కల్తీ పేగు

Family crime story in this week - Sakshi

2016, అక్టోబర్‌ 4.‘అమ్మా.. ఈ స్వీట్‌ తీసుకో. నిన్ను ఫంక్షన్లో ఎంత మంది అడిగారో తెలుసా’ ఇంట్లోకి వస్తూనే స్వీట్‌ ప్యాకెట్‌లోంచి ఓ మైసూర్‌పాక్‌ తీసి తల్లి మీరాబి చేతికి ఇచ్చింది మస్తాని. ‘ఎక్కడే.. నీకు తెలుసుగా. మీ నాన్నకు ఒంట్లో బాగోలేదు. అక్కడకు వస్తే మీ నాన్నకు ఇబ్బంది కదా’ అంటూనే ‘ఇంతకీ శ్రీమంతం ఫంక్షన్‌ బాగా జరిగిందా?’ అంది మీరాబి.‘ఊ.. చాలా బాగా జరిగింది. మా ఆడపడుచుకు వాళ్ల అత్తగారు కోడలికి నెక్లెస్‌ పెట్టింది తెలుసా. మా ఆడపడుచు ముఖం చూడాలి ఎలా వెలిగిపోయిందో’ అంటూ తనూ స్వీట్‌ తీసుకొని నోట్లో పెట్టుకుంది. ‘మీ ఆడపడుచు అదృష్టం అంతా. ఇంతకీ చిన్నాకు ఎలా ఉంది? ఒంట్లో బాగోలేదన్నావ్‌..’ మనవడి బాగోగులు అడిగింది మీరాబి.‘ఇప్పుడు పర్వాలేదమ్మా. జ్వరం తగ్గింది. మళ్లీ వస్తే హాస్పిటల్‌కి తీసుకెళ్లాలి. ఇక నే వెళ్తానమ్మా. మీ అల్లుడు వచ్చే టైమ్‌ అయ్యింది. పిల్లాడు కూడా ఇంట్లో ఒక్కడే ఉన్నాడు’‘కాసేపు ఉండవే. ఇల్లు ఏమైనా కిలోమీటర్‌ దూరమా. పక్కనే కదా. అయినా మీ ఆయన పెద్ద ఆఫీసరా... నువ్వేమైనా ఆఫీసరు భార్యవా. కాస్త రెండు రొట్టెలు చేసియ్యి. పిండి కలిపే ఉంది. నేనే చేద్దును కానీ కాళ్లు నొప్పులుగా ఉన్నాయి’ అని మీరాబీ అనడంతో స్వీట్‌బాక్స్‌ షెల్ఫ్‌లో పెట్టేసి ‘సరేనమ్మా’అంటూ కిచెన్‌లోకి వెళ్లిపోయింది మస్తాని.ఆరోగ్యం బాగా లేని తండ్రి కోసం రొట్టె చేయడం మొదలెట్టింది.

మరుసటి రోజు.కొడుకుకు జ్వరం తగ్గకపోవడంతో ఆసుపత్రిలో అడ్మిట్‌ చేసింది మస్తాని.డాక్టర్‌ రాసిచ్చిన మందులు తీసుకురావడానికి బయటకు వచ్చింది. ఇంతలో చేతిలో ఉన్న సెల్‌ఫోన్‌ మోగింది. చూస్తే తమ్ముడు సుభాని. ‘ఏంట్రా...’ అంది మస్తాని!అవతలి నుంచి సమాచారం విని విస్తుపోయింది. ఉన్నఫళంగా ఇంటికి చేరుకుంది.అప్పుడు సమయం సాయంత్రం 6 గంటలు.స్కూల్, కాలేజీలకు వెళ్లిన విద్యార్థులు, పనులకు వెళ్లిన పెద్దలు ఇంటికి చేరుకునే సమయం.

గుంటూరు జిల్లా చేబ్రోలులోని ముస్లిం కాలనీ అది.గ్రామస్తులంతా ఆర్టీసీ రిటైర్డ్‌ ఉద్యోగి షేక్‌ ఖాసీం ఇంటివైపు పరుగులు తీస్తున్నారు.ఖాసీం ఇంటి ముందు పెద్ద ఎత్తున గుమిగూడారు. ఆ గుంపులోంచే లోపలికి నడిచింది మస్తానీ.ఎదురుగా కనిపించిన దృశ్యానికి హతాశురాలైంది. అక్కడే ఉన్న ఆమె అన్నదమ్ములు మస్తానీని చూసి బావురుమన్నారు. ఎదురుగా నేల మీద తల్లీ మీరాబి, తండ్రి ఖాసీం... వారి చుట్టూ రక్తం మడుగు కట్టి ఉంది. ఒంటి నిండా గాయాలు. ఇంతలోనే పోలీస్‌ జీపు ఖాసీం ఇంటి ముందు ఆగింది. పోలీసులు వేగంగా జీపులోంచి దిగి ఖాసీం ఇంట్లోకి వెళ్లారు. ఇంట్లో కనిపించిన దృశ్యాన్ని చూసి వారు కూడా కొద్దిసేపు నిర్ఘాంతపోయారు. వృద్ధులిద్దరూ విగతజీవుల్లా రక్తపు మడుగులో పyì  ఉన్నారు. మృతదేహాల నిండా గొడ్డలితో నరికిన గాయాలు ఉండటాన్ని చూసి గుర్తు తెలియని అగంతకులు హత్య చేసినట్లు నిర్ధారించుకున్నారు.‘ఏం జరిగింది?’ సుభానీని పిలిచి అడిగాడు సీఐ.‘ఏమో తెలియదు సార్‌. పని మీద ఉదయం గుంటూరుకు వెళ్లాను. సాయంత్రం ఇంటికి వచ్చి చూసే సరికి ఇంట్లో రక్తపుమడుగులో అమ్మ, నాన్న పyì  ఉన్నారు. వెంటనే పోలీస్‌ స్టేషన్‌కు ఫోన్‌ చేశాను..’  కళ్లనీళ్లతోనే చెప్పాడు సుభాని. ‘మీ ఇంట్లో ఇంకా ఎవరెవరు ఉంటారు’ అడిగాడు సీఐ.‘మేం ఐదుగురం అన్నదమ్ములం, ఇద్దరు అక్కచెల్లెళ్లు. పెద్దన్న బెంగళూరులో ఉంటాడు. మిగతా అందరం అమ్మనాన్నతోనే ఉంటాం. ఈమె మా అక్క మస్తాని. మా పక్కిల్లే వీళ్లది’ అన్నాడు సుభానీ. ఏడుస్తున్న మస్తాని వద్దకు వచ్చిన సీఐ ‘ఏమ్మా ఏం జరిగి ఉంటుందో నీకేమైనా తెలుసా’ అన్నాడు. ‘లేదు సార్‌. మా అబ్బాయికి విపరీతంగా జ్వరం. తగ్గకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించాను. మా తమ్ముడు ఫోన్‌ చేసి విషయం చెబితే బాబునక్కడే వదిలేసి హడావిడిగా వచ్చాను’ ధారగా కారుతున్న కళ్లనీళ్లు తుడుచుకుంటూ చెప్పింది మస్తాని. కుటుంబసభ్యులు ఇచ్చిన వివరాల ఆధారంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించిన సీఐ, ఎస్సైలు సుభాని ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు. 

షేక్‌ ఖాసీం, మీరాబీల హత్యల విషయాన్ని పై అధికారులకు తెలియజేశాడు సీఐ. హత్యాస్థలాన్ని డీఎస్పీ, అదనపు ఎస్పీలు పరిశీలించారు. ‘ఇది దోపిడీ దొంగల పని అయి ఉండాలి.  లేదంటే ఎవరైనా సైకో చేసి ఉండాలి. అలాంటి వారే ఇంత వృద్ధుల్ని ఇంత దారుణంగా చంపి ఉంటారు’ అన్నాడు ఎస్పీ. గుంటూరు నుంచి క్లూస్, డాగ్‌ స్క్వాడ్‌ టీంలు చేబ్రోలుకు చేరుకున్నాయి. డాగ్‌ స్క్వాడ్‌ హత్య జరిగిన ప్రదేశంతో పాటు ఇళ్లంతా కలియదిరిగింది.క్లూస్‌ టీం సంఘటన స్థలంలో సునిశితంగా పరిశీలించి వేలిముద్రలను సేకరించింది. మృతదేహాల పక్కన ఉన్న రెండు రకాల చేతిగాజులముక్కలను  టీం సేకరించింది.గాజు ముక్కలు ఎరుపు, పసుపు రంగుల్లో ఉన్నాయి. ‘మీరాబీ చేతి గాజులై ఉండవచ్చు’ నిర్ధారణకు వచ్చారు పోలీసులు.దోపిడీ దొంగలు, సైకోలకు సంబంధించిన ఆనవాళ్లు ఘటనా స్థలంలో క్లూస్‌ టీంకు లభించలేదు. 

రోజులు గడుస్తున్నాయి.దొంగల ముఠాల వల్లగానీ, సైకోల వల్లగాని ఈ హత్యలు జరిగినట్టుగా ఎటువంటి ఆనవాలు దొరకడం లేదు.‘ఇతరత్రా ఎలాంటి సమాచారం లభించలేదంటే కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్యలు జరిగి ఉండవచ్చు’ అన్నాడు డీఎస్పీ.‘నిజమే సార్‌! ఈ కోణంలో విచారిస్తే తప్పకుండా నేరస్తులు ఎవరో తెలిసిపోతుంది’ అన్నాడు సీఐ. డీఎస్పీ, సీఐతో పాటు పోలీసు సిబ్బంది అన్ని కోణాల్లో విచారించడం మొదలుపెట్టారు. ఖాసిం కొడుకులు, బిడ్డల మీద ప్రత్యేక బృందాలతో నిఘా ఉంచారు పోలీసులు.క్లూస్‌ టీంకు దొరికిన గాజు ముక్కలు మృతురాలు మీరాబీవేనా అనే కోణంలో విచారించడం మొదలుపెట్టారు. ఇంటి చుట్టుపక్కల వారికి ఆ గాజు ముక్కలు చూపించి ‘ఇవి ఎవరివో చెప్పగలరా’ అని అడిగారు. ఒకరిద్దరు మాకెందుకొచ్చిన తంటా అనుకుంటూ ‘తెలియదు సార్‌’ అన్నారు.ఎదురింట్లో ఉంటున్న సీమా మాత్రం ‘సార్‌. మీరాబీ పసుపు రంగు గాజులే వేసుకుంటుంది. ఎరుపు రంగు గాజులు రెండు రోజుల ముందు ఆడపడుచు శ్రీమంతం సందర్భంగా మస్తాని వేసుకుంది.వాటికి రెండు వైపులా డిజైన్‌ ఉంటుంది. నాకు గుర్తు. ఎందుకంటే షాపింగ్‌కి నేనే మస్తానీకి తోడు వెళ్లాను’ అంది.ఆ కొద్దిపాటి క్లూ ఆధారంగా మస్తానీపై అనుమానంతో ఆమె నివాసంలో పోలీసులు తనిఖీ చేశారు. రక్తపు మరకలతో ఉన్న గొడ్డలి, ఇనుప రాడ్డు లభించాయి. 

‘ఈ గొడ్డలి ఎవరిది’ కరుకుగా ప్రశ్నించింది పోలీసు స్వరం మస్తానీని. ‘అది మాదే సార్‌. కానీ ఆ గొడ్డలికి రక్తం ఎలా అంటిందో తెలియదు. అయినా, అది మా ఇంట్లోనే ఉండదు... ’ అక్క మస్తాని ఇంటికి పోలీసులు వచ్చారని తెలియగానే సుభాని పరుగున అక్కడకు చేరుకున్నాడు. గొడ్డలిని చూసిన సుభాని ‘ఆ గొడ్డలి మా ఇంట్లోనే ఉంటుంది సార్‌. అప్పుడప్పుడు మా అక్క కట్టెలు కొట్టుకోవడానికి తీసుకెళ్తుంటుంది’ చెప్పాడు.‘ఓహో.. అయితే ఈ గొడ్డలితోనే మీ అమ్మను, నాన్నను చంపి ఉంటారు అవునా’ ఎస్సై మాటలకు మస్తానీ నిలువెల్లా వణికిపోయింది. ఆ పక్కనే ఉన్న ఆమె భర్త మొహిద్దీన్‌ తల వంచుకున్నాడు. పోలీసులు మస్తానీని, ఆమె భర్త మొహిద్దీన్‌లను అదుపులోకి తీసుకున్నారు. 

గుంటూరు టౌన్‌ పోలీసు స్టేషన్‌లో... పోలీసుల ముందు మస్తాని, మొహిద్దీన్‌లు అసలు విషయం చెప్పడం మొదలుపెట్టారు. మస్తానీ గొంతు పెగుల్చుకొని ఒక్కో విషయం చెబుతోంది. పోలీసులు రికార్డ్‌ చేస్తున్నారు. ‘సార్‌. మా అమ్మనాన్నలతో కొన్నాళ్లుగా ఆస్తి విషయంలో తగాదాలున్నాయి. పెళ్లప్పుడు నాకు ఇస్తానన్న ఆస్తి రాసివ్వకపోగా మా అమ్మ రోజూ తిడుతూ నాతో గొడవకు దిగుతుండేది. మొన్న 5వ తేదీన కూడా సాయంత్రం ఏ కారణం లేకుండానే మా అమ్మ నన్ను తిడుతూ గొడవకు దిగింది. దాంతో నాకూ కోపం వచ్చింది. ఎదురు తిరిగి ఆమెతో నేనూ గొడవకు దిగాను. ఇద్దరం జుట్లు పట్టుకుని కొట్టుకున్నాం. ఈ గొడవలో మా ఇద్దరి చేతి గాజులు పగిలిపోయి అక్కడ పడ్డాయి. కోపం ఆపుకోలేక పక్కనే ఉన్న గొడ్డలితో మా అమ్మను నరికాను. ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఇంతలో నా భర్త అక్కడికి వచ్చాడు. జరిగిదంతా అతనికి చెప్పాను. మేమిద్దరం అక్కడున్న సమయంలోనే బయటికెళ్లిన మా నాన్న ఇంటికొచ్చాడు. రక్తపు మడుగులో ఉన్న మా అమ్మను చూసి ‘ఏమైంద’ని గట్టిగా అరిచి గొడవ చెయ్యబోయాడు. విషయం బయటికి తెలుస్తుందేమోనని, నాన్నను కూడా చంపేస్తే ఆస్తి పంచుకోడానికి అడ్డు తొలగిపోతుందని నా ¿¶ ర్త, నేను మా నాన్నను పక్కనే ఉన్న ఇనుప రాడ్డుతో తలపై కొట్టి, గొడ్డలితో నరికి చంపేశాం. మామీద అనుమానం రాకూడదని ఏమి తెలియనట్టు హడావిడిగా మా అబ్బాయిని తీసుకొని ఆసుపత్రికి వెళ్లాం. డాక్టర్‌ వద్దని చెప్పినా సెలైన్‌ బాటిల్‌ ఎక్కించమని ఆసుపత్రిలో ఉన్నట్టు నమ్మించాలని ప్రయత్నించాం’ అని పోలీసుల విచారణలో మస్తానీ ఆమె భర్త ఖాజా మొహిద్దీన్‌లు హత్యలకు పాల్పడినట్లు అంగీకరించారు. పోలీసులు నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపారు.ప్రస్తుతం కేసు విచారణ కొనసాగుతుంది.
– వడ్డే బాలశేఖర్, సాక్షి ప్రతినిధి, గుంటూరు
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top