64% వర్షాన్ని పీల్చుకుంటున్న భూమి!

64% of the land breathe in rain water - Sakshi

వాగులు, నదుల్లోకి చేరుతున్నది వర్షపాతంలో 36% మాత్రమే

భూతాపం పెరగడమే భూమాత దాహార్తి పెరగడానికి కారణం

ఎక్కువ వర్షం పడినప్పుడు సాధారణంగా ఎక్కువ నీరు చెరువులు, నీటి ప్రాజెక్టుల్లోకి చేరటం రివాజు. కానీ, ఇటీవల కాలంలో అలా జరగడం లేదని, పెరుగుతున్న భూతాపం వల్ల భూమాత దాహం అంతకంతకూ పెరిగిపోవడమే ఇందుకు మూలకారణమని ఒక అధ్యయనంలో తేలింది. కుండపోత వర్షం కురిసినప్పుడు కూడా గతంలో మాదిరిగా వాగులు, వంకలు, నదుల్లోకి వరద నీరు ఎక్కువగా చేరటం లేదని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌ వేల్స్‌ బృందం అధ్యయనంలో వెల్లడైంది.  160 దేశాల్లో 5,300 నదీ పరీవాహక ప్రాంతాల్లో పరిశీలన కేంద్రాలు, 43 వేల వర్షపాత నమోదు కేంద్రాల నుంచి సేకరించిన సమాచారాన్ని విశ్లేషిస్తే ఇదే అర్థమవుతోందని యూనివర్సిటీ ఆఫ్‌ న్యూ సౌత్‌ వేల్స్‌ ప్రతినిధి శర్మ ఇటీవల వెల్లడించారు. మనం ఇప్పటి వరకు అనుకుంటున్న దానికన్నా భూదాహం ఎక్కువగా ఉందన్నారు.

వంద వాన చుక్కలు నేల మీద పడితే అందులో నుంచి 36 చుక్కలు మాత్రమే సరస్సులు, నదులు, భూగర్భ జలాల్లో కలుస్తున్నాయి. మనుషులకు అందుబాటులో ఉండే (ఈ నీటినే సాంకేతిక పరిభాషలో ‘బ్లూ వాటర్‌’ అంటారు) ఇదే. మిగతా మూడింట రెండొంతుల వర్షపు నీరు కురిసినప్పుడే మట్టిలోకి ఇంకిపోతున్నాయని (ఈ నీటినే సాంకేతిక పరిభాషలో ‘గ్రీన్‌ వాటర్‌’ అంటారు) ఈ అధ్యయనంలో తేలింది.వాతావరణ మార్పుల వల్ల కుండపోత వర్షాల సంఖ్య పెరిగినా నదులు, రిజర్వాయర్లలోకి వరద నీరు గతంలో మాదిరిగా పోటెత్తకపోవడానికి నేల ఉష్ణోగ్రత గతంలో కన్నా పెరిగి, ఆవిరైపోయే నీటి శాతం పెరిగింది. అందువల్లే వర్షపు నీటిని భూమి ఎక్కువ మొత్తంలో తాగేస్తోంది. సాధారణ వర్షాలకు నీరు పారి తరచూ రిజర్వాయర్లలోకి నీరు చేరుతుంటేనే రిజర్వాయర్లలో నీరు ఉంటుంది. భారీ వర్షపాతం నమోదైన అరుదైన సందర్భాల్లో మాత్రమే నదులు, రిజర్వాయర్లలోకి నీరు వస్తున్నదని ఈ అధ్యయనం తేల్చి చెబుతోంది. అంటే, గతంలో కన్నా భూమి త్వరగా బెట్టకు వస్తున్న సంగతిని రైతులు గుర్తించాలి. కందకాల ద్వారా ఎక్కువ నీటిని భూమిలోకి ఇంకింపజేసుకుంటేనే పంటలు, ముఖ్యంగా ఉద్యాన తోటలు బాగుంటాయని గుర్తించమని ఈ అధ్యయనం చెబుతోంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top