కాలాన్ని  చేజార్చుకోకండి!

Do not miss the time - Sakshi

విద్యార్థులుగా మీరున్న ఈ వయసు బాగా పటుత్వంతో కూడుకున్నది. ఇప్పుడు మీరు బాగా చదవగలరు. మీరు శ్రద్ధతో వినగలుగుతున్నారు. చక్కగా విషయాలను ఆకళింపు చేసుకోగలుగుతున్నారు. కొన్ని కొన్ని విషయాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు. ఎక్కువసేపు కూర్చోగలరు. అన్నిరకాల వాతావరణాలను తట్టుకునే శక్తి ఉంటుంది. అదే ఒక వయసు దాటిన తరువాత మీకు ఇప్పటి శక్తి ఉండదు.  ఇకపైన మనం ఈ పంథాలో ప్రయాణం చేయాలని అనుకోగలుగుతున్నప్పడు మీకు ఆమేరకు అవకాశాలు కూడా ఉంటాయి. మీరు తప్పులు చేసినా వాటిని దిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. దానిని బంగారు భవిష్యత్తుగా మార్చుకోగలరు.

కానీ ఈ అవకాశాలన్నీ దాటిపోయిన తరువాత, తలపండిపోయిన తరువాత, 70 ఏళ్ళు పైబడిన తరువాత ‘ఇది చెయ్యాలి’ అని అనుకుంటే అదంత సులభసాధ్యం కాదు. వెళ్ళిపోయిన కాలం తిరిగి రాదు. అలా బాధపడాల్సిన అవసరం మీకు రాకుండా ఉండాలంటే కాలం విలువను తెలుసుకోవాలి. దాని గొప్పదనాన్ని గుర్తించాలి. దానిని సద్వినియోగం చేసుకోవాలి. అలా కావాలంటే ఎప్పడు ఏది చేయాలో అప్పడు అది చేయడం అలవాటు కావాలి. అలవాటు అంటే అలవాటే. దానికి నిరంతరం జాగ్రత్త అవసరం.ఏ సమయంలో ఏది అందుకోవాలో అది అత్యంత శ్రద్ధతో అందుకోవాలి. అంటే – ఆవు పాలు పిండే వ్యక్తి రెండు మోకాళ్ళ మధ్యలో పాల బిందె పెట్టుకుని అవు పొదుగు దగ్గరి సిరములను లాగుతున్నప్పుడు వచ్చే సన్నటి పాలధార నేరుగా బిందెలోనే పడేటట్లు దాని మీద ఎలా దృష్టి పెడతాడో, నేలపాలు కాకుండా ఎలా చూసుకుంటాడో అలా సమయాన్ని విద్యార్థులు ఒడిసి పట్టుకోవాలి.ఒకప్పుడు అంటే తొలి దశలో సచిన్‌ టెండూల్కర్‌ తన ఆటమీద ఎంత శ్రద్ధ పెట్టేవాడంటే, ఏ ఒక్క క్షణాన్ని కూడా వృథా చేసేవాడు కాదు. శిక్షణకు వెళ్ళడానికి తెల్ల దుస్తులు తప్పనిసరి.

అది అతని దగ్గర ఒకే జత ఉండేది. ఎక్కడో బస్సెక్కి ఎక్కడికో వెళ్ళాలి. పొద్దున్నంతా ఆటలో శిక్షణ తీసుకుని మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు ముందుగా తన తెల్ల దుస్తులు ఉతికి ఆరేసుకునేవాడు. సాయంకాలానికి అవి వేసుకుని మళ్ళీ ఆటలో సాధనకు బయల్దేరి వెళ్లేవాడు. అతని జీవితం వడ్డించిన విస్తరి కాదు. సమయాన్ని వృథా చేసుకోకుండా అంత కఠోర సాధన చేసాడు కాబట్టే భారతరత్న కాగలిగాడు. కాలాన్ని సద్వినియోగం చేసుకున్నవారిని మాత్రం కాలం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుంది. అబ్దుల్‌ కలాంగారు ఆఖరి క్షణాల్లో కూడా  కళాశాలలో వేదిక ఎక్కి పిల్లలతో మాట్లాడుతూ తనకు స్పృహ తప్పుతోందని తెలిసి, ఆఖరి మాటవరకు కూడా శరీరాన్ని ఊన్చుకుని తరువాత కిందకు జారిపోయాడు.కె.ఎల్‌.రావుగారని లబ్దప్రతిష్ఠుడైన ఇంజనీరు ఉండేవారు.

ఆయన దగ్గరకు ఒక మంత్రిగారు ఫలానా సమయానికి వస్తానని చెప్పి ఆ తరువాత ఎప్పడో వచ్చాడు. ఆయనకోసం రావుగారు తన పనులన్నీ వాయిదా వేసుకుంటూ చాలాసేపు చూసాడు. తరువాత వచ్చిన మంత్రిగారితో చర్చించి పంపేసారు. అదేమంత్రిగారు తరువాత పనిబడి ‘‘నేను ఫలానా సమయానికి వస్తున్నాను మీతోపనుంది’’ అన్నప్పుడు...‘‘చెప్పిన సమయానికి వస్తే నేను మీతో మాట్లాడగలను. ఆ సమయం దాటితే నేను మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉండలేను’’ అని తన కాలం ఒక మంత్రిగారి కాలం కంటే ఎంత విలువయిందో నిర్మొహమాటంగా చెప్పేసాడు. నిన్న తప్పిపోయిన తరగతులు మళ్ళీ రావు. స్వతంత్ర జీవితంలోకి అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్న విద్యార్థులుగా మీకు ఏ ఒక్క క్షణం కూడా జారిపోవడానికి వీల్లేదు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top