breaking news
Padmapani
-
నాన్నకు శ్రద్ధతో..
నాన్నా నువ్వంటే ఇష్టం. నీ కబుర్లు ఎన్నో వింటున్నాను. ప్రతిసారీ నువ్వు కొత్తగా అర్థమవుతున్నావు. స్కూలు మ్యాగజైన్లో నా తొలి వ్యాసం ‘మై డాడీ... మై హీరో’. ఆ ఇష్టం రోజు రోజుకీ పెరిగిపోతోంది. నేను తెలుసుకున్న నిన్ను అక్షరాల్లో చూపించాను. ఆ పుస్తకం పేరు ‘అవర్ బబ్లూ... ద హీరో ఆఫ్ ద్రాస్’. నీ సాహసానికి ప్రతిరూపం అది. నీ గురించిన జ్ఞాపకాల ప్రతిబింబం కూడా. నాన్నా! నీకు బెంగవద్దు. నువ్వు కోరుకున్నట్లే పెరుగుతాను. ఇట్లు... నీ మౌగ్లీ. ఇది అపరాజిత తన తండ్రికి రాసిన ఉత్తరంలోని సారాంశం. నాన్నను చూళ్లేదు. నాన్న ఆత్మ తెలుసు. అపరాజిత కడుపులో ఉండగానే.. నాన్న కార్గిల్‌లో అమరుడయ్యాడు. కూతురి జ్ఞాపకాల్లో జీవించే ఉన్నాడు. ఇండియా–పాకిస్థాన్. ఒకప్పుడది సమైక్య భారతం. ఇప్పుడవి ఇరుగు పొరుగు దేశాలు. ఇరుగు– పొరుగు అనే అందమైన మాట వెనుక అంతర్లీనంగా అప్పుడప్పుడు ఘర్షణ కూడా ధ్వనిస్తూ ఉంటుంది. ఇరుదేశాల సైనికులూ ఒకరి మీద మరొకరు పైచేయి సాధిస్తూ తమ తమ దేశాల పతాకాలకు సగర్వంగా సెల్యూట్ చేస్తుంటారు. అలాంటి సెల్యూట్లలో ఒకటి 1999లో చేశారు మన సైనికులు. ఆనాడు దేశమంతటా ‘ఆపరేషన్ విజయ్’ సంబరాలు చేసుకుంది. కశ్మీర్‌లోని కార్గిల్‌లో రెండునెలల మూడువారాల రెండు రోజుల పోరాటం.. ఆ ఏడాది మే 3వ తేదీ మొదలైంది, జూలై 26తో ముగిసింది. భారత సైనికులు విజయ పతాకం ఎగురవేశారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశమంతా సంతోషంలో మునిగిపోయింది. ఇక్కడ హైదరాబాద్, హస్తినాపురంలోని మేజర్ పద్మపాణి ఆచార్య కుటుంబంలో ప్రతి ఒక్కరి కళ్ల నుంచి ఆనంద భాష్పాలు రాలాయి. ఏడు నెలల గర్భిణి చారులత తన పొట్టను నిమురుతూ ‘మీ నాన్న గెలిచాడు కన్నా’ అని చెప్పింది. వింగ్ కమాండర్ జగన్నాథాచార్య తన కొడుకు ఫొటోను చూస్తూ ‘నీ సేవలు వృథా కాలేదు పాణీ’ అనుకున్నాడు. ‘దేశవిజయం కోసం అమరుడైన వీరుడివి నువ్వు. నీకు ఓటమి లేదు. నీ బిడ్డకు పరాజయం ఉండదు. నువ్వు సంతోషపడేలా పెంచుతాను నీ బిడ్డను’ అని కొడుకు ఫొటో చూస్తూ మౌనంగా తనలో తానే అనుకుంది తల్లి విమలాచార్య. సెప్టెంబర్ 14వ తేదీ పుట్టింది అపరాజిత. పద్మపాణి ఫొటోముందు నిలబడి ‘అన్నయ్యా! నీ బిడ్డ తండ్రిలేనిది కాదు, నేనున్నాను’ అని అన్నయ్య షర్ట్ వేసుకుని హాస్పిటల్కెళ్లింది మహా వీర చక్ర మేజర్ పద్మపాణి ఆచార్య చెల్లెలు ఆమ్రపాలి. కార్గిల్ యుద్ధసమయంలో మేజర్ పద్మపాణి ఆచార్య కశ్మీర్లో ఇన్ఫాంట్రీ ఆఫీసర్‌గా విధుల్లో ఉన్నారు. కార్గిల్‌లో యుద్ధవాతావరణం అలముకొని ఉందని మాత్రమే తెలుసు దేశానికి. యుద్ధం అనివార్యమయ్యే పరిస్థితిని అంచనా వేస్తున్నారు నిపుణులు. యుద్ధం జరుగుతోందని ఏ దేశమూ ప్రకటించలేదు. దాడులైతే జరుగుతూనే ఉన్నాయి. జూన్ 21వ తేదీన పద్మపాణి ఆచార్య ఇంటికి ఫోన్ చేశారు. తన పుట్టినరోజునాడు కుటుంబ సభ్యులతో శుభాకాంక్షలు చెప్పించుకోవడానికి చేసిన ఫోన్ కాల్ అది. యుద్ధక్షేత్రం నుంచి నెలకో, రెండు నెలలకో సాధ్యమైనప్పుడు ఒక్కఫోన్ రావాల్సిందే తప్ప, జవానుల కుటుంబసభ్యులు అక్కడికి ఫోన్ చేయడం కుదరదు. మొబైల్ ఫోన్లు లేని రోజులవి. శాటిలైట్ ఫోన్లో ఒకటి– రెండు నిమిషాలు మాట్లాడడమే ఎక్కువ. ఆ రోజు పద్మపాణికి ఇంట్లో అందరూ శుభాకాంక్షలు చెప్పారు. ఇంట్లోవాళ్లతో ‘ప్రే ఫర్ ద యూనిట్’ అని ఆయన ఆ రోజు చెప్పిన మాటను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు వాళ్లు. పద్మపాణి మాటలతో వాళ్లకు యుద్ధం గురించి స్పష్టత వచ్చింది. ‘అప్పుడు కూడా తనకోసం ప్రార్థించమని చెప్పలేదు, తన యూనిట్ కోసం ప్రార్థించమని కోరాడు’ అని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత ఎనిమిదో రోజు వార్ ఫీల్డ్ నుంచే మరో ఫోన్. ఈసారి పద్మపాణి నుంచి కాదు, ఆర్మీ ఆఫీసర్ నుంచి. ఆ ఫోన్‌కాల్‌ని చారులత రిసీవ్ చేసుకున్నారు. ‘పద్మపాణి భార్యను’ అనగానే ఫోన్ కట్ అయింది. ఐదు నిమిషాల్లోనే మళ్లీ ఫోన్. ఈ సారి పద్మపాణి తల్లి విమల తీశారు. దేశమాత కోసం పద్మపాణి అమరుడయ్యాడని తెలిసింది. అపరాజిత ఇవేవీ చూడలేదు, కానీ తాను చూసినట్లే ప్రతి సంఘటననూ కళ్లకు కట్టినట్లు పుస్తకం రాసింది. ఆఖరుకి నానమ్మ తనను ఎత్తుకుని ‘నీ బిడ్డకు ఓటమి ఉండదు’ అంటూ అపరాజిత అని పేరు పెట్టడం కూడా. నానమ్మ చెప్పిన ప్రతి కథలోనూ హీరో తన తండ్రే. ‘అచ్చం మీ నాన్నలాగే ఉన్నావు’ అని మనుమరాలిని దగ్గరకు తీసుకుంటూ కొడుకు చిన్నప్పుడు చేసిన అల్లరి పనులన్నీ చెప్పేదామె. పద్మపాణి ప్రేమకథతోపాటు అతడి వీరోచిత సంఘటనలనూ చెప్పేది. ఆటో మీటరు అరవై రూపాయలు తిరిగితే ‘పోనీలే ఖాళీగా తిరిగి వెళ్లాలి కదా’ అని మరో వంద కలిపి నూట అరవై రూపాయలిచ్చిన సందర్భాల నుంచి.. దసరా ఉత్సవాల్లో ధోవతి, కుర్తా ధరించి పాదాభివందనం చేసిన వాళ్లను ఆశీర్వదించడం వరకు పద్మపాణి చేసిన ప్రాక్టికల్ జోక్స్‌తో సహా ప్రతిదీ పూసగుచ్చేది విమలాచార్య. వాటన్నింటినీ ‘అవర్ బబ్లూ... హీరో ఆఫ్ ద్రాస్’ పేరుతో అక్షరబద్దం చేసింది అపరాజిత. ఈ పుస్తకాన్ని అమ్మ, చిన్నాన్న, మేనత్తలు, నానమ్మ, తాతయ్యల జ్ఞాపకాలతో రాసింది. గత ఏడాది పద్మపాణి జయంతి రోజున ఆ పుస్తకాన్ని ఆవిష్కరించింది. ఈ ఏడాది తండ్రి జయంతికి మరో కొత్త ఆలోచనను తెర మీదకు తెచ్చింది అపరాజిత. ‘ఆర్మ్డ్ ఫోర్సెస్ ఫ్లాగ్ డే ఫండ్’కి విరాళమిచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. నానమ్మ 2011లో స్థాపించిన ‘మేజర్ పద్మపాణి ఫౌండేషన్’ తరఫున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ ఫండ్ రైజింగ్ పోగ్రామ్‌లో భాగంగా నేడు హైదరాబాద్‌లోని తాజ్‌బంజారాలో జరిగే డోనర్స్ డిన్నర్‌కి దాదాపుగా 150 మంది దాతలు హాజరు అవుతున్నారు. పద్మపాణి కోర్స్మేట్లు, యూనిట్లో సహ అధికారులు వస్తున్నట్లు చెప్పింది అపరాజిత. తన తండ్రి స్మారకార్థం చేస్తున్న ఈ కార్యక్రమంలో వాళ్లు తమ జ్ఞాపకాలను పంచుకుంటారని, తనకు తండ్రి గురించి మరికొన్ని సంగతులు తెలుస్తాయని సంబరపడుతోంది. ‘‘ఉత్తరాల్లో నాన్నను చూశాను, అక్షరాల్లో నాన్నేమిటో తెలుసుకున్నాను. నాన్న మా మధ్య ఉన్నారు. మాతో ఉన్నారు. ప్రపంచానికి నాన్న గురించి చెప్పడానికి ఇంకా ఎన్నో చేస్తాను’’ అంది అపరాజిత. తల్లి చారులతతో అపరాజిత మా నాన్న హీరో నేను చూసింది నాన్న ఫొటోను మాత్రమే. అయితే నాన్న గురించిన ప్రతి చిన్న సంఘటన కూడా తెలుసు. నాన్న నాతో ఉన్నారనే భావనలోనే పెరిగాను. నేను నాన్నతో మాట్లాడతాను కూడా. నా పోషణ, పెంపకం నాన్న పెన్షన్‌తోనే. మరి నాన్న లేడని ఎలా అనుకోగలను. కళ్ల ముందు కనిపించకపోయినంత మాత్రాన లేనట్లు కాదు. నా దృష్టిలో మా నాన్న గొప్ప హీరో. – అపరాజిత, అమరవీరుడు మేజర్ పద్మపాణి ఆచార్య కుమార్తె మా బిడ్డే అపరాజిత పుట్టినప్పుడు తొలిసారి ఎత్తుకున్నది నేనే. తనకు అన్నప్రాశన, చెవులు కుట్టడం, అక్షరాభ్యాసం... అన్నీ నా ఒడిలోనే జరిగాయి. అపరాజితకు తండ్రిగా మా అన్నయ్య చేయాల్సిన కార్యక్రమాలన్నీ నేనే చేశాను. బాధలో ఉన్న మా వదిన చారులతకు ఇబ్బంది కలగకుండా అపరాజిత పనులు నేనే చేసేదాన్ని. నా పెళ్లయిన తర్వాత నా భర్త కూడా అపరాజితను సొంత బిడ్డలాగే చూస్తున్నారు. అపరాజిత, నాకు పుట్టిన పాపాయి ఇద్దరూ మాకు బిడ్డలే. ఈ పిల్లలిద్దరికీ నేను, చారులత ఇద్దరం తల్లులం. అపరాజిత పుట్టకముందే తండ్రిని కోల్పోయింది అనుకుంటారు. కానీ తనిప్పుడు ఇద్దరు తండ్రులు, ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డ. – ఆమ్రపాలి, అపరాజిత మేనత్త – వాకా మంజులారెడ్డి ఫొటోలు: జి. అమర్ -
ఉప్పెన: కృష్ణా నదీముఖంలో
కృష్ణా నదీముఖంలో కద్దూర పట్టణం. క్రీ.శ. 200 (నేటి కృష్ణాజిల్లా మచిలీపట్నం వద్ద గూడూరు గ్రామం) ‘ఆగు నావికుడా! దురదృష్టం నిన్ను ఉప్పెనలా ముంచబోతుంది. సావధానం!’ అని అరుస్తూ అతడి అడుగులకి అడ్డుపడ్డాడొక సిద్ధ పురుషుడు. విబూది పూసిన ముఖంపై చింతనిప్పుల వంటి కళ్ళలోకి చూసి నివ్వెరపోయినా మరుక్షణమే తేరుకొన్నాడు పద్మపాణి. అర్ధరాత్రి కావస్తోంది. వంగి దండాలు పెడుతున్న పానశాల కావలివాడి చేతిలో వెండి పణం రాల్చి అప్పుడే వీధిలోకి అడుగుపెట్టాడు. అంత రాత్రి గడిచినా ఆ ఆంధ్రుల రేవుపట్టణంలో సందడి ఏమాత్రమూ తగ్గలేదు. జూదశాలలు, గణికాగృహాల నుండి బయటపడే నాగరికులు, విదేశీ నావికులు కనిపిస్తున్నారు. గౌడ (బెంగాలీ), మాగధ (బీహారీ), ఓఢ్ర (ఒరియా), ద్రవిడ (తమిళం) భాషలే కాక మలయ (మలేసియా), చీనీ (చైనా), యవన (గ్రీక్) భాషలు కూడా అక్కడక్కడా వినిపిస్తాయి. మర్రిచెట్టు కింద పల్లకీలు మోసే బోయీలు, బండ్లవాళ్ళు, యజమానులకై ఎదురుచూస్తున్న సేవకులు అరుగులపై పూలిజూదం ఆడుతూ ఆ సిద్ధపురుషుడి అరుపుకి ఒకసారి ఉలక్కిపడి మళ్ళీ ఆటలోకి వెళ్లాలా లేదా అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. పద్మపాణి చిన్ననాటి నుంచి సముద్రగర్భంలోని భూతాలతో, భూతాలవంటి ప్రకృతి బీభత్సాలతో ఆటలాడిన వాడు. మహాచీనం (చైనా) నుండి పారశీకం (అరేబియా గల్ఫ్ తీరం) వరకూ అనేకమార్లు నావలు నడిపించిన నావసారధి. కలవరం బయటకి కనపడకుండా నింపాదిగా ఆ సిద్ధపురుషుడి ఎర్రని కళ్ళలోకి చూస్తూ ఏమిటని తలెగరేసాడు. ‘దురదృష్టం నావికుడా! నిన్ను ఉప్పెనలా ముంచబోతుంది!’ మరోసారి బొంగురుపోయిన గొంతుతో హెచ్చరించాడు. ‘హహహ్! పోనీయవోయ్. అవలోకితేశ్వరుని అండ ఉన్నంతవరకూ ఇలాంటివి నన్నేమీ చేయలేవ్’ అని దట్టీలోని ఒక నాణెం సిద్ధుడి వంక విసిరి పానశాల వెనుక ద్వారం ఉన్న వీధి వైపు నడిచాడు. ఆ పానశాల నుంచి ఏ క్షణాన్నయినా నాగబుధిక బయటికి రావచ్చు. కాని కలవడం అసాధ్యం. ఎందుకంటే రాత్రి పూట పానశాలల్లో పని చేసే స్త్రీలను సాయుధ రక్షణతో నివాసం వరకూ దిగబెట్టడం నియమం. నాగబుధికని ఎన్నిమార్లు అడిగినా తానుండే నివాసమేదో చెప్పదు. ఈ రాత్రయినా బండిని వెంటాడి ఆమె ఇల్లెక్కడో కనుక్కోవాలి. ఆమెకి తనంటే ఇష్టమే. సందేహం లేదు. కానీ ఎందుకు తటపటాయిస్తుందో అర్థంకాదు! మధుశాల యజమానికి ఆమె బాకీపడిన సొమ్మును సుంకంతో సహా చెల్లించి ఆమెని విముక్తని చేస్తానని మాటయిచ్చినా ప్రయోజనం లేదు. అవుననదు. కాదనదు. పానశాల వెనక ద్వారంలో నుండి నల్లని తెరలతో గూడుబండి వెలువడింది. బరిశెలతో నలుగురు కావలివాళ్ళు దానివెంట నడవసాగారు. మబ్బుల మధ్య చంద్రునిలా తెరల మధ్య నుండి నాగబుధిక ముఖం తొంగి చూసింది. తనను చూసిన క్షణంలో ప్రత్యక్షమైన చిరునవ్వు మరుక్షణం వెలవెలపోయి తెరల వెనుకకి మాయమయింది. కాస్త దూరంగా బండి వెనుకే నడవసాగాడు పద్మపాణి. ‘చేతికందిన అదృష్టాన్ని ఎందుకే కాలదన్నుకుంటావ్? చూడు నీకోసం ఎలా పడిగాపులు పడుతున్నాడో’ అంది మాలసిరి, నాగబుధిక స్నేహితురాలు. స్నేహితురాలి మాటలకి మూడవ అంతస్తు కిటికీలోంచి బయటకి తొంగి చూసి నిట్టూర్చింది నాగబుధిక. అర్ధరాత్రి గడిచినా ఇంకా వీధి మధ్య అరుగుపై ఎదురుతెన్నులు చూస్తున్న పద్మపాణి ముఖం వెన్నెల వెలుగులో స్పష్టంగా కనిపిస్తోంది. ‘ఆహా! ఎంత విరహమే! అందగాడు, ధనవంతుడు. తూర్పు సముద్రపు దేశాల్లో అతడిని మించిన నావికుడు లేడని చెబుతారు. సరేనను చాలు, ఈ పాడు జీవితం వదిలి హాయిగా ఉండవచ్చు. అయినా నీకూ అతడంటే ఇష్టమేగా?’ అన్నది మాలసిరి. ‘అవునే’ నీళ్ళు పొంగుతున్న కళ్ళు తుడుచుకుంటూ, ‘అందుకే వద్దనేది. నా దురదృష్టాన్ని అతడికెందుకు అంటిచాలి? నా కథ నీకు తెలుసుగా. నా అంతటి దురదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే ఉండదు. పుట్టింది బ్రాహ్మణ కుటుంబంలో అయినా పుట్టినప్పుడే తల్లిదండ్రులని పొట్టన పెట్టుకున్నాను. కొడుకులు లేకపోవడంతో నా తండ్రి ఆస్తి రాజుగారికి పోయింది. అనాథనని నన్ను చేరదీసి నాయనలా సాకిన రామిశెట్టికీ న ష్టమే. గొడ్డొచ్చిన వేళా! బిడ్బొచ్చిన వేళా! అని శెట్టిసాని చెప్పింది నిజమే’ ‘బాధపడకే. ఊరుకో,’ వెక్కివెక్కి ఏడుస్తున్న నాగుబుధికను ఓదార్చింది మాలసిరి. ‘నాయన కూడా నీలాగే చెప్పేవాడు. నన్ను చారుదత్తుడనే కుమ్మరి చేతిలో పెట్టి ఆయన కన్నుమూశాడు. కానీ ఏమిలాభం? సంవత్సరం తిరగకుండా నా దురదృష్టం నా మొగుడిని కూడా తీసుకుపోయింది. పెనిమిటి పోయినా బొమ్మల వ్యాపారానికి ఆయన చేసిన అప్పుమాత్రం మిగిలింది. మన యజమాని మంచివాడు కనక మధుశాలలో ఈ పని ఇచ్చాడు. ఇంకో నాలుగేళ్ళలో ఆ అప్పు తీరిపోతుంది. ఆప్పుడీ పాడు జీవితానికే స్వస్తి చెప్పవచ్చు.’ అన్నది నాగుబుధిక. ‘ఛీఛీ.. ఏం మాటలే అవి? నా మాట విని పద్మపాణితో పెళ్ళికి ఒప్పుకో. వెళ్ళి అతనితో సరేనని చెప్పు. చూడు పాపం నీకోసం ఎలా ఎదురు చూస్తున్నాడో!’ అని ఒప్పించింది ఆమె శ్రేయోభిలాషి మాలసిరి. పాతికేళ్ళ జీవితంలో పద్మపాణి ఎన్నో దేశాలు తిరిగాడు. ఎందరో స్త్రీలని చూశాడు. కాని మొదటి చూపులోనే నాగబుధిక అతడి హృదయాన్ని కదిలించింది. పైకి ఆహ్లాదంగా కనిపించినా సముద్రంలాంటి ఆమె కళ్లలోతుల్లో ఏదో విషాదం. ఎందుకో పొదివి పట్టి హృద యానికి హత్తుకోవాలనే తపన. ఆమె లేని జీవితం వృధా అనే భావన. ప్రతిరోజూ ఆమె ముఖం చూడనిదే కంటికి కునుకు రాదు. తన అదృష్టం ఎలా ఉందో? ఆహ్! దురదృష్టమట! చింతనిప్పుల వంటి కళ్ళతో ఆ సిద్ధుడు చేసిన హెచ్చరిక పద్మపాణి మనస్సులో ప్రతిధ్వనించింది. తలెత్తి ఆకాశం వంక చూశాడు. చంద్రుడి చుట్టూ కాంతి వలయం! సన్నని తూర్పుగాలి. సముద్రయానాలలో అనేక ప్రకృతి వైపరీత్యాలని కళ్ళారా చూసిన ఆ నావికుడి భృకుటి ముడిపడింది. ఏదో పెద్ద గాలివాన వచ్చే సూచన. ఎదురుగా పరుగెత్తుకుంటూ తనవైపే వస్తున్న నాగబుధికని చూశాడు. అతడి ఆనందానికి అంతులేదు. తన హృదయంపై వాలిపోయిన ప్రియురాలిని కౌగిలిలో బిగించి కాలం తెలియకుండా అలానే ఉండిపోయాడు. మరునాడే మధుశాల యజమానికి అప్పు చెల్లించి నాగబుధికని విడిపించుకున్నాడు. నూతన వధువు నాగబుధికతో సముద్రతీరంలోని తన విడిది చేరాడు పద్మపాణి. పున్నమిరాత్రి. అతడి ఆనందంలో పాలుపంచుకోవటానికా అన్నట్లు ఆ నావికుడి నేస్తం సముద్రం కూడా నూరు అడుగులు ముందుకొచ్చాడు. అతడి గుండెలాగే సముద్రపుటలలు కూడా ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. ప్రథమ సమాగమనానికి ఆరాటపడుతున్న ఆ దంపతులకి చిరుజల్లు స్వాగతం పలికింది. కలసిన ఆ శరీరాలకీ కర్ణేంద్రియాలకీ ఒకరికొకరి ధ్యాస తప్ప బయట ప్రపంచంతో ప్రమేయం లేదు. ఆ రాత్రి వచ్చిన రెండు తాటిచెట్ల ఎత్తు ఉప్పెన కూడా ఆ జంట ఆలింగనాన్ని విడదీయలేక పోయింది. సముద్రం సృష్టించిన బీభత్సానికి కద్దూర పట్టణం తుడిచి పెట్టుకుపోయింది. కానీ మరుభూమిలా మిగిలిన ఊరి మధ్య ఆ నూతన దంపతులున్న సౌధం మాత్రం చెక్కుచెదరలేదు. మరునాడు ఉదయం మేడపై నుండి ఆ వినాశనాన్ని కలయజూసిన పద్మపాణి కళ్లలో నీళ్లు తిరిగాయి. ఈ ప్రకృతి ఉపద్రవం నుండి నన్ను కాపాడిన నా అదృష్ణదేవతవి నువ్వే అని కౌగిలించుకొన్న పద్మపాణిని తనకిచ్చినందుకు అవలోకితేశ్వరునికి నీళ్ళు నిండిన కళ్లతో ధన్యవాదాలర్పించింది నాగబుధిక. ఆగ్నేయాసియాలో ఆంధ్ర రాజ్యాలు ఇండియాలో అత్యంత పొడవైన తీరరేఖ ఆంధ్రులదే. చిలక సరస్సు నుండి పులికాట్ వరకూ అనేక రేవు పట్టణాలు తెలుగువారి అధీనంలో ఉండేవి. వీటిలో ముఖ్యమైనవి కృష్ణా గోదావరీ తీరంలో ఉన్నాయని ‘పెరిప్లస్ ఆఫ్ ఎరిత్రియన్ సీ’ అనే రోమన్ గ్రంథం చెబుతుంది. అవి ఎఫిటెరియాన్ (భట్టిప్రోలు), కొన్టకోస్సిలా (ఘంటశాల), కొడ్డూరా (బందరు వద్ద గూడూరు), అల్లోజ్ఞైని (గోదావరి డెల్టాలోని ఆదుర్రు), మైసోలియా (మోటుపల్లి), పోడుక (ఒంగోలు వద్ద పాదర్తి), మునార్ఫా (కావలి వద్ద మున్నేరు), సొపట్మ (పులికాట్)... మొదలైనవి. టోలెమీ రచించిన గ్రీక్ గ్రంథం ‘జాగ్రఫీ’ ఆగ్నేయాసియా దేశాలతో వాణిజ్యం కృష్ణా తీరంలోని రేవు పట్టణాల నుండే సాగిందని చెబుతుంది. ఆగ్నేయాసియాలో ఆంధ్రులు నెలకొల్పిన రాజ్యాలు శిలాయుగంలో ఉన్న ఆ ప్రాంతానికి నాగరికతని పంచాయి. శాసనాలలో కనిపించే ఆయా దేశాల పాత పేర్లే అందుకు నిదర్శనం. బర్మా పేరు త్రిలింగం. అక్కడి రాజవంశాన్ని తెలైంగులు అంటారు. తెలైంగ్ వారి భాష. ఇప్పటి థాయ్‌లాండు సింధుశాఖ ప్రాంతానికి ఒకప్పటి పేరు కాకుళ రాజ్యం. ఇక మలేసియాలో పాలెంబాంగ్ ప్రాంతపు ఒకప్పటి పేరు ఆంధర. ఇండోనేసియాలోని బోరుబదూర్ మహాస్తూపం ఉన్న ప్రదేశాన్ని మగెలాంగ్ (మహాలంక) అంటారు. ఇక అండమాన్ నికోబార్ ద్వీపాల పూర్వ నామాలు ఆంధ్రమణీ- మనక్కవరం. సింహపురి (నెల్లూరు) సింగపూర్ అయింది. అంతెందుకు? వియెత్నాం, లావోస్ దేశాల ఒకప్పటి పేరు అమరావతి రాజ్యం. అక్కడి పట్టణాల పేర్లు- విజయ, పాండుర, కౌథూర. అన్నీ కృష్ణాతీరంలోని ప్రాచీన పట్టణాల పేర్లే. జాతక కథలు ఆంధ్ర వణిజులకి ఆగ్నేయాసియాలోని దేశాలకి ఉన్న సంబంధాలు ప్రస్తావిస్తాయి. ఆంధ్ర రాజవంశమైన విష్ణుకుండినులూ కంపూచియా (కాంభోజ) రాజ్య స్థాపకులైన కైండిన్య గోత్రులూ ఒకటేనని శాసనాలంకారం అనే గ్రంథం చెబుతుంది. అంధ్రతీరంలో నౌకానిర్మాణం ఒక ప్రముఖమైన పరిశ్రమగా ఎదిగింది. నరసాపురం (ప.గో.జిల్లా), మోటుపల్లి (గుంటూరు జిల్లా) ముఖ్యమైన కేంద్రాలు. ఆంధ్రులు 75 టన్నుల బరువు మోసే నావలు నిర్మించారని రోమన్ గ్రంథం హిస్టోరియా న్యాచురాలిస్ చెబుతుంది. ఆనాటి సమాజం ఎంత అభివృద్ధి చెందినా స్త్రీల పరిస్థితి మాత్రం పతనం చెందసాగింది. మనుధర్మశాస్త్రం ఆ కాలంలోనే రచించబడింది. ఆర్థిక వనరులపైన పురుషుల గుత్తాధిపత్యం మొదలయింది. మితాక్షర కూతుళ్లకి ఆస్తిపై హక్కు కల్పించదు. ఆస్తిని కాపాడుకోవటానికి కొడుకుల అవసరం అయింది. తల్లిదండ్రులు లేని ఆడపిల్లలు పరులపై ఆధారపడవలసి వచ్చింది. చేసిన అప్పులు తీర్చేందుకు భార్యాపిల్లలని దాస్యానికి అమ్మటం ఆచారమయింది. హరిశ్చంద్రుని కథ దీనికి నిదర్శనం. నిరాధారులయిన స్త్రీలకు రక్షణ కరువైంది. విధవా వివాహం చట్టసమ్మతమే. అమరకోశం అనే సంస్కృత నిఘంటువు ‘పునర్భూ’ అంటే పునర్వివాహం చేసుకున్న స్త్రీని ప్రస్తావిస్తుంది. రాత్రిపూట పనిచేసే స్త్రీ కార్మికులకు తప్పనిసరిగా తగిన రక్షణతో ఇంటి వద్ద దిగబెట్టే వ్యవస్థ చేయాలని అర్థశాస్త్రం నిర్దేశిస్తుంది. ఈనాడు కాల్సెంటర్లలో రాత్రి సమయాల్లో పనిచేసే ఉద్యోగినులకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించే ఆనవాయితీ మన దేశంలో రెండువేల సంవత్సరాలకి పూర్వమే ఉండేదంటే ఆశ్చర్యం కలుగక మానదు.