కాఫీ–టీ అండ్‌ హెల్త్‌!

Health Awareness on Coffee And Tea Lovers - Sakshi

మన రోజువారీ ఆహారంలో మంచినీళ్లు ప్రధాన పానియం. ఇక మిగతా పానియాల విషయానికి వస్తే... ఆరోగ్యాన్నిచ్చే సూప్‌లూ, కషాయాలూ, ఇతరత్రా ఫ్రూట్‌ జ్యూస్‌లతో పోలిస్తే కాఫీ టీలే మనం నిత్యం తీసుకునే ద్రవాహారాలు. టీ, కాఫీలలో ఉండే కొన్ని సహజ పోషకాల కారణంగా కొన్ని ఆరోగ్య ప్రయోజనాలూ ఉంటాయి. మరికొన్ని ప్రతికూల అంశాలూ ఉంటాయి. మనమంతా ఎలాగూ రోజూ టీ, కాఫీలను తాగుతూనే ఉంటా కాబట్టి... వాటిలోని కొన్ని ప్రధాన రకాలు, వాటితో కలిగే ఆరోగ్య ప్రయోజనాలూ, వాటి కారణంగా కనిపించే ప్రతికూల ప్రభావాలతో పాటు అవెంతపరిమితంగా తీసుకుంటే మంచిదోచూద్దాం రండి. ముందుగా టీ గురించి తెలుసుకుందాం.

టీలో...  అనేక రకాలున్నాయన్న సంగతి మనకు తెలిసిందే. కానీ అన్ని రకాల టీలలో ప్రధానంగా కాటేచిన్స్, ఫ్లేవనాయిడ్స్, ఫ్లేవనోన్స్‌ అనే జీవరసాయనాలు ఉంటాయి. ఇవి రెండు చాలా అద్భుతమైన  యాంటీఆక్సిడెంట్స్‌. టీలోని  ఫ్లేవనాయిడ్స్‌ మనలోని హానికరమైన కొలెస్ట్రాలైన ఎల్‌డీఎల్‌ను తగ్గిస్తాయి. కొవ్వు పదార్థాలైన ట్రైగ్లిజరాయిడ్స్‌ను సైతం కొంతమేరకు తగ్గిస్తాయి. కానీ మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌)ను మాత్రం పెంచలేవు. టీలో కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు ఉండకపోగా... టీ తాగడం వల్ల కొవ్వు పేరుకోవడం కూడా కాస్తంత తగ్గుతుంది. అయితే కొవ్వు తగ్గుతుంది కదా అంటూ మోతాదుకు మించి టీ తాగడం కూడా మంచిది కాదు. ఎంత కాటేచిన్స్, ఫ్లేవనాయిడ్స్‌ ఉన్నప్పటికీ టీ మాత్రం పరిమితంగానే.. అంటే రోజుకు నాలుగు కప్పులు మాత్రమే.

టీతో సమకూరే కొన్ని ప్రయోజనాలు...
కొవ్వులను కొంతవరకు నిరోధించడం వల్ల  పక్షవాతాన్ని కొంతమేరకు నివారించగలదు. స్ట్రోక్‌ను నివారించే గుణం సాధారణ టీ కంటే గ్రీన్‌ టీలో మరింత ఎక్కువ. మొత్తం పక్షవాతాల్లో కనీసం 20 శాతాన్ని టీ నివారిస్తుందని చాలా అధ్యయనాల్లో నిరూపితమైంది.
టీ మన దేహంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గించడం, నైట్రిక్‌ ఆక్సైడ్‌ పాళ్లను పెంచడంతో పాటు రక్తనాళాల్లోని లోపలి పొర అయిన ఎండోథీలియంలో... రక్తాన్ని సాఫీగా ప్రవహింపజేసేలా చేస్తుంది. ఈ  కారణాల వల్ల టీ కొంతవరకు ‘బ్రెయిన్‌ స్ట్రోక్‌’ నివారణకూ తోడ్పడుతుంది.
అప్పటికప్పుడు కాచిన టీలో కాటెచిన్, ఫ్లేవనాయిడ్స్‌ ఎక్కువగా ఉండి... సమయం గడుస్తున్న కొద్దీ అవి తగ్గిపోతూ ఉంటాయి. అందుకే టీని కాచినవెంటనే ఫ్రెష్‌గా అప్పటకప్పుడు తాగేయాలి.

టీ లో ప్రతికూల అంశాలు...
టీ లో కొన్ని ప్రతికూల అంశాలూ ఉన్నాయి.  మనం తీసుకున్న ఆహారం, పండ్లు, కూరగాయల నుంచి మన శరీరానికి అందాల్సిన ఐరన్‌ను టీ శరీరంలోకి ఇంకకుండా నిరోధిస్తుంటుంది. అందుకే... తినేముందు అరగంట... తిన్న తర్వాత అరగంట వరకు టీ తాగకూడదు.
టీ చాలా ఎక్కువగా తాగే అలవాటుతో పాటు అలా ఏళ్ల తరబడి తాగేవారికి దీర్ఘకాలంలో ‘ఫ్లోరోసిస్‌’ వచ్చే ప్రమాదం ఉంది.

కాఫీ  
ఒక కప్పు కాఫీలో వందలకొద్దీ జీవరసాయనాలుంటాయి. అందులో కొన్ని చాలా చురుకైనవి. ఉదాహరణకు కెఫిన్, డైటర్‌పిన్స్, డైఫీనాల్స్‌ వంటివి అందులో కొన్ని. మనం ఒక కప్పు కాఫీ తాగగానే మన దేహ స్పందనల్లో కాస్తంతైనా తేడా కనిపిస్తుంది. ఆ ప్రభావం ఏమేరకు అన్న అంశం మాత్రం పూర్తిగా వ్యక్తి నుంచి వ్యక్తికి తేడాగా  ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి హైబీపీ (హైపర్‌టెన్షన్‌), ఒంట్లో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉండటం (హైపర్‌లిపిడేమియా) ఉన్నాయనుకుందాం. సాధారణ వ్యక్తుల్లో కాఫీ కనబరిచే ప్రభావానికీ, ఆ జబ్బులున్నవాళ్లలో చూపే ప్రభావానికీ తేడాలుంటాయి. అలాగే కాఫీ ఏరకానికి చెందింది, ఎలా తయారు చేశారు అనే అంశంపై కూడా ఆధారపడి ఉంటాయి. ఉదాహరణకు అది ఫిల్టర్‌ కాఫీయా లేక సాధారణ కాఫీయా అన్న అంశం కూడా ప్రభావానికి కారణమవుతుంది.

కాఫీలో సాధారణ రకాలు
సాధారణంగా కాఫీలోనూ కొన్ని రకాలుంటాయి. ఉదాహరణకు ఫిల్టర్‌కాఫీ, ఇన్‌స్టాంట్‌ కాఫీ, అన్‌ఫిల్టర్డ్‌/బాయిల్డ్‌ కాఫీ వంటివి.
ఫిల్టర్‌ కాఫీని ‘డ్రిప్‌ బ్య్రూవ్‌డ్‌ కాఫీ’ అని కూడా అంటారు.
అలాగే సాధారణ (అన్‌ఫిల్టర్‌డ్‌) కాఫీని బాయిల్డ్‌ కాఫీ అని కూడా అంటారు. ఇందులో మళ్లీ స్కాండనేవియన్‌ బాయిల్డ్, ఫ్రెంచ్‌ ప్రెస్, టర్కిష్‌/గ్రీక్, ఎస్ప్రెస్సో అని మళ్లీ రకాలుంటాయి. ఎస్ప్రెస్సో కాఫీ అన్నది చాలారకాల కాఫీకి మూలరూపం. ఈ మూలరూపాన్ని తీసుకుని మళ్లీ లాటే, కాపక్సినో, మాషియాటో, కఫే అమెరికానో వంటి కాఫీలను తయారు చేస్తారు. ఇలా ఇందులో రకరకాల ఫ్లేవర్స్‌ను కాఫీ ప్రియులు తాగుతుంటారు.

కాఫీలో కెఫిన్‌తో ఆరోగ్యంపై ప్రభావమిలా
కాఫీలో ఉండే కెఫిన్‌ అనే ఉత్ప్రేరక పదార్థం ఉంటుందన్న విషయం తెలిసిందే. మనం కాఫీ తాగి తాగగానే... దాని ప్రభావం కనిపిస్తుంటుంది. కాఫీ తాగిన కొద్దిసేపట్లోనే మన రక్తపోటు (ప్రధానంగా సిస్టోల్‌ బ్లడ్‌ప్రెషర్‌) పెరుగుతుంది. బీపీని కొలిచే సాధనంతో చూస్తే అది సాధారణం కంటే 8 ఎం.ఎం./హెచ్‌జీ ఎక్కువవుతుంది. అలాగే డయాస్టోలిక్‌ ప్రెషర్‌ కూడా పెరుగుతుంది. అయితే అది 6 ఎంఎం/హెచ్‌జీ పెరుగుతుంది. ఈ రెండు పెరుగుదలలూ కాఫీతాగిన తర్వాత కనీసం గంట నుంచి మూడు గంటల పాటు అలాగే ఉంటాయి. ఈ కొలతల్లో పెరుగుదల అన్నది సాధారణ వ్యక్తుల కంటే రక్తపోటుతో బాధపడేవారిలో ఎక్కువ. అందుకే హైబీపీతో బాధపడేవారు కాఫీ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
కాఫీలో మైగ్రేన్‌ తలనొప్పిని తగ్గించే ‘యాంటీ మైగ్రేన్‌’ ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగిన తర్వాత రెండోదానికి చాలా వ్యవధి ఇవ్వాలి. అలా గ్యాప్‌ ఇవ్వకపోతే... అవసరం లేని మాత్రను వేసుకుంటే కలిగే సెడ్‌ఎఫెక్ట్స్‌ను పొందినట్టే.
కాఫీ... యాంగై్జటీని మరింత పెంచుతుంది. కొందరిలో దేహాన్ని వణికేలా కూడా చేస్తుంది.  
రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగేవారిలో ఒక వయసు తర్వాత గ్లకోమా (నీటి కాసులు) అనే కంటి వ్యాధి వచ్చే అవకాశాలు పెరుగుతాయని ఒక అధ్యయనంలో తేలింది.
ఈ అన్ని విషయాలను మన మనసులో ఉంచుకొని... టీ అయితే రోజుకు నాలుగు కప్పులకు మించకుండా... కాఫీ అయితే మూడు కప్పులకు మించకుండా తాగితేనే దేహానికీ, ఆరోగ్యానికీ మేలని గుర్తుంచుకోండి. ఎలా తాగితే అవి ఆరోగ్యంగా ఉండేందుకు ఉపకరిస్తాయో తెలుసుకుని, అలా మాత్రమే వాటిని తాగండి. ఆరోగ్యంగాఉండండి.

టీలలో కొన్ని ప్రధాన రకాలు... వాటి ప్రయోజనాలు
సాధారణ టీ: మనం రోజూ తాగే చాయ్‌ ఇది. కాఫీతో పోలిస్తే టీ బెటర్‌. ఎందుకంటే  కాఫీలో కెఫిన్‌ ఎక్కువగా ఉండటం వల్ల ఒక్కోసారి అది రెండు కప్పులకు మించితే తొలుత చాలా ఎక్కువగా ఉత్తేజ పరచి, ఆ తర్వాత నిస్తేజమయ్యేలా చేయవచ్చు. కానీ సాధారణంగా కాఫీ కంటే టీలో కెఫిన్‌ మోతాదు తక్కువ. అందుకే కాఫీ కంటే టీని ఎక్కువ సార్లు తాగవచ్చు. అయితే మరీ ఎక్కువగా తీసుకుంటే మాత్రం అది సాధారణ జీర్ణ ప్రక్రియకు అంతరాయం కలిగించడం, పోషకాలు ఒంటికి పట్టకుండా చేసే ప్రమాద ఉంది. ఆరోగ్యకరమైన పరిమితి అంటే గరిష్టంగా రోజుకు 4 కప్పులు మాత్రమే.

వైట్‌ టీ : వైట్‌ టీ అంటే పాలు ఎక్కువగా ఉండే టీ కాదు. ఈ రకం చాలా లేతగా ఉండే టీ–ఆకులతో తయారయ్యే టీ–పౌడర్‌తో కాచి తయారుచేస్తారు. ఇది కాస్తంత తక్కువగా ప్రాసెస్‌ చేసిన టీ. దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువ. కెఫిన్‌ తక్కువ. ఇది కాస్తంత పచ్చిగా ఉన్నట్లుంటుంది. అనేక క్యాన్సర్లను నివారిస్తుంది. బరువు తగ్గడానికి కూడా కొంతమేర ఉపయోగపడుతుంది.

బ్లాక్‌ టీ : పాలు కలపకుండా కేవలం డికాక్షన్‌ మాత్రమే తీసుకుంటే దాన్ని బ్లాక్‌ టీగా పరిగణిస్తారు. ఇది మరీ నలుపు రంగులో కాకుండా డికాక్షన్‌కు ఉండే సహజమైన మెరుపుతో ఉంటే మంచి మేలు చేస్తుంది. పశ్చిమాసియా, యూరప్‌కు చెందిన వారి ఈ చాయ్‌ ఎక్కువగా తాగుతుంటారు. ఇందులోని హెర్బల్‌ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.  ∙బ్లాక్‌ టీలోని ట్యానిన్స్‌ డయేరియాను అరికడతాయి. ∙ఆస్తమా ఉన్నవాళ్లకు బ్లాక్‌ టీ మంచి రిలీఫ్‌. ఊపిరితిత్తుల్లోని గాలిగొట్టాలను వెడల్పు చేయడం ద్వారా తేలిగ్గా శ్వాస తీసుకునేలా చేస్తుందది. ∙అయితే అంతగా అలవాటు లేనివారు బ్లాక్‌ టీని మరీ మితిమీరి తాగితే నిద్రలేమి, గుండెదడ, రక్తం వేగంగా ప్రవహించడం వంటి దుష్పరిణామలు సంభవించవచ్చు. అందుకే బ్లాక్‌ టీని కూడా చాలా పరిమితంగానే తాగాలి.

గ్రీన్‌–టీ : ఆరోగ్యం కోసం చాలామంది ఇప్పుడు గ్రీన్‌–టీ తాగుతున్నారు. ఇందులో ఉండే ఫైటోకెమికల్స్‌ రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. ఇందులోని యాంటీ  ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ను నివారిస్తాయి. గుండెజబ్బుల నుంచి కూడా కొంతమేర రక్షణ లభిస్తుంది. ఎపిగెల్లో కాటెచిన్‌–3 (గ్యాలేట్‌) అనే యాంటీ ఆక్సిడెంట్‌ వల్ల అనేక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. దీన్ని కూడా పరిమితంగా తాగితేనే మేలు.

చాక్లెట్‌ టీ : ఇది కాస్త చాక్లెట్‌ రంగు మిళితమైనట్లు కనిపించడంతో పాటు చాక్లెట్‌ ఫ్లేవర్‌నూ కలిగి ఉంటుంది. డార్క్‌ చాక్లెట్స్‌ వల్ల నరాలు ఉత్తేజితం కావడంతో పాటు ఇందులోని పాలీఫినాల్స్‌ ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. మరీ ఎక్కువ తాగితే  నరాలు మరీ ఎక్కువ ఉత్తేజితమైతే నిద్రలేమి సమస్య రావచ్చు. అయితే చాక్లెట్‌ టీని డయాబెటిస్‌ ఉన్నవారు తాగడం అంత మంచిది కాదు. అయితే పూర్తిగా పరిహరించకుండా  చాలా చాలా పరిమితంగా మాత్రం తీసుకోవచ్చు.

కాఫీ సుగుణాలివే...
మరి కాఫీ ఎప్పుడూ హానికరమేనా? అందులో మంచి గుణాలేమీ లేవా? కాఫీ ప్రియులు బాధపడాల్సిన అవసరమే లేదు. ఇందులోనూ మంచి గుణాలున్నాయి. అవి... కాఫీని పరిమిత మోతాదుల్లో తీసుకుంటే అది పక్షవాతాన్ని (స్ట్రోక్‌ని) నివారిస్తుంది. కాఫీలోని డైఫినాల్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ ఈ పని చేస్తుంది. అయితే ఈ ప్రయోజనాన్ని పొందడానికి మనం కాఫీని చాలా పరిమితంగా... అంటే... కేవలం రోజుకు రెండు లేదా మూడు కప్పులు మాత్రమే తీసుకోవాలి.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top