అంజినరెడ్డి కుటుంబాన్ని ఆదుకోని ప్రభుత్వం

Farmer suicides in Anantapur district - Sakshi

వ్యవసాయాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న రైతు ఆత్మహత్య చేసుకొని చనిపోయినా ప్రభుత్వం ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోలేదు. అనంతపురం జిల్లా రొద్దం మండలం రాచూరు గ్రామానికి చెందిన కురుబ నారాయణప్ప కుమారుడు అంజినరెడ్డి(38)అనే రైతు అప్పులు తీర్చే దారి లేక ఈ ఏడాది జూన్‌ 26న తన ఇంటిలోని పైకప్పుకు తాడుతో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి పేరున 4 ఎకరాల భూమి ఉంది. వర్షాభావం వల్ల నాలుగేళ్లుగా పంటలు సరిగ్గా పండలేదు. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు రూ. 9 లక్షలకు పైగా ఉన్నాయి. కోగిర కెనరా బ్యాంకులో మృతుడి పేరు మీద రూ. 1.40 లక్షలు, తండ్రి పేరున రూ. 2 లక్షలు, మృతుడి భార్య పేరున రూ. 1.40 లక్షల అప్పుంది.

వడ్డీ వ్యాపారుల దగ్గర రూ. 5 లక్షలు అప్పు చేశారు. రైతుల రుణాలు మాఫీ చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ వీరి రుణాలు మాత్రం మాఫీ కాలేదు. వ్యవసాయ బోరులో భూగర్భ జలాలు అడుగంటడంతో వేరుశనగ, మల్బరీ పంటల దిగుబడి దెబ్బతిన్నది. అప్పులు ఎలా తీర్చాలని అంజినరెడ్డి భార్య అశ్విని, తండ్రి నారాయణప్పతో చెప్పి ప్రతి రోజూ మథనపడేవారు. ఈ నేపథ్యంలో గాలివాన బీభత్సానికి పట్టుపురుగులు పెంచే రేషం షెడ్డు కూలిపోయింది.  రూ. 4 లక్షలు నష్టపోవడంతోపాటు షెడ్డు కూలిన సంఘటనలో మృతుడి కాలు విరిగింది. పంటలు సరిగ్గా లేకపోయినా ఆర్థికంగా చేదోడుగా ఉన్న పట్టుపురుగుల పెంపకంతో ఇల్లు గడిచేది.

అయితే, షెడ్డు కూలిపోవడంతో అదీ లేకుండా పోయింది. ఆర్థికంగా, మానసికంగా కుంగిపోయిన అంజినరెడ్డి అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి వృద్ధ తల్లిదండ్రులు, భార్య, ఆడపిల్ల ఉన్నారు. కుటుంబ పెద్ద దిక్కు ఆత్మహత్య చేసుకోవడంతో ఆడ పిల్లను ఎలా పోషించుకోవాలో తెలియక మృతుడి భార్య దిక్కుతోచని పరిస్థితిల్లో ఉన్నారు. ఆర్డీఓ, తహసీల్దార్‌ వచ్చి గ్రామంలో విచారణ కూడా చేసుకు వెళ్లారు. ప్రభుత్వం నుంచి ఇంతవరకూ ఈ కుటుంబానికి ఎటువంటి పరిహారం అందలేదు.

– కె.ఎల్‌. నాగరాజు, సాక్షి,రొద్దం, అనంతపురం జిల్లా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top