కొంచెం చూస్కోండి!

కొంచెం చూస్కోండి!


కన్ను ఎప్పుడూ కాలుష్యాన్ని నేరుగా తాకుతూ ఉంటుంది. వాయు కాలుష్య సముద్రంలో ఈదుతూ ఉంటుంది. మిగతా నాలుగు జ్ఞానేంద్రియాలను చూడండి. చెవి ఎక్కడో పుర్రె లోపల సురక్షితంగా ఉంటుంది. చెవి తమ్మె (ఎక్స్‌టర్నల్‌ ఇయర్‌ పిన్నా) మాత్రమే బయట ఉంటుంది. అలాగే ముక్కులోని వాసన చూసే యంత్రాంగమూ లోపలెక్కడో ఉంటుంది. ఇక నాలుక నోటిలోపల సురక్షితంగా ఉంటుంది. చర్మం విషయానికి వస్తే... అది నేరుగా కాలుష్యంతో అంటుకునే ఉన్నా, స్పర్శజ్ఞానాన్ని మినహాయిస్తే... లోపలి అవయవాలన్నింటికీ రక్షణ కల్పించడమే దాని ప్రధాన బాధ్యత. కంటికి రక్షణగా కనురెప్పలు ఉన్నప్పటికీ వాటిని దాటుకొని కాలుష్యం కంటికి చేరుతుంటుంది. తన చూసే  బాధ్యతలను నెరవేర్చడానికి కన్ను అనుక్షణం వాతావరణంలోని కాలుష్యానికి గురవుతూనే ఉంటుంది. ఇలా నేరుగా కాలుష్యం  తాకుతూ ఉండటం వల్ల కన్నుకు జరిగే నష్టాలు, వాటి నివారణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుసుకోవడం కోసమే ఈ ప్రత్యేక కథనం.



మన కళ్లకు చాలా కనిపించవు. అవి దాక్కుని దాక్కుని కళ్లపై దాడి చేస్తాయి. మిట్టమధ్యాహ్నం కూడా మసక ఘాతాలు కురిపిస్తాయి. చెవులు చేతులతో మూసుకుపోగలవు – ముక్కులు.. చేతుల్ని అడ్డుపెట్టుకోగలవు. గొంతులు కేకలు పెట్టగలవు. కానీ పాపం కళ్లే... కంటిపాపలకు కూడా తెలియకుండా పొగ, ధూళి, దుమ్ము, మెరుపుకాంతీ... ఇవన్నీ బల్లేలై కళ్లను గుచ్చేవే! కొంచెం చూస్కోండి... కాలుష్యం నుంచి కళ్లను కాపాడుకోండి.



గాలిలోని కాలుష్యాలకు కారణమయ్యేవివే...  

గాలి కనబడదు... దానిలోని కాలుష్యాలూ కనబడవు. మన కన్ను నేరుగా గాలిలోకి తెరచుకొని ఉన్నప్పుడు దాన్ని నిత్యం తాకుతూ ఉండే కాలుష్యభూతాలేమిటో కూడా మనకుతెలియదు. అయినా వాటిని తట్టుకుంటూ కన్ను తన పని తాను చేస్తూ ఉంటుంది. కన్నును ఆవరించి ఉండే ఆ వాయుకాలుష్య సముద్రానికి కారణాలు చాలా ఎక్కువే. పట్టణ (అర్బన్‌)ప్రాంతాల్లో పరిశ్రమలు ఉండటం, వాహనాలు ఎక్కువగా తిరుగుతుండటం, ఎయిర్‌ కండిషన్స్‌ పనిచేస్తుండటం, ఇతరత్రా ఎలక్ట్రిక్‌ ఉపకరణాల నుంచి వచ్చే కాలుష్యాలూ గాలిలోకి చేరడంతో అవన్నీ కంటికి నేరుగా తాకుతుంటాయి.



పట్టణ ప్రాంతపు వాయు కాలుష్యాలివి...

వాయుకాలుష్యంలో అన్నింటికంటే చాలా ప్రమాదకరమైనది కార్బన్‌ మోనాక్సైడ్‌. ఇది వాహనాల ఇంధనం మండటం వల్ల వెలువడే కాలుష్యం. ఇది కంటిని తాకినప్పుడు కళ్లు మండుతుంటాయి. వాహనాల నుంచే కాదు... ఎయిర్‌కండిషన్లు, హీటర్ల నుంచి కూడా ఈ వాయువు వెలువడుతుంది. కాకపోతే పైన పేర్కొన్న వాటి నుంచి వెలువడే శాతం వాహనాల నుంచి వెలువడే శాతం కంటే తక్కువ. గాలిలో కంటికి ప్రమాదకరంగా పరిణమించే వాటిలో నైట్రోజన్‌ ఆక్సైడ్‌ మరో ముఖ్యమైన వాయువు. ఇది ఫ్యాక్టరీల నుంచి వెలువడుతుంది. ఇది గాలిలోని నీటి అణువులతో కూడినప్పుడు యాసిడ్‌గా మారుతుంది. అందువల్ల అలర్జిక్‌ రియాక్షన్‌కు కారణమై ఒక్కోసారి కళ్లకలక (కంజంక్టవైటిస్‌)కు దారితీయవచ్చు.  ఫ్యాక్టరీల నుంచి వెలువడే కాలుష్యాలలో మరో ముఖ్యమైనది సల్ఫర్‌ డయాక్సైడ్‌. ఇది కళ్లను మంట పుట్టించడంతో పాటు ఊపిరితిత్తుల్లో కూడా మంట కలిగిస్తుంది. ఇవిగాక... ఏరోసాల్స్, ఆర్సినిక్, బెంజీన్, లెడ్, క్లోరోఫ్లోరో కార్బన్‌లు (ఇవి ఫ్రిజ్‌లనుంచి వెలువడుతుంటాయి), పెట్రోల్‌ మండించినప్పుడు వెలువడే కార్బన్‌ వ్యర్థాలు, చెట్ల నుంచి గాలిలోకి వెలువడే కంటికి కనపడనంత సూక్ష్మంగా ఉండే పుప్పొడి రేణువులు, మనం పొగతాగి వదిలినప్పుడు వెలువడే పొగాకు కాలుష్యాలు, గాలిలో వేలాడుతూ ఉండే ధూళి కణాలు (సస్పెండెడ్‌ ఎయిర్‌ పార్టికిల్స్‌)...   వీటన్నింటినీ మనకు తెలియకుండానే కన్ను భరిస్తూ ఉంటుంది.



బయట సరే... ఇంట్లోనూ!

నీటిఆవిరి : ఇంట్లో ఉన్నప్పుడు మన శ్వాసతో పాటు, మన వంటావార్పూ, నీరు వెచ్చబెట్టుకునే చాలా ప్రక్రియల్లో ఇది వెలువడుతుంది.



ఏరోసాల్స్‌ : మన ఇంట్లోని ఉపకరణాలపై వేసిన రంగులు, గోడలకు వేసిన వార్నిష్, పెయింట్స్‌ వంటి వాటి నుంచి వెలువడుతుంది.



అలర్జెన్స్‌ : మనం తల ఆనించే తలగడ (పిల్లో)లోనూ డస్ట్‌ మైట్స్‌ అనే సూక్ష్మ క్రిములు కోట్లలో ఉంటాయి. ఇక... ఇంట్లోకి వచ్చే గాలితో పాటు ప్రవేశించే పుప్పొడి, స్పోరులు కంటిని తాకుతుంటాయి.



అమోనియా : ఇంట్లోని కొన్ని ఉత్పాదనల్లో ఇది ఉంటుంది. ప్రత్యేకంగా ఇంటిని  శుభ్రపరిచే చాలా రసాయనాల్లో అమోనియా ఉండటం వల్ల ఒక్కోసారి శుభ్రపరిచే సువాసన అలా వెలువడి ముక్కును తాకుతుండగానే... మరో పక్క ఈ రసాయనం కారణంగా కళ్లూ మండుతుంటాయి.



ఫార్మాల్డిహైడ్‌ : మన ఆఫీస్‌లలో ఉండే పార్టికిల్‌ బోర్డ్స్, కరెంట్‌ వైర్ల నుంచి వచ్చే వాసనల నుంచి, పొగాకు వాసనల నుంచి ఇది వెలువడుతుంటుంది.



మెర్క్యూరీ (పాదరసం) : ఫ్యాక్టరీల నుంచి, మన వాహనాల నుంచి వెలువడే పొగనుంచి.



పెయింట్స్‌ : ఇంట్లో పెయింట్‌ వేసిన కొత్తలో కళ్లు మండుతుండటాన్ని మనం గమనించవచ్చు. దీనికి కారణం వాటిల్లో ఉండే లెడ్‌.

స్ప్రేలు / సుగంధ ద్రవ్యాలు/కాస్మెటిక్స్‌ : ఇంట్లో సెంట్‌ స్ప్రే చేసుకున్నప్పుడు కళ్లు కాస్త మండటాన్ని చాలాసార్లు గమనించవచ్చు. ఇక కొన్ని సౌందర్యసాధనాలు (కాస్మెటిక్స్‌) సైతం కంటికి హాని చేస్తాయి.



పల్లెల్లోని వాయు–కాలుష్యాలివి...

పౌడర్‌ రూపంలోని మందులు : పురుగు మందులు, తెగుళ్ల నివారణకు వాడే మందుల నుంచి వెలువడే దుర్వాసనల ద్వారా వాటి ఉనికి తెలుసుకోవచ్చు. ఇవీ కంటికి హానికరమే. పుప్పొడి వల్ల కళ్లకు హాని కలగడం పట్టణాల్లో కంటే పల్లెల్లో ఎక్కువ.  పార్థీనియం అనే మొక్కతో ఈ ప్రమాదం మరీ ఎక్కువ.బొగ్గులు, కిరోసిన్, పిడకలు, కట్టెల వంటివి కాల్చినప్పుడు వెలువడే పొగలు కూడా కళ్లకు హాని చేస్తాయి.



మిగతా కారణాలు...

పైన పేర్కొన్న ప్రధానమైన వాయు కాలుష్యకారకాలే కాకుండా ఇటుక బట్టీలు, ముడి ఖనిజాలను (ఓర్స్‌)ను శుభ్రం చేయడం, అణు ఇంధన ఆధారిత సంస్థలు/రసాయన పరిశ్రమలు, బాంబు పేలుళ్లు, దీపావళి మొదలుకొని ఇతరత్రా కొన్ని వేడుకల్లో బాణాసంచాలు కాల్చడం వంటి అంశాలన్నీ అరుదుగా లేదా అప్పుడప్పుడు కంటికి ప్రమాదాలను తెచ్చిపెడతాయి.



కాలుష్యాలతో కళ్లపై ప్రభావాలిలా...

అనేక రకాల కాలుష్యాల బారిన పడగానే కన్ను వాటి దుష్ప్రభావాలను ఈ కింద పేర్కొన్న లక్షణాల ద్వారా మనకు తెలియపరుస్తుంది. అవి...

కళ్లు మంటగా ఉండటం ∙ఎర్రబారడం

వెలుగును చూడలేకపోవడం (ఫొటోఫోబియా)

కళ్ల నుంచి నీళ్లు కారడం ∙కళ్ల నుంచి పూసి (రోపీ డిశ్చార్జ్‌)

కళ్లు పొడిబారడం

కళ్లు మసకబారడం (ఇది అనేక రకాలుగా జరగవచ్చు.

కాలుష్యం దట్టంగా ఉన్నప్పుడూ ఎదుటి దృశ్యాలను కన్ను చూడలేకపోవచ్చు లేదా కంట్లోని నీటి పొర వల్ల కన్ను మసకగానూ మారవచ్చు.

అదేపనిగా ధూళికి గురి కావడం వల్ల వచ్చిన క్యాటరాక్ట్‌ కారణంగా కూడా కన్ను మసకబారవచ్చు)

కంట్లో దురదలు

అలర్జిక్‌ కంజంక్టవైటిస్‌ (ఇన్ఫెక్టివ్‌ కంజంక్టవైటిస్‌) లేదా కళ్లకలక వంటి లక్షణాలు.



 కంటి సంరక్షణ కోసం కాలుష్య నివారణ ఇలా...

ఫ్యాక్టరీలు మొదలుకొని ఇంటి లోని పొయ్యి వరకు వీలైనంత తక్కువగా గాల్లోకి కాలుష్యాలు వెలువడేలా అందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫ్యాక్టరీల యాజమాన్యాలు తమ నిర్దేశిత జాగ్రత్తలను తప్పక నిర్వహించేలా నియంత్రణ సంస్థలు చూడాలి. సాధ్యమైనంత వరకు పారిశ్రామిక సంస్థలు నివాస ప్రాంతాల నుంచి దూరంగా ఉండాలి. వాహనాల విషయంలో వీలైనంత తక్కువ కాలుష్యాలను వెలువడే ఇంధనాలు వాడాలి. ఉదాహరణకు డీజిల్, పెట్రోలుకు బదులు పూర్తిగా మండిపోయి (కంబష్చన్‌ అయిపోయి) ఎలాంటి కాలుష్యాలను వెలువరించని గ్యాస్‌లు లేదా బ్యాటరీ ఆధారిత వాహనాలను ఉపయోగించాలి. పట్టణ ప్రాంతాల వారు తక్కువ దూరాలకు  మోటార్‌ సైకిళ్లకు బదులు సైకిళ్లు వాడటం అటు కళ్లకు, ఇటు మిగతా ఒంటి ఆరోగ్యానికీ మంచిదే. తమ వాహనాల నుంచి వెలువడే కాలుష్యాల పాళ్లను తరచూ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి.



అది మోతాదుకు మించకుండా జాగ్రత్త వహించడంతో పాటు.. ఒకవేళ అలా కాలుష్యాలు వెలువడుతుంటే వెంటనే రిపేర్‌ చేయించుకోవాలి. ఇది వాతావరణాన్ని రక్షించడంతో పాటు మీ వాహనం పనిచేసే కాలాన్ని, దాని సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఖనిజాలను వెలికి తీసే ప్రాంతాల్లోనూ / వాటిని ప్రాసెస్‌ చేసే ప్రాంతాల్లోనూ తగిన రక్షణాత్మకమైన జాగ్రత్తలు పాటించాలి. కాలుష్య నియంత్రణ మండలి వంటి సంస్థలు నిరంతరం వాతావరణంలోని కాలుష్య కారకాల పాళ్లను (అంటే కార్బన్‌ మోనాక్సైడ్, కార్బన్‌ డయాక్సైడ్, నైట్రోజన్‌ ఆక్సైడ్, సస్పెండ్‌ పార్టికల్స్‌ వంటివి) నిత్యం లెక్కిస్తూ సైన్‌ బోర్డ్స్‌ వంటి ఉపకరణాల ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తుండాలి. అలా వాతావరణ కాలుష్యాల కారణంగా ఆరోగ్యంతో పాటు కళ్లకు జరిగే నష్టంపైన కూడా అవగాహన కలిగించాలి. కాలుష్యాలతో కళ్లకు జరిగే హాని గురించి అవగాహన కల్పించడం ఇప్పటివరకూ పెద్దగా జరగడం లేదు.



కాలుష్యంతో వచ్చే కంటిజబ్బుల్లో కొన్ని...

వాయుకాలుష్యాలకు కన్ను మితిమీరి గురి కావడం వల్ల వచ్చే ప్రధాన సమస్యల్లో కొన్ని...

క్యాటరాక్ట్‌  (తెల్ల ముత్యాలు) : కంటికి ఉండే లెన్స్‌ వయసు పెరుగుతున్న కొద్దీ తన పారదర్శకతను కోల్పోవడం చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ. అయితే కాలుష్యం వల్ల ఈ పరిణామం చాలా ముందుగా జరిగేందుకు అవకాశాలు ఎక్కువ. దాంతో చాలా తొందరగా క్యాటరాక్ట్‌ సమస్య వస్తుంది.



కంటి క్యాన్సర్‌ / కనురెప్ప క్యాన్సర్‌ : చాలా అరుదుగా వచ్చే తీవ్ర సమస్యలివి. భరించలేనంత కాంతి వల్ల లేదా తీవ్రమైన సూర్య కాంతిలో ఉండే అల్ట్రా వయొలెట్‌ కిరణాల వల్ల టెరీజియం (కంటి మూలలో ఉండే పొర పెరగడం), కార్నియా పైపొర దెబ్బతినడం, క్యాటరాక్ట్, ఏజ్‌ రిలేటెడ్‌ మాక్యులార్‌ డీజనరేషన్‌ (ఏఆర్‌ఎమ్‌డీ),  వంటి జబ్బులు రావచ్చు.



వేడిమి వల్ల : వేడి వాతావరణంలో ఉండే వేడిమి కూడా కంటిని దెబ్బతీస్తుంది. ఇది ఫ్యాక్టరీల వంటివి ఉన్న చోట్ల జరుగుతుంది. దీనివల్ల కన్నుపొడిబారే జబ్బు (డ్రై–ఐ లేదా గ్జీరాఫ్తాల్మియా) వస్తుంది. వాతావరణంలోని పొగమంచుకు అదేపనిగా చాలాకాలం ఎక్స్‌పోజ్‌ కావడం వల్ల స్నో బ్లైండ్‌నెస్, టెరీజియమ్‌ వంటి వ్యాధులు రావచ్చు. ∙ఇవేగాక వాతావరణంలో నేరుగా కన్ను తెరచుకొని ఉండటం వల్ల – మరీ కాంతిమంతమైన ట్రాఫిక్‌ లైట్లు, ఎలక్ట్రానిక్‌ తెరలు, వర్షంలో మెరుపులు వంటివి కూడా కంటికి హాని చేస్తాయి.



కంటికి హాని జరిగిన లక్షణాలు కనిపిస్తే చేయాల్సింది...

అనేక కారణాల వల్ల వాయు కాలుష్యంతో కంటికి హాని చేసే లక్షణాలు కనిపించినప్పుడు పాటించాల్సిన సూచనలివి... మనసును ప్రశాంతంగా ఉంచుకొని కంటిని మూసి ఉంచాలి. వీలైతే పరిశుభ్రమైన నీటితో కంటిని కడగాలి. కేవలం కంటిని కడగడానికి గది ఉష్ణోగ్రత (రూమ్‌ టెంపరేచర్‌) తో ఉన్న నీటినే వాడాలి తప్ప వేడి నీటినీ, చల్లటి ఫ్రిజ్‌ నీటిని ఉపయోగించకూడదు. బయటకు వచ్చినప్పుడల్లా ఎలాంటి పవర్‌ లేని సాధారణ కళ్లజోడు (ప్లెయిన్‌ గ్లాసెస్‌) ధరించాలి. ఇది స్టైల్‌ కోసం అనుకోకూడదు. కాళ్లకు పాదరక్షల్లాగే కళ్లకు కళ్లజోడు రక్షణ కల్పిస్తుంది.



చేయకూడనివివీ...

అన్నింటికంటే ముందుగా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినదేమిటంటే కళ్లను ఎప్పుడూ రుద్దుకోకూడదు. ఎంతగా దురదపెట్టినట్లు అనిపించినా, మంట పుట్టినా ఈ పని చేయకూడదు. అలారుద్దుకోవడం కంటికి మరింత హాని చేస్తుంది కాబట్టే ఈ ముఖ్య సూచన. కళ్లలో ఎలాంటి చుక్కల మందులను డాక్టర్‌ సలహాలు, సూచనలు, ప్రిస్క్రిప్షన్‌ లేకుండా ఉపయోగించకూడదు.మందుల షాపులో అడిగి తీసుకునే (ఓవర్‌ ద కౌంటర్‌) మెడిసిన్స్‌ కంటి విషయంలో అస్సలు తీసుకోకూడదు. కాంటాక్ట్‌ లెన్స్‌లు వాడేవారు, ఐ మేకప్‌ ఉన్నవారు వాటిని తొలగించాలి. ఈ చేయాల్సిన / చేయకూడని సూచనలు పాటించాక వీలైనంత త్వరగా కంటి వైద్య నిపుణులను కలవాలి.  

డా. రవికుమార్‌ రెడ్డి

కంటి వైద్య నిపుణులు

మెడివిజన్‌ ఐ హాస్పిటల్‌ హైదరాబాద్‌


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top