ఎత్తు చెప్పుల అనర్థాలను చిత్తు చేయండిలా! | High heals tips | Sakshi
Sakshi News home page

ఎత్తు చెప్పుల అనర్థాలను చిత్తు చేయండిలా!

Jul 2 2018 2:02 AM | Updated on Jul 2 2018 2:02 AM

High heals tips - Sakshi

హైహీల్స్‌ వేసుకుంటే చూడ్డానికి బాగుంటుందేమోగానీ.. వాటి హీల్‌ పరిమితికి మించి  ఉండటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. ఎముక బాల్‌ మీద అదనపు ఒత్తిడి కలిగి, మడమలో తీవ్రమైన నొప్పి వస్తుంది. తుంటి భాగంలో ఉండే ‘హిప్‌ ఫ్లెక్సార్‌ కండరాలు’ అవసరమైనదానిక కంటే ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది . ఈ చెప్పులు మహిళల మోకాల్లో లోపలివైపున ఒత్తిడిని (ఇన్‌వర్డ్‌ ఫోర్స్‌) కలిగించి, ఆస్టియో ఆర్థరైటిస్‌కు కారణమవుతాయి.

వీటి వల్ల చీలమండ భాగంలోని యాంకిల్‌ జాయింట్‌ కదలికలు కూడా బాగా తగ్గిపోతాయి. దాంతో పిక్క కండరాలు పొట్టిగా మారి, బలం కోల్పోతాయి. అన్నిటికీ మించి అదనపు హీల్‌ కారణంగా బ్యాలెన్స్‌ కోల్పోయే అవకాశాలు పెరిగినకొద్దీ పడిపోవడం, గాయపడటం వంటి ప్రమాదాలకు అవకాశాలు ఎక్కువ. ఇన్ని ప్రమాదాలు ఉన్నప్పటికీ మహిళలు హైహీల్స్‌ను ఇష్టపటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఇవి తొడుక్కున్నప్పుడు మడమలు మరింత ఎత్తుకు వెళ్తాయి.

హైహీల్స్‌ వేసుకున్నప్పుడు కలిగే శరీరాకృతి చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. దీనికి కారణం మన మడమలు ఎత్తు కాగానే... దాన్ని బ్యాలెన్స్‌ చేయడానికి మరింత నిటారుగా నిలుచోవడమే. ఇలా నిటారుగా ఉండటం వల్ల మహిళల అందం ఇనుమడించినట్లు కనిపించడంతో పాటు, ఆత్మవిశ్వాసం వ్యక్తమవుతున్న ఫీలింగ్‌ ఉంటుంది. అందుకే మహిళలు అంత రిస్క్‌ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటివారు హైహీల్‌తో వచ్చే అనర్థాలను సాధ్యమైనంతగా తగ్గించడానికి అనుసరించాల్సిన కొన్ని టిప్స్‌ ఇవి...

రోజంతా హైహీల్స్‌ వేసుకోకండి. మీకు మరీ ముఖ్యమైనవి అనిపించిన కొన్ని  సందర్భాల్లోనే వాటిని ధరించండి.
  మీ హైహీల్‌ చెప్పుల కోసం మధ్యాహ్నం లేదా సాయంత్రాలలోనే షాపింగ్‌ చేయండి. ఆ సమయంలో మీ పాదాల ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ. మిగతా సమయాల్లో హైహీల్స్‌ ధరించాల్సి వస్తే ఆ సమయాల్లో ఫ్లెక్సిబిలిటీ తక్కువ కావడంతో సరిగ్గా మీ పాదాలకు సరిపోయేవి దొరకకపోవచ్చు. అందుకే ఈ జాగ్రత్త.  
 మీ హైహీల్‌ షూను ఎంచుకునే సమయంలో ఒకదాని తర్వాత మరొకటి ధరించి కాకుండా... రెండింటినీ ఒకేసారి వేసుకుని నడిచి చూడండి. (ఒక్కోసారి హీల్‌ నిడివిలోనూ మార్పు ఉండవచ్చు. రెండింటినీ ఒకేసారి వేసుకుంటే ఆ తేడా తెలిసేందుకు అవకాశం ఎక్కువ).
 మీ హైహీల్స్‌ తొడిగే ఫ్రీక్వెన్సీ ఎంత తగ్గితే మీకు దాని వల్ల వచ్చే నొప్పులూ అంతగా తగ్గుతాయి.
 పాయింటెడ్‌ హైహీల్స్‌ లేదా మరీ బిగుతుగా ఉండే షూస్‌ వేసుకోవద్దు.
 హైహీల్స్‌ వేసుకునే ముందుగా మీ మోకాలి కింద వెనక భాగంలో ఉండే కాఫ్‌ మజిల్స్‌ను కాసేపు రుద్దుకుంటూ, కాసేపు వార్మప్‌ మసాజ్‌లా చేయండి. కాఫ్‌ మజిల్స్‌కు ప్రతిరోజూ తగినంత వ్యాయామాన్ని, స్ట్రెచింగ్‌ను ఇవ్వండి.
 హైహీల్స్‌ తొడగడానికి ముందుగా కాస్తంత వార్మింగ్‌ అప్‌ ఎక్సర్‌సైజ్‌ కోసం అటూ ఇటూ మెల్లగా పరుగెత్తి... ఆ తర్వాతే హైహీల్స్‌ వేసుకోండి.
 మీరు నిర్దేశించుకున్న సమయం కంటే ఎక్కువ సేపు హైహీల్స్‌ వేసుకుంటే... అవి విడిచాక కాసేపు రెండు కాళ్లూ కాస్తంత దూరంగా పెట్టి పాదాలు నేలకు ఆనేట్లుగా ఉంచి కాసేపు అలాగే నిలబడండి. ఈ సమయంలో ముందుకు వంగి మోకాళ్లు ఒంగకుండా చేతి వేళ్లతో కాలివేళ్లను ముట్టుకునే స్ట్రెచింగ్‌ ఎక్సర్‌సైజ్‌ చేయండి.
 హైహీల్స్‌ తొడిగినప్పుడు నొప్పిగా ఉంటే అలా భరిస్తూ నడక కొనసాగించకండి. వెంటనే వాటిని విడిచేయండి. నొప్పి తగ్గేవరకు మీకు సౌకర్యంగా ఉండే మామూలు చెప్పులు ధరించండి. ఈ నొప్పులన్నీ తగ్గాకే మళ్లీ హైహీల్స్‌ ట్రై చేయండి.
 మీరు హైహీల్స్‌ వేసుకోవడం వల్ల కలిగే కొన్ని అనర్థాల వల్ల అసలు పాదరక్షలే తొడగలేని పరిస్థి కూడా రావచ్చు. అందుకే హైహీల్స్‌ చెప్పుల్ని చాలా సెలెక్టర్‌ సందర్భాల్లోనే వాడటం మంచిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement