కొంచెం శక్తితోనే కొండంత ఫలితం.... | Christians are Always Minorities | Sakshi
Sakshi News home page

కొంచెం శక్తితోనే కొండంత ఫలితం....

Mar 31 2019 1:28 AM | Updated on Mar 31 2019 1:28 AM

Christians are Always Minorities - Sakshi

‘నీకున్న శక్తి కొంచెమే అయినా  నా వాక్యాన్ని అనుసరించావు, పైగా నన్ను ఎరుగనని అనలేదు’ అన్నది ప్రకటన గ్రంథంలోని ఫిలడెల్ఫియా చర్చికి పరిశుద్ధాత్ముడిచ్చిన ‘ప్రోగ్రెస్‌ రిపోర్ట్‌’!! అందుకు బహుమానంగా, ఎవరూ మూయలేని ఒక తెరిచిన ద్వారాన్ని ఆ చర్చికి దేవుడు అనుగ్రహించాడు (ప్రక3:7–13). ప్రకటన గ్రంథంలోని ఏడు చర్చిల్లో ఫిలడెల్ఫియా చాలా చిన్నది. ఇప్పటి టర్కీ దేశంలో, రోమ్‌ నుండి ఆసియా కు వెళ్లే రహదారులన్నీ కలిసే ఒక ప్రాముఖ్యమైన కూడలి ప్రాంతమైన ఫిలడెల్ఫియా పట్టణంలో ఉన్న చర్చి అది. ఎన్నో ప్రతికూలతలు, లోక సంబంధమైన ప్రలోభాల మధ్య కూడా వెల లేని తన విశ్వాసాన్ని కాపాడుకొని ఆ చర్చి దేవుని ప్రసన్నుని చేసి ఆయన ప్రేమను సంపాదించుకొంది. ప్రతికూలతలను, శత్రువులను ఎలా ఎదుర్కొంటుందన్నదే ఏ చర్చి విశ్వాసానికి, విజయానికైనా గీటురాయి. అయితే ఆసుపత్రిలో రోగులున్నట్టే చర్చిలో పాపులు, ఆత్మీయంగా బలహీనులు, దీనులు తప్పక ఉంటారు.

కాకపోతే తాము ఒక రోజున రోగవిముక్తులం కావాలన్న బలమైన ఆశ ఉన్న ఆసుపత్రి రోగుల్లాగే, తాము తప్పక పాపవిముక్తులం కావాలన్న ప్రార్థ్ధన, పట్టుదల, ప్రయాస కలిగిన పాపులున్న చర్చి దేవుణ్ణి ప్రసన్నుని చేస్తుంది. ‘పాపులముగానే చేరాము, పాపులముగానే చనిపోతాము’ అన్న మార్పులేని మొండి వైఖరి కలిగిన సభ్యుల వల్ల చర్చికి, దేవునికి కూడా ప్రయోజనం లేదు. లోకంలో అంతా పాపులే, కాకపోతే క్షమించబడిన పాపులు కొందరు, ఇంకా క్షమించబడని పాపులు మరి కొందరు. పాపక్షమాపణానుభవంతో చర్చిలో చేరడం అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ అలా జరుగక పోతే, చేరిన తర్వాతైనా పాపక్షమాపణను పొందితే ఆనందం. కాకపోతే చర్చిలో అంతా పరిశుద్ధులు, నీతిమంతులే ఉండాలన్న నియమం పెట్టుకున్న స్వనీతిపరులైన విశ్వాసులు మాత్రం ఏ చర్చిలోనూ ఇమడలేరు.

యూదులు కాకుండానే యూదులమని అబద్ధమాడే సాతాను సమాజపు వాళ్లంతా వచ్చి నీకు నమస్కారం చేస్తారని ఫిలడెల్ఫియా చర్చికి ప్రభువు వెల్లడించాడు. అబ్రాహాము విశ్వాసవారసత్వంతో సంబంధం లేకున్నా శరీర సంబంధంగా ఆయన వంశానికి  చెందిన వారమని చెప్పుకొనే పరిసయ్యులను ఆనాడు యేసుప్రభువు ‘మీరు మీ తండ్రి అయిన సాతాను సంబంధులు, అతని క్రియలు చేయగోరేవారు’ అంటూ ఘాటుగా విమర్శించాడు( యోహాను 8:44). నిజమైన క్రైస్తవ విశ్వాస విలువలు లేకున్నా, తమ తాతలు తండ్రులు క్రైస్తవులు కాబట్టి మేము కూడా క్రైస్తవులమేనని చెప్పుకొనే నామకార్ధపు తరతరాల క్రైస్తవులతో ఈరోజుల్లోనూ చర్చికి సమస్యలున్నాయి. అయితే వారిని విమర్శించడం, పరిహసించడం, వెళ్లగొట్టడం, సూటిపోటి మాటలనడం అందుకు పరిష్కారం కానే కాదు. యేసుప్రభువు అనుచరులమని చెప్పుకునే వాళ్లంతా యేసు ప్రేమకు, ఆయన చూపించిన క్షమాపణకు ప్రతినిధులు!! మన ప్రేమ, క్షమా స్వభావమే వారిని మార్చి దేవుని వైపునకు తీసుకెళ్ళాలి.

బైబిల్‌ కన్నా, దేవునికి సంబంధించి  మనకున్న అనుభవ జ్ఞానం, దాని మూలంగా ఏర్పడిన విశ్వాసం, క్షమ, ప్రేమాపూర్ణత కలిగిన మన జీవితం ఇతరులను ప్రభావితం చేసి వారిని ఆత్మీయంగా స్వస్థపర్చి ప్రభువు వద్దకు నడిపిస్తుంది. అందుకు ఎంతో జ్ఞానం, మరెంతో శక్తి అవసరం లేదు. సాత్వికత్వంతో తలవంచుకొని దేవుని పక్షాన ధీరత్వంతో నిలబడగల మన ‘కొంచెం శక్తి’ చాలు, ఫిలడెల్ఫియా చర్చిలాగా గొప్ప దేవునికోసం గొప్ప కార్యాలు చేసి గొప్ప విశ్వాసులమనిపించుకోవడానికి. సూపర్‌ మార్కెట్లో ఉండే వందలాది కొవ్వొత్తులకు చీకటి ఏ మాత్రం భయపడదు. కానీ పూరిగుడిసెలో మూలన వెలిగే ఒక చిన్నకొవ్వొత్తికి కారు చీకటి కూడా వణికి పారిపోతుంది. క్రైస్తవుడు కూడా సూపర్‌ మార్కెట్లో  కొవ్వొత్తి కాదు, అతను వెలిగే కొవ్వొత్తి... అందుకే మరి, క్రైస్తవులెప్పుడూ మైనారిటీలే!!!  
– రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement