అసమానతలు తొలగితేనే అభివృద్ధి

అసమానతలు తొలగితేనే అభివృద్ధి - Sakshi


విభిన్న చారిత్రక నేపథ్యాలు, అనేక వైరుధ్యాలున్న ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలు రెండుగా విడిపోయాయి. అంతర్గత ప్రాంతీయ అసమానతలను రూపుమాపేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపడితేనే రెండు రాష్ట్రాలు రాజకీయ, సామాజిక స్థిరత్వం సాధిస్తాయి. నవ తెలంగాణ నిర్మాణం కంటే ముందు విడిపోవడానికి అనేక చారిత్రక, సాంస్కృతిక, రాజకీయ కారణాలున్నాయి. ఈ నేపథ్యంలో విభజనకు దారితీసిన పరిస్థితులను విశ్లేషించుకోవాల్సిన అవసరముంది.

 

 1953లో ఏర్పడిన మొదటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్(ఎస్సార్సీ) చైర్మన్ జస్టిస్ ఫజల్ అలీ.. భాషాప్రాతిపదికన రాష్ట్రాలను ఏర్పాటు చేసే విషయంలో వచ్చే సమస్యలను ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు సమయంలోనే గుర్తించారు. విభిన్న చారిత్రక నేపథ్యాలు, అనేక వైరుధ్యాలు ఉన్న ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను ఒక్కటిగా చేయడం సరికాదని బలంగా భావించారు. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక భిన్నత్వాలను పట్టించుకోకుండా భిన్న ప్రాంతాలను కలిపేందుకు భాషను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం సరికాదన్నారు. భాషను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోవడం వల్ల అనేక పరిమితులు ఏర్పడుతాయని కమిషన్ స్పష్టంగా పేర్కొంది. ’అసమానత‘ను కారణంగా చూపి వెనకబడిన తెలంగాణను, అభివృద్ధి చెందిన ఆంధ్రా ప్రాంతాన్ని కలపాలనుకోవడంపై కూడా జస్టిస్ ఫజల్ అలీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ అసమానత అనే తర్కమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాజకీయ, సామాజిక వ్యాఖ్యలకు ఆధారమైంది. నిజానికి, ఇప్పటి విభజనకు కూడా అదే ప్రధాన కారణం.

 

 1969లో వచ్చిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.. క్షేత్రస్థాయి వాస్తవాలపై ఫజల్ అలీ కమిషన్ ముందుచూపును, రాజకీయ నాయకత్వ హ్రస్వ దృష్టిని రుజువుచేసింది. అభివృద్ధి చెందిన ఆంధ్రా ప్రాంత అణచివేత వల్ల విద్య, ఉద్యోగాలు, ప్రమోషన్లు, రాజకీయాల్లో తమకు జరుగుతున్న అన్యాయానికి తెలంగాణలోని మధ్యతరగతి ప్రజలు, రాజకీయ నేతలు తీవ్రంగా ఆగ్రహం చెందుతున్నారన్నది 1969 ఉద్యమం ఇచ్చిన సందేశం. 1972లో ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చిన జై ఆంధ్ర ఉద్యమం కూడా అలాంటి కారణాలతో వచ్చినదే. ప్రాంతీయ అసమానత్వమే కాకుండా ఇరుప్రాంతాల ప్రజల మధ్య సాంసృ్కతిక, భావోద్వేగ అనైక్యత కూడా ఉందన్న విషయం ఈ ఉద్యమాల ద్వారా స్పష్టమైంది. అప్పట్లో జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీదే హవా. దాంతో ఆ ఉద్యమాలను భయపెట్టో, బుజ్జగించో అణచివేయగలిగింది.

 

 ఉద్యమాలను అణచివేయగలిగింది కానీ ప్రజల్లో, ముఖ్యంగా యువతలో ఏర్పడిన నిరాశానిస్పృహలను, ఆగ్రహావేశాలను అణచివేయలేకపోయింది. అవి నక్సలైట్ ఉద్యమ రూపంలో తెలంగాణలో బహిర్గతమయ్యాయి. 1995 తరువాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్రంలో పెద్ద ఎత్తున కొనసాగిన ఆర్థిక సంస్కరణలు మళ్లీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి తెరతీశాయి. ఆ సంస్కరణలు గ్రామీణరంగం, వ్యవసాయ చేతివృత్తులవారిపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపాయి. వారు తాము నిర్లక్ష్యానికి గురైనట్లు భావించారు. చేనేతదారులు, రైతులు పెద్ద ఎత్తున ఆత్మహత్యలకు పాల్పడ్డారు. గ్రామీణ ఆర్థిక రంగం నాశనమవడంతో పట్టణాలకు వలసలు పెరిగాయి. సంస్కరణల కారణంగా ఐటీ, స్థిరాస్థి, నిర్మాణ రంగాల్లో హైదరాబాద్ బాగా అభివృద్ధి చెందింది. దాంతో వ్యవసాయంలో సర్వం కోల్పోయిన రైతులు, కూలిపనివారు, నిరుద్యోగులు, వృత్తి పనులవారు ఆయా రంగాల్లో ఉపాధి కోసం భారీగా హైదరాబాద్ దారి పట్టారు.

 

 రాజకీయం, వ్యాపారం మధ్య తేడా చెరిగిపోవడం చంద్రబాబు హయాంలో చోటుచేసుకున్న మరో మార్పు. వ్యాపారవేత్తలు రాజకీయాల్లోకి రావడం, రాజకీయ నేతలు వ్యాపారాలు ప్రారంభించడం అప్పడ్నుంచి ఎక్కువైంది. ఆంధ్రాకు చెందిన సంపన్నులు రాజకీయ పలుకుబడితో హైదరాబాద్‌లో చుట్టుపక్కలా భారీగా భూములు కూడబెట్టుకున్నారు.  మరోవైపు, వ్యవసాయ భూములు అంతరించడం ప్రారంభమైంది. హైదరాబాద్ ముఖచిత్రంలో ఒక్కసారిగా వచ్చిన ఈ మార్పు.. ఆ చుట్టుపక్కలా భారీగా పెరిగిన ఆంధ్రా జనాభా.. వ్యవసాయ భూములు అంతరించడం.. తమ ఆర్థికవ్యవస్థను, తమ జీవితాలను, తమ సంస్కృతిని కోల్పోవాల్సి రావడం.. ఇవన్నీ స్థానిక ప్రజలను అభద్రతాభావంలోకి నెట్టేశాయి. క్షేత్రస్థాయి ప్రజలు, పౌర సమాజం, స్వచ్ఛంద సంస్థలు, పౌర హక్కుల సంఘాలు ఈ ఉద్యమానికి రంగం సిద్ధం చేస్తే.. టీఆర్‌ఎస్ దానికి రాజకీయ రూపునిచ్చింది.

 

 ముందుచూపులేని రాజకీయ నాయకుల వల్ల ఏర్పడిన కేంద్రీకృత అభివృద్ధి, రాజకీయ- వ్యాపార వర్గం దురాశ, ప్రాంతీయ ఆకాంక్షలను పట్టించుకోకపోవడం.. వీటన్నింటి ఫలితంగానే ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. పెట్టుబడిప్రధాన, కేంద్రీకృతమైన, పట్టణప్రధాన అభివృద్ధి విధానం వల్ల విభజన వాదం పెరుగుతుందన్న విషయం తెలంగాణ ఉద్యమం ద్వారా నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠం. సీమాంధ్ర ప్రాంతంలో భారీ పెట్టుబడులతో అద్భుతమైన రాజధాని నిర్మించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ ప్రాంతంలోనూ ఉప ప్రాంతీయ అసమానతలు ఉన్నందువల్ల.. పైన పేర్కొన్న పరిణామాలు అక్కడ కూడా చోటుచేసుకునే ప్రమాదం ఉంది. విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు రాజకీయ, సామాజిక స్థిరత్వాన్ని సాధించాలంటే అంతర్గత ప్రాంతీయ అసమానతలను రూపుమాపేలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంటుంది.

 - ప్రొఫెసర్ కే శ్రీనివాసులు,

  రాజనీతి శాస్త్ర విభాగం,

 ఉస్మానియా విశ్వవిద్యాలయం


 

 రాయితీలు కల్పించాలి..


 తెలంగాణ చలనచిత్ర పరిశ్రమను అభివృద్ధి చేసుకోవడం నవ నిర్మాణంలో భాగమే.  ఇక్కడ చిత్ర నిర్మాణం పెరగాలి. కథకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడి కళాకారులతో, స్థానిక లొకేషన్లలో డిజిటల్ సాంకేతికతతో 40 -50 లక్షల్లో మంచి సినిమా తీయవచ్చు. స్థానిక కళాకారులతో స్థానికంగా నిర్మించిన చిత్రాలకు 15-20 లక్షలు సబ్సిడీ ఇచ్చి.. మినిమమ్ శాటిలైట్ రైట్స్ వచ్చేలా చర్యలు తీసుకోవాలి. థియేటర్లలో రెంటల్‌కు బదులు పర్సంటేజీ విధానాన్ని ప్రవేశపెట్టాలి. మండలానికో మినీ థియేటర్ నిర్మాణానికి ప్రభుత్వం రుణ సదుపాయం కల్పిస్తే గుత్తాధిపత్యాన్ని అరికట్టవచ్చు. ప్రొడక్షన్ ముందు, తర్వాత నిర్మాతలకు అవసరమైన సదుపాయాలను కల్పించాలి. స్టూడియోల నిర్మాణానికి ముందుకొచ్చే ఔత్సాహికులకు భూమి కేటాయించి, రుణ సౌకర్యం కల్పించాలి. తెలంగాణ నిర్మాతల చిత్రాలకు పన్ను మినహాయింపు ఇవ్వాలి.  

 - సయ్యద్ రఫీ, కన్వీనర్, కౌన్సిల్ ఫర్ తెలంగాణ సినిమా ఇండస్ట్రీ

 

 అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి..

 అభివృద్ధి హైదరాబాద్‌కే పరిమతం కాకుండా, అన్ని జిల్లాలకు విస్తరించాలి. ప్రతి జిల్లాకు అభివృద్ధి నమూనాను రూపొందించి, అమలు చేసేందుకు ఒక కమిటీని నియమించాలి. విద్యుత్, నీటి సరఫరాల మీద దృష్టి పెట్టాలి. తాము ఎన్నకున్న నాయకుడు అంచనాలకు అనుగుణంగా పని చేయని పక్షంలో ప్రశ్నించే హక్కు ప్రజలకు ఉండాలి. కులాల పేరిట వైషమ్యాలు పెరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలి. తెలంగాణ నవ నిర్మాణంలో విద్యార్ధులు కీలక పాత్ర నిర్వహించాలి. స్వార్థ రాజకీయాల పట్ల యువత అప్రమత్తతతో వ్యవహరించాలి.

 - పి. గంగాధర్, గండివేట్, మం. గాంధారి, నిజామాబాద్ జిల్లా

Read latest Elections 2014 News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top