నాన్న ప్రేమకు స్టాంప్‌

Dad hidden stamps Durga is the Heiress - Sakshi

కళక్షన్‌

కలం స్నేహం, దేశదేశాల నుంచి కొత్త కొత్త స్టాంపులు, నాణాలు, ఉత్తరాలు సేకరించడం,ఇది నాటి ట్రెండ్‌...వాట్సాప్, యాప్స్, ఈమెయిల్, ట్విటర్, ఫేస్‌బుక్, యూ ట్యూబ్‌...ఇది నేటి ట్రెండ్‌..నాటి ట్రెండ్‌ని పరిరక్షించడం ఎలా... వాటిని వెల కట్టడం ఎలా...అరవయ్యేళ్ల క్రితం తండ్రి దాచిన స్టాంపులకు  దుర్గ వారసురాలిగా నిలిచారు.వయోభారం, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దుర్గకు  వాటిని భద్రపరచడం కష్టంగా ఉంది... దాంతో అరుదైన స్టాంపుల కలెక్షన్‌పై ఆసక్తి ఉన్నవారికి వీటిని ఇచ్చి, వాటిని దాచే భారం నుంచి, ఆర్థిక భారం నుంచి బయట పడాలనుకుంటున్నారు తెనాలి వాస్తవ్యురాలు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...మా నాన్నగారు కుప్పా సుబ్రహ్మణ్య శాస్త్రి, డిఫెన్స్‌లో జిఆర్‌ఈఎఫ్‌ అంటే జనరల్‌ రెజీమ్‌ ఇంజినీర్‌ ఫోర్స్‌ సెంటర్‌లో 20 ఏళ్లు పనిచేశారు.

1983లో 46 సంవత్సరాల వయసులో కాలం చేశారు.నాన్నగారికి ఉద్యోగంలో ఉన్నన్ని రోజులూ సెలవులు ఉండేవి కాదు. అందువల్ల సంవత్సరానికోసారి 20 రోజులు ఉండే సెలవుల్లో మాత్రమే ఇంటికి వచ్చి మాతో గడిపేవారు. అస్సాం వంటి దూర ప్రాంతాలలో పనిచేస్తున్నప్పుడు, ప్రయాణానికే పది రోజులు పట్టేది, అందువల్ల ఒక్కోసారి ఇంటికి వచ్చేవారు కాదు. మాకు నాన్నగారితో కలిసి ఉండటానికి అవకాశం ఉండేది కాదు. అన్నీ అమ్మే చూసుకునేది. మేం ముగ్గురం ఆడపిల్లలం. అమ్మ మా కోసం, మా చదువుల కోసం బందరులో ఉండేది. నాన్నగారు బదరీలో పనిచేస్తున్న రోజుల్లోనే కన్నుమూశారు. నాన్నగారు పోయినప్పుడు నేను విజయవాడలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాను.

నాన్నగారి కలం స్నేహం వల్లే...
నాన్నగారికి కలం స్నేహితులు ఉండేవారట. వారి ద్వారా సేకరించిన స్టాంపులను సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు తెచ్చి దాచేవారట. నాన్నగారికి చిన్నప్పటి నుంచీ ఈ అలవాటు ఉండేదట. తరచు బదిలీలు అవుతుండటం కారణంగా అక్కడ ఏర్పడిన కొత్త పరిచయాల ద్వారా కూడా నాన్న స్టాంపులు సేకరించేవారట. నాన్నగారు పోయాక కూడా ఆ స్టాంపులు ఇంట్లోనే ఉండేవి. అయితే అవి ఉన్నాయని మాకు తెలీదు.

నాన్నగారు పోయిన తరవాత అమ్మని... అమ్మమ్మ, మావయ్య వాళ్లు నిద్ర చేయించడం కోసం వాళ్ల ఇంటికి తీసుకువెళ్లారు. అమ్మ వెనక్కి వచ్చాక, ఒకసారేవో అవసరమై అటక మీద చూసినప్పుడు నాకు కనిపించాయి. కొన్ని స్టాంపులు అప్పటికే పాడైపోయాయి. స్టాంపుల ఆల్బమ్స్, ఫస్ట్‌ డే కవర్లు మాత్రం ఉన్నాయి. ఇవన్నీ నాన్న ఎప్పుడు సేకరించారో మాకు అర్థం కాలేదు. అప్పుడు చెప్పింది అమ్మ ఈ విషయాలన్నీ.

నా దగ్గరే...
అమ్మను చూడటానికి అక్కలిద్దరికీ కుదరకపోవడం తో నేను నా దగ్గరకు అమ్మని తీసుకుని వచ్చేశాను.

అమ్మ అనారోగ్యం... అత్తగారి బాధ్యత
అమ్మకి పెరాలసిస్‌ వచ్చింది. ఐదు సంవత్సరాలు ఆవిడకు సేవ చేస్తూ గడిపాను. అదే సమయంలో మా అత్తగారితో కూడా ఇబ్బంది పడవలసి వచ్చింది. మా అత్తగారు ఎరుకలపూడి విశాలాక్షి వయసు 87, ఆవిడను చూసుకోవడం కోసం తెనాలి దగ్గర ఉన్న పల్లెటూరిలోనే ఉంటున్నాం. నాకు ఐదుగురు ఆడపడుచులు, ఒక బావగారు. మా అత్తగారే పిల్లలందరినీ కష్టపడి పెంచారు. కాస్త పెద్దయ్యాక మా పెద్ద ఆడపడుచు బాధ్యత నెత్తిన వేసుకుని, తోబుట్టువులందరినీ పైకి తీసుకువచ్చి, పెళ్లిళ్లు చేశారు. అందరూ సెటిల్‌ అయ్యారు. నాకు ఆవిడే ఆదర్శం.

కష్టాలలో ఉన్నప్పుడే జీవితం విలువ తెలిసేది!
మా అమ్మని నేను అమ్మలా చూసుకోవాలి. నాకు పిల్లలు పుడితే చూసేవారు లేరు. అందుకే మేం పిల్లలు వద్దనుకున్నాం. అమ్మకి కాఫీ తాగించి, రెండు బిస్కెట్లు తినిపించడానికి గంట సమయం పట్టేది. చివరి రోజుల్లో అమ్మ నాతో ‘‘నువ్వు నాకు అమ్మవి’’ అనేది. నాకు ఓపికను లేదా ఆవిడకు ఆరోగ్యాన్ని ఇవ్వు అని నిత్యం ఆ భగవంతుడిని ప్రార్థించేదాన్ని.

అమ్మకోసం ఉద్యోగం మానేశాను...
ఇరవై సంవత్సరాల పాటు పోలార్‌ ఫ్యాన్స్‌ కంపెనీలో పనిచేశాను. అమ్మ వాళ్ల కోసం తెనాలి దగ్గరకు వచ్చాక, విజయవాడకు ప్రయాణం చేయడం కష్టమైంది. రైలు వేళలు సమస్య అయ్యింది. నేను ఇంటి దగ్గర లేనప్పుడు అమ్మ ఒక్కతే ఉండవలసి వచ్చేది. దాంతో ఉద్యోగం మానేశాను.

సంగీతం నేర్చుకున్నాను...
చదువుకునే రోజుల్లోనే నా ఆనందం కోసం సంగీతం నేర్చుకున్నాను. వయొలిన్‌లో డిప్లొమా పూర్తి చేశాను. ఈ రోజు వరకు నా ఆత్మానందం కోసమే పాడుకున్నాను. ఇప్పుడు నా జీవనం కోసం శ్రద్ధ ఉన్నవారికి నేర్పించాలనుకుంటున్నాను.
సంభాషణ: డా. వైజయంతి పురాణపండ

ప్రస్తుతం నా దగ్గర 1500 స్టాంపులు, 250 ఫస్ట్‌ డే కవర్లు ఉన్నాయి. ఇండియా, సిలోన్, దుబాయి, యుఏఈ, యు ఎస్‌. మలేసియా, సౌత్‌ ఆఫ్రికా, హాంగ్‌ కాంగ్, మెక్సికో, ఆస్ట్రేలియా.. లాంటి చాలా దేశాలకు సంబంధించినవి స్టాంపులు ఆల్బమ్‌ ఉంది. స్టాంపుల బాధ్యత తీసుకోవడానికి నా తరవాత నా వారసులు ఎవ్వరూ లేరు కదా! నాన్నగారు కష్టపడి కలెక్ట్‌ చేసినందుకు, అవి సరైన వాళ్ల దగ్గరకు వెళితే సార్థకత అవుతుంది. ఇలా ఇంట్లోనే పడి ఉంటే చెదలు తిని వృధా అయిపోతాయి. వాటి విలువ తెలిసిన వాళ్ల వద్దకు అవి చేరితే, నాకు వాటి సంరక్షణ బాధ్యత తీరుతుంది. నాకు ఆర్థికంగానూ కొంత సాయం అందినట్లవుతుంది.
– దుర్గ

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top