సచ్చిదానంత పాండా పరిశోధనశాలలోని ఎలుకలు ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయి. బాగా పొద్దుపోయాక తిండి తినే ఎలుకలు విపరీతంగా బరువు పెరిగాయి. దీనికి భిన్నంగా తాము చురుగ్గా ఉన్నప్పుడు (అంటే పగటి వేళల్లో) తిండితినే జీవులు సన్నబడ్డాయి.

మనలో ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించేందుకు ఎలుకలపై జరుగుతున్న ఈ పరిశోధనలూ తోడ్పడుతున్నాయి. రాత్రంతా ఏదో ఒకటి తింటూ ఉండే జీవుల్లో డయాబెటిస్ వచ్చే అవకాశాలు ఎక్కువ. అంతేకాదు... బరువు పెరగడంతో పాటు ఈ జీవుల్లో ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశాలు సైతం పెరుగుతున్నాయి. దీనికి భిన్నంగా రాత్రంతా తినకుండా ఉండటం వల్ల కొలెస్ట్రాల్ పాళ్లు తగ్గడం గణనీయంగా కనిపిస్తోంది. ‘‘అందుకే... సాధారణంగా రాత్రి నిద్రపోయే ఆ సమయంలో ఒకవేళ నిద్రపట్టకపోయినా ఏదో ఒకటి తినడం సరైన పని కాదు. దీనివల్ల బరువు తప్పక పెరుగుతుంది’’ అంటారు సచ్చిదానంత పాండా.

 ఆరోగ్యానికీ... తిండి వేళలకూ సంబంధం ఉంది!
మన ఆరోగ్యానికీ, భోజన వేళలకూ గట్టి సంబంధమే ఉందని తెలుసుకోండి. నిజానికి పగటి వేళ వెలుతురు ఉన్న సమయం పని కోసం, రాత్రి సమయం మన నిద్రకోసం ఉద్దేశించిందన్న అంశం ముందుగా తెలుసుకోవాలి. ఆ వేళలకు తగ్గట్లుగా పగలు  చురుగ్గానూ, రాత్రి మందకొడిగా ఉండేలా మనలోని అవయవాలు ఆల్రెడీ ప్రోగ్రామ్ అయిపోయి ఉంటాయి. ఇలా పగలు, రాత్రికి తగ్గట్లుగా మనం చురుగ్గానూ, నిద్రతోనూ ఉండేలా జీవగడియారంలో నమోదై ఉండటాన్నే ‘సర్కాడియన్ రిథమ్’గా పేర్కొంటాం. దీనికి భిన్నంగా పొద్దుకుంగాక కూడా కృత్రిమవెలుగులకు ఎక్స్‌పోజ్ అవుతూ ఉండటం మనలో అనారోగ్యానికి కారణమవుతుంటుంది.

 వెలుగుకు ఒక గడియారం... ఆహారానికి మరొకటి...
వెలుతురు, చీకట్లకు అనుగుణంగా నడిచే జీవగడియారం ఒకటుంటుంది. కొత్తగా తెలిసిన సమాచారం ఏమిటంటే దానితో పాటు ఆహారానికి సంబంధించి కూడా ఒక జీవగడియారం ఉంది. అయితే దీని గురించి సైంటిస్టులు మరింత అధ్యయనం చేయాల్సి ఉంటుంది. రాత్రివేళల్లోనూ పగటివేళలో ఉన్నట్లే లైట్లతో కృత్రిమ వెలుగును సృష్టిస్తే ఎంత సమస్యగా ఉంటుందో... అదే పనిగా పగలూ రేయీ తింటూ ఉంటే కూడా అంతే సమస్యగా ఉంటుంది. పగటివేళ స్రవించాల్సిన జీర్ణరసాయనాలు పగలూరేయీ తేడా లేకుండా అదే పనిగా స్రవిస్తుంటాయి. ‘‘మనం ఎప్పుడూ తింటూనే ఉంటే మన గ్లూకోజ్ పాళ్లు ఎప్పుడూ తారస్థాయిలోనే ఉంటుంటాయి’’ అంటారు శాన్‌డియాగోకు చెందిన రూత్ పాటర్‌సన్ అనే నిపుణుడు. దాంతో వాటిని అదుపులో ఉంచేందుకు ఇలా అదేపనిగా ఇన్సులిన్ స్రవిస్తూ ఉంటుంది. ఇలా అదేపనిగా ఇన్సులిన్ స్రవించడం అంటే క్యాన్సర్‌కు కారణాలైన ప్రీక్యాన్సరస్ కణాలను ఉత్తేజపరచడమే. ఇక రాత్రివేళలో భోజనానికీ, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కూ మధ్య కనీసం 13 గంటల వ్యవధి ఇచ్చేవారిలో రొమ్ముక్యాన్సర్ వచ్చే అవకాశాలూ తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

 జీర్ణవ్యవస్థకు రెస్ట్ ఇస్తే...
‘‘రాత్రి నిద్రపోయే సమయంలో తిండి తినకుండా ఉండటం అనేది పెద్ద సమస్య కాదు. రాత్రి కనీసం 8 గంటలప్పుడు భోజనం చేసినా... మర్నాడు ఉదయం మళ్లీ 8 గంటలకు బ్రేక్‌ఫాస్ట్ చేస్తే చాలు. ఆటోమేటిగ్గా కనీసం పన్నెండు గంటల వ్యవధి దొరుకుతుంది. ఈ పన్నెండు గంటల్లో జీర్ణవ్యవస్థ తనకు అవసరమైన విశ్రాంతి పొందుతుంది. ఈమాత్రం విశ్రాంతి ఇస్తే అది సమర్థంగా పనిచేస్తుంది’’ అంటారు పాటర్‌సన్. అయితే ఉదయం వేళ తినే బ్రేక్‌ఫాస్ట్ చాలా ప్రధానమైనది. దాన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ తప్పించకూడదు. రాత్రి భోజనానికీ, ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌కూ మధ్య 12 - 14 గంటల వ్యవధి ఇవ్వాలి.  అంత వ్యవధిని బ్రేక్ చేస్తుంది కాబట్టే బ్రేక్‌ఫాస్ట్ అంత ముఖ్యమైనది.

బరువు తగ్గడానికి కొన్ని సూచనలు!
రోజులో సగం ఉపవాసం ఉండండి...

రోజులో సగం వ్యవధి భోజనం నుంచి మీ జీర్ణ వ్యవస్థకు విశ్రాంతి ఇవ్వండి. దీనికోసం రాత్రి 7.30 నుంచి ఉదయం 8.30 వరకు తినకుండా ఉండండి.

బ్రేక్‌ఫాస్ట్ చక్రవర్తిలా తినండి...

మీరు ఉదయం వేళ తినే టిఫిన్ రాజుల భోజనంలా ఉండాలి. మధ్యాహ్న భోజనం సామాన్యుడి తిండిలా ఉండాలి. రాత్రి మాత్రం నిరుపేద తిన్నట్టే తినాలి.

రాత్రి పొద్దుపోయాక భోజనాలు వద్దు...

రాత్రి మరీ పొద్దుపోయాక భోజనం చేయకండి. కాస్త పెందళాడే భోజనం చేయండి. దాంతో మీ రాత్రి భోజనాన్ని జీర్ణం చేసేందుకు జీర్ణవ్యవస్థకూ కాస్త సమయం చిక్కుతుంది.

రాత్రివేళలో నీళ్లు మాత్రమే తాగండి...

నిద్రవేళల్లో ఒకవేళ మీరు మెలకువతో ఉన్నా ఏమీ తినవద్దు. మంచినీళ్లు మాత్రం తాగుతూ ఉండండి.

మీ భోజన జీవగడియారాన్ని సెట్ చేయండి...
నిద్ర కోసం ఉన్నట్లే భోజన వేళలకూ జీవగడియారం ఉందని తెలిసింది కదా. మీ భోజన వేళలను ఆ గడియారంలో సెట్ చేయండి. దానికి అనుగుణంగా రోజూ వేళకు తినండి. ఆరోగ్యకరంగా బరువు తగ్గుతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement