నాలుగు నమూనాలు

Gollapudi Maruthi Rao Article On Humans - Sakshi

జీవన కాలమ్‌

నేను దాదాపు రోజూ టీ. నగర్‌లోని అగస్త్య గుడికి వెళ్లి కూర్చుని వస్తూం టాను. అక్కడ పనిచేసే ఓ ముసలాయన ఉన్నాడు. దాదాపు ఒకే కాషాయ రంగు ధోవతిని కట్టుకుంటాడు. అది మాసిపోయి ఉంటుంది. రోజూ వదల కుండా అదే ఎలా కట్టుకుంటాడు? రాత్రి వేళల్లో ఏదయినా గోచీ కట్టుకుని ఈ ధోవతిని ఉతుక్కుని ఆరవేసుకుంటాడేమో? అది ఏనాడూ తెల్లగా ఉండదు. కానీ ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. తెల్లని జుత్తు. హడావుడిగా నడుస్తూంటాడు. అతను చేసేవి– నాకు తెలిసి– రెండే పనులు. స్వామికి దీపం వెలిగించడానికి గుడ్డ వొత్తిని సిద్ధం చేస్తూ ఉంటాడు. పెద్ద నల్లటి గుడ్డని చిన్న ముక్కలుగా స్వామి ముందు వెలిగించడానికి పీలికలుగా కత్తిరిస్తాడు. ఆ పనివాడితనం చూసి తీరవలసిందే. మరొక పని? సరిగ్గా 11 గంటలకి గుడి రెండు తలుపులూ మూస్తాడు. చేతికి వాచీ లేదు. కానీ అతను తాళం చెవులు పట్టుకు తలుపులు మూయడానికి వెళ్తే– 11 గంటలయిందని అర్థం. 

మరొకాయన ఉన్నాడు. అందగాడు. వయస్సు 48. పేరు నీరవ్‌ మోదీ. వజ్రాలు, రత్నాలు అంతర్జాతీయంగా అమ్ముతాడు. గత పదేళ్లలో బ్యాంకుల దగ్గర దొంగ లెక్కలతో 13 వేల కోట్లు అప్పు చేశాడు. ఇందుకు అతని మేనమామ మద్ధతు. చివరికి తన ఆట కట్టుబడే సమయం వచ్చిందని కాస్త ముందు గ్రహించి దేశం ఎల్లలు దాటిపోయాడు. బ్యాంకుల్లో 28 నకిలీ అకౌంట్లు ఉన్నవాడు. బెల్జియంలో పౌరసత్వం ఉన్నవాడు. చట్టం నుండి తప్పించుకోవడానికి– యునైటెడ్‌ అరబ్‌ రిపబ్లిక్, సింగపూర్, హాంకాంగ్‌ వంటి దేశాలు తిరిగినవాడు. గత్యంతరం లేక ఇంగ్లండులో చట్టానికి దొరికిపోయి లండన్‌ జైలులో ఉన్నవాడు. ఇప్పుడు అతని గతి ఏమిటి? మరో వారం రోజుల్లో ఇంగ్లండు చట్టం నిర్ణయిస్తుంది.

మరొకాయన ఉన్నాడు. ఆయన జిమ్మీ కార్టర్‌. 42 సంవత్సరాల కిందట ఈ ప్రపంచంలో అతి ధనవంతమయిన, శక్తివంతమయిన దేశాన్ని– అమెరి కాని పాలించాడు. పదవిలోకి వచ్చిన మరునాడే– అలనాడు వియత్నాం యుద్ధానికి వెళ్లని వీరులకి క్షమాభిక్ష పెట్టాడు. దేశంలో ఎన్నో సంస్కరణలు చేశాడు. అమెరికా చరిత్రలో ఎక్కువ కాలం బతికిన హెర్బర్టు హూవర్‌ కన్నా ఒక అడుగు ముందు నిలిచాడు. ఉరిశిక్షను వ్యతిరేకించాడు. నోబెల్‌ బహుమ తిని పుచ్చుకున్నాడు. ఇప్పుడేం చేస్తున్నాడు? ఎల్విస్‌ ప్రెస్లీ పాటలు వింటూ, పెన్సిల్వేనియాలో 1961లో తాను కట్టుకున్న అతి మామూలు ఇంట్లో మనశ్శాం తితో హాయిగా జీవిస్తున్నాడు. ఆయనకిప్పుడు ఎన్ని సంవత్సరాలు? 94. 

మరొక్క నమూనా. ఆవిడ పుట్టడమే రాచరికపు పుట్టుక. 93 సంవత్సరాల కిందట పుట్టింది. ఎనిమిదవ ఎడ్వర్డ్‌ రాజు ఇంగ్లండుని పాలిస్తే ఆమె మామూలు జీవితాన్ని గడిపేది. కానీ 1936లో ఆయన సింప్సన్‌ అనే ఓ మామూలు వ్యక్తి ప్రేమలో పడి కిరీటాన్ని, సింహాసనాన్నీ వదులుకున్నాడు. తన దేశంలోనూ, ప్రపంచంలోనూ జరిగిన ఎన్నో రాజకీయ, సామాజిక పరిణామాలకి ఆమె ప్రత్యక్ష సాక్షి. సంప్రదాయాన్నీ, రాచరికాన్నీ ప్రేమించి, గౌరవించే వ్యవస్థలో ఆమె సింహాసనం, హోదా యథాతథంగా నిలిచాయి. ఎన్నో ప్రపంచ యుద్ధాలూ, దేశీయ పరిణామాలలో వ్యక్తిగతంగానూ, వ్యవస్థాగతంగానూ తన హోదానీ, అర్హతనీ నిలదొక్కుకుంటూ– ప్రస్తుతం ‘బ్రెక్సిట్‌’ పరిణామాన్ని ఎదుర్కోబోతున్న ఏకైక రాజకీయ ప్రతీక ఎలిజబెత్‌ మహారాణీ. నేనెప్పుడూ అనుకుంటూ ఉంటాను. ఇది తుమ్మితే ఊడిపోయే ముక్కు అని. ఒక్కసారి ఆ వ్యవస్థలో ‘సోషలిస్టు’ భావజాలం తొంగిచూస్తే. అయితే ‘పరిణామం’ కంటే ‘చరిత్ర’ ఉన్నతమయినదని వారూ భావిస్తే? ఇంతకూ ఆమె స్థిరత్వానికి కారణం– ఇంగ్లిష్‌లోనే చెప్పాలి– వ్యవస్థ dignity, జాతి సంప్రదాయ నిబద్ధత. 

ఒక వ్యక్తి జీవనంలో ఆనందం, ఆరోగ్యం, అభిరుచి, అభిజాత్యం– ఇన్నిటి పాత్ర ఉంది. వీటన్నిటినీ జయించే మరొక ముఖ్యమైన లక్షణం మరొకటి ఉంది. ఇది వ్యక్తిత్వ వికాసానికి మూలస్తంభం. స్వామి ముందు వెలిగించే దీపపు ఒత్తుల్ని సిద్ధం చేస్తూ సమాజంలో తన ఉనికికే అర్థం కాంక్షించని ఓ మూగ జీవనానికీ, తన ఉనికిని, అస్తిత్వాన్నీ మార్చుకుని తనదికాని కోట్ల ధనాన్ని అవినీతితో అనుభవించాలన్న లక్ష్యానికీ, ఈ ప్రపంచాన్ని శాసించగల అధికారాన్ని చేతి వేటు దూరంలో నిలిపి– ఇప్పటికీ ‘మనశ్శాంతి’కి పట్టం కట్టిన ఓ సంస్కారికీ, తన పుట్టుకకీ, తన జీవనానికీ గంభీరమయిన వంతెనను నిర్మించుకుని– ఆ జాతికి గర్వకారణంగా జీవించే– ‘వ్యవస్థ’ ప్రాతినిధ్యానికీ ఎంత దూరం. అయితే వ్యక్తి జీవనంలో– వ్యక్తిత్వ నిర్ధారణలో వీటన్నిటి వెనుకా ఓ సామాన్య లక్షణం ఉంది. దాని పేరు– తృప్తి. అది కూడా కాదు. తృప్తితో జీవిస్తున్న గర్వం. అది కూడా కాదు. గర్వం పట్ల అవగాహన. అది కూడా కాదు. అవగాహనను స్వభావం చేసుకున్న అలవాటు. 
గొల్లపూడి మారుతీరావు

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top