పుణ్యం కొద్దీ పూలజడ!

పుణ్యం కొద్దీ పూలజడ!


 శ్రావణలక్ష్మి ఎంత శోభాయమానం! పట్టుచీరల గరగరలు... బంగారు నగల ధగధగలు... గంధపు వాసనల గుబాళింపులు... చేతి గాజుల శ్రావ్యగీతికలు... ఘల్లుఘల్లున అందెల సవ్వడులు... గోరింట పంటల సిరులు... ఆహా! ఎంత మంగళదాయకం!! వేడుకను చూడ్డానికి... ఎన్ని జన్మల సుకృతాలు చేసి ఉండాలో. అప్పుడే అయిందా! సెంటర్ ఆఫ్ ది ఎట్రాక్షన్.... పూలజడ! వీక్షణ భాగ్యం దక్కాలంటే ఎన్ని పుణ్యాలు చేసుకుని ఉండాలో!

 

 ఓ వాలుజడ, మల్లెపూల జడ

 ఓ మురిపాల జడ, సత్యభామ జడ

 ఓ పట్టుజడ...

 మనసు కట్టడి చేసే జడలు ఎన్నో...

 మదిని గిలిగింతలు పెట్టే పూలజడలు ఎన్నెన్నో...

 వేగవంతమైన జీవితంలో ఆధునికత ఎంతగా వచ్చి చేరినా వేడుకలలో అమ్మాయిల రూపాన్ని ఒద్దికగా, కనులకు పండగలా మార్చేసే సుగుణం మాత్రం సంప్రదాయ అలంకరణకే ఉంది. ఆ అలంకరణలో పూలజడ స్థానం ఎప్పటికీ చెక్కుచెదరనిది. చిక్కుపడకుండా, ఎక్కడపడితే అక్కడ రాలకుండా, అందంగా ఉండటానికి కొన్ని వెంట్రుకలను పాయలుగా విడదీసి, జడగా అల్లుతారు. ఆ జడకు రకరకాల పువ్వులతో అందాలను రూపుకడతారు. ఒకప్పుడు అమ్మాయి పూలజడతో ముస్తాబు అయ్యిందంటే వేడుకకు సిద్ధమైంది అని అందరూ అనుకునేవారు. ఇప్పుడు ఏ వేడుకకైనా కళ రావాలంటే అమ్మాయి పూలజడతో సిద్ధమవ్వాలి అని ఇంటిల్లిపాదీ ముచ్చటపడుతున్నారు. దీనికి కారణం ఇప్పుడు పూలజడల్లోనూ ఆధునికత అందంగా చేరిపోవడమే! నిన్నమొన్నటివరకు మోయలేని భారాన్ని పిల్లల నెత్తిన ఎందుకు పెట్టడం అనుకునేవారు సైతం ఇప్పుడు చిన్నారులను కుందనపు బొమ్మలా తీర్చిదిద్దాలని ఆరాటపడుతున్నారు. అందుకేనేమో పువ్వులతో పాటు టిష్యూ లేసులు, కుందన్ బిళ్లలు, ముత్యాలు, రతనాలు కూడా జడ ఒంపుల్లో చేరిపోవడానికి వేగిరపడుతున్నాయి.

 

 పూలజడల్లో సంప్రదాయతరహాకు చెందినవి, ఆధునికతను సింగారించుకున్నవి రెండు రకాలు:

 సంప్రదాయ తరహా పూలజడల్లో ... మల్లెమొగ్గలు, కాడమల్లె, కనకాంబరాలు, మరువం... పువ్వులను మాత్రమే ఉపయోగిస్తారు. మోయడానికి కాస్త బరువుగా ఉంటాయి కాని, చూడటానికి అందంగా ఉంటాయి. కృత్రిమమైనవి వద్దనుకున్నవారు ఇలాంటి జడలను ఎంపిక చేసుకుంటారు.

 

 గాజులు జడ: కొన్ని ప్రాంతాలలో గాజులు, పూలను అందంగా అమర్చి జడను డిజైన్ చేస్తారు. సీమంతం, పెళ్లి వేడుకలకు ఈ జడ బాగా ప్రాచుర్యం పొందింది.

 ఆధునిక పూల జడల్లో ...
అడుగుభాగాన అట్టముక్కలను వాడరు. దీనికోసం రావి, మర్రి, విస్తరాకులను బేస్‌గా ఎంపిక చేసుకుంటారు.

 

 గులాబీ రేకలు: ఈకాలంలో 90 శాతం మంది అమ్మాయిలు ఇష్టపడే పూలజడ ఇది. పూల జడ వేసుకున్నామన్న బరువు కూడా తెలియదు. విస్తరాకు తగినంత పరిమాణంలో కత్తిరించి, ముందుగా గులాబీ రేకలు కుట్టి, లోపలివైపు మల్లెమొగ్గలను పెడతారు. పూర్తిజడ అవసరం లేదు, జడబిళ్లలాగా కావాలనుకుంటే అలాగే కొనుగోలు చేయవచ్చు. సింపుల్‌గా కావాలనుకున్నవారు ఈ జడ బిళ్లలను జడపైన దూరం దూరంగా అమర్చుకోవచ్చు. హెవీగా కావాలనుకున్నవారు దగ్గరగా వాడుకోవచ్చు. అర్ధచంద్రాకారంగా తలమీదుగా పువ్వులతో అమర్చిన దాన్ని ‘వేణి’ అంటారు. దీన్ని కూడా పువ్వుల రేకలతోనూ, పువ్వులతోనూ తయారుచేయవచ్చు. మధ్యలో గోల్డ్ కలర్ టిష్యూ లేస్‌ని పువ్వులా అమర్చితే పూలజడ సిద్ధం.

 

 బంగారు జడ: బయటివైపు అంతా బంగారు రంగు టిష్యూ లేస్‌తో డిజైన్ చేసి, లోపల మల్లెమొగ్గలు, పైన అర్ధచంద్రాకారంగా రెండు వేణిలను అమర్చాలి. ఒక వేణికి మల్లెమొగ్గలు, మరో వేణికి మల్లెపూలు వాడితే అందంగా ఉంటుంది. ఈ జడ తలంబ్రాల సమయంలో ఎక్కువ ఇష్టపడతారు.

 

 నెమలి జడ: ఈ జడలో ప్రతి డిజైన్ పురివిప్పిన నెమలిని తలపిస్తుంది. లిల్లీలు, గులాబీలతో ఈ జడను డిజైన్ చేస్తారు. ఇది చాలా సమయం తాజాగా ఉంటుంది. తేలికగా ఉంటుంది. అందుకని చాలా మంది మగువలు ఈ డిజైన్‌ను ఇష్టపడతారు. ముందుగా జడంతా నెమలి బిళ్లలుపెట్టి, ఆ తర్వాత పూలను అమర్చాలి. ఈ బిళ్లలను మళ్లీ మళ్లీ వాడుకోవచ్చు. పెళ్లిలో నిండైన కళతో జడ చూపులను కట్టిపడేస్తుంది.

 

 ముత్యాల జడ: పూలజడను చిన్న చిన్న వేడుకలకు వేసుకోలేం. అలాగని జడను సింపుల్‌గా వదిలేయలేం. పెళ్లికి సంప్రదాయబద్ధంగా నిండుగా ఉండేవి, రిసెప్షన్‌కి సింపుల్‌గా ఉండే జడలను ఇష్టపడేవారికి ముత్యాల జడ మంచి ఆప్షన్.

 

 - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి

 

 మీరూ ట్రై చేయవచ్చు


 కాస్త సృజనతో పాటు కేరింగ్ కూడా తెలిసుంటే ఆకట్టుకునే పూలజడలను మీరూ అందంగా రూపొందించవచ్చు.

     

 మామూలుగా చాలా మంది రెడీమేడ్‌గా లభించే సాదా బిళ్లలు తెచ్చి జడంతా  పెట్టేసుకుంటారు. కాని పూలతో వచ్చిన నిండుతనం మరివేటికీ రావు. అందుకే బిళ్లల చుట్టూతా పూలతో సింగారిస్తే మరింత అందంగా కనిపిస్తుంది జడ.

     

 పూలజడలను ముందుగా సిద్ధం చేస్తే గాలి తగలని బాక్స్‌లో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇలా అయితే 2-3 రోజుల వరకు తాజాగా ఉంటాయి. పువ్వులు బయటకు తీసిన 5 గంటల నుంచి నెమ్మదిగా తాజాదనం కోల్పోతాయి. నీళ్లు చల్లితే నల్లబడతాయి. అందుకని పొడిగానే ఉంచాలి.

 చీర రంగులను బట్టి పూలజడలు

 

 పసుపు, నారింజ, ఎరుపురంగులో చీరలకు గులాబీ రేకలు, కనకాంబరాలు వాడాలి.  

 తెలుపు రంగు అయితే - మల్లెమొగ్గలు, కాగడామల్లె, లిల్లీలు, చంబేలీ పూలు, ముత్యాలు, ఆర్ట్‌ఫిషియల్ గోల్డ్ ఫ్లవర్స్, మోటివ్స్... జత చేయాలి.  

 

 ఆకుపచ్చ రంగు చీర అయితే సంపంగి, మరువం వాడుతూ ఇతర పువ్వులను, రకరకాల జడబిళ్లలను ఉపయోగించవచ్చు. వయొలెట్ కలర్ అయితే ఆర్కిడ్స్, డబుల్ షేడెడ్ పువ్వులు కావాలనుకుంటే కార్నిషన్ మేలు.  

 

 ఈ పువ్వుల జడలు డిజైన్‌ను బట్టి ధర.రూ.2000/- నుంచి 3,500/- వరకు ఉంటాయి.   

 

 మరింత ఖరీదైన డిజైన్స్ కావాలనుకుంటే ఖర్చు దానికి తగిన విధంగానే ఉంటుంది. జడబిళ్లలు, ఇతర యాక్ససరీస్ హైదరాబాద్ ఇతర ముఖ్య పట్టణాల మార్కెట్‌లలో కొనుగోలు చేయవచ్చు.

 

 - కల్పనారాజేష్, పూలజడల డిజైనర్, ఎల్.బి.నగర్, హైదరాబాద్

 e-mail: pellipoolajada@gmail.com


 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top