నాన్నకు శ్రద్ధతో..

Article About Of Our Babloo The Hero Of Drass - Sakshi

నాన్నా నువ్వంటే ఇష్టం.
నీ కబుర్లు ఎన్నో వింటున్నాను.
ప్రతిసారీ నువ్వు కొత్తగా అర్థమవుతున్నావు.
స్కూలు మ్యాగజైన్‌లో నా తొలి వ్యాసం ‘మై డాడీ... మై హీరో’.
ఆ ఇష్టం రోజు రోజుకీ పెరిగిపోతోంది.
నేను తెలుసుకున్న నిన్ను అక్షరాల్లో చూపించాను.
ఆ పుస్తకం పేరు ‘అవర్‌ బబ్లూ... ద హీరో ఆఫ్‌ ద్రాస్‌’.
నీ సాహసానికి ప్రతిరూపం అది.
నీ గురించిన జ్ఞాపకాల ప్రతిబింబం కూడా.
నాన్నా! నీకు బెంగవద్దు.
నువ్వు కోరుకున్నట్లే పెరుగుతాను.
ఇట్లు... నీ మౌగ్లీ.
ఇది అపరాజిత తన తండ్రికి రాసిన 
ఉత్తరంలోని సారాంశం.

నాన్నను చూళ్లేదు.
నాన్న ఆత్మ తెలుసు.
అపరాజిత కడుపులో ఉండగానే..
నాన్న కార్గిల్‌లో అమరుడయ్యాడు. 
కూతురి జ్ఞాపకాల్లో
జీవించే ఉన్నాడు.

ఇండియా–పాకిస్థాన్‌. ఒకప్పుడది సమైక్య భారతం. ఇప్పుడవి ఇరుగు పొరుగు దేశాలు. ఇరుగు– పొరుగు అనే అందమైన మాట వెనుక అంతర్లీనంగా అప్పుడప్పుడు ఘర్షణ కూడా ధ్వనిస్తూ ఉంటుంది.  ఇరుదేశాల సైనికులూ ఒకరి మీద మరొకరు పైచేయి సాధిస్తూ తమ తమ దేశాల పతాకాలకు సగర్వంగా సెల్యూట్‌ చేస్తుంటారు. అలాంటి సెల్యూట్‌లలో ఒకటి 1999లో చేశారు మన సైనికులు. ఆనాడు దేశమంతటా ‘ఆపరేషన్‌ విజయ్‌’ సంబరాలు చేసుకుంది. కశ్మీర్‌లోని కార్గిల్‌లో రెండునెలల మూడువారాల రెండు రోజుల పోరాటం.. ఆ ఏడాది మే 3వ తేదీ మొదలైంది, జూలై 26తో ముగిసింది. భారత సైనికులు విజయ పతాకం ఎగురవేశారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా సంతోషంలో మునిగిపోయింది. ఇక్కడ హైదరాబాద్, హస్తినాపురంలోని మేజర్‌ పద్మపాణి ఆచార్య కుటుంబంలో ప్రతి ఒక్కరి కళ్ల నుంచి ఆనంద భాష్పాలు రాలాయి. ఏడు నెలల గర్భిణి చారులత తన పొట్టను నిమురుతూ ‘మీ నాన్న గెలిచాడు కన్నా’ అని చెప్పింది. వింగ్‌ కమాండర్‌ జగన్నాథాచార్య తన కొడుకు ఫొటోను చూస్తూ ‘నీ సేవలు వృథా కాలేదు పాణీ’ అనుకున్నాడు. ‘దేశవిజయం కోసం అమరుడైన వీరుడివి నువ్వు. నీకు ఓటమి లేదు. నీ బిడ్డకు పరాజయం ఉండదు. నువ్వు సంతోషపడేలా పెంచుతాను నీ బిడ్డను’ అని కొడుకు ఫొటో చూస్తూ మౌనంగా తనలో తానే అనుకుంది తల్లి విమలాచార్య. సెప్టెంబర్‌ 14వ తేదీ పుట్టింది అపరాజిత. పద్మపాణి ఫొటోముందు నిలబడి ‘అన్నయ్యా! నీ బిడ్డ తండ్రిలేనిది కాదు, నేనున్నాను’ అని అన్నయ్య షర్ట్‌ వేసుకుని హాస్పిటల్‌కెళ్లింది మహా వీర చక్ర మేజర్‌ పద్మపాణి ఆచార్య చెల్లెలు ఆమ్రపాలి. 

కార్గిల్‌ యుద్ధసమయంలో మేజర్‌ పద్మపాణి ఆచార్య కశ్మీర్‌లో ఇన్‌ఫాంట్రీ ఆఫీసర్‌గా విధుల్లో ఉన్నారు. కార్గిల్‌లో యుద్ధవాతావరణం అలముకొని ఉందని మాత్రమే తెలుసు దేశానికి. యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితిని అంచనా వేస్తున్నారు నిపుణులు. యుద్ధం జరుగుతోందని ఏ దేశమూ ప్రకటించలేదు. దాడులైతే జరుగుతూనే ఉన్నాయి. జూన్‌ 21వ తేదీన పద్మపాణి ఆచార్య ఇంటికి ఫోన్‌ చేశారు. తన పుట్టినరోజునాడు కుటుంబ సభ్యులతో శుభాకాంక్షలు చెప్పించుకోవడానికి చేసిన ఫోన్‌ కాల్‌ అది. యుద్ధక్షేత్రం నుంచి నెలకో, రెండు నెలలకో సాధ్యమైనప్పుడు ఒక్కఫోన్‌ రావాల్సిందే తప్ప, జవానుల కుటుంబసభ్యులు అక్కడికి ఫోన్‌ చేయడం కుదరదు. మొబైల్‌ ఫోన్‌లు లేని రోజులవి. శాటిలైట్‌ ఫోన్‌లో ఒకటి– రెండు నిమిషాలు మాట్లాడడమే ఎక్కువ. ఆ రోజు పద్మపాణికి ఇంట్లో అందరూ శుభాకాంక్షలు చెప్పారు. ఇంట్లోవాళ్లతో ‘ప్రే ఫర్‌ ద యూనిట్‌’ అని ఆయన ఆ రోజు చెప్పిన మాటను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు వాళ్లు. పద్మపాణి మాటలతో వాళ్లకు యుద్ధం గురించి స్పష్టత వచ్చింది. ‘అప్పుడు కూడా తనకోసం ప్రార్థించమని చెప్పలేదు, తన యూనిట్‌ కోసం ప్రార్థించమని కోరాడు’ అని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఎనిమిదో రోజు వార్‌ ఫీల్డ్‌ నుంచే మరో ఫోన్‌. ఈసారి పద్మపాణి నుంచి కాదు, ఆర్మీ ఆఫీసర్‌ నుంచి. ఆ ఫోన్‌కాల్‌ని చారులత రిసీవ్‌ చేసుకున్నారు. ‘పద్మపాణి భార్యను’ అనగానే ఫోన్‌ కట్‌ అయింది. ఐదు నిమిషాల్లోనే మళ్లీ ఫోన్‌. ఈ సారి పద్మపాణి తల్లి విమల తీశారు. దేశమాత కోసం పద్మపాణి అమరుడయ్యాడని తెలిసింది.

అపరాజిత ఇవేవీ చూడలేదు, కానీ తాను చూసినట్లే ప్రతి సంఘటననూ కళ్లకు కట్టినట్లు పుస్తకం రాసింది. ఆఖరుకి నానమ్మ తనను ఎత్తుకుని ‘నీ బిడ్డకు ఓటమి ఉండదు’ అంటూ అపరాజిత అని పేరు పెట్టడం కూడా. నానమ్మ చెప్పిన ప్రతి కథలోనూ హీరో తన తండ్రే. ‘అచ్చం మీ నాన్నలాగే ఉన్నావు’ అని మనుమరాలిని దగ్గరకు తీసుకుంటూ కొడుకు చిన్నప్పుడు చేసిన అల్లరి పనులన్నీ చెప్పేదామె. పద్మపాణి ప్రేమకథతోపాటు అతడి వీరోచిత సంఘటనలనూ చెప్పేది. ఆటో మీటరు అరవై రూపాయలు తిరిగితే ‘పోనీలే ఖాళీగా తిరిగి వెళ్లాలి కదా’ అని మరో వంద కలిపి నూట అరవై రూపాయలిచ్చిన సందర్భాల నుంచి.. దసరా ఉత్సవాల్లో ధోవతి, కుర్తా ధరించి పాదాభివందనం చేసిన వాళ్లను ఆశీర్వదించడం వరకు పద్మపాణి చేసిన ప్రాక్టికల్‌ జోక్స్‌తో సహా ప్రతిదీ పూసగుచ్చేది విమలాచార్య. వాటన్నింటినీ ‘అవర్‌ బబ్లూ... హీరో ఆఫ్‌ ద్రాస్‌’ పేరుతో అక్షరబద్దం చేసింది అపరాజిత. ఈ పుస్తకాన్ని అమ్మ, చిన్నాన్న, మేనత్తలు, నానమ్మ, తాతయ్యల జ్ఞాపకాలతో రాసింది. 
గత ఏడాది పద్మపాణి జయంతి రోజున ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఈ ఏడాది తండ్రి జయంతికి మరో కొత్త ఆలోచనను తెర మీదకు తెచ్చింది అపరాజిత. ‘ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ ఫ్లాగ్‌ డే ఫండ్‌’కి విరాళమిచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. నానమ్మ 2011లో స్థాపించిన ‘మేజర్‌ పద్మపాణి ఫౌండేషన్‌’ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఫండ్‌ రైజింగ్‌ పోగ్రామ్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌లోని తాజ్‌బంజారాలో జరిగే డోనర్స్‌ డిన్నర్‌కి దాదాపుగా 150 మంది దాతలు హాజరు అవుతున్నారు. పద్మపాణి కోర్స్‌మేట్‌లు, యూనిట్‌లో సహ అధికారులు వస్తున్నట్లు చెప్పింది అపరాజిత. తన తండ్రి స్మారకార్థం చేస్తున్న ఈ కార్యక్రమంలో వాళ్లు తమ జ్ఞాపకాలను పంచుకుంటారని, తనకు తండ్రి గురించి మరికొన్ని సంగతులు తెలుస్తాయని సంబరపడుతోంది. ‘‘ఉత్తరాల్లో నాన్నను చూశాను, అక్షరాల్లో నాన్నేమిటో తెలుసుకున్నాను. నాన్న మా మధ్య ఉన్నారు. మాతో ఉన్నారు. ప్రపంచానికి నాన్న గురించి చెప్పడానికి ఇంకా ఎన్నో చేస్తాను’’ అంది అపరాజిత.

తల్లి చారులతతో అపరాజిత
మా నాన్న హీరో
నేను చూసింది నాన్న ఫొటోను మాత్రమే. అయితే నాన్న గురించిన ప్రతి చిన్న సంఘటన కూడా తెలుసు. నాన్న నాతో ఉన్నారనే భావనలోనే పెరిగాను. నేను నాన్నతో మాట్లాడతాను కూడా. నా పోషణ, పెంపకం నాన్న పెన్షన్‌తోనే. మరి నాన్న లేడని ఎలా అనుకోగలను. కళ్ల ముందు కనిపించకపోయినంత మాత్రాన లేనట్లు కాదు. నా దృష్టిలో మా నాన్న గొప్ప హీరో. 
– అపరాజిత, అమరవీరుడు మేజర్‌ పద్మపాణి ఆచార్య కుమార్తె

మా బిడ్డే
అపరాజిత పుట్టినప్పుడు తొలిసారి ఎత్తుకున్నది నేనే. తనకు అన్నప్రాశన, చెవులు కుట్టడం, అక్షరాభ్యాసం... అన్నీ నా ఒడిలోనే జరిగాయి. అపరాజితకు తండ్రిగా మా అన్నయ్య చేయాల్సిన కార్యక్రమాలన్నీ నేనే చేశాను. బాధలో ఉన్న మా వదిన చారులతకు ఇబ్బంది కలగకుండా అపరాజిత పనులు నేనే చేసేదాన్ని. నా పెళ్లయిన తర్వాత నా భర్త కూడా అపరాజితను సొంత బిడ్డలాగే చూస్తున్నారు. అపరాజిత, నాకు పుట్టిన పాపాయి ఇద్దరూ మాకు బిడ్డలే. ఈ పిల్లలిద్దరికీ నేను, చారులత ఇద్దరం తల్లులం. అపరాజిత పుట్టకముందే తండ్రిని కోల్పోయింది అనుకుంటారు. కానీ తనిప్పుడు ఇద్దరు తండ్రులు, ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ. – ఆమ్రపాలి, అపరాజిత మేనత్త 

– వాకా మంజులారెడ్డి
ఫొటోలు: జి. అమర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top