పోషకాల పవర్‌హౌజ్‌!

Good Food and rich in minerals  - Sakshi

గుడ్‌ఫుడ్‌

చాలా చవకగా ఆరోగ్యాన్ని సంపాదించుకోడానికి జామపండు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలకు కొదవే లేదు. అందుకే ఈ పండును ‘పోషకాల పవర్‌హౌజ్‌’ అంటారు. వంద గ్రాముల జామపండులో 68 క్యాలరీలు ఉంటాయి. అంతేకాదు... ఇందులో క్యాల్షియమ్, మెగ్నీషియమ్, ఫాస్ఫరస్, పొటాషియమ్‌ వంటి ఖనిజాలూ పుష్కలంగా ఉంటాయి. జామతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే. 

జామలో విటమిన్‌–సి చాలా ఎక్కువ. ఇది చాలా శక్తిమంతమైన యాంటీ ఆక్సిడెంట్‌ కావడంతో ఎన్నో వ్యాధులను నివారిస్తుంది. ఒంటికి వ్యాధి నిరోధక శక్తిని సమకూరుస్తుంది. 

జామ అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. జామలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ ఇందుకు దోహదం చేస్తాయి. ముఖ్యంగా ప్రోస్టేట్, రొమ్ముక్యాన్సర్ల నివారణకు బాగా ఉపయోగపడుతుంది. 
జామ గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువ. అందుకే డయాబెటిస్‌ ఉన్నవారు దీన్ని నిరభ్యంతరంగా తినవచ్చు. 

పీచుపదార్థాలు చాలా ఎక్కువ కావడం వల్ల ఇందులో జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ పీచుపదార్థాలే ఒంట్లో చక్కెరను నెమ్మదిగా విడుదలయ్యేలా చేస్తాయి. అందువల్ల కూడా ఇది డయాబెటిస్‌ ఉన్నవారికి ఉపయుక్తమైన పండుగా పేరొందింది. 

దీనిలో పీచుపదార్థాలు పుష్కలంగా ఉండటం వల్ల మలబద్దకాన్ని సమర్థంగా నివారిస్తుంది. విరేచనం సాఫీగా అయ్యేందుకు తోడ్పడుతుంది.
 
జామలో పొటాషియమ్‌ కూడా ఎక్కువే. పొటాషియమ్‌ రక్తపోటును అదుపు చేస్తుందన్న విషయం తెలిసిందే. అందుకే హైబీపీ నియంత్రణకు ఇది బాగా ఉపయోగపడుతుంది. 

జామపండు ఒంట్లోని ట్రైగ్లిజరైడ్స్, చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) వంటి వాటిని అదుపు చేయడంతో పాటు, ఒంటికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్‌ పెరగడానికి తోడ్పడుతుంది. 
జామలో క్యాల్షియమ్, ఫాస్ఫరస్‌ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఇది ఎముకల పటిష్టపరుస్తుంది. ఎముకల ఆరోగ్యానికి దోహదపడుతుంది. 

జామపండులో విటమిన్‌–బి6, విటమిన్‌ బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉండటం వల్ల అవి మెదడులోని న్యూరాన్ల పనితీరును మెరుగుపరుస్తాయి. అందువల్ల జామపండు తినేవారిలో మెదడు చురుగ్గా ఉంటుంది. డిమెన్షియా, అలై్జమర్స్‌ వంటి జబ్బులను నివారించడానికి కూడా జామ తోడ్పడుతుంది. 

జామపండ్లను తినేవారిలో పంటి, చిగుర్లకు సంబంధించిన వ్యాధులు చాలా తక్కువ. 

ఇందులో ఫోలిక్‌యాసిడ్‌ పుష్కలంగా ఉండటం వల్ల డాక్టర్లు దీన్ని గర్భిణులకు సిఫార్సు చేస్తుంటారు. కడుపులోని బిడ్డ తాలూకు నాడీ వ్యవస్థ ఆరోగ్యకరంగా అభివృద్ధి అయ్యేందుకు జామ తోడ్పడుతుంది. 
ఆరోగ్యకరమైన, నిగారింపుతో కూడిన మెరిసే చర్మం కోసం జామ బాగా ఉపయోగపడుతుంది. ఏజింగ్‌ ప్రక్రియనూ ఆలస్యం చేస్తుంది. 

బరువు తగ్గాలనుకునేవారికి జామ అనేక విధాల తోడ్పడుతుంది. ఇందులోని తక్కువ చక్కెర పాళ్లు, పీచు వంటి అంశాలు వేగంగా బరువు తగ్గడానికి తోడ్పడతాయి.   

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Read also in:
Back to Top