నిశ్చల ప్రేమ కథా చిత్రం

Director Ritesh Batra on Mumbai movie Photograph - Sakshi

ప్రేమ కథలు భారీగా ఉండక్కర్లేదు. కొన్ని కరిగిపోయే ఐస్‌క్రీమ్‌లా ఉంటాయి. కొన్ని ఎక్కడ తిన్నామో మర్చిపోయి రుచి మాత్రం మిగిలిపోయే స్ట్రీట్‌ ఫుడ్‌లా ఉంటాయి. కొన్ని గుంపులో మనం అనుకోకుండా క్లిక్‌ చేసిన ఫొటోగ్రాఫ్‌లా ఉంటాయి. ఫొటోలో  ఉన్న అమ్మాయి నిజ జీవితంలో దొరుకుతుందని ఆశ పడటం ప్రేమకు బాగుంటుంది కాని వాస్తవానికి కాదు. ‘ఫొటోగ్రాఫ్‌’ సినిమా ఒక ఫొటోగ్రాఫర్‌కి, ఫొటోలోని  అమ్మాయికి మధ్య నడిచే ప్రేమ కథ.

‘రఫీ... దాదీ (నానమ్మ) మందులేసుకోవడం మానేసిందట. నిజమేనా?’ అడుగుతాడు బస్తీలోని బడ్డీకొట్టు యజమాని.‘రఫీభాయ్‌.. మీ దాదీకి బాగలేదట?’ అంటాడు పక్కింటాయన.‘ఏ రఫీ.. దాదీ విషయం ఏదో వింటున్నాను..?’ ఆరా తీస్తాడు స్నేహితుడు!‘ఏంటీ.. ఉత్తరప్రదేశ్‌లోని మా ఊళ్లో ఉన్న దాదీ సంగతి అప్పుడే ముంబైదాకా పాకిందా?’ రఫీ మనసులో ఆశ్చర్యం.దాదీ సమస్యకు పరిష్కారం వెదికాడు. తను ‘నూరీ’ అనే అమ్మాయితో ప్రేమలో పడ్డట్టు దాదీకి ఓ ఉత్తరం రాశాడు. ఆ అమ్మాయి ఫోటోనూ జత చేసి జాబు పోస్ట్‌ చేశాడు.

‘పిల్ల చందమామ తునకరా! చూడ్డానికి వస్తున్నా’ అంటూ ప్రత్యుత్తరం కన్నా ముందే ముంబైకి వచ్చేసింది దాదీ.అసలు కథ ఇక్కడ నుంచి సాగే ఈ సినిమా పేరు ‘ఫోటోగ్రాఫ్‌’. దర్శకుడు రితేష్‌ బత్రా. ‘లంచ్‌ బాక్స్‌’ సినిమాను తీసి గుర్తింపు పొందిన దర్శకుడు ఇతడే. అయితే లంచ్‌బాక్స్‌ను దృష్టిలో పెట్టుకోకుండా ఫోటోగ్రాఫ్‌ను చూడండి. మీకు నచ్చుతుంది. అమేజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతోంది. సాన్యా మల్హోత్రా (దంగల్, పటాకా, బధాయీ హో ఫేమ్‌), నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఫరూఖ్‌ జఫర్, గీతాంజలీ కులకర్ణి ముఖ్య పాత్రలు.

పాజ్‌ ఆఫ్‌.. ప్లే ఆన్‌
అయితే రఫీ చెప్పిన నూరీ ఎవరు? వాస్తవానికి ‘నూరీ’ గేట్‌ వే ఆఫ్‌ ఇండియా దగ్గర కనిపించిన అమ్మాయికి రఫీ పెట్టుకున్న పేరు. ఆమె ఒరిజినల్‌ పేరు మిలోని (సాన్యా మల్హోత్రా). గుజరాతీ, అప్పర్‌ మిడిల్‌క్లాస్‌ అమ్మాయి. సీఏ ఇంటర్‌ చదువుతూంటుంది. టాప్‌ స్టూడెంట్‌. ఒకరోజు కుటుంబంతో కలిసి షాపింగ్‌ వెళ్లిన మిలోని గేట్‌ వే ఆఫ్‌ ఇండియా దగ్గర ఇన్‌స్టంట్‌ ఫోటోగ్రాఫ్స్‌ తీసిపెట్టే రఫీ (నవాజుద్దీన్‌ సిద్దిఖీ)కి కనపడుతుంది. ఆమెకు ఫొటో తీసుకోవాలని ఉండదు. కాని ఆమెను కన్విన్స్‌ చేసి ఫోటో తీస్తాడు. ఆ ఫోటోగ్రాఫ్‌ తీసుకొని డబ్బు చెల్లించే లోపే తల్లి పిలవడంతో మిలోని వెళ్లిపోతుంది. ఆ రోజే రఫీకి వాళ్ల దాదీ నుంచి కొత్త బెదిరింపు ఎదురవుతోంది. తను బతికుండగానే రఫీ పెళ్లి చూడాలని.. అల్లా కరుణిస్తే.. రఫీ పిల్లలతో ఆడుకోవాలనీ ఆమె ఆశ. రఫీకేమో ఇప్పుడప్పుడే పెళ్లి ఆలోచన ఉండదు.

ఊర్లో చేసిన అప్పు తీరాక.. ఆర్థికంగా కాస్త స్థిరపడ్డాక.. అంటే సొంతంగా ఓ వ్యాపారం మొదలుపెట్టిగాని పెళ్లి జోలికి వెళ్లొద్దు అనుకుంటాడు. అందుకే దాదీ మాటను లెక్కచేయడు. దాంతో దాదీ (ఫరూఖ్‌ జఫర్‌) రకరకాల హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడుతూ ఉంటుంది. ఊరి నుంచి అతడు నివాసం ఉండే ప్రాంతంలోని ఇరుగుపొరుగు వారికి తెలిసేలా గోల చేస్తుంటుంది. మనవడు పెళ్లికి ఒప్పుకునేదాకా మందులు వేసుకోవడం మానేస్తుంది. ఆ బెదిరింపుకి విరుగుడుగా రఫీ ఆడిన అబద్ధమే అనుకోకుండా కనిపించిన మిలోనీని తను ప్రేమించిన ‘నూరీ’గా ఉత్తరం ద్వారా దాదీకి పరిచయం చేయడం. ఆ అమ్మాయిని చూడ్డానికి వస్తాను అని దాదీ అనేసరికి ఆ అబద్ధాన్ని నిజంలా నటించే ప్రమాదం రఫీ నెత్తిన పడుతుంది.

సెర్చింగ్‌లో..
కనీసం పేరు కూడా తెలియని మిలోనీని ఎలా వెదకాలి అనే ఆలోచనల్లో పడ్తాడు రఫీ. సిటీబస్‌లో వెళ్తుంటే ఓ చోట ఓ పెద్ద హోర్డింగ్‌ కనపడ్తుంది. ఆత్రంగా వెనక్కి తిరిగి మరీ చూస్తాడు. ఆ అమ్మాయే! తర్వాత స్టాప్‌లో దిగిపోయి గబగబా ఆ హోర్డింగ్‌ ఉన్న చోటికి వస్తాడు. అదో సీఏ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌. టాప్‌ స్టూడెంట్‌ అయిన మిలోని ఫోటోతో పబ్లిసిటీ కోసం పెట్టిన హోర్డింగ్‌ అది. దాని ఆధారంగా ఆమెను వెతుక్కుంటూ వెళతాడు. కాసేపటికి మిలోనీ దర్శనమిస్తుంది. రఫీ మొహం విప్పారుతుంది. బస్‌లో కలిసే ప్రయాణం చేస్తారు. తర్వాత రోజూ ఆమెను కలుస్తాడు. విషయం వివరిస్తాడు.

దాదీ ఆగమనం..
మిలోని మితభాషి.  యాక్టర్‌ కావాలనుకుంటుంది. సీఏ కావాలని తండ్రి డిసైడ్‌ చేస్తాడు. మారు మాట్లాడకుండా సీఏలో చేరుతుంది. ఆ అమ్మాయి వేసుకునే బట్టలను వాళ్లమ్మ సెలెక్ట్‌ చేస్తుంది. తనకి ఇష్టమైనవి కాకపోయినా ఒప్పేసుకుంటుంది. అలా మిలోని మనసు విప్పి మాట్లాడే సందర్భాలను ఆ ఇంట్లో చాలా తక్కువగా కల్పిస్తుంటారు. అన్నిటికీ అన్నిటినీ పెద్దవాళ్లే నిర్ణయిస్తారు. ఆ అమ్మాయి ఫాలో అవుతుంది. అలాంటి మిలోని దాది దగ్గర గలగలా మాట్లాడుతుంది. రఫీ దాదీని పరిచయం చేశాక ‘మీరెలా కలిశారు?’ అని అడుగుతుంది దాదీ. గేట్‌ ఆఫ్‌ ఇండియా దగ్గర అని నిజమే చెప్తుంది.

మీ కుటుంబం? అన్న ప్రశ్నకే అతికే అబద్ధాన్ని సెకన్లలో అవలీలగా అల్లేస్తుంది. ‘మా అమ్మానాన్న.. మస్‌జిద్‌ గోడ కూలి చనిపోయారు. అక్కా, బావల దగ్గర పెరిగాను. హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను’’ అని. ఆశ్చర్యపోతాడు రఫీ. అలా దాదీతో మాట్లాడ్డం, ఆమెతో ముంబైలో తిరగడాన్ని చాలా ఇష్టపడ్తుంది మిలోని. ఇంట్లో దొరకని సాన్నిహిత్యం, ప్రేమ, స్వేచ్ఛ ఆమె దగ్గర పొందుతున్నట్టు ఫీలవుతుంది. రఫీ బాల్యం గురించి చెప్తూ ఉంటుంది దాదీ. వింటూ ఎంజాయ్‌ చేస్తుంది

మిలోని. సోల్‌మేట్స్‌..
దాదాపు రోజూ క్లాసెస్‌ అయిపోగానే లేదంటే కొన్ని క్లాసెస్‌ డుమ్మా కొట్టి మరీ దాదీని కలుస్తూ ఉంటుంది మిలోని. తెలియకుండానే రఫీ, మిలోని ఒకరి సాంగత్యాన్ని ఒకరు ఇష్టపడుతూ ఉంటారు. ఆ అమ్మాయిని సినిమాకు తీసుకెళ్తాడు. అతనితో తన బాల్య జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. తనెలా ఉండాలని కోరుకుంటుందో అలా ఉంటూంటుంది రఫీ దగ్గర. అయినా తామిద్దరి మధ్యా ఉన్న మతం, డబ్బు అంతరాన్ని ఓ పక్క గుర్తు చేసుకుంటూనే ఉంటుంటాడు రఫీ. ఇంకోవైపు ఆమె బాయ్‌ప్రెండ్‌లా ప్రొటెక్టివ్‌గానూ ప్రవర్తిస్తుంటాడు.

దాదీ స్ట్రీట్‌ఫుడ్‌ (ఐస్‌ఫ్రూట్‌ లాంటిది) ఇప్పిస్తున్నప్పుడు ‘వద్దు.. ఆమెకు జలుబు చేస్తుంది. అసలే పరీక్షలు. జబ్బు పడితే కష్టం’ అనే మిషతో ఆ ఐస్‌ఫ్రూట్‌ను మిలోని తిననివ్వకుండా రఫి చేసే ప్రయత్నం మొదటి విషయంలో భాగమైతే మిలోని కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లోని ఫ్యాకల్టీ ఆ అమ్మాయి పట్ల చనువుగా బిహేవ్‌ చేస్తుంటే మిలోనీని అక్కడి నుంచి తీసుకెళ్లడం రెండో విషయానికి ఉదాహరణ. మొత్తానికి ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ఇష్టం అయితే ఉంటుంది. కాని ప్రకటించుకోరు. సోల్‌మేట్స్‌లా బిహేవ్‌ చేస్తారు.

పెళ్లి చూపులు..
ఇంకోపక్క మిలోనికి పెళ్లి సంబంధం వస్తుంది. వరుడు విదేశాల్లో డాక్టర్‌. ఇంట్లో వాళ్లకు నచ్చుతాడు. మిలోని సమ్మతి మాట వరుసకే. అబ్బాయిని కలవమని చెప్తారు ఇంట్లో వాళ్లు. ఓ రెస్టరెంట్‌లో కలుస్తుంది. ఇష్టాయిష్టాలు తెలుసుకునే క్రమంలో ‘నీకు ఎక్కడ ఉండాలని ఉంది? ఇండియాలోనా? అబ్రాడ్‌లోనా?’ అంటాడు పెళ్లికొడుకు.‘ఇండియాలోని పల్లెటూళ్లో’ అని సమాధానమిస్తుంది మిలోని.అవాక్కవుతాడు అబ్బాయి.‘పల్లెటూళ్లోనా? అక్కడ ఏం చేస్తావ్‌?’ అడుగుతాడు అదే విస్మయాన్ని కంటిన్యూ చేస్తూ.‘ఆ స్వచ్ఛమైన గాలి పీల్చుకుంటూ పొలాల్లో పనిచేస్తూ ప్రశాంతంగా ఉంటా’ చెప్తుంది మిలోని.ఏడ్వలేక నవ్వుతాడు అబ్బాయి అయోమయంగా. అతణ్ణి కలిశాననిపించుకొని క్లాస్‌ ఉందని వెంటనే రఫీ దగ్గరకు వెళ్తుంది మిలోని. రఫీ దాదీ ఆ ఇద్దరి పెళ్లి ఏర్పాట్లకు సన్నద్ధమవుతుంది.

‘ఆ అమ్మాయి ఇంకా చదువుకోవాలి.. ఇప్పుడప్పుడే కాదు’’అని దాటవేసేందుకు ట్రై చేస్తాడు రఫీ. నిజానికి అతనికీ మనసులో మిలోని జీవితభాగస్వామి అయితే బాగుండు అనే బలంగా అనిపిస్తూంటుంది. ఆమెతో సమం కావాలంటే ఆ స్ట్రీట్‌ ఫోటోగ్రాఫర్‌ పనికి స్వస్తి పలక వల్సిందే అనుకుంటాడు. వ్యాపారం మొదలుపెట్టాలి ఏం వ్యాపారం? అనే తలపుతోనే ఆ రాత్రి నిద్రపోతాడు. ఫ్యాన్‌కి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న తన ఇంటి యజమాని కనిపిస్తాడు. తనలా కూల్‌డ్రింక్‌ ఫ్యాక్టరీ పెట్టుకోమని సలహా ఇచ్చి వెళ్లిపోతాడు. నిద్రలేస్తాడు. ఆ వ్యాపారం ఆరంభించాలనే నిశ్చయానికి వస్తాడు. ఆ రోజు మిలోనితో మళ్లీ సినిమాకు వెళ్తాడు. మధ్యలోనే బయటకు వచ్చేస్తుంది మిలోని.

వెంట రఫీ వచ్చి.. ‘సినిమా నచ్చలేదా?’ అడుగుతాడు. ‘అన్నీ ఒకేరకంగా ఉంటున్నాయి. మీకు బోర్‌ కొట్టదా?’ అని తిరిగి ప్రశ్నిస్తుంది. ఇక్కడితో ఈ సినిమాకు ఎండ్‌ టైటిల్స్‌!సినిమాలన్నీ ఒకే రకంగా ఉంటాయో.. ఉండవో.. చూసే వాళ్ల పర్‌సెప్షన్‌! ప్రేమ కథలూ అన్నీ ఒకే రకంగా అనిపిస్తాయా లేదా అన్నది కూడా పాఠకుల, వీక్షకుల దృక్పథాన్ని బట్టే! ఈ ఫోటోగ్రాఫ్‌ కూడా అంతే! అందుకే కాబోలు.. ఈ స్టోరీ ముగింపును ప్రేక్షకులకు వదిలేశాడు దర్శకుడు.బహుశా రఫీ కూడా ఆమెకు కొన్నాళ్లకు బోర్‌ కొడతాడా? ఫొటో తీసిన లిప్తకాలం పాటు నిలబడి జారిపోయే ప్రేమకథా ఇది? కెమెరా ఉన్నంత మాత్రాన ఫిల్మ్‌లో బంధించే ప్రతీది ఫొటోగ్రాఫర్‌ సొంతమవదు కదా అని చెప్పదలుచుకున్నాడా... అది ఒక్కొక్కరు ఒక్కోవిధంగా ఊహించుకోవాలి. ఒక నిశ్చల ప్రేమ కథా చిత్రం ‘ఫొటోగ్రాఫ్‌’.
– సరస్వతి రమ

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top