‘ఎరక్కపోయి వచ్చాను... ఇరుక్కుపోయాను’’ అంటూ తీరిగ్గా రోజుల తరబడి విచారిస్తూ కూర్చున్నాడు ఆ దొంగ.
చదివింత...
‘ఎరక్కపోయి వచ్చాను... ఇరుక్కుపోయాను’’ అంటూ తీరిగ్గా రోజుల తరబడి విచారిస్తూ కూర్చున్నాడు ఆ దొంగ. ఆ కూర్చోవడం కూడా ఒక ఎయిర్ కండిషనింగ్ యూనిట్ మీద. చైనాలోని గువాంగ్‌డంగ్ ప్రావిన్స్ ప్రాంతంలో ఒక బహుళ అంతస్థుల భవనంలో చోరీకి ప్రయత్నించాడతను. ఆ ప్రయత్నంలో ఒక ఏసీ యూనిట్ మీదకు ఎక్కి అక్కడి నుంచి ఎలా దిగాలో తెలియక అక్కడే కూర్చుండిపోయాడు. తెల్లవారుఝామున మూడు గంటల ప్రాంతంలో అలా ఇరుక్కుపోయిన ఈ దొంగగారిని భవనంలోని వారు గుర్తించి, ‘‘చోరుడా... ఇదేమీ చోద్యమురా?’’ అని కోపగించుకోకపోగా అయ్యో పాపం అనుకుంటూ అతనికి సాయం చేసేందుకు ప్రయత్నించారు.
అయితే వారి సాయాన్ని తీసుకోవడానికి ముఖం చెల్లని ఆ దొంగ అదే చోట అలాగే కూర్చుండిపోయాడు. అదీ అరవై గంటల పాటు. దీంతో కాళ్ల దగ్గర తీవ్రమైన వాపు వచ్చేసరికి ఇక సాయం తీసుకోక తప్పలేదు. ఏకంగా అన్ని గంటల పాటు ఆహారం ఏమీ తీసుకోకుండా కేవలం నీళ్లు తప్ప అన్నీ వద్దన్న ఈ దొంగ ప్రస్తుతం పోలీసుల ఆతిథ్యంలో ఉన్నాడు.
...::: సత్యవర్షి