
తనయుల కోసం తండ్రుల తపన
తెలంగాణ సెంటిమెంట్ తమకే సొంతమంటూ ఉత్సాహంతో ఉరకలేస్తున్న టీఆర్‌ఎస్‌లో టికెట్ల పోరు అంతర్గతంగా కలకలం రేపుతోంది.
కరీంనగర్: తెలంగాణ సెంటిమెంట్ తమకే సొంతమంటూ ఉత్సాహంతో ఉరకలేస్తున్న టీఆర్‌ఎస్‌లో టికెట్ల పోరు అంతర్గతంగా కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లాలో హుస్నాబాద్, మంథని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఏర్పడింది. పార్టీలో సీనియర్, మాజీ వుంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు తనయుడు సతీష్‌బాబు హుస్నాబాద్ నుంచి అసెంబ్లీ టికెట్టు ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఆయన అదే నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జీగా ఉన్నారు. గత ఎన్నికల్లో కెప్టెన్ ఇదే సీటు నుంచి టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు.
ఈసారి తన కుమారుడిని అదే స్థానం నుంచి బరిలోకి దింపాలని పట్టుదలతో ఉన్నారు. కానీ, సీపీఐతో పొత్తు ఉంటుందని ఇటీవలే కేసీఆర్ ప్రకటించటంతో అయోమయం మొదలైంది. ఉత్తర తెలంగాణలో సీపీఐకి పట్టున్న రెండు స్థానాల్లో హుస్నాబాద్ ఒకటి. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి ఇదే సీటుకు పట్టు బడుతున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన మంతనాల్లో తనకు హుస్నాబాద్ టికెట్టు ఇవ్వాలని సతీష్‌బాబు పట్టుబట్టినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. దానికి బదులుగా రాజ్యసభ లేదా ఎమ్మెల్సీ సీటు ఇస్తామని కేసీఆర్ నచ్చజెప్పగా విముఖత వ్యక్తం చేసినట్లు తెలిసింది. కెప్టెన్ సైతం తన కొడుక్కే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కేసీఆర్ ఎదుట స్పష్టం చేసినట్లు సమాచారం. దీంతో కెప్టెన్‌ను కాదనలేక, సీపీఐ పొత్తును తేల్చలేక కేసీఆర్ ఈ సీటును పెండింగ్‌లో పెట్టారు.
మంథనిలోనూ ఇదే కథ..
మంథనిలో సీనియర్ నేత, వూజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి, ఆయన కుమారుడు సునీల్‌రెడ్డితోనూ కేసీఆర్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జీగా ఉన్న సునీల్‌రెడ్డి తనకే టికెట్టు వస్తుందన్న ధీవూతో ఉన్నారు. తన కుమారుడికి టికెట్టు ఇవ్వాలని రాంరెడ్డి కేసీఆర్‌ను పట్టుబడుతున్నారు. తీరా సమయానికి , పుట్ట మధును పార్టీలోకి చేర్చుకోవటంతో తండ్రీకొడుకులు అసంతృప్తితో ఉన్నారు. అయితే కేసీఆర్ ఎమ్మెల్సీ పదవి ఇస్తామంటూ సునీల్‌రెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే, అసంతృప్తితో ఉన్న రాంరెడ్డి తమకు టికెట్టు ఇవ్వకపోతే సామూహికంగా రాజీనామాలు చేస్తామని ఇప్పటికే అల్టిమేటం ఇచ్చారు. భవిష్యత్తు కార్యాచరణపై తన అనుచర వర్గంతో చర్చలు జరిపారు.